19, సెప్టెంబర్ 2009, శనివారం
ఉన్మాదమేనా ప్రేమంటే?
ప్రేమ మళ్లీ వెర్రితలలు వేస్తోంది... ప్రేమ పేరుతో ఉన్మాదం విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది... ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి... పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు.. మానసిక వైద్యనిపుణులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు... కానీ, ఉన్మాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తూనే ఉంది. మొన్న శ్రీలక్ష్మి, నిన్న స్వప్నిక, నేడు అనూష... తమ ప్రేమను తిరస్కరించారని ప్రియులమనుకునే మగాళు్ల... అమ్మాయిలపై అమానుషంగా దాడులు చేయటం హత్యలు చేయటం అడ్డొచ్చిన వాళ్లను చంపేయటం ఇదేనా ప్రేమంటే... ఇది ప్రేమోన్మాదమా? కామోన్మాదమా?
ఆకర్షణ మరోసారి ప్రేమ ముసుగు తొడుక్కుంది... ఆ ప్రేమను వద్దన్న పాపానికి ఓ అమాయకురాలు భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. ఆమెను చంపేందుకు వచ్చిన ప్రబుద్ధుడు.. అడ్డం వచ్చినందుకు అమ్మాయి తల్లిదండ్రులనే చంపేశాడు... ఏమిటీ దారుణం...? ఎందుకీ ఉన్మాదం..? పెడదారి పట్టిన యువత వికృత విశ్వరూపానికి ఇది పరాకాష్ట...
పైశాచిక ప్రేమకు రాజమండ్రిలో మరో అమ్మాయి బలైంది. తన ప్రేమను తిరస్కరించిందంటూ ప్రియురాలు అనూషపై రాజేశ్ అనే ఉన్మాది.. ఆవేశంతో దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు... ప్రియురాలి గొంతు కోశాడు... అడ్డం వచ్చిన తల్లిదండ్రులను అడ్డంగా నరికేశాడు... అనూష ప్రాణాపాయం నుంచి బయటపడిందే కానీ, తనకూ, చెల్లెళ్లకూ ప్రాణాధారమైన తల్లిదండ్రులను మాత్రం ఆమె కోల్పోయింది. ఉన్మాది ఆవేశానికి ఒక కుటుంబం క్షణాల్లో అనాధగా మారిపోయింది...తండ్రి ఆటో నడిపి తెచ్చే సంపాదనే వారికి ఇంతకాలం ఆధారం.. ఇప్పుడు జీవించడమెలాగో కూడా తెలియని పరిస్థితి... ఎందుకిలా జరిగింది? ఎవరీ రాజేశ్... అనూష కుటుంబంపై ఎందుకింత కక్ష కట్టాల్సి వచ్చింది?
అనూష కుటుంబంపై దాడి చేసిన రాజేశ్‌ది కాలేజీ ప్రేమ కాదు.. ఇంకా చెప్పాలంటే రాజేశ్ పెద్దగా చదువుకున్న వాడు కాదు... అసలు అతని కుటుంబం పేద, మధ్యతరగతిలకు మధ్యస్థంగా ఉండే కుటుంబం... బిల్డింగ్ మెటీరియల్ కమిషన్ ఏజెంట్ బాబూరావు కొడుకు ఈ రాజేశ్.... రెండేళ్ల క్రితం వీళ్ల కుటుంబం రాజమండ్రిలోని ఇంటి పైభాగంలో అద్దెకు ఉండేవారు.. అతను చిన్న చిన్న పనులతో కాలక్షేపం తప్ప పెద్దగా చదువుకున్నది లేదు.. కొన్నాళు్ల వీధి వీధి తిరిగి పాలు పోశాడు.. ఆ తరువాత ఓ కొరియర్ సంస్థలో పని చేశాడు.. అనూష వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడే, ఆమెతో రాజేశ్ సన్నిహితంగా మెలిగే వాడు... తాను అతణ్ణి అన్నా అని కూడా సంబోధించినట్లు అనూష చెప్తోంది...
చాలా కాలం పాటు అనూషను ప్రేమిస్తున్నానంటూ రాజేశ్ వేధించటంతో ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. రాజేశ్‌పై పోలీసు కేసు కూడా అమ్మాయి తల్లిదండ్రులు పెట్టారు.. కొంతకాలం లాకప్‌లో కూడా ఉండి వచ్చాడు.. అప్పుడే రాజేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు... బుద్ధి చెప్పారు... మారిపోతాడని భావించి ఇంటికి పంపించేశారు... అటు రాజేశ్ తల్లిదండ్రులు, అనూష తల్లిదండ్రులతో రాజీ కూడా కుదుర్చుకున్నారు... అందులో భాగంగానే అనూష ఇంటిని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయారు...
ఆరు నెలలు మామూలుగానే గడిచిపోయాయి. అంతా చక్కగానే ఉందనుకున్నారు.. ఏమైందో తెలియదు.. రాజేశ్ బుర్ర మళ్లీ వెనక్కి తిరిగింది. అనూషకు అదే పనిగా ఫోన్లు చేయటం ప్రారంభించాడు.. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.. కాలేజీకి వెళు్తంటే వెంటపడి వేధించాడు.. హింసించాడు.. చివరకు మనశ్శాంతి కరవై అనూష మూడు నెలలుగా కాలేజీకి వెళ్లడమే మానేసింది... మళ్లీ పోలీసులను ఆశ్రయిద్దామని అనూష తల్లిదండ్రులకు చెప్పింది... పోనీలే.. వాడి పాపాన వాడు పోతాడంటూ వాళు్ల వ్యవహారాన్ని సాగదీశారు... అమ్మాయికి పెళ్లి చేస్తే పరిస్థితి చక్కబడుతుందనీ అనుకున్నారు.. పెళ్లి సెటిల్ చేశారు కూడా. కానీ ఫలితం లేకపోయింది... రాజేశ్ ఆగ్రహానికి, ఆలోచన లేని ఆవేశానికి తల్లిదండ్రులు బలికావలసి వచ్చింది.
రాజేశ్ ఎందుకిలా మారాడంటే పోలీసులు ఇప్పుడే చెప్పలేమంటున్నారు.. భయపడ్డ రాజేశ్ తల్లిదండ్రులను బంధువులు ఊరు దాటించేశారు.. రాజేశ్ జనం కొట్టిన దెబ్బలకు చావు తప్పి, కన్నులొట్టబొయినట్లు తయారై పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తున్నాడు...విచిత్రమేమంటే రాజేశ్ కుటుంబంలో ఎవరికీ ఇలాంటి వికృత లక్షణాలు లేవు. అతనికి అక్క, అన్న ఉన్నారు.. కానీ, వాళ్ల జీవితాలేవో.. వాళు్ల గడుపుకుంటున్నారు. రాజేశ్ ఒక్కడికే చిల్లర వేషాలున్నాయి. అయితే అతను రౌడీషీటర్ కాడు.. అతనిపై క్రిమినల్ రికార్డులూ ఏమీ లేవు.. ఉన్న కేసల్లా అనూషను వేధించాడన్నదే.. తనకు కావలసింది దక్కకపోయేసరికి దాన్ని ఎలాగైనా దక్కించుకోవడం కోసం మృగంగా మారిన వ్యక్తి రాజేశ్... అతని మానసిక పరిస్థితి ఉన్మాదంతోనే పూర్తిగా నిండిపోయింది. ఆ ఉన్మాదంలోనే ఇంత ఘాతుకానికి పూనుకున్నాడు...
ఇలాంటి ప్రతి ఘటన జరిగిన తరువాత ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు.. మహిళా సంఘాలు హడావుడి చేస్తూనే ఉన్నాయి. నాలుగు రోజుల తరువాత మర్చిపోతున్నారు... మరో ఘటన జరిగేదాకా దాని ఊసెత్తరు.. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఘటన జరిగింది. మళ్లీ ఈ సంఘాల వాళ్లందరూ ఆందోళనలు ప్రారంభించారు.. హోంమంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు...
ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం చట్టాలు చేయగలదు కానీ, ప్రతి మనిషి వెనుకా పోలీసును కాపలా ఉంచటం సాధ్యం కాదు. పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపిస్తున్నారే కానీ, ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించటం అసాధ్యం.. పిల్లల విషయంలో ఎవరికి వారు వాళ్లకు అవసరమైన వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకోవటం అవసరం... కట్టుబాట్లు లేకుండా పిల్లల్ని పెంచటం, విచ్చలవిడి శృంగారం, నేర ఘటనల ప్రభావం రాజేశ్ లాంటి ఎందరి జీవితాలనో నాశనం చేస్తున్నాయి... ఈ విషయాన్ని పెద్దలు గ్రహిస్తే... పిల్లలు నియంత్రణలో ఉంటారు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి... పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు.. మానసిక వైద్యనిపుణులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు...
Really? When did they start doing anything seriously? This is news to me!
>>>>>
Really? When did they start doing anything seriously? This is news to me!
>>>>>
అవి మాటల్లో జరుగుతాయి కానీ చేతల్లో జరగవు.
No one can change this .change comes from the minds of youth(boyz n galz)..after failure in love men become a killer r devdas r casanova like me....hmmmmmm
కామెంట్‌ను పోస్ట్ చేయండి