27, సెప్టెంబర్ 2009, ఆదివారం

ఆరని రుధిరజ్వాల భగత్‌సింగ్‌....


నేడు భగత్‌సింగ్‌ జయంతి
ఒక వీరుడి మరణం.. శత యోధుల జననం..వీరుడి మరణంతోనే అతడి చరిత్ర అంతం కాబోదు... అతడి శరీరం నుంచి చిందిన వెచ్చని నెత్తుటి చుక్క ఒక్కొక్కటి ఒక్కో వీరుడికి ఊపిరి పోస్తుంది... ఆ రక్తపు చుక్కల్లోని వేడి ఎన్నటికీ చల్లారదు.. ఆ మృత వీరుడి శరీరంలోని సత్తువ ఎప్పటికీ వ్యర్థం కాదు.. అతడిలో ఉన్న కసి వెయ్యింతలై శత్రువుపై పోరాడుతుంది. ఆ వీరుడు భగత్‌ సింగ్‌... ఆ రక్తం రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష... ఆ సత్తువ ఉవ్వెత్తున ఎగిసిపడే యువకెరటం...
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది మంది పాల్గొన్నారు... ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడారు.. బ్రిటిష్‌ వారి దురాగతాలకు బలైపోయారు... ఉరికొయ్యలను సంతోషంగా ముద్దాడారు... కానీ వారందరిలో ఓ చిన్న కుర్రాడు... నూనూగు మీసాలైనా రాని 22 ఏళ్ల యువకుడు యావత్‌ జాతి దృష్టిని ఎలా మళ్లించాడు..? కనుమరుగై ఎనభై సంవత్సరాల తరువాత ఈరోజుకు కూడా జాతికి ఎలా ప్రేరణ అవుతున్నాడు?


దాదాపు వందేళ్ల స్వాతంత్య్ర సంగ్రామంలో అతనిది చాలా చిన్న పాత్ర... పట్టుమని పది సంవత్సరాలైనా లేని పోరాట చరిత్ర అతనిది... ఆ స్వల్పకాలమే అతనికి సరిపోయింది. దొంగల్లా వచ్చిన తెల్ల దొరలను నిలువెల్లా వణికించటానికి... దేశంలోని విప్లవకారులందరికీ మకుటాయమానంగా నిలవటానికి అతనికి ఆ కొద్ది సమయమే సరిపోయింది. అతణ్ణి ఒక్క క్షణం బతకనిస్తే... తమ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తారన్న భయాన్ని బ్రిటిష్‌ పాలకుల్లో కలిగేలా చేసిన విప్లవ జ్యోతి అతడు.. 22 సంవత్సరాల చిన్న జీవితంలో యావజ్జాతిలో స్వాతంత్య్ర జ్వాలను రగిలించిన వీరుడు... భగత్‌ సింగ్‌.....
===============================
మనల్ని చీల్చుకుని వెళ్లిపోయిన ఇవాళ్టి పాకిస్తాన్‌లో ఓ రాష్ట్రం పంజాబ్‌.... ఇందులోని లాయల్‌పూర్‌ జిల్లా ఖట్‌కర్‌ కలాన్‌ గ్రామంలో సాధారణ సంధూ జాట్‌ కుటుంబంలో 1907 సెప్టెంబర్‌ 27న భగత్‌సింగ్‌ అనే వెలుగు మొలక మొగ్గ తొడిగింది. ఈ మొలకే అనతికాలంలో మహా విప్లవ జ్వాలగా పరిణమిస్తుందని తండ్రి కిషన్‌సింగ్‌ సంధూ కానీ, తల్లి విద్యావతి కానీ ఎంతవరకు ఊహించారో తెలియదు.. కానీ, స్వాతంత్య్ర పోరాటంలో వారి వారసత్వాన్ని అంత త్వరగా అందిపుచ్చుకుంటాడని మాత్రం ఊహించి ఉండరు...
కానీ అదే జరిగింది. భగత్‌సింగ్‌ తాతగారు అర్జున్‌సింగ్‌, ఆర్యసంస్కర్త స్వామి దయానంద సరస్వతి అనుయాయి. ఆర్యసమాజం ద్వారా జాతీయోద్యమంలో పాల్గొన్న వ్యక్తి.. ఇక కిషన్‌సింగ్‌, అతని ఇద్దరు బావలు అజిత్‌సింగ్‌, స్వరణ్‌జిత్‌ సింగ్‌లు అంతా గధర్‌ పార్టీ సభ్యులే... భారత దేశాన్ని బ్రిటిష్‌ వారి నుంచి విముక్తం చేయటం కోసం అమెరికా, కెనడాల్లోని భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ ఇది. ఇది స్వాతంత్య్రోద్యమంలో రహస్య కార్యకలాపాలను కూడా నిర్వహించింది. ఈ సంస్థలో భగత్‌ సింగ్‌ కుటుంబ పెద్దలు సభ్యులు కావటం విశేషం... 1925లో కాకోరీ రైలు దోపిడీ కేసులో స్వరణ్‌జిత్‌సింగ్‌ను దోషిగా నిర్ధారించి 1927లో ఉరితీశారు...
తన మామను ఉరి తీసిన తరువాతి క్షణం నుంచీ భగత్‌సింగ్‌లో విప్లవ భావాలు మరింత వేగంగా పెరిగాయి. అంతకు ముందు సింగ్‌ తోటి విద్యార్థుల్లా ఖల్సా హైస్కూల్‌లో చేరలేదు.. బ్రిటిష్‌ పాలకులకు విధేయులుగా ఉండేందుకు సింగ్‌ తాత ఒప్పుకోకపోవటంతో భగత్‌ ఆర్యసమాజ్‌ వేద విద్యాలయంలో చేరాడు.. అక్కడే చదువుకున్నారు...13వ ఏట భగత్‌ సింగ్‌ తొలిసారి మహాత్మాగాంధీ గురించి విన్నాడు.. ఆయన్ను అనుసరించటం ప్రారంభించాడు...బ్రిటిష్‌ పుస్తకాలను తగులబెట్టడం, బట్టలను తగులబెట్టడం, సహాయ నిరాకరణోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనటం అన్నీ చేశాడు...స్వాతంత్య్రోద్యమంలో భగత్‌ సింగ్‌ వేసిన తొలి అడుగులు అవి.....
======================
1922లో సహాయ నిరాకరణోద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు.. ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీచౌరాలో రెండువేల మంది ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ప్రారంభించారు...పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.. నిరసనకారులు భయపడకపోగా తిరగబడ్డారు.. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.. పోలీసులు నేరుగా కాల్పులు ప్రారంభించటంతో ఉద్యమకారులు స్టేషన్‌పై దాడి చేసారు.. దాదాపు 22 మంది పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు..
ఈ ఘటనకు చలించిపోయిన మహాత్మాగాంధీ, సహాయ నిరాకరణోద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.. ఇది భగత్‌ సింగ్‌ను కలచివేసింది. వేలాది భారతీయులను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్‌ తొత్తులకు చౌరీచౌరాలో వేసిన శిక్ష చాలదని ఆయన భావించాడు.. అతని మార్గం అప్పటి నుంచి మారింది....
==================================
మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో విభేదించిన తరువాత భగత్‌ సింగ్‌ పూర్తిగా మార్కి్సస్‌‌ట భావజాలం వైపు మళ్లాడు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మాదిరిగా, హింసామార్గంలోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్న విశ్వాసం ఆయనలో క్రమంగా బలపడుతూ వచ్చింది. .
గాంధేయ వాదం నుంచి పక్కకు మళ్లిన భగత్‌ సింగ్‌ పూర్తిగా మారిపోయాడు...దీనికి తోడు మామ స్వరణ్‌జిత్‌ సింగ్‌ ఉరితీత ఆయన్ను కదిలించింది. అంతే... వెనక్కి తిరిగి చూడలేదు.. హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు.. శివరామ్‌ రాజ్‌గురు, సుఖదేవ్‌ థాపర్‌లు భగత్‌ సింగ్‌కు అక్కడే కలిసారు... ముగ్గురూ కలిసి విప్లవ కార్యక్రమాలను అమలు పరిచేవారు...

1928లో భారత్‌లో అప్పటి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసేందుకు సర్‌ జాన్‌ సైమన్‌తో బ్రిటిష్‌ సర్కారు ఓ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్‌ రాకను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు మిన్నుముట్టాయి. సైమన్‌ గోబ్యాక్‌ అంటూ సమర యోధులు నినదించారు...మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారు పోలీసు తుపాకీ గుండుకు ఎదురుగా గుండె నిలిపారు..లాహోర్‌లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతిరాయ్‌ నిరసనకు నాయకత్వం వహించారు.. ఆయనపై పోలీసులు లాఠీ ఝళిపించారు.. తీవ్ర గాయాలతో లాలా కన్నుమూశారు.. ఈ ఘటనకు భగత్‌ సింగ్‌ ప్రత్యక్ష సాక్షి...
ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌ సింగ్‌ నిశ్చయించుకున్నాడు.. లాలాను చిత్రహింసల పాల్జేసిన పోలీస్‌ ఛీఫ్‌ స్కాట్‌ను కాల్చి చంపాలని ప్లాన్‌ వేశారు.. సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులు ఆయనకు సహకరించారు.. కానీ, అనుకున్నదొకటి అయింది ఇంకొకటి...స్కాట్‌ను కాల్చాలని అనుకున్న వీరులు గుర్తించటంలో పొరపాటు పడి డిఎస్‌పి జెపి సాండర్‌‌సను కాల్చారు.. వెంటనే పోలీసులకు చిక్కకుండా పారిపోయి, సిక్కు మతానికి వ్యతిరేకమే అయినా, గడ్డం తీసివేసి, పాగా తీసి, టోపీ పెట్టుకుని కొత్త వేషం ధరించాడు భగత్‌సింగ్‌....
1929లో బ్రిటిష్‌ ప్రభుత్వం పోలీసులకు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ డిఫెన్‌‌స ఆఫ్‌ ఇండియా యాక్‌‌టను తీసుకురావటం భగత్‌సింగ్‌ సహించలేకపోయాడు... ఇలాంటి చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా విప్లవకారులను అణచివేయటం సాధ్యం కాదని తెల్లదొరలకు తెలిసేలా చేయాలనుకున్నాడు..అంతే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో బాంబు వేయాలని నిర్ణయించుకున్నాడు.. తన మిత్రుడు భుక్తేశ్వర్‌ దత్‌తో కలిసి బాంబు వేసే పథకం రచించాడు.. మరో విప్లవ వీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ పోలీసులకు పట్టుబడరాదని వారించాడు.. .. కానీ, భగత్‌ సింగ్‌ కావాలనే పట్టుబడాలని నిర్ణయించుకున్నాడు...... తక్కువ తీవ్రత ఉన్న బాంబును 1929 ఏప్రిల్‌ 29న అసెంబ్లీలో విసిరాడు భగత్‌... జిన్నాలాంటి ప్రముఖులంతా ఉన్న సమయంలోనే భగత్‌ బాంబు విసిరాడు.. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అన్న నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. బాంబును కావాలనే జనానికి దూరంగా విసిరాడు భగత్‌... తాను కావాలనే ఈ పని చేసినట్లు నిర్భయంగా ఒప్పుకున్నాడు... పోలీసులకు దొరికిపోయాడు...

అరెస్టయిన వెంటనే విచారణ ప్రారంభమైంది. దీనికి లాహోర్‌ కుట్ర కేసుగా పేరు పెట్టారు.. నేరం రుజువైనట్లు అనతికాలంలోనే న్యాయమూర్తులు నిర్ణయించారు.. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్షనూ విధించారు... వారిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు నినదించారు.. కాంగ్రెస్‌ పైనా, మహాత్మాగాంధీ పైనా భగత్‌సింగ్‌ను విడుదల చేయించాలని ఒత్తిడి పెరిగింది. కానీ, నాడు కాంగ్రెస్‌ కానీ, గాంధీజీ కానీ భగత్‌సింగ్‌ను కాపాడే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించదు.. ఆ రోజుల్లో గాంధీజీ లేఖ రాస్తే రాజకీయ ఖైదీలను బ్రిటిష్‌ సర్కారు విడిచిపెట్టేది.. దాదాపు 90 వేల మందిని ఆయన విడిపించారు కూడా.. కానీ భగత్‌ సింగ్‌ ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించలేదన్న అపవాదు గాంధీపై ఉంది. పైగా ఎవరినైనా కాపాడటానికి నాకెలాంటి అధికారం లేదు.. దేవుడే అన్నీ నిర్ణయిస్తాడంటూ నిర్లిప్తంగా గాంధీ ఆ తరువాత మాట్లాడినట్లు రికార్డు ఉంది. 1931 మార్చి 20న అంటే ఉరిశిక్ష అమలు చేసేందుకు మూడు రోజుల ముందు భగత్‌ సింగ్‌ మిత్రుడు ప్రాణనాథ్‌ మెహతా క్షమాభిక్ష దరఖాస్తు తీసుకెళ్తే.. విప్లవ జ్యోతి నిర్ద్వంద్వంగా ఖండించాడు... ఎవరినీ ప్రాణాలకోసం వేడుకునేది లేదని తేల్చి చెప్పాడు.. ఆ తరువాత మార్చి 23న ప్రజలంతా గుమికూడకుండానే ఉదయం ఏడు గంటలకు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్‌ ముష్కరులు ఉరితీశారు..ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాలతోనే ముగ్గురు వీరులూ అమరులయ్యారు...
నిజానికి లాహోర్‌ జైలు నుంచి తప్పించుకుని వెళ్లేందుకు భగత్‌సింగ్‌కు అవకాశం ఉండింది... కొందరు దేశభక్త పోలీసులు అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా.. కానీ, భగత్‌ సింగ్‌ ఆ పని చేయలేదు.. దేశంలోని మిగతా యువతకు ఆదర్శంగా నిలవాలనుకున్నాడు.. ధృవతారలా నిలిచాడు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారినందరినీ మరచిపోతామేమో కానీ, భగత్‌సింగ్‌ను మరవటం భారతీయుడైన ఏ ఒక్కరికీ సాధ్యం అయ్యే పని కాదు...

కామెంట్‌లు లేవు: