భారత దేశంపై ఉగ్రవాదులు కనీవినీ ఎరుగని రీతిలో జరిపిన యుద్ధంలో క్షణక్షణానికి సంచలన విషయాలు బయటపెడుతున్నాయి. కరాచీ నుంచి గేట్‌వే దాకా సముద్ర మార్గంలో టెరర్రిస్టులు చొరబడటమే విస్మయం అనుకుంటే, అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగుచూసింది. మారణకాండకు తెగబడిన వారిలో ఒకరు గత పది మాసాలుగా తాజ్ హోటల్‌లో ట్రైనీ చెఫ్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా వెలుగుచూసిన ఈ నిజం కేంద్ర హోం శాఖకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ముంబయి మహానగరాన్ని కాష్టాల గడ్డగా మార్చటానికి లష్కర్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న కొద్దీ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పన్నెండు నాటికన్ మైళ్ల మేర తీర ప్రాంతంలో నిరంతర నిఘా కళు్ల కప్పి దేశంలోకి ముష్కరులు ప్రవేశించటమే మింగుడు పడని అంశంగా మారింది. టెరర్రిస్టులు కరాచీ నుంచి పోర్‌బందర్ చేరుకుని అక్కడ కుబేర్ అనే బోటును హైజాక్ చేశారు. అక్కడి నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియాకు మరో నాలుగు రబ్బరు బోట్లలో చేరుకున్నారు. వాస్తవంగా నవంబర్ 26న ఘాతుకానికి ముందు టెరర్రిస్టుల చొరబాటుకు సంబంధించిన వివరం ఇది. కానీ, ఈ దారుణంకోసం ఏడాది క్రితం నుంచే కరాచీలో కుట్ర జరిగింది. ఘటనలో పాల్గొన్న అందరికీ అత్యాధునిక శిక్షణ ఇవ్వబడింది. భారత ప్రథమ శత్రువు దావూద్ ఇబ్రహిం సముద్రమార్గం గుండా నడిపిస్తున్న నెట్‌వర్‌క ముష్కరులకు చక్కగా ఉపయోగపడింది. అయితే తుట్టతుది ఆపరేషన్‌కు జరిగిన తంతు ఇది. దీనికి ముందస్తుగా టెరర్రిస్టు సంస్థ లష్కర్ భారీ కసరత్తే చేసింది. అందులో భాగంగానే ఇద్దరు ఉగ్రవాదులను అటు తాజ్‌లో, ఇటు ఓబెరాయ్‌లో చొరబర్చింది. తాజ్ హోటల్‌లో పది నెలల నుంచే ఈ ఆపరేషన్‌కు కుట్ర జరుగుతున్నదన్న విషయం నిర్ధారణ కావటం ఉగ్రవాదులు దేశంలో ఏ మేరకు విస్తరించారో అర్థమవుతోంది. హోటల్ తాజ్‌లో జరిగిన దాడిలో అయిదుగురు వంటవాళు్ల మరణించారు. వారిలో ఒక ట్రైనీ చెఫ్ తాను చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి పది మాసాలుగా తనతో పని చేసిన మిత్రుడే తనపై కాల్పులు జరిపాడని చెప్పాడు. దీంతో తాజ్‌లో చాలా కాలం నుంచే ఉగ్రవాదులు మకాం వేసినట్లు స్పష్టమైంది. వంటవాడిగా ఉన్న కాలంలోనే హోటల్‌లోకి వివిధ రకాలుగా సరుకులు వస్తున్న సమయంలో తెలివిగా మారణాయుధాలను, మందుగుండు సామాగ్రిని హోటల్‌లోకి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. విచిత్రమేమంటే తాజ్, ఓబెరాయ్‌లలో ఏడాది నుంచే ఉగ్రవాదులు కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేసుకున్నారని కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ స్వయంగా ఓ చానల్‌తో అన్నారంటేనే మన ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంటే దాడికి సంబంధించిన సమాచారం ఎంతో కొంత కేంద్రం వద్ద ఉంది. కపిల్ సిబల్ ఇచ్చిన సమాచారానికి ఆధారం ఏమిటి? తెలిసిన సమాచారాన్ని సంబంధిత వర్గాల మధ్య కము్యనికేట్ అయిందా? అయితే ఎందుకు నియంత్రించలేదు? పది నెలలుగా ఒక వంటవాడే ఉన్నాడా, మరికొందరు హోటల్‌లో మకాం వేశారా అన్నది ఇంకా స్పష్టం కావలసి ఉంది. అయితే ఒక విదేశీ నాగరికుడికి హోటల్ మేనేజిమెంట్ శిక్షణ ఇవ్వటానికి హోటల్ తాజ్ ఏ ప్రాతిపదికన అంగీకరించిందన్నది అంతుపట్టని విషయం. అంత పెద్ద హోటల్‌లో, విఐపిల తాకిడి ఎక్కువగా ఉండే చోట ఒక ఉద్యోగం ఇస్తున్నప్పుడు అతనికి సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోకుండానే ఎలా ఇచ్చారు? లోతుల్లోకి వెళ్తే కానీ, డొంక కదలదు. అంతే కాదు..ఈ ఘాతుక చర్యలో స్థానిక సంఘ విద్రోహుల ప్రమేయాన్నీ కొట్టిపారేయలేం.. నాలుగు రబ్బరు బోట్లలో చొరబడ్డ టెరర్రిస్టులు అందరి కళు్ల కప్పి స్థానికుల సహకారం లేకుండా ఎలా ముందుకు వెళ్లగలిగారు? ప్రముఖ ప్రదేశాలకు దూరంగా ఉన్న నారిమన్ హౌస్‌లో ఇజ్రాయిలీలు ఉంటున్న సమాచారం ఉగ్రవాదులకు ఎలా ఉప్పందింది? ఈ ప్రశ్నలన్నింటినీ ఛేదించాల్సి ఉంది. కేంద్ర సర్కారు జాతికి జవాబుదారి.... కాబట్టి వీటికి సమాధానాలు ఇవ్వాల్సింది సర్కారు పెద్దలే. ``ఇంతకాలం సహించాము.. ఇప్పటికే చాలా చాలా మూల్యం చెల్లించుకున్నాం.. ఇక సహించేది లేదు.. ఏదో ఒకటి చేయండి.. చేసి చూపించండి''.. ప్రజలంతా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఇదే. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వేచి చూడాలి...
3 కామెంట్‌లు:
Anna mana kalam sosha tappa jarigedi nothing
అయితే ఇక ఈ దేశంలో ఎక్కడా స్వేచ్చగా బతికే అవకాశం లేదన్నమాట. చివరికి మన ఇంట్లో కూడా! మన పని మనిషో, డ్రైవరో ఉగ్రవాది అయితే ఏం చేయగలం? తాజ్ లోకి పేలుడు సామగ్రి ఎలా చేరిందో ఇప్పుడే కొంచెం గా అర్థమవుతోంది.
అసలింతకీ ఈ దేశంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ప్రజల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానాలు ఇస్తుందా?
sujata garu.. javabu iche sthitilo unte asalu samsye parishkaramayyedi kada
కామెంట్‌ను పోస్ట్ చేయండి