18, ఫిబ్రవరి 2009, బుధవారం

ఏదీ గాంధీ వాదం?

`నా జీవితమే నా సందేశం'.. జాతిపిత మహాత్మాగాంధీ తన జాతికి అందించిన జీవన సూత్రమిది. దాదాపు అర్ధశతాబ్దం పాటు జాతిని స్ఫూర్తిమంతం చేసి దేశానికి స్వాతంత్య్ర ఫలాలను అందించిన వారిలో అగ్రగణ్యుడుగా నిలిచిన వాడాయన. ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించేందుకు తాను జన్మించడానికి ముందు నుంచీ సాగుతున్న పోరాటాన్ని అందిపుచ్చుకుని గమ్యం వైపు నడిపించినవాడు. జాతీయోద్యమ రంగం పైకి లోక్‌మాన్య బాలగంగాధర్‌ తిలక్‌ తరువాత ప్రవేశించిన గాంధీజీ తన పోరాటాన్ని ప్రధానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సాగించాడు. స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ ఉద్యమాదులు, సామాజిక రంగంలో కులభేద నిరసన, అస్పృశ్యత మద్యపాన నిషేధము, ఆర్థిక రంగంలో దేశీయ పరిశ్రమలు, గ్రామ స్వరాజ్యము, ఖాకీ వంటి వాటిని ప్రధానంగా చేసుకుని ఆయన పోరాటాలు సాగాయి. ఆయన ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమం ప్రపంచ విముక్తి ఉద్యమాల్లో ఒక కొత్త సమర సాధనంగా మారింది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తరువాత ఈ అరవై ఏళ్లలోనూ మన దేశంలో సత్యాగ్రహ, సహాయ నిరాకరణ ఉద్యమాలే ప్రజల సమస్యల పరిష్కార సాధనాలుగా మారాయి. గాంధీజీ ఆచరించిన అతి సామాన్యమైన విధానాలు ఆలోచనకు, ఆచరణకు మధ్య ఉన్న అంతరాలను చెరిపేశాయి. మొట్టమొదటి సారిగా భారతీయులపై దక్షిణాఫ్రికాలో శే్వతజాతీయులు జరుపుతున్న దమనకాండను నిరసిస్తూ గాంధీ ప్రయోగించిన మహాస్త్రం `సత్యాగ్రహా'నికి వందేళు్ల పూర్తయిన సందర్భంలో ఆయన జయంతిని ప్రత్యేకంగా జరుపుకున్నాం కూడా. జాతీయోద్యమంలో గాంధీజీ ప్రతిపాదించిన మత సామరస్యం వంటి అంశాలు జాతి సమగ్రతకు, పటిష్ఠ నిరా్మణానికి ప్రాతిపదికను వేసినప్పటికీ కూడా రాజకీయ ఆచరణలో ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ద్విజాతి సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకువచ్చింది. స్వాతంత్య్రం రావడంతోనే దేశం ఛిన్నాభిన్నమైపోయింది. అప్పటిదాకా మార్గదర్శకుడుగా ఉన్న గాంధీ రంగం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమయంలో దేశ విభజన జరగడంతోనే ద్విజాతి సిద్ధాంతం అంతమైపోతుందని అనుకున్న వారికి అవి భ్రమలేనని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళు్ల పూర్తయిన తరువాత దేశంలో ద్విజాతి సిద్ధాంతం కాస్తా బహుళ జాతి సిద్ధాంతంగా పరిణమించే ప్రమాదం ఏర్పడింది. ఏ కులమత విభేదనను గాంధీ నిరసించాడో ఆ కుల, మత విభేదన పునాదులపైనే నేటి భారత రాజకీయ వ్యవస్థ వర్ధిల్లుతోంది. ఈ విభేదాలే ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో వరా్గన్ని ఓటుబ్యాంకుగా మార్చివేశాయి. ఫలితం వర్గవైషమ్యాలు, మత విద్వేషాలు, ఉద్యమాలు.. ఈ ఉద్యమాలు సైతం మళ్లీ గాంధేయ మార్గంలోనే కొనసాగడం విచిత్రం. ఈ సమరసత లోపించడాన్ని విదేశీ టెరర్రిస్టులు అవకాశంగా తీసుకున్న పర్యవసానం గత రెండు దశాబ్దాలుగా దేశంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న హింసాకాండ. ఇవాళ దేశంలో ఏ ఒక్క నగరమూ సురక్షితం కాదు. వేరా్పటు వాదులు ఒక వంక, మావోయిస్టులు మరో వంక, అతివాద సంస్థలు ఇంకొక వంక దోపిడీ దారులు మరో పక్క హింసాకార్యకలాపాలను స్వేచ్ఛగా సాగిస్తున్నారు. వేల మంది అన్యాయంగా అసువులు బాస్తున్నారు. ఒక చెంపపై కొడితే, మరో చెంప చూపించే వ్యక్తి కలికానికి కూడా ఇవాళ ఈ భారత దేశంలో కనపడడు. శాసనకర్తల స్థానంలో నేరగాళు్ల కూర్చొనే దారుణమైన పరిస్థితులు ఉన్న ఈ దేశంలో గాంధీ ప్రవచించిన అహింసకు తావెక్కడుంటుంది? రాజకీయాల పుణ్యమా అని దేశంలో రాజకీయాల ముసుగులో పార్టీలే మతాల మధ్య చిచ్చుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతున్నాయన్నది నిష్ఠుర సత్యం. అవినీతి పూర్తిగా చట్టబద్ధమైపోయింది. లంచం ఇవ్వడానికి ప్రజలు మానసికంగా సిద్ధపడిపోయారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీజీ దర్శించిన స్వరాజ్యమేనా ఇది? అని ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, జాతీయ పునరుజ్జీవనోద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన గాంధీజీ అందించిన స్ఫూర్తిని ఆయన్ను తండ్రిగా ఆరాధిస్తున్న జాతి ఎంతవరకు అందిపుచ్చుకున్నది? ఆయన ప్రతిపాదించిన రాజకీయ విధానాలు కానీ, ఆర్థిక విధానాలను కానీ, సామాజిక అంశాలను కానీ ఆయన్ను మహాత్ముడిగా భావన చేస్తున్న మనం ఎంతవరకు పట్టించుకుంటున్నాం? అని ప్రశ్నించుకుంటే ఏమీ లేదనే చెప్పాలి. ఆయన జయంతిని ఏటా వాడవాడలా, దేశవిదేశాల్లో జరుపుకుంటున్నాం. ఆయన ప్రవచించిన అహింస, సత్యాగ్రహ వాదాలను సందర్భం వచ్చినప్పుడల్లా తలచుకుంటున్నాం. దేశమంతటా లక్షలాది విగ్రహాలను స్థాపించుకున్నాం. రాజ్‌ఘాట్‌లో అఖండదీపాన్ని వెలిగించి ఘనంగానే నివాళులర్పిస్తున్నాం. కానీ, స్వాతంత్య్రానంతరం గాంధీ కాంక్షించినది ఒక్కటీ నెరవేరలేదు. ప్రపంచీకరణ, సంస్కరణల ప్రభావంతో గాంధీ ఆర్థిక విధానాలు కనపడకుండా పోయాయి. స్వదేశీ పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూతపడ్డాయి. వృత్తులు మట్టికొట్టుకుపోయాయి. పట్టణీకరణ అత్యంత వేగంగా పెరిగిపోయి, పల్లెసీమలు కనుమరుగవుతున్నాయి. గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యం రూపురేఖలు కూడా ఇప్పుడు కనపడవు. మన రాష్ట్రంలోనే పంచాయితీలకు ఎన్నికలు జరిగితే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన ప్రబుద్ధులు వేలం పాటలో పదవులను కొనుక్కున వైనాలు నిన్న మొన్నటి ఘటనలే. స్థానిక స్వపరిపాలన సజావుగా సాగడం కోసం వాటికి తగిన అధికారాలు కాగితాల్లో రాసే ఉంటాయి. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర అట్టే పెట్టుకుంటాయి. ఎన్నటికీ బదలాయింపు జరగదు. ఏ విధంగా చూసినా ఇవాళ ఈ దేశంలో గాంధీ కేవలం ఏడాదికి ఓసారి దండ వేసేందుకు వాడుకునే విగ్రహం మాత్రమే. రంగు వేసుకుని ముష్టెత్తుకోవడానికి పనికివచ్చే ఓ వేషం మాత్రమే. అంతే కానీ, ప్రస్తుతం ఈ దేశంలో మనుగడ సాగిస్తున్న జాతికి గాంధీజీ తండ్రి మాత్రం కాలేడు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి