21, జూన్ 2011, మంగళవారం

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణాది

కోటి గొంతులను ఒక్కటిగా ముడి బిగించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. నాలుగు కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిలించిన చైతన్య జ్యోతి ఆరిపోయింది. తెలంగాణా పోరాట అస్తిత్వ రేఖాచిత్రం కనుమరుగైపోయింది.  జనం కోసం ఇంతగా గళం విప్పిన వ్యక్తి.. ధిక్కారమే జీవితంగా  గడిపిన వ్యవస్థ.. ప్రజల బాధల్ని తన బాధలుగా మలచుకున్న మనీషి.. పోరు గడ్డ ఓరుగల్లు నుంచి జ్వాలగా ఎగసి విప్లవ వీరులను శాసించిన యోధుడు.. కొత్తపల్లి జయశంకర్‌..
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. జీవితమంతా లోకం కోసం ధారపోసిన కాళోజీ మాటలను నిజం చేసినవాడు.  అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంతకాలం ఉద్యమించిన వాడు.. ప్రజల్ని చైతన్యపరిచేందుకు  విప్లవోద్యమ పూలను లోకమంతటా విరజిమ్మిన వాడు..
తన ప్రజల కోసం.. తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు గత దశాబ్ది కాలంలో మరొకరు లేరు.. వ్యక్తిత్వాన్ని మించిన వ్యవస్థ జయశంకర్‌. తానే ఉద్యమమై.. తానే సిద్ధాంతమై.. ఊపిరై నిలిచిన వాడు..  తెలంగాణా చుట్టూ కమ్ముకున్న చీకట్లను తొలగించేందుకు ఊపిరున్నంత కాలం ప్రయత్నించాడు. ఎవరినీ నొప్పించిన వాడు కాదు.. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్లూ.. లేని వాళ్లూ సైతం ఆయన పట్ల ఆప్యాయత ప్రకటించుకునేలా చేసుకున్నవాడు.. సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం అన్నది అరుదుగా కనిపించే విషయం. ఆ సిద్ధాంతం కోసమే ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు.. తెలంగాణ ఉద్యమం గురించి ఆయనతో ప్రస్తావించినప్పుడల్లా.. మా పోరాటం ఫలితమిస్తే.. ఆ ఫలాల్ని మీకందించాలన్నదే నా తపన అని అన్నవాడు.. తెలంగాణా తప్ప ఆయన దేన్నీ స్వీకరించలేదు..అంగీకరించలేదు.. మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలను రాసుకుతిరగలేదు.. తెలంగాణ రాష్ట్రసమితి తన మాటే వేదంగా భావించినా.. సలహాలకే తప్ప సభ్యత్వం జోలికి కూడా పోని వాడు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమానికి ఆయన సాక్షీభూతం. దశాబ్దకాలపు పోరాటానికి విజయసారథి.  తన వారికి విముక్తి కల్పించటం కోసం.. తన వారికి భుక్తి కల్పించటం కోసం.. తాను పుట్టిన నేలను స్వర్ణమయం చేయటం కోసం అంపశయ్యపై కూడా శ్రమించాడు.. ఆయనకు ఇజాలు లేవు.. ఉన్నదల్లా తెలంగాణాయే.. ఆయన కోరుకున్నదల్లా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం అంతరించటాన్నే.. ఆ అన్యాయాన్ని ఎదిరించేందుకు.. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన వాడు. అతిథి మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తూనే అంతా తానే అయి నడిపించాడు.. పల్లెలు.. పట్టణాలు అనక.. పల్లేరు కాయై తిరిగిన వాడు.. తన కలను నిజం చేసుకోకుండానే అవని విడిచి వెళ్లిపోయాడు..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి