11, ఫిబ్రవరి 2009, బుధవారం

మహిళల సాధికారత అంటే ఇదేనా?

`సమర్థులూ, నిర్భయులూ, అంకిత భావం కలవాళూ్ల ఒక వేయి మంది పురుషులతో భారత దేశ సమస్యల్ని సమర్థంగా జయించగలను.. అయితే ఇవే గుణాలున్న స్త్రీలు ఉన్నట్లయితే అందులో పదోవంతైనా చాలు.. అదే పనిని అంతకంటే త్వరగా, అంతకంటే శక్తిమంతంగా సాధించగలను..' సరిగ్గా శతాబ్దం క్రితం ప్రపంచానికి భారతీయ మార్గాన్ని నిర్దేశం చేసిన మహా పురుషుడు స్వామి వివేకానంద అన్న మాటలివి. మహిళా శక్తిని ఆనాడే ఇంత శక్తిమంతంగా అంచనా వేయగలిగిన వ్యక్తి మరొకరు లేరు. ఆనాటి ఆయన మాటలను ప్రపంచ మహిళ ఈనాడు నిజం చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే తాను ఎవరికీ ఎంతమాత్రం తక్కువ సమానం కాదన్నది ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లోనూ నిరూపితమైంది. జాతి, భాష, సంస్కృతి, సంపద, రాజకీయాల హద్దులు ఆమెకు లేవు. ఏ ఎల్లలూ ఆమెను కట్టిపడేయలేవు. ఆమె ఇప్పుడు అబల కాదు. తన స్వేచ్ఛ, స్వాతంత్య్రాల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న పరిపూర్ణ వ్యక్తి. తరాలు మారుతున్న కొద్దీ మహిళ వ్యక్తిత్వంలో అనేక మార్పులు. ఉరకలు వేసే ఉత్సాహం. పురుషుడి కంటే ఎన్నో రెట్లు వేగంగా ఇవాళ స్త్రీ పురోగమన దిశలో పరుగులు పెడ్తోంది. ఆర్థిక స్వాతంత్య్రమే కాదు.. అధికార వాసనలూ ఆమెకు తెలుసు. ఒక గ్రామ సర్పంచి పదవి నుంచి అగ్రరాజ్యానికి అధ్యక్ష స్థాయి వరకూ ఆమె ప్రస్థానాన్ని ఎవరు ఆపగలరు? అనేక సామాజిక, విజ్ఞాన సాంస్కృతిక రంగాల్లో ఇప్పటికే మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. కేవల గృహిణిగా కుటుంబాన్ని నడపడమే కాదు.. వ్యోమగామిగా రోదసిదాకా ప్రయాణించి రాగల శక్తిసంపన్నత తనకుందని నిరూపించుకున్నది. భారతీయ సంస్కృతి మహిళకు ఇచ్చిన గుర్తింపు `శక్తి స్వరూపిణి'. ఆ స్వరూపం ఇవాళ ప్రపంచమంతటా విశ్వరూపమై ఆవరించింది.
స్త్రీత్వం అన్నది ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, ఒక దేశానికో పరిమితం కాదు. ఇది మానవతకూ, విశ్వజనీనతకూ సంబంధించినది. ఒక్క మాటలో చెప్పాలంటే, `మానవ జాతి మనుగడకీ ప్రాణం పోసింది మగువ.' ఎంత క్లాసికల్‌ భావన ఇది..! ప్రపంచంలో ఏదైనా అబద్ధం కావచ్చేమో కానీ, ఈ భావన మాత్రం సార్వకాలిక మైన నిజం. సమాజం ఎంత ఆధునికమైనా, ఎన్ని మార్పులు చేర్పులకు లోనైనా, ఎంతగా పురోగమించినా అన్నింటికీ ఆధారభూమికగా మహిళ నిలవకుండా సాధ్యం కాదన్నది నిజం. ప్రపంచంలో ఎక్కడైనా సరే మహిళకున్న ప్రత్యేక స్థానానికి ఇది ఓ చిన్న గుర్తింపు మాత్రమే. బాలికగా జన్మించినప్పటి నుంచీ, సోదరిగా, ఇల్లాలిగా ఒదిగినా, ఉద్యోగినిగా ఎదిగినా, నాయకురాలిగా సమాజాన్ని శాసించినా, తల్లిలా పరిపూర్ణతను సాధించేంత వరకూ అనేక రూపాలలో ఎదిగే వ్యక్తిత్వం ఆమెది. ఆమె ప్రకృతి.. ప్రకృతిలో ఎన్ని రకాల చైతన్యాలున్నాయో, ఎన్ని వైరుధ్యాలు కనిపిస్తాయో, అన్ని రకాల చైతన్యాలు.. వైరుధ్యాలు ఆమెలో కనిపిస్తాయి. ఏడాది పొడవునా సంభవించే ఆరు రుతువులు మహిళలోని ఆరు లక్షణాల సమన్వితం.
సమగ్ర మానవ సంస్కృతిని, నాగరికతల్ని నిర్మించే లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో స్త్రీ, పురుషులిద్దరిదీ సమాన భాగస్వామ్యం. ఒకరి ప్రయోజనాలను మరొకరు కాపాడుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం సిద్ధిస్తుంది. కానీ, పాశ్చాత్య ప్రపంచం ఇందుకు విరుద్ధంగా నడిచింది. ప్రాపంచిక దృక్పథం స్త్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారింది. ఈ దృక్పథాన్ని పురుషుడు ఆమోదించిన పర్యవసానం స్త్రీవాద ఉద్యమాలు. పాశ్చాత్య పోకడలను పుణికిపుచ్చుకున్న భారతదేశంలోనూ అదే ధోరణి ప్రబలడం ప్రాచీన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దారి తీసింది. పురుషులతో సమానత్వాన్ని సాధించడానికి, ఆర్థిక స్వేచ్ఛ కోసం వీధుల్లోకి వచ్చి మహిళలు ఉద్యమించాల్సిన పరిస్థితులు దాపురించడం నిజంగా దురదృష్టమే. కానీ, ఈ ఉద్యమాలు విశ్వవ్యాప్తంగా మహిళల్లో నిద్రాణమైన చైతన్యాన్ని వెలుగులోకి తెచ్చిన శుభ సందర్భం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన సాధారణ మహిళ కథ ఈ మహిళా దినోత్సవం. సమాజంలో మగవాడితో సమానంగా అడుగులు కలిపి నడిచేందుకు జరిపిన పోరాటానికి తీపి గుర్తు ఈ రోజు. ఫ్రెంచ్‌ విప్లవం జరుగుతున్న రోజుల్లో యుద్ధాన్ని నివారించేందుకు గ్రీసు దేశంలో మహిళలు మగవారిపై సెక్సువల్‌ సమ్మెను ప్రకటించాల్సి వచ్చింది. మహిళలంతా ఏకమై యుద్ధం ఆపితే కానీ, పడగ్గది వైపు కూడా రానివ్వబోమని చేసిన హెచ్చరిక ప్రపంచంలో స్త్రీ ఉద్యమాలకు ఒక విధంగా నాంది. ఆ తరువాత కొన్నాళ్లకే పర్షియాలో మగువలు మగవారి అణచివేత విధానాలను ఆనాడే నిరసించారు. స్వేచ్ఛ, సమానత్వాలను డిమాండ్‌ చేస్తూ అప్పుడే తొలి ప్రదర్శన జరిగింది. ఈ ఉద్యమాలు, ఆందోళనలన్నీ ఏకపక్షంగా, ఎక్కడికక్కడ జరిగినవే. ఆయా దేశాలకు పరిమితం అయినవే. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మహిళల పట్ల ఒకరకమైన వివక్ష కొనసాగుతున్నా విశ్వవ్యాప్తంగా ఒకవిధమైన చైతన్యం రావడానికి చాలా కాలమే పట్టింది. 20వ శతాబ్దంలో ఓ పక్క పారిశ్రామిక విప్లవం రావడం.., మరో పక్క జనాభా విస్ఫోటనం.., మహిళల పట్ల మరింత వివక్షకు దారి తీసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కొద్దో గొప్పో మహిళల పరిస్థితి ఒకలా ఉంటే, వెనుకబడిన దేశాల్లో మరింత దారుణంగా మారింది. సంపన్న దేశాల్లో జాతి వివక్ష పెరిగి, విజాతీయులపై వేధింపులు అధికమయ్యాయి. ఆర్థికపరమైన అవసరాలు, సామాజిక ప్రయోజనాలు పురుషాధిక్యతను సహించరాని స్థితికి చేర్చాయి. ప్రతి చిన్న విషయానికీ తనపై ఆధారపడి ఉండేలా మహిళను పంజరంలో చిలుకగా మార్చడం వల్లనే ఉద్యమాలు విశ్వరూపం దాల్చాయి. అమెరికాలో జాత్యహంకారం నల్లజాతి మహిళల పరిస్థితిని దుర్భరం చేశాయి. ఆఫ్రికాలో మహిళ పరిస్థితి ఆదిమ కాలం నుంచి ఇవాళ్టికీ బయటపడలేదు. ఆసియా మహిళపైనా వివక్షే. ఇస్లామిక్‌ దేశాల్లో మహిళకు అన్నీ బంధనాలే.. ఆసియాలో, ఐరోపాలో, ఆస్ట్రేలియాలో నాగరిక సమాజాలని చెప్పుకున్న అన్ని సమాజాల్లోనూ మహిళల హక్కుల్ని కాలరాయడం వల్లనే వారి హక్కుల పరిరక్షణ ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు 1975లో ఐక్యరాజ్యసమితి ప్రత్యక్షంగా చొరవ తీసుకుని మార్చి ఎనిమిదో తేదీని అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి గుర్తింపునివ్వడం ద్వారా విశ్వవ్యాప్తంగా మహిళను ఏకత్రితం చేసింది. అప్పట్నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్ని ప్రపంచం అంతటా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలలో చాలా దేశాలు ఈ రోజును జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటించడం గమనార్హం.

ఇంతవరకూ బాగానే ఉంది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం అన్ని విధాలా స్వాగతించదగిందే. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు జరుగుతున్న మహిళా ఉద్యమాలు కానీ, స్త్రీవాద సాహిత్యం కానీ ఎంతమంది ప్రయోజనాలను కాపాడుతున్నాయి...? ఎందరు మహిళలకు సాధికారత సంపాదించి పెట్టగలిగాయి అన్న ప్రశ్నలకు జవాబు అసంపూర్ణమే. .నగరాల్లో, పట్టణాల్లో, ప్రపంచ రాజధానుల్లో జరుగుతున్న ఉద్యమాలు సంపన్న వర్గాల మహిళలు ఒక విధంగా తమ గుర్తింపు కోసం, పాపులారిటీ కోసం చేస్తున్నారనే ఆరోపణలు సత్యదూరం కావు. తమ ఆర్థిక, అధికార అవసరాలు, ప్రయోజనాల కోసం చేస్తున్నవే తప్ప, నిజంగా స్త్రీ వివక్షకు గురవుతున్న ప్రాంతాల్లో, ఈ మహిళా సంఘాలు కానీ, ఉద్యమకారులు చేపట్టిన కార్యక్రమాలను వేళ్లపైన లెక్కించవచ్చు. ఒకరిద్దరు మహిళలు అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చిన సందర్భాలు తప్ప ఈ దినోత్సవాల వల్ల కానీ, ప్రసంగ, ప్రచారాల వల్ల కానీ సాధించింది శూన్యం. ఆఫ్రికాలో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులుగానే ఉన్నారన్న నిజాన్ని ఇవాళ ఎవరు కాదనగలరు? ఎవరూ కనీసం వారికి అక్షరం ముక్క నేర్పేవారు లేకుండా పోయారు. ఇవాళ్టికీ ఆఫ్రికా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో నూటికి తొంభై మంది మహిళలు నాగరిక సమాజానికి దూరంగానే అడవి జీవితాలను గడుపుతున్నారన్నది కఠిన వాస్తవం. చదువు వారికి దూరం కనీసం కాగితం అంటే ఏమిటో వారికి తెలియదు. ఒంటిపై అర్ధభాగం వరకూ ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా గడపడం వారికి సర్వసాధారణం. అడవే వారి ప్రపంచం. అదే జీవితం. ప్రపంచం ఎన్ని వేల కిలోమీటర్లు వాయు వేగంతో ప్రయాణిస్తున్నా, దాంతో వారికి నిమిత్తం లేదు. ఈ పరిస్థితి ఒక్క ఆఫ్రికాలోనే లేదు.. ప్రపంచంలోని అన్ని కొండ ప్రాంతాల్లోనూ ఉన్నది ఇదే పరిస్థితి. గిరిజన మహిళలకు ఇవాల్టికీ అటవీ ఉత్పత్తులే అమృత సమానాలు. వారిని ఉద్ధరించడం మాట దేవుడెరుగు... వారికి ఉన్న ఆ కాస్త ఆస్తిని కూడా దోచుకునే దొంగలే ఈ నాగరిక సమాజంలో ఉన్నారు. వారి సంక్షేమం గురించి ఈ మహిళా ఉద్యమకారులు చేస్తున్నదేమిటి? ఏడాదికోమారు హక్కులంటూ ప్రదర్శనలు చేయడం తప్ప..
ఇస్లామిక్‌ దేశాల్లో ముస్లిం మహిళల పరిస్థితిని ఐక్యరాజ్యసమితి కానీ, హక్కుల సంఘాలు కానీ ఏనాడైనా గమనించాయా? మొన్నమొన్నటి వరకూ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు దశాబ్దకాలం పాటు మహిళను అత్యంత దారుణంగా అణచివేస్తే ఈ హక్కుల సంఘాలు కనీసం నిరసన అయినా చెప్పలేకపోయాయి. చదువు లేక, ఆపాదమస్తకం బురఖా ధరించి పురుషుడి సాయం లేకుండా బయటకు రాలేక, ఇంట్లో ఓ మూల కూర్చోలేక వాళు్ల పడిన వేదనలు అన్నీ ఇన్నీ కావు. అప్పుడంటే తాలిబన్లకు భయపడి ఉద్యమకారులు అక్కడ కాలుమోపలేకపోవచ్చు. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ అమెరికా స్వాధీనంలో ఉంది. అయినప్పటికీ అఫ్గాన్‌ ఆడపిల్లలను ఆదుకుని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రపంచ మహిళా సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రమే కదా! షరియత్‌ పేరుతో ముస్లిం మహిళపై మత ఛాందసవాదులు మోపుతున్న ఆంక్షలకు అడ్డుచెప్పేవారెవరు? ఇరాక్‌లోనూ అదే పరిస్థితి. వీళ్లను కాపాడటం ఐక్యరాజ్యసమితికి కానీ, అంతర్జాతీయ మహిళాసంఘాలకు కానీ లేదా?
కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉన్నంత కాలం స్త్రీపురుషుల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే స్త్రీ, పురుషులు ఒకరికొకరు తమకు పోటీలుగా భావించడం మొదలు పెట్టారో అప్పుడే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతూ వచ్చింది. పురుషుడు తప్పు చేశాడు కాబట్టి తాను తప్పు చేయడం కరెక్టనే వాదం విచ్చలవిడితనానికి దారి తీసింది. పురుషుడి విశృంఖలత్వాన్ని నియంత్రించే బదులు, మహిళ కూడా అదే మార్గంలో నడిచేందుకు చేసిన ప్రయత్నం స్వేచ్ఛా శృంగారం జడలు విప్పేందుకు దోహదపడింది. గే, లెస్బియనిజంలు పెరిగి చివరకు ఎయిడ్‌‌స వంటి ప్రాణాంతక వ్యాధుల విస్తరణకు కారణమయింది. ఏ లైంగిక స్వేచ్ఛ కోసమైతే అమెరికాలో ఒకప్పుడు ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమకారులే ప్రపంచంలోని విపరిణామాలను గుర్తెరిగారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఆధారంగా వివాహ వ్యవస్థకు పునాదులు వేస్తున్నారు.

భారత దేశంలో 20వ శతాబ్దానికి పూర్వం వరకూ ఎలాంటి స్త్రీవాద ఉద్యమం రాలేదు. భారతీయ దృక్పథం మొదట్నుంచీ కూడా పురుషుణ్ణి ఏ విధంగా చూసిందో, స్త్రీని కూడా అదే దృక్పథంతో చూసింది. సామాజిక మత రంగాల్లో పురుషునితో సమానమైన స్త్రీని ఋగ్వేదం చిత్రించింది. ఆచారాల నిర్వహణలోనూ, మంత్ర రచనలోనూ, క్లిష్టమైన యుద్ధ, పాలనా రంగాల్లో కూడా వేదకాలపు స్త్రీ పురుషుడి సహచారిణిగా, సహ భాగినిగా దర్శనమిస్తుంది. అందుకే ఆమెను శక్తిగా ఆరాధించారు. ఒకే దివ్యత్వానికి చెందిన రెండు సగాలుగా స్త్రీపురుషులను భారతీయ సంస్కృతి సంభావించింది. సహజ ప్రకృతి లింగభేదం లేకుండా, స్వచ్ఛమూ, సమగ్రమూ, స్వతంత్రమూ అయిన ఆత్మ సమన్వయం గురించి ఉపనిషత్తులు గుర్తించాయి. ఆనాడు పురుషుడితో సమానంగా మహిళకు సైతం ఉపనయనాది సంస్కారాలు జరిగాయని, వారు వేద విధులను నిర్వర్తించేవారన్న విషయాలు ఈరోజు ఎవరికైనా తెలుసా? అన్నింటికంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ భారతీయ ఆలోచనావిధానానికి నిదర్శనం. ఆ తరువాత భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య దాడులు ఇక్కడి సామరస్యాన్ని విచ్ఛిన్నం చేశాయి. క్రమంగా స్త్రీ పురుష వివక్ష సమాజంలో విషం చిమ్మింది. పురుషుడి సాచివేత ధోరణి స్త్రీల పట్ల దారుణమైన ప్రవర్తన ఉద్యమాలు, ఆందోళనలకు కారణభూతమయ్యాయి. హక్కుల పోరాటాలు ప్రారంభమయ్యాయంటే అందుకు కారణం నిస్సందేహంగా ఇక్కడి పురుషాధిక్యతేనని స్పష్టం. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు.. ఒక పక్క, పెళ్లిళ్ల పేరుతో వ్యాపారాలు స్త్రీని అన్ని విధాలా అణచివేసింది. ఇవాళ్టికీ మన దేశంలో కేవలం వరకట్న వేధింపులతో ఏడాదికి 25 వేల మంది పెళ్లికూతుళ్లను సజీవ దహనం చేస్తున్నారన్నది పచ్చినిజం. చదువుకున్న వాళు్ల, అత్యాధునిక నాగరికత ఉందని భ్రమించే అమెరికాలో ఉండి జీవితాల్ని వెలగబెడ్తున్న వాళు్ల సైతం ఆడవాళ్లను వరకట్న వేధింపులకు పాల్పడటం పైశాచికం. ఒకనాడు పురుషుడితో అన్ని విధాలా సమాన స్థాయిలో ఉన్న మహిళను రాను రాను విద్యకు దూరం చేశారు. వేదాలను వినవద్దన్నారు. ఇంటికి పరిమితం చేసి వంటింటి పంజరంలో బంధించారు. ఇదే సమయంలో ఇక్కడికి వచ్చిన పాశ్చాత్యపు వలసవాద సంస్కృతి, విదేశాల్లో వచ్చిన ఉద్యమాలు ఇక్కడి మహిళల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాయనడంలో సందేహం లేదు. అయితే ఈ చైతన్యం వారిలో సాధికారతను సాధించే దిశలో ఎంత తోడ్పడిందో, పెడమార్గం పట్టడానికీ కొంతవరకు కారణమయింది. ప్రాచీన భారతీయ సంస్కృతికి, సనాతనమైన స్త్రీత్వానికి విపరీతార్థాలు ఆపాదించి, అసలు స్త్రీకి ఏనాడూ భారతదేశం పూచికపుల్లంత విలువైనా ఇవ్వలేదన్న అపార్థాలకు ఇక్కడ వచ్చిన ఉద్యమాలు ప్రచారాన్ని కల్పించాయి. శృంగారం శృతి తప్పింది. ఒక పక్క పాశ్చాత్య దేశాలు లైంగిక స్వేచ్ఛకు పరిమితులు కల్పించుకుని, కుటుంబ వ్యవస్థను కోరుకుంటుంటే, భారత్‌లో మాత్రం ఏ చిన్న సమస్యనైనా భూతద్దంల్లోంచి చూసి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కురచ చొక్కాలు ధరించి అర్ధనగ్నంగా కనిపించడం సభ్యత కాదంటే విడాకులు.. అకలి లేదన్నా బలవంతంగా తినమన్నారంటూ విడాకుల పత్రం దాఖలు.. ఇంతకన్నా హాస్యాస్పదమైన ధోరణి మరేదైనా ఉంటుందా? స్త్రీ జనోద్ధరణకోసమే తమ జీవితాల్ని అంకితం చేశామని చెప్పుకునే వాళ్లే లెస్బియనిజాన్ని ప్రోత్సహించే దుస్థితి ఇక్కడ ప్రబలింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలని ఉద్యమించడంలో తప్పు లేదు. కానీ, నిజంగా చట్టసభల్లో ప్రవేశించినవాళ్లలో ఎంతమంది స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? ఉద్యమకారులే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో స్త్రీవాద ఉద్యమానికి పురుషద్వేషం ఒక్కటే ప్రాతిపదిక. ఈ రకమైన ధోరణి సమాజంలో అసంతులనానికి దారి తీసింది. ప్రధాన, అప్రధాన భేదం లేకుండా స్త్రీ తన హక్కుల కోసం పోరాడాల్సిందే. కానీ, ఈ ప్రపంచంలో స్త్రీ, పురుషులు హక్కులు, బాధ్యతలను పంచుకుని వారి మధ్య సామరస్య పూరిత సంబంధాన్ని బాధించుకోకుండా తగిన సర్దుబాట్లు చేసుకున్నప్పుడే దాన్నుండి ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది.


అంతర్జాతీయ మహిళా దినోత్సవం... క్రోనోలాజీ...
1909..
అమెరికాలోని సోషలిస్టు పార్టీ పిలుపు మేరకు మొట్టమొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికాలో జరిగింది. 1913 వరకు పిబ్రవరి చివరి ఆదివారం నాడు వారు ఈ దినోత్సవాన్ని క్రమం తప్పకుండా జరుపుకున్నారు.
1910...
కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్‌‌ట ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్పానించింది. విశ్వవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న మహిళల హక్కుల కోసం పోరాడాలని తీర్మానించారు. పదిహేడు దేశాల నుంచి వచ్చిన వంద మంది మహిళలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ, ఏ రోజున అంతర్జాతీయ మహిళా దినాన్ని జరుపుకోవాలన్నది నిర్ణయించనే లేదు.
1911...
కోపెన్‌ హెగెన్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆస్ట్రియాలో మొట్టమొదటి సారిగా మార్చి 19వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డెన్మార్‌‌క, జర్మనీ, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో దాదాపు పది లక్షల మంది స్త్రీ, పురుషులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వోటు హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలు, పని చేసే హక్కు, ఉద్యోగాల్లో వివక్ష తొలగింపు వంటి డిమాండ్లను ఈ సందర్భంగా చేశారు.
ఆ తరువాత వారం రోజుల లోపే అంటే మార్చి 25న న్యూయార్‌‌క నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 140 మంది వర్కింగ్‌ గర్‌‌ల్స దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇటాలియన్లు, యూదులే. ఈ దుర్ఘటన అమెరికా కార్మిక చట్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కార్మికులకు సురక్షితమైన పనిచేసే పరిస్థితులు కల్పించడంపై చట్టం చేసింది.
1913-14
మొదటి ప్రపంచ యుద్ధాన్ని పురస్కరించుకుని రష్యా మహిళలు మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1913 ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు జరుపుకున్నారు. ఆ తరువాతి సంవత్సరంలో ఐరోపా దేశాలు మార్చి ఎనిమిదో తేదీన ఈ దినోత్సవాన్ని పాటించాయి.
1917..
యుద్ధంలో దాదాపు 20 లక్షల మంది రష్యన్‌ సైనికులు మరణించడంతో అక్కడి మహిళలు మరోసారి ఫిబ్రవరి చివరి ఆదివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.
ఆ తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విశ్వవ్యాప్తంగా కొత్త గుర్తింపు వచ్చింది. 1975లో ఐక్యరాజ్యసమితి ఈ కార్యక్రమాన్ని తానుగా చేపట్టింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

భారత దేశంలో 1971 నుంచి మహిళల సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. 1971లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక కమిటీని నియమించింది. 1980వ దశకంలో అభివృద్ధి ప్రణాళికలో మహిళలను ప్రత్యేక లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం ప్రత్యేక చాప్టర్‌ను చేర్చారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో మహిళా అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఎనిమిదో ప్రణాళిక నాటికి మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం వంటి కార్యకలాపాలతో పాటు సాధికారత కూడా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1996 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మహిళల జనాభా 450 మిలియన్లు ఉంది. అంటే దాదాపు దేశ జనాభాలో 49 శాతం అన్నమాట.
1985లో మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పటి నుంచి దేశంలో మహిళా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. 1992లో జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పడింది. ప్రస్తుతం సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గిరిజావ్యాస్‌ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

సాధికారత కోసమేనా రిజర్వేషన్లు..?
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా మన దేశంలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి రాజకీయ పార్టీలు పైకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, లోపాయికారిగా ఎంతగా అడ్డుకుంటున్నదీ జగద్విదితం. పార్లమెంటు సమావేశమైన ప్రతిసారీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి కాసింత రభస జరగడం ఆ తరువాత మర్చి పోవడం రివాజుగా మారింది. మన రాష్ట్రంలోనైతే పంచాయితీల్లో ఇప్పటికే 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. అయితే ఈ సాధికారతను ఎంతవరకు మహిళలు స్వతంత్రంగా అనుభవిస్తున్నారంటే ప్రశ్నార్థకమే. నిజంగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో ఎంతమంది భర్త ప్రమేయం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు? చాలా చోట్ల భర్తల పెత్తనమే నడుస్తున్నదన్నదన్నది కఠిన సత్యం. అందాకా ఎందుకు అరున్నరేళు్లగా బీహార్‌లో ఉన్న మహిళా ముఖ్యమంత్రి రాబ్రీదేవిపై పెత్తనం లాలూది కాదా? ఈరకమైన సాధికారతనేనా మహిళలు కోరుకుంటున్నది?

విశ్వసుందరి అయినా అంగడి బొమ్మే!
ప్రపంచ వ్యాప్తంగా విశ్వసుందరి పోటీలు జరుగుతున్నాయి. ఆడదాన్ని విశ్వసుందరిగా కొనియాడటం వెనుక ఉన్న వ్యాపార ధోరణి ఎంతటి దారుణమైందో తెలియంది కాదు. కాస్మొటిక్‌ సామ్రాజ్యానికి ఏ మార్కెట్‌పై దృష్టి ఉంటే, ఆ దేశానికి చెందిన సుందరి విశ్వసుందరి కావడం నిజం. గతంలో భారత్‌కు వరుసగా నాలుగేళ్ల పాటు దక్కిన గౌరవం ఈ కాస్మొటిక్‌ మార్కెట్‌ విస్తరణ కోసమేనని నిర్వివాదం. వెరసి ఆడదానికి ఎలాంటి గౌరవాన్ని పురుషుడు ఇస్తున్నా, ఎంత గొప్పగా కీర్తిస్తున్నా, ఇప్పటికీ మహిళను ఆటబొమ్మగా చూస్తున్నాడనడానికి ఈ పోటీలు ఓ నిదర్శనం కాదా!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి