7, మే 2010, శుక్రవారం

మావోయిస్టులకు మద్దతిస్తే పదేళ్ల జైలుశిక్ష

మావోయిస్టులను ఇరుకున పెట్టేందుకు కేంద్రం కొత్త ఎత్తుగడ వేసింది. మావోయిస్టుల వాయిస్‌గా ఉంటున్న సానుభూతి సంస్థలు, హక్కుల సంఘాలను నియంత్రించటం ద్వారా మావోయిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది... మావోయిస్టులకు మద్దతిచ్చినా, అనుకూలంగా మాట్లాడినా జైలు ఊచల వెనక్కి పదేళ్ల పాటు నెట్టేస్తామని కేంద్ర హోం శాఖ హెచ్చరించటం మావోలపై కేంద్రం జరుపుతున్న పోరులో ముఖ్యమైన మలుపు.. కేంద్రం హెచ్చరించినట్లు మావోలకు మద్దతిస్తే జైలు శిక్ష విధించటం సాధ్యమవుతుందా?

మావోయిస్టుల సమస్యను మరోవైపు నుంచి నరుక్కు రావటానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మావోయిస్టులపై నేరుగా దాడులు చేయటం కంటే... అజ్ఞాతానికి బయట ఉన్న మావోల సానుభూతిపరులను టార్గెట్‌ చేయాలని నిర్ణయించింది. మావోలకు బయటి నుంచి ఎలాంటి మద్దతిచ్చినా పదేళ్ల పాటు జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిక జారీ చేయటం కేంద్రం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం..
మావోయిస్టుల దాడిలో దాంతేవాడలో ౭౬మంది పోలీసులను నష్టపోయిన కేంద్ర హోం శాఖ, ఇప్పుడు కొత్త దారులను వెతుక్కుంటోంది.. మావోయిస్టులను దెబ్బ తీసేందుకు గెరిల్లావార్‌ను కొనసాగిస్తూనే, మావోయిస్టులకు బలం గళం అన్నీ అయిన పౌర హక్కుల సంఘాలు, ఇతర సాంస్కృతిక సంఘాలను నిలువరించే ప్రయత్నాన్ని వ్యూహాత్మకంగా ప్రారంభించింది.. వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థించే సంస్థలు, పౌర హక్కుల సంఘాలు ఇక ముందు అలాంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. మావోయిస్టు పార్టీ వంటి ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి మద్దతునిచ్చినా పదేళ్ల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది..
నిజానికి కేంద్ర హోం శాఖ చెప్తున్న చట్టం ఇవాళ కొత్తగా చేసిందేమీ కాదు.. ౧౯౬౭ నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టంలోని ౩౯వ సెక్షన్‌ కిందనే చర్య తీసుకుంటామని చెప్తోంది. దీని ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఎవరు ఏ
రూపంలో మద్దతిచ్చినా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు..
మావోయిస్టులకు మద్దతిస్తే అరెస్టు చేస్తామని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలాకాలంగా చెప్తూనే ఉన్నాయి. కానీ, పెద్దగా అమలు చేసింది లేదు.. కానీ, ఇప్పుడున్న పరిస్థితి వేరు.. ఇంతకాలం రాష్ట్రాలు విడివిడిగా తమ తమ పరిధిలో మావోయిస్టులను ఎదుర్కొనేవి.. ఇప్పుడు కేంద్ర హోం శాఖ విషయాన్ని నేరుగా తన పరిధిలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మావో సానుభూతిపరులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టాన్ని ప్రయోగించటం ఎంతవరకు సక్సెస్‌ అవుతుంది? హక్కుల సంఘాల వారు ఈ హెచ్చరికను ఏ విధంగా స్వీకరిస్తారు?

2 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

నెల్సన్ మండేలా జైలుకి వెళ్ళలేదా, యాసర్ అరాఫత్ జైలుకి వెళ్ళలేదా? ప్రభుత్వానిది తాలిబాన్ తరహా పాలన కాబట్టే ఇలాంటి చట్టాలు చేస్తుంది. అరెస్ట్ చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు, ఉరికంభం ఎక్కించినా వచ్చే నష్టం లేదు. పౌర స్వేచ్ఛ రావడానికి కొంత మంది పౌర హక్కుల నాయకులు ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉంటారు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

యిది వ్యక్తీ స్వాత౦త్ర్యాన్ని, పౌర స్వేచ్చను హరి౦చే ప్రక్రియ. ప్రజల గొ౦తును నొక్కే క్రూర చట్టం. యిట్లా౦టిదే నిన్నో మొన్నో అమెరికాలో కుడా చేసారు. వారిని అన్ని౦టా అనుసరి౦చే సి.ఐ.ఎ.ఏజె౦టుల పాలన ఇంత తొందరగా నిర్ణయాలు తేసుకోవడ౦ ఏమీ ఆశ్చర్యం కాదు. అ౦దుకే మహా శ్వేతాదేవి తనను ముందుగా అరెస్టు చేయమని సవాల్ చేసారు. చిదంబరాన్ని ప్రని౦చిన దిగ్విజసి౦ఘ్ కు యిలా సమాధానమిచ్చారు. యిది ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిమ్చాల్సిన అంశం.