భారత దేశంపై మహా సంగ్రామానికి పూనుకునే దుస్సాహసానికి ఉగ్రవాదులు పాల్పడ్డారంటే అందుకు బాధ్యులెవరు? అసంఖ్యాకంగా అత్యాధునిక ఆయుధ సంపత్తితో అతి తేలిగ్గా వాణిజ్యరాజధానిలోకి ప్రవేశించి దేశానికి ప్రతీకలుగా నిలిచిన వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయటంలో విజయం సాధించగలగటం ఎవరి వైఫల్యం?కనీవినీ ఎరుగని స్థాయిలో మహామారణ కాండకు పాల్పటం ఎలా సాధ్యపడింది. ఎక్కడో కరాచీ నుంచి కార్గో షిప్లలో బయలుదేరి, అక్కడి నుంచి బోట్లలో గేట్వేకు చేరుకుని బాంబుల మూటలతో, ఎకె గన్నులతో దాదాపు 20 మంది.. ఈ బీభత్సాన్ని సృష్టించటం అసాధారణం. పదుల కిలోల కొద్దీ ఆర్డీఎక్‌స.. సంచుల నిండా గ్రెనేడ్లు.. రాకెట్ లాంచర్లు.. ఆధునిక మారణాయుధాలతో స్వేచ్ఛగా ఎలా ప్రవేశించగలిగారు? విచ్చలవిడిగా, పిచ్చి పట్టినట్లు విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతుంటే ఏం జరుగుతోందో తెలిసే లోగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ప్రభుత్వాలు చేష్టలుగి పోయాయి. పాతికేళ్ల లోపు కురవ్రాళు్ల మహామారణ కాండకు పదుల సంఖ్యలో వాణిజ్య రాజధానిలోకి ప్రవేశిస్తుంటే సరిహద్దుల్లో వాళ్లను అడ్డుకునే వ్యవస్థే లేకుండా పోయింది. రెండు బోట్లలో దిగిన వీళ్లను జాలర్లు పసిగట్టి పోలీసులను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఖాకీలు అన్నీ సర్దుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. చివరకు వాళ్ల వాహనాలనే కబ్జా చేసి పారిపోతున్నా పట్టుకోలేని అసమర్థత మన వ్యవస్థది. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించిన తీరు చూస్తే.. మన దేశంలో అసలు రక్షణ వ్యవస్థ అన్నది ఒకటి ఉందా? అన్న అనుమానం కలుగుతుంది. ఈ దాడికి ఆరు నెలల ముందే బ్లూప్రింట్ తయారైంది. ముంబై ఆపరేషన్కు `నవంబర్ 26 దివాళి' అని కోడ్ కూడా పెట్టుకున్నారు ముష్కరులు. 12 నవంబర్‌న కరాచీ నుంచి ఓ కార్గో షిప్‌లో ఓ కమాండర్ ముంబయి బయలు దేరాడు. మార్గ మధ్యంలో లష్కర్ ముఖ్యనేతల్లో నాలుగో వ్యక్తికి ఫోన్ చేసి తాను మరో ఏడెనిమిది గంటల్లో ముంబై చేరుతున్నట్లు తెలిపాడు. సురక్షితంగా గేట్వే చేరుకుని అక్కడి నుంచి ముంబైలోకి అతను అనుచరులతో ప్రవేశించాడు. 19, 20 తేదీలలో నగరమంతా తిరిగి ఆనుపానులన్నీ తెలుసుకున్నారు. ఆ తరువాత 26 నాటికి ప్రత్యేక బోట్లలో ఫిదాయూలు దిగారు. గ్రూపులుగా విడిపోయారు. తాము అనుకున్న విధంగా దీపావళి జరుపుకున్నారు.... వందల ప్రాణాలను బలిపెట్టి...
వీరికి సహకరించిన వారిలో మన పంజాబ్కే చెందిన ఇంటిదొంగ ఒకరున్నట్లు తెలుస్తోంది. ఇతను రెగ్యులర్‌గా లష్కర్ కమాండర్‌తో సంప్రతింపులు జరిపినట్లు సమాచారం. టెరర్రిస్టులను తీసుకువచ్చిన బోటును నడిపిందికూడా భారతీయుడే. తాము గమ్యం చేరగానే అతణ్ణి ఉగ్రవాదులు హతమార్చారు. వాస్తవానికి సెప్టెంబర్లోనే ఉగ్రవాదుల దాడి జరుగవచ్చని ప్రముఖ విదేశీ నిఘా ఏజెన్సీ ఒకటి `రా' వర్గాలను హెచ్చరించింది. `రా' ఐబికి ఈ సమాచారం తెలిపింది. ఈ విషయాన్ని యథావిధిగా ముంబయి పోలీసులకు, కేంద్ర హోం శాఖకు అందించి ఐబి చేతులు దులుపుకుంది. ఈ సమాచారం మేరకు సెప్టెంబర్ 24న ఈ దాడి జరగాల్సి ఉంది. అప్పుడు పోలీసులు కాస్త హడావుడి చేసి ఊరుకున్నారు. కానీ, అదే దాడి సరిగ్గా రెండు నెలల తరువాత జరిగింది. గత మే నెల 13న జైపూర్‌లో దాడులు జరిగినప్పటి నుంచీ జూన్, ఆగస్టు మినహా మిగతా అన్ని నెలల్లో ఒక్కో మహానగరంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫెడరల్ సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సి ఉందంటూ తాజాగా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యను హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఎప్పుడో చేసేశారు. బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన పోలీసు చట్టాన్ని సంస్కరించాలన్న మెరుపు ఆలోచనా సింగ్ గారికి ఇప్పుడే వచ్చింది. ఒక నగరం తరువాత ఒకటి దాడికి గురవుతున్నా, సదరు సంస్థను ఏర్పాటు చేయటమో, ప్రత్యేక చట్టాన్నో చేసే ఓపికా, తీరికా పాలకులకు ఎంతమాత్రం చిక్కటం లేదు. ఎన్నికల ప్రచారాలు మాత్రం భేషుగ్గా చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడూ గంభీరోపన్యాసాలకు కొదువ లేదు. శవాలపై రాజకీయ ఫలాలను ఏరుకునే ప్రయత్నాలలోనూ ఎవరికి వారే సాటి. ప్రజల అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్నా వారి ధోరణి ఎంతమాత్రం మారదు. 