29, నవంబర్ 2008, శనివారం

జై జవాన్‌..

జై జవాన్‌... పాలకులు ఉదాసీనత వహించినప్పుడు ఈ జవానులే ఈరోజు సామాన్యుల పాలిటి రక్షకులయ్యారు. నిద్రాహారాలు మాని పక్కా వూ్యహంతో, యాభై తొమ్మిది గంటల సుదీర్ఘ పోరాటం చేసి శత్రువులను నిర్జించిన అసాధారణ పటిమ నేషనల్‌ సెక్యూరిటీ గార్‌‌డ్స కమాండోలది. మాతృభూమిని కబళించేందుకు వచ్చిన ముష్కరులను కలుగుల్లోంచి బయటకు రాకుండానే అంతం చేసిన ఎన్‌ఎస్‌జిలకు జాతి యావత్తూ సలామ్‌ చేస్తోంది. 
ముంబై లోని నారిమన్‌ హౌస్‌, ఓబెరాయ్‌ హోటల్‌ ల వద్ద ఆపరేషన్‌ టోర్నడోను విజయవంతం చేసి బయటకు వచ్చిన వీర జవానులకు అక్కడి స్థానికులు పట్టిన నీరాజనం అపురూపం.  మీడియాలో కనిపించిన ఆ దృశ్యాలు జాతి శౌర్యానికి ప్రతీకలు.. మన సైనికుల అసాధారణ పాటవానికి నిలువు దర్పణాలు..మిన్నంటిన నినాదాలు భారత సైనిక కీర్తిపతాకను వినువీధిన ఎగరేస్తున్నాయి. భారత్‌పై తెగబడ్డ ఉగ్రవాదానికి ముఖం బద్దలయ్యే జవాబు చెప్తున్నాయి.... ఎవరు కన్నెత్తి చూసినా చావు దెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నాయి.
ప్రతి ఒక్క పెదవి పైనా ఒకే మాట.. ఒకే నినాదం.. వందే మాతరమ్‌.. భారత మాతాకీ జై అని... ప్రతి ఒక్క చెయూ్య చేస్తున్నది తన జవానుకు సగర్వంగా  సలామ్‌.. తమ దేశాన్ని, తమ ప్రాణాలను కాపాడిన వీర జవానులను మనసారా అభినందిస్తున్నది. యుద్ధంలో  ఎన్‌ఎస్‌జి విజయాన్ని గుండెల నిండా నింపుకున్న ఆనందం వారి భావోద్వేగంలో అణువణువునా తొణికిసలాడింది.  రెండు రోజులుగా తలుపులు బిగించుకుని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజల్ని ఎన్‌ఎస్‌జి విజయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. రెచ్చిపోయిన ఉత్సాహంతో సైనికులను అభినందించేందుకు వేల సంఖ్యలో వచ్చిన జన సందోహాన్ని చూస్తె ప్రతి భారతీయుడి మనసు పులకరించి పోతుంది. దాదాపు 59 గంటల పాటు నిద్రాహారాలు మాని శత్రువులను పరిమార్చటం కోసమే ఎన్‌ఎస్‌జి శ్రమించింది. జన్మభూమిని కంటికి రెప్పలా కాపాడటంలో ఎన్‌ఎస్‌జి ఏనాడూ వెనుకడుగు వేయలేదు..ఓటమి అంటే ఏమిటో దానికి తెలియదు.. అక్షరధామ్‌ ఆపరేషన్‌ నుంచి ఆపరేషన్‌ టోర్నడో, ఆపరేషన్‌ సైక్లోన్‌ల దాకా దేశం పట్ల వారి కమిట్‌మెంట్‌ ఎన్నడూ వృథా పోలేదు. అడుగడుగునా అవరోధాలు ఎదురైనా ఆపరేషన్‌ను సక్సెస్‌ చేయటంలో , ఉన్మాదులను మట్టుపెట్టడంలో వారి నైపుణ్యం అపూర్వమ్.  నారిమన్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన జవానులను చూసిన ప్రతి ఒక్కరికీ ఆ క్షణంలో అనిపించింది ఒక్కటే.. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా వీళ్లు అని..
భారత దేశం హృదయపూర్వకంగా తన సైనికులను సల్యూట్‌ చేస్తోంది. త్రివర్ణ పతాకం తిరిగి సంతోషంగా వినీలాకాశంలో రెపరెపలాడుతోంది. జై హింద్.


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

andaru garvinchadaginadi selute mitrama