22, మే 2010, శనివారం

సత్యానికి సంకెళ్లు

సత్యంబాబు తప్పించుకున్నాడు.. సత్యంబాబు దొరికిపోయాడు.. తప్పించకుకోవటమే ఒక విచిత్రం.. పారిపోయిన వాడు దొరకడం మరో విచిత్రం.. అయిదు గంటల హైడ్రామాలో విజయవాడ పోలీసులు నిర్వహించిన పాత్ర రిలీజ్‌ కంటే ముందే సంచలనం సృష్టిస్తున్న రాంగోపాల్‌వర్మ రక్తచరిత్రను మించిపోయింది.. అనేక ట్విస్ట్‌లు.. జవాబు లేని ప్రశ్నలు.. అనుమానాలు... ఆరోపణలు.. ఏం జరిగింది? దోషులెవరు? ఒక హత్య కేసులో నేరం రుజువు చేయటం కంటే ఇతర అంశాలపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలకు జవాబుదారీ ఎవరు?

ఉదయం పది గంటలు...
అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తప్పిపోయాడన్న వార్త దావానలంలా పాకింది...

ఉదయం 11 గంటలు..
మీడియాలో హడావుడి..

మధ్యాహ్నం 12గంటలు..
సత్యంబాబు తప్పించుకున్న కేసులో ఎస్కార్ట్‌ పోలీసుల సస్పెన్షన్‌

మధ్యాహ్నం 1 గంట..
సత్యంబాబును ఎన్‌కౌంటర్‌ చేశారన్న అనుమానాలు..

మధ్యాహ్నం 3 గంటలు..
సత్యంబాబు దొరికాడన్న వార్త...


మొత్తం అయిదు గంటలు.. శనివారం మధ్యాహ్నం పోలీసులు ఓ మ్యాట్నీ షోను చూపించారు.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన సత్యంబాబు స్టోరీలో పోలీసులు మాత్రం ఫెయిలయ్యారు.. మొత్తం స్టోరీలో అన్నీ ట్విస్ట్‌లే.. అన్నీ సంచలనాలే.. మరెన్నో అనుమానాలే.. ? కొసమెరుపేమిటంటే పోలీసుల నుంచి తప్పించుకున్న సత్యంబాబు పోలీసులకే దొరకడం...

అయేషా హత్య కేసులో నడవలేని స్థితిలో ఉన్న నిందితుడు సత్యం బాబును మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెండు రోజుల క్రితం తీసుకువచ్చారు... నిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయిన తరువాత పోలీసులు తిరిగి విజయవాడకు బయలు దేరారు.. సూర్యాపేట దగ్గరకు వచ్చిన తరువాత భోజనం కోసం ఆగినప్పుడు సత్యం బాబు సంకెళ్లను తెంచుకుని పారిపోయాడు... వెంట ఉన్న పోలీసులందరినీ విజయవాడ సిపి సీతారామాంజనేయులు సస్పెండ్‌ చేశారు...
సత్యం ఎలా పారిపోయాడు? సంకెళ్లు తెంచుకుని పదిమంది పోలీసుల కళ్లు కప్పి పారిపోయే అవకాశం సత్యంకు ఉందా? సత్యం కేసులో సత్యానికి సంకెళ్లు వేస్తున్నది ఎవరు?
అయేషామీరా హత్యకేసులో అరెస్టు చేసిన తరువాత విచిత్ర పరిస్థితుల్లో సత్యం బాబు ఆరోగ్యం చెడిపోయింది... పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే విచిత్రమైన సిండ్రోమ్‌ అతణ్ణి పట్టుకుంది.. కనీసం నడిచే పరిస్థితిలో కూడా అతను లేడు.. కోర్డుకు సైతం పోలీసులు చేతుల మీద మోసుకురావలసిన పరిస్థితి. అంత అనారోగ్యంతో ఉన్న సత్యం బాబు చేతులకు ఉన్న సంకెళ్లు.. కాళ్లకు వేసుకున్న గొలుసులను తెంచుకొని ఎలా పారిపోగలిగాడు? అతనికి అంత శక్తి ఉందా? ఒక వేళ తెంచుకున్నాడే అనుకుంటే... నడిచే పరిస్థితిలోనే లేని వాడు.. పదిమంది పోలీసుల కళ్లు గప్పి ఎలా పారిపోగలిగాడు? ఇది సాధ్యమేనా? ఎలా జరిగింది..?
నిమ్స్‌లో ఉన్న రెండు రోజుల్లోనే సత్యం బాబు పూర్తి ఆరోగ్యవంతుడై పిటి ఉషలా పరిగెత్తే స్థాయికి చేరుకున్నాడా? అలా కానప్పుడు పారిపోవటం ఎలా సాధ్యపడింది? ఈ అనుమానాలే.. సత్యం పారిపోవటం వెనుక పోలీసుల పాత్రను అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. సత్యంను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు పోలీసులు ఎత్తుగడ వేశారా? చివరకు పోలీసుల పాచిక ఫలించకుండా మీడియా అడ్డుపడటంతో సత్యంను తిరిగి వెలుగులోకి తెచ్చారా?

సత్యం బాబు సూర్యాపేటలో కళ్లు కప్పి ౮౦ కిలోమీటర్ల దూరంలోని నందిగామలోని డిఎస్‌పి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు.. సత్యం తప్పించుకుని ఎలా వెళ్లాడు? అతను మార్చుకున్న చొక్కా ఎవరిచ్చారు? సత్యం జిల్లా పరిధులు ఎట్లా దాటి వెళ్లగలిగాడు? అంటే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదా? పది మందిని మాత్రం సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారా? అయేషా హత్య కేసు మిస్టరీలాగానే, సత్యం పరారీ కూడా మిగలనుందా?

2 కామెంట్‌లు:

N S S Sarath Chandra చెప్పారు...

సినిమా లలో మాత్రమే సాధ్య పడే నాటకీయ పరారి సీన్లు మన పోలిసులు చుసినత్తు ఉన్నారు..క్రిమినల్ సినిమా పార్ట్ 2 చేసారు....

Unknown చెప్పారు...

Kovela santosh kumar గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.