40 గంటల పాటు ఎన్ఎస్జి కమాండోలు ఉగ్రవాదులు యుద్ధం చేశారు. ఇక యథావిధిగా పరామర్శల పర్వం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సంకీర్ణ కూటమి అధినేత్రి.. రాజకీయ పార్టీల నేతలు, ఛోటా మోటా నాయకులు, మంత్రులు పొలోమని ముంబయిని చుట్టుముట్టనున్నారు. గంభీరమైన పదజాలంతో రాజకీయం చేసేందుకు వారికిది సువర్ణావకాశం.. కానీ బాధితులకు కావలసింది నేతల మాటలు కాదు.. ప్రధానమంత్రి చేస్తానని చెప్తున్నవి చేతల్లో చూడటమే వాళ్లకు కావాలి. ఇవాళ భద్రత కావలసింది నేతలకు కాదు.. వారిని ఎన్నుకున్న సామాన్యుడికి.. చట్టం చేయటానికి నాయకులకు ఇంత వెరపెందుకో సామాన్యులకు అర్థం కాదు. కేంద్రంలోని పాలక వర్గం ఉన్న చట్టాన్ని రద్దు చేస్తుంది.. పోనీ ఒక రాష్ర్టం తాను చట్టం చేసుకుంటానన్నా దానికీ మోకాలడ్డుతుంది... అంతా రాజకీయమే.. అన్నింటా రాజకీయమే..దీనికి పరిమితి లేదు.. నేతలకు పరిణితి లేదు. ఇది రాజనీతి కాదు.. కూటనీతి. ప్రజాస్వామ్యం ముసుగులో నాయకులు ప్రజలను పందెంగా పెట్టి ఆడుతున్న మృత్యుక్రీడ. మతంతో ప్రమేయం లేకుండా కలుగుల్లో దాగిన ఉగ్రవాదులను ఏరివేయటానికి రాజకీయ సంకల్పం అవసరం. అవసరమైతే అందుకోసం అధికారాన్ని పణంగా పెట్టడానికైనా వెనుకాడవద్దు. బంగ్లాదేశ్ విషయంలో, ఖలిస్తాన్ విషయంలో ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం సర్దార్ పటేల్ ఎంత ఖచ్చితంగా సైనిక చర్య జరిపారో నేతలు గ్రహించాలి. ఉగ్రవాదానికి ఇస్లాం, హిందూ అన్న తేడా లేదు. దేశానికి ద్రోహం చేసిన వాడెవడైనా వెంటాడి వెంటాడి వేటాడాలి. వాళ్ల పట్ల చూపే కనికరం వందల ప్రాణాలతో చెలగాటం అన్నది నిష్ఠుర సత్యం. మన దేశ అంతర్గత భద్రత కంటే అంతర్జాతీయ శాంతి వ్యవహారాలు ముఖ్యమేం కాదు.. మనం శాంతికాముకులమన్న పేరు కోసం పక్కలో బల్లెంలా తయారైన శత్రువును విడిచిపెట్టడం మూర్ఖత్వం అవుతుంది. విస్పష్టంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నట్లు మనకు తెలుసు. ప్రథమ శత్రువు దావూద్ ఇబ్రహిం అక్కడే ఉన్నాడనీ తెలుసు. వారికి పాక్ ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తోన్న విషయమూ తెలుసు. ప్రత్యక్ష యుద్ధానికి దిగలేక.. పరోక్షంగా దేశంపై పట్టు బిగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదనీ తెలుసు. అలాంటి దేశంతో చర్చలు కాలాయాపనే తప్ప పరిష్కారానికి మార్గం చూపవన్నదీ మన పాలకులకు తెలుసు. అయినా అగ్రరాజ్యానికి ఉన్న ధైర్యం మనకు లేకపోయింది. టెరర్రిస్టు దాడి జరిగిన వెంటనే ఇది పిరికిపందల చర్య అని మాట్లాడే నాయకుల చేవ పిరికితనం కాదా? రాజ్యం వీర భోజ్యం అన్నారు పెద్దలు. రాజ్యం ఏలే పాలకుడికి ప్రజలను కాపాడే వీరత్వం, పౌరుషం ఉండాలి. ఆ పౌరుషమే ఇవాల్టి పాలకులకు కరవైనప్పుడు మృత్యు ముఖంలో ఉన్న పాలితులు ఎవరిని నిందించితే మాత్రం ఏం ప్రయోజనం?
1 కామెంట్:
ఉగ్రవాదానికి ఇస్లాం, హిందూ అన్న తేడా లేదు. దేశానికి ద్రోహం చేసిన వాడెవడైనా వెంటాడి వెంటాడి వేటాడాలి. వాళ్ల పట్ల చూపే కనికరం వందల ప్రాణాలతో చెలగాటం అన్నది నిష్ఠుర సత్యం. మన దేశ అంతర్గత భద్రత కంటే అంతర్జాతీయ శాంతి వ్యవహారాలు ముఖ్యమేం కాదు.. మనం శాంతికాముకులమన్న పేరు కోసం పక్కలో బల్లెంలా తయారైన శత్రువును విడిచిపెట్టడం మూర్ఖత్వం అవుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి