19, జూన్ 2011, ఆదివారం

మీ పిల్లలు మిమ్మల్ని టేకోవర్ చేశారు

మీరు ఇద్దరు.. మీకు ఇద్దరు.. అంతా హ్యాపీగా ఉన్నారు.. కానీ, మీకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మీరు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. వాళ్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. వాళ్లు కొనమంటే కొంటారు.. తినమంటే తింటారు. అంతా వాళ్ల ఇష్టమే.  మిమ్మల్ని వాళ్లే నడిపిస్తున్నారు.. మీరు నడుస్తున్నారు. మీకు తెలియకుండానే వాళ్లకు లొంగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు మిమ్మల్ని టేకోవర్ చేసేశారు..
మీ పెద్దవాళ్లు ఊళ్లో ఉంటున్నారు.. ఇద్దరి మధ్యా ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఒకరిమాట మరొకరు కాదనరు. పిల్లలంటే అమితమైన ప్రేమ. కానీ, మిమ్మల్ని వాళ్లు శాసిస్తున్నారు. ఓ ఆటాడుకుంటున్నారు. వాళ్లేం చెప్తే మీరు అదే చేస్తున్నారు. నియంతల్లా ్యవహరిస్తున్నారు.
వాళ్లు చెప్పింది కాదనలేని పరిస్థితిలో మీరున్నారు. మీ వల్ల కాకపోయినా, అప్పుడే కాకపోయినా, కొన్నాళ్ల తరువాతైనా వాళ్ల కోరికలు తీర్చటం మీ విధిగా భావిస్తున్నారు. వాళ్లకంటే మీకెవరూ లేరు.. కొండమీది కోతిని తెమ్మన్నా తెచ్చి పెడ్తారు.. ఎందుకిలా చేస్తున్నారో మీకు తెలియదు. అయినా చేసేస్తున్నారు. వాళ్లు మీకు బాసులు.. వాళ్లు ప్రతిమాటా మీకు వేదంలా వినిపిస్తుంది.
ఎన్ని మాటలన్నా కోపం రాదు.. నిష్ఠూరాలాడినా సహిస్తారు. అలకబూనితే అనునయిస్తారు..బతిమాలుకుంటారు బుజ్జగిస్తారు.. కాళ్లు నెత్తిన పెట్టుకుంటారు.
వాళ్లు ఎవరో కాదు. మీ పిల్లలు.. అవును.. అక్షరాలా మీ పిల్లలు.. మీ పిల్లలే మీకు బాసులుగా మారిపోయారు.. మిమ్మల్ని వాళ్లు చెప్పినట్టల్లా వినేలా చేసేసుకున్నారు. మీరు స్కూటర్ కొంటే వాళ్లు చెప్పిన మోడల్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. కారు కొంటే ఎంపిక చాయిస్ వాళ్లకే.. ఫుడ్ కోర్టులో.. పిజ్జా కార్నర్‌లో, పిక్నిక్‌ల్లో , మూవీస్‌లో అన్నింటా వాళ్లే మీకు దారి చూపిస్తున్నారు. చివరకు ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? గోడలకు ఏ కలర్ వేయాలన్న  విషయాలను కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారు.. తు.చ.తప్పకుండా మీరు పాటించేస్తున్నారు.
మీరు ఒక సంగతి జాగ్రత్తగా గమనించండి.. గత అయిదారేళ్లలో మీ జీతం నాలుగు రెట్లు పెరిగింది.. మామూలు పరిస్థితిలో అయితే మీ లైఫ్ మరింత కంఫర్ట్ గా సాగాలి. కానీ, అలా జరగటం లేదు.. జీతంతో పాటు అప్పులూ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇందుకు కారణం ఏమిటో తెలుసా? మీ పిల్లలు.. ఆగండాగండి.. వాళ్లేం తప్పు చేసారని తిట్టుకోకండి.. మీ పిల్లలు వాళ్లకు టార్గెట్ అయ్యారు.. అంతే మీ పిల్లలకు మీరు టార్గెట్‌గా మారిపోయారు..
ఒక్కసారి ఆలోచించండి...ఈ కింది విషయాలను జాగ్రత్తగా గమనించండి.
చిల్ట్రన్ మార్కెట్..
కిడ్స్ ఫుడ్ మార్కెట్
మార్కెట్ ఫ్యూచర్-కిడ్స్
కార్పొరేట్ టార్గెట్ -కిడ్స్

అవును.. ఇది నిజం.. కార్పొరేట్ మార్కెట్ ప్రపంచానికి ఇప్పుడొక కొత్త కస్టమర్ దొరికాడు. మార్కెట్ శక్తులన్నింటికీ ఇప్పుడతనే పెద్ద టార్గెట్.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుందన్న సామెత కార్పొరేట్ వరల్డ్‌కు చక్కగా కలిసొచ్చింది. మీ ఇంట్లో ఒక పిల్లో , పిల్లవాడో పుట్టాడంటే, కార్పొరేట్ ప్రపంచానికి ఓ వినియోగదారుడు దొరికినట్లే.. ఇప్పుడు మీ పిల్లలు వాళ్లకు లవర్లు..  మీ పిల్లల దగ్గర మీట నొక్కితే చాలు, అక్కడ మీ పర్స్ ఖాళీ అయిపోతుంది. అంతే.. ఇప్పుడదే జరుగుతోంది.
2005 జూలై 15 అర్థరాత్రి అమెరికాలో స్కాలెస్టిక్ పబ్లిషర్స్ హెడ్ క్వార్టర్స్ ముందు దాదాపు అయిదు కిలోమీటర్ల మేర క్యూ ఉంది. వాళ్లంతా హేరీపోటర్ పుస్తకాన్ని తమ పిల్లల కోసం కొనేందుకు వచ్చిన వాళ్లు.. సరిగ్గా అర్థరాత్రి ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. మార్కెట్‌లోకి  వచ్చిన గంటలో ప్రపంచ వ్యాప్తంగా  రెండున్నర మిలియన్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అమెరికాలో ప్రవాసాంధ్రులు శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారు కూడా ఈ హారీపోటర్ కోసం క్యూకట్టిన వాళ్లలో ఉన్నారని వారే వారి అనుభవాలను చెప్పారు.
హేరీపోటర్ కేవలం పుస్తకం కాదు.. ఇది ఒక బ్రాండ్. ప్రపంచంలో అతి పెద్ద బ్రాండ్..  మన జాతక కథలను రీప్రొడ్యూస్ చేసినట్లు అనిపించటం వరల్డ్ కిడ్స్ హేరీని ఓన్ చేసుకునేలా చేసింది. ఇందులో మాయలు.. మర్మాలు.. మ్యాజిక్ స్టిక్‌లు.. టోపీలు, టీషర్టులు, కాస్ట్యూమ్స్, వేషాలు,.. ఒకటేమిటి ప్రతి ఒక్కటీ  అమ్మకం వస్తువులుగా మారిపోయాయి. చివరకు ఈ పేరుతో వీడియో గేమ్స్ కూడా వచ్చేసాయి.  ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మార్కెటింగ్ సూపర్ నోవా. బిలియన్ల కొద్దీ డాలర్లను తెగ కుమ్మరించిన అతి పెద్ద బ్రాండ్ ఇది. ఇది బిగ్ మ్యాజిక్ కాదు.. అతి పెద్ద  వ్యాపారం ..దాదాపు 500 మిలియన్ల డాలర్ల బిగ్ బిజినెస్.
ఇవాళ ప్రపంచంలో  హేరీపోటర్ పేరు వినని పిల్లవాడు ఉండడు. అంతగా ఈ పుస్తకాన్ని, దాంతో తీసిన సినిమాలను, దాని పేరుతో తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసేసుకున్నారు.. ఇప్పుడు అర్థమైందా? మీ పిల్లలు కార్పోరేట్ వరల్డ్‌కు ఎంతగా ముద్దొస్తున్నారో..
జస్ట్ ఇమాజిన్.. మీ పిల్లవాడు డ్రైవింగ్  సీట్లో కూచుంటే.. కార్లో అయితే మీకు సంతోషంగానే ఉంటుంది. కానీ మీ లైఫ్ డ్రైవింగ్ అతను చేస్తానంటే.. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం రీచ్ అయిన టార్గెట్ అదే. మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా టేకోవర్ చేసేశారు. మీకు తెలియకుండానే డామినేట్ చేస్తున్నారు. వాళ్లను హ్యాపీగా ఉంచేందుకు మీ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.. వ్యాపారానికి కావలసిందీ అదే కదా..                          
పిల్లలు అమాయకులు.. వాళ్లకు అన్నీ మంచిగా కనిపిస్తాయి. అంతా బాగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాస్త ఆకర్షణీయంగా ఉంటే చాలు.. అది తమకే కావాలని గోల చేసేస్తారు. దాని కోసం ఇల్లుపీకి పందిరి వేస్తారు. అన్నయినా, చెల్లె అయినా తమ తరువాతే అన్నంతగా అల్లరి చేస్తారు. వాళ్లను బుజ్జగించటానికి పేరెంట్స్  పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ శతాబ్దపు తొలినాళ్లలో పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల కంట్రోల్‌లోనే ఉండేవాళ్లు. పిల్లలు ఏదైనా అడిగితే అది మంచిది కాకుంటే తల్లిదండ్రులు పిల్లలకు వద్దని చెప్పేవాళ్లు.. అవసరమైతే కోప్పడటమో.. ఇంకా అలిగితే రెండు తగిలించైనా మందలించి కంట్రోల్ చేసే వాళ్లు.. కానీ 80వ దశకానికి వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. పిల్లలను అడపాదడపా కోప్పడ్డా.. బుజ్జగించటానికే ప్రాధాన్యం పెరిగింది. గారం ఎక్కువైంది.  ఈ గారమే ఇప్పుడు గుదిబండై కూచుంది.
వాళ్ల అమాయకత్వమే కార్పోరేట్ వ్యాపారులకు పెట్టుబడిగా మారింది. వాళ్లను ఆకర్షించటమే వాళ్ల ముందున్న  ధ్యేయం.. వాణిజ్య ప్రకటనలూ వాళ్లను దృష్టిలో ఉంచుకునే రూపొందించారు.
సినిమాలు, సీరియళ్లకూ పిల్లలే టార్గెట్ అయ్యారు. చివరకు వాళ్ల కోసం ఏకంగా టెలివిజన్ చానళ్లే వచ్చిపడ్డాయి. కార్టూన్ నెట్‌వర్క్, పోగో, డిస్నీ వండర్‌లాండ్.. ఒకటేమిటి.. పదుల కొద్దీ చానళ్లు వచ్చేశాయి.
స్టార్‌వార్స్.. 80వ దశకంలో  ఒక సంచలనం. యాక్షన్  ఓరియెంటెడ్ సీరియళ్లు, సినిమాలు కిడ్స్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. స్టార్‌వార్స్ అందులోని కేరెక్టర్లు బొమ్మలుగా మారి ఇళ్లల్లోకి వచ్చిపడ్డాయి. వీడియోగేమ్స్‌గా మారి జాయ్‌స్టిక్‌లతో ఓ ఆటాడుకున్నాయి.
స్టార్‌వార్స్ తరువాత కుప్పలు తెప్పలుగా కిడ్స్ లక్ష్యంగా కామిక్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్స్ సీరియళ్లుగా, సినిమాలుగా వచ్చేశాయి. హిమాన్‌తో  మొదలై బ్యాట్‌మ్యాన్, సై్పడర్‌మ్యాన్ లనుంచి నిన్న మొన్నటి బెన్‌టెన్ దాకా అన్ని టీవీ షోలు, సినిమాలు పైకి చూసేందుకు పిల్లల ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే అన్నట్లు కనిపిస్తాయి. కానీ, ఇవన్నీ వాళ్ల బొమ్మలను, ఇతర ప్రాడక్ట్‌లను అమ్ముకోవటానికి చేసిన మార్కెటింగ్ స్ట్రాటెజీ అన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేదు. గ్రహించేలోపే పిల్లలు పేరెంట్స్ చేయిదాటిపోయారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా హిమాన్‌లు, సై్పడర్‌మ్యాన్‌లు, బాల హనుమాన్‌లు, బెన్‌టెన్‌లు ఇవే కనిపిస్తాయి.
ఈ పరిస్థితిని  ప్రపంచంలో ఏ తల్లీతండ్రీ నియంత్రించే స్థితిలో లేరు.. ఒక రకమైన అడిక్షన్‌కు లోనైపోయారు.. దీన్నుంచి బయట పడటం అంత తేలిక కూడా కాదు.. కార్పోరేట్ మాయాజాలంలో మనం కొట్టుకుపోతున్నాం..ఎక్కడ తేలుతామో దేవుడైనా చెప్పగలడో.. లేడో...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి