18, జూన్ 2011, శనివారం

వాళ్ల దేవుడు చచ్చిపోయాడు

తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు వాళ్లు దేవుణ్ణి బాగా విశ్వసించారు.. ఆయనే తమను సృష్టించారని నమ్మారు.. అందమైన భూమ్మీద అందంగా జీవితాన్ని గడిపేయొచ్చని కలలు కన్నారు. జీవితం చాలా హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోతుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు కోరుకున్న ఆ జీవితం ఎనిమిదేళ్లకే ముగిసిపోయింది. తమకు సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే రోజులు గడుస్తున్నాయి. తామేం చేశామో వారికి తెలియదు.. తమకు మంచి జీవితాన్ని ఇస్తాడనుకున్న దేవుడు పత్తాలేకుండా పోయాడు.. వారి దృష్టిలో వాళ్ల దేవుడు చచ్చిపోయాడు..  నిజంగానే చచ్చిపోయాడు.  
ఓ అమ్మాయి.... పేరు మీనా
‘‘మా ఊళ్లో నాకు తెలిసిన ఓ అమ్మాయి ఈ సంతకు వెళ్దామని తీసుకువచ్చింది. సంతకు వెళ్లిన తరువాత మరో మహిళ మాకు పరిచయమైంది. కాసేపటికి తన దగ్గరున్న బిస్కట్ ఇచ్చింది. మగతగా అనిపించింది...అంతే ఆ తరువాత ఏమైందో తెలియదు.. నేను నిద్ర లేచేసరికి ముంబయిలో ఉన్నా.. మళ్లీ తిరిగి రాలేదు..’’
మరో అమ్మాయి.....పేరు అనిత
‘‘మా నాన్న చనిపోయారు.. ఆ బాధలో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ తారా సినిమాకెళ్దామని తీసుకెళ్లింది.. మా ఇద్దరి వయసు 12ఏళ్లు.. సినిమాహాల్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు కలిశారు.. ఖాట్మండుకు వెళ్లి పశుపతి ఆలయాన్ని చూసి వద్దామని అన్నారు..సినిమా తరువాత అంతా కలిసి ఖాట్మండు బస్సెక్కాం. వాళ్లిద్దరు తనకు తెలుసని తారా చెప్పింది.. నేను ఆమెను నమ్మాను.. మాకు తినటానికి బ్రెడ్ ఇచ్చారు.. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.. మేము మళ్లీ తిరిగి రానే లేదు..’’
ఇంకో అమ్మాయి... పేరు  మెయిలీ
‘‘పదిహేనేళ్ల వయసులోనే నాకు పెళ్లి అయింది.. రెండేళ్ల పాప కూడా ఉంది. పాపకు న్యుమోనియా వచ్చింది.. డాక్టర్ సిటీకి తీసుకెళ్లమన్నారు.. బస్‌స్టాప్‌లో తొమ్మిదేళ్లుగా తెలిసిన ఒకతను తనకు దేశంలోనే గొప్ప డాక్టర్ తెలుసని చెప్పాడు.. ఆయనతో కలిసి రైలెక్కాను.. తాగేందుకు పెప్సీ ఇచ్చాడు.. నేను నిద్ర లేచేసరికి బొంబాయిలో ఉన్నా.. తరువాత తెలిసింది అతను నన్ను 50 వేల రూపాయలకు అతను అమ్మేశాడని.’’
......................................................................................
మీనా, అనిత, మెయిలీ, ఒక్కొక్కరిది ఒక్కో బాధ.. తమ మానాన తాము బతుకుతున్న వారి బతుకులను మరెవరో వచ్చి హటాత్తుగా మార్చివేశారు.. వాళ్లకు సంబంధం లేని, ఇష్టం లేని జీవితంలోకి బలవంతంగా నెట్టేశారు. మైనారిటీ అయినా తీరని అమ్మాయిలు వాళ్లు.. కష్టం, సుఖం అంటే ఏమిటో అర్థం కాని వయసులో జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోతే.. వాళ్లను ఆదుకునేందుకు నమ్ముకున్న దేవుడు జాడ తెలియకుండా వెళ్లిపోయాడు.. అందుకే వాళ్లు అంటారు దేవుడు చచ్చిపోయాడని..
వేరెవరి కోసమో వాళ్లు జీవించాలి.. మరెవరికో సుఖాన్ని అందించేందుకు వాళ్లు శ్రమించాలి.. ఇంకెవలి అవసరాలు తీర్చేందుకు వాళ్లు సంపాదించాలి.. స్వాతంత్య్రం దేశానికి ఉంది.. వాళ్లకు లేదు. వాళ్ల బతుకులు వాళ్లవి కావు. చుట్టూ లక్షల మంది ఉంటారు.. వాళ్లలో ఒక్కరైనా తనవాళ్లు ఉండరు.. ఒంటరి తనం.. వెంటాడుతుంది.. వేటాడుతుంది.. ఊబిలోకి కూరేస్తుంది.. ఎందుకిలా జరుగుతోంది? వాళ్లేం తప్పు చేశారు?   
ఒక నమ్మకం ..వాళ్లకు ద్రోహం చేసింది. ఒక అవసరం..వాళ్లను బలహీనులను చేసింది. ఒక అమాయకత్వం , జీవితాన్నే నాశనం చేసింది
రోజుకు 2500 మంది-పిల్లలు..మహిళలు అన్న తేడాలేదు.. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోతారు.. ఏమైందో తెలియదు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఎక్కడ తేలుతారో మాత్రం తెలుసు. ప్రపంచంలో సెక్స్ ట్రేడ్ జరుగుతున్న అతి పెద్ద ప్రాంతం ఎక్కడుంది? మీకు తెలుసా? పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. భేషుగ్గా మన ముంబయిలోనే ఉంది. దాన్ని కామాటిపురా అని పిలుచుకుంటారు. ఇదిగో ఇలా రోజూ మాయమైపోతున్న పిల్లలు, మహిళలంతా తేలేది ఇక్కడే.. ఇంటర్ సెక్సువల్ టూరిజంలో అగ్రస్థానంలో ఉన్న ఏకైక ప్రాంతం. వేల మంది పాలుగారే పిల్లలు, మహిళలు  ఏడాదికి దాదాపు నలభై కోట్ల బిజినెస్ చేస్తున్నారు. ఏడేళ్ల వయసులోనే అమ్మాయిల్ని ఎత్తుకొచ్చేసి కామాటిపుర ప్రాంతంలో పడేస్తున్నారు.. నిన్నటి పసిపిల్ల ఇవాళ్టి బానిసగా మారుతోంది.
వాళ్లకేం తెలియదు.. అక్కడ కోటేల్లో ఓనర్ చెప్పినట్టు నడుచుకోవాలి.  పసితనం లేదు.. పెద్దరికం లేదు.. వయస్సుతో పరిమితం లేదు.. జెండర్ ఫిమేల్ అయితే చాలు.. ఎంత చిన్న వయసయితే అంతగా ఆడుకోవచ్చు.. లేతమనసులతో ఆడుకోవటం అంటే చాలామందికి సరదా.. అందుకే వారికి అంత డిమాండ్.. ఒకసారి వారికి దొరికిపోయారా అంతే సంగతులు.. చావలేరు.. బతకలేరు.. శరీరం ఓ సెక్స్ యంత్రంగా మారిపోతుంది. అలాగే బతకాలి.. వేరే మార్గం లేదు. రక్షించేవాడు లేడు.. రాడు..వినకపోతే అంతే సంగతులు. చెప్పిటన్లు వినేంత వరకు చిత్రహింసలు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. పది రోజులైనా సరే.. అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు.. వాళ్లు చెప్పింది వినకుంటే ఏమైపోతారో తెలియదు.. నో వే..
.......................
చనిపోయిన తరువాత నరకం అనేది ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే ఆ శిక్షలు ఎలా ఉంటాయో అంతకంటే తెలియదు.. పుస్తకాల్లో చదువుకోవటం... సినిమాల్లో చూడటం తప్ప మనకు తెలిసినంత వరకు నరకం జస్ట్ ఓ భయం.. కానీ, ఆ భయమే జీవితమైతే. ఆ జీవితంలో ఆ రకమైన శిక్షలు కామన్ ఎలిమెంట్ అయితే ఇదిగో ఈ అమాయకుల బతుకుల్లాగే తెల్లారుతాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ గురించి విన్నాం.. సినిమాల్లో చూశాం.. కానీ, నిజం ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. ఆ డిగ్రీ ఏ లెవల్లో ఉంటుందో అర్థం కాదు.. కానీ, ఇదిగో  ఒక్కసారి కామాటిపురకు వెళ్తే.. అమాయక ఆడపిల్లలపై ప్రయోగించేది థర్డ్ డిగ్రీ కాదు.. ఒకవేళ ఉంటే.. దాన్ని అంటే టెంత్ డిగ్రీ..
సిగరెట్లతో కాలుస్తారు, కొరకంచుతో వాతలు పెడతారు, యాసిడ్ పోస్తారు, కాళ్లు విరుగుతాయి, రోజుల్లోనే రోగిష్టిగా మారతారు. నడవలేరు. కూర్చోలేరు. నిలబడలేరు..
క్షణాల్లో, గంటల్లో  వాళ్ల జీవితాలు ఊహించరి రీతిలో మారిపోతాయి. సెక్స్ ట్రేడింగ్ అనేది మన దేశంలోనే ఎక్కువగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. .. మనతో పాటు, నేపాల్, ఆసియాలోని అన్ని దేశాల్లో , మాజీ సోవియట్ యూనియన్‌లో, ఆఫ్రికాలో.. ప్రతి చోటా.. ప్రపంచంలో విటుడనేవాడున్న ప్రతిచోటా అమ్మాయిల అమ్మకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేల మంది వ్యభిచార కూపంలోకి పడిపోతున్నారు.
సెక్స్‌ట్రేడ్.. ఇప్పుడిదొక తేలికైన వ్యాపారం.. పెట్టుబడిలేని వ్యాపారం.. దీనికి ఇన్వెస్ట్‌మెంట్ అమ్మాయి అందమే.. అదీ లేత అందం.. ఇక్కడ ఎంత చిన్న వయసయితే, అంత డిమాండ్.. పన్నెండేళ్లు.. కొంచెం తగ్గితే తొమ్మిదేళ్లు.. ఇంకాస్త తగ్గితే ఎనిమిదేళ్లు..ఒక్కసారి  మాయమాటలు చెప్పి అమ్మాయిని ఈ కూపంలోకి ఒక్కసారి తెచ్చిపడేస్తే చాలు.. యాభై వేల నుంచి ఒక్కోసారి లక్ష రూపాయల దాకా సంపాదించేయొచ్చు. మాఫియాలను మించిన దందా ఇది.
మన దేశంలో  నడుస్తున్న వ్యభిచార గృహాల్లో ఎంతమంది మగ్గుతున్నారో మీకు తెలుసా? అక్షరాలా రెండు లక్షల మంది. ఇందులో ఇండియా, నేపాల్ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. అందులోనూ తొమ్మిది, పదేళ్ల వయసున్న అమ్మాయిల సంఖ్యే యాభై వేల దాకా ఉంటుంది. అక్కడ విటుడి సుఖం, ఆనందం మాత్రమే ప్రధానం.. అమ్మాయిని వీలైనంత ఎక్కువగా  బాధపెట్టి లైంగికంగా అనుభవించటంలోనే వీళ్లు ఆనందాన్ని చూస్తారు.. ప్రపంచం మొత్తం మీద 12 లక్షల మంది పిల్లలు ప్రతి ఏటా అపహరణకు గురవుతున్నారట.. వీరిలో 8 లక్షల మంది వరకు ఆడపిల్లలు.. అంతా వ్యభిచార కూపాలకే తరలిపోతున్నారు.. మగవాడి రాక్షసానందాలకు ఇంత మంది పసికూనల జీవితాలు మొగ్గలోనే వాడిపోతున్నాయి.
మనుషులు- తోటి మనుషులతో చేసే వ్యాపారం ఇది. ఆడ మనుషులతో చేసే వ్యాపారం.. అన్నెంపున్నెం తెలియని అమ్మాయిలతో చేసే వ్యాపారం.  దీనికి లైసెన్సులు అక్కర్లేదు.. చట్టాలు అవసరం లేదు.. ఈ వ్యాపారం బడాబాబుల అనందం కోసం..వెయ్యి రూపాయలకు చిల్లర ఉన్నదన్న సంగతి కూడా తెలియని వారి సంతోషం కోసం, ఆనందం కోసం నడిపే దుకాణాలివి..
అమ్మాయిల అమ్మకం అనేది ప్రపంచ వ్యాప్తంగా మల్టీబిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. మన దేశంలోనే వ్యభిచారంలో మగ్గుతున్న వారిలో ప్రతిమూడో అమ్మాయి వయసు పన్నెండేళ్ల లోపే ఉంటుంది. పేరుకు గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం.. సూపర్ పవర్‌గా ఎదుగుతోందని బుజాలు తడుముకుంటాం.. టీవీ మైకుల ముందు తెగ మాట్లాడేసే మహానుభావులు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్లు చేసిన అభివృద్ధికి అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. అంతా పైకి నవ్వుతూనే కనిపించాలి.. ముఖానికి రంగు పులుముకున్నట్లే.. నవ్వునూ పులుముకుని తీరాలి. లోపల బాధ ఉబికివస్తున్నా పంటిబిగువునుంచి బయటపడటానికి వీల్లేదు.. కస్టమర్ ఏం చేస్తే అందుకు ఒప్పుకోవాలి. మద్యం తాగిస్తే తాగాలి. సిగరెట్ ఇస్తే పీల్చాలి.. ఏ ఒక్కరు ఎదరు తిరిగినా చెప్పేదేముంది? ట్రాఫికింగ్ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించిన నెట్‌వర్క్.  ఒక్క అమెరికాలోకే ప్రతి సంవత్సరం 50 వేల మంది అమ్మాయిల రవాణా జరుగుతోందంటేనే ఈ వ్యాపారం ఎంత బాగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ట్రాఫికింగ్ అపహరణ
ట్రాఫికింగ్ టార్చర్
ట్రాఫికింగ్ మర్డర్
ట్రాఫికింగ్ మానవ హక్కుల ఉల్లంఘన
ట్రాఫికింగ్ లైంగిక దోపిడీ
గొర్రెల్ని సంతలో పెట్టి అమ్మేసినట్లు అమ్మేయటం. ఏ ఒక్క దేశమూ మినహాయింపు కాదు.. పైగా దీన్ని సిగ్గులేని ప్రభుత్వాలు సెక్స్ టూరిజంగా అనధికార పర్మిట్లు ఇచ్చేస్తున్నాయి. పర్యాటకుల లైంగికానందం కోసం పసికూనలను బలిపెడుతున్నాయి.
వీళ్లున్న చోట ఖాకీలు ఉంటారు కానీ, పోలీసింగ్ అనేది ఉండదు.. చట్టాలు, సంకెళ్లు అనే పదాలకు చోటుండదు. అంతా మనీమేటర్సే.. అమ్మాయిని అమ్మకానికి పెట్టడం దగ్గర నుంచి పోలీసింగ్ వరకు అంతా పచ్చనోట్లపైనే సాగుతుంది. ఏడాదికో, పదేళ్లకో ఒకసారి సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే ఏదో ఓ సంస్థ కొందరిని ఈ కూపం నుంచి బయటకు తీసుకొచ్చి ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటుంది. పది మందినో, పాతిక మందినో బయట పడేసినంత మాత్రాన లక్షలాది మంది పరిస్థితి ఏమిటి? అదే దూకుడు ఎందుకు కంటిన్యూ కాదు? అని ప్రశ్నిస్తే జవాబుండదు..
స్కూలు కెళ్లిన పాపాయి తిరిగి రాదు
వీధిలో ఆడుకుంటున్న అమ్మాయి అదృశ్యమవుతుంది
ఫ్రెండ్స్‌తో వెళ్లిన కూతురు మళ్లీ కనిపించదు.
ఇది ఏ ఒక్కరి సమస్య కాదు..
ఎందుకిలా జరుగుతోంది ఒక్కసారి ఆలోచించండి.. పేదరికంలో ఉన్న వాళ్లు మాత్రమే ఈ బాధలు పడటం లేదు.. మధ్యతరగతి వ్యవస్థలోనూ ఇదే జరుగుతోంది. కాకపోతే అక్కడ పేదలది గతి లేని బతుకులయితే, ఇక్కడ మధ్యతరగతిది గతి తప్పిన బతుకులుు. ఇక్కడ పిల్లలది తప్పు కాదు.. అమ్మాయిలది తప్పు కాదు.. వ్యవస్థది.. నేరగాళ్లది.. మాఫియాది.. అందుకే ఆ అమ్మాయిలకు దేవుడు నిజంగానే చచ్చిపోయాడు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అంతర్జాతీయం గా జరిగే ఈ వ్యాపారం గా ఈ సినేమాలో బాగా చూపించాడు.

http://www.youtube.com/watch?v=0pQuNcuk5FE