17, మే 2010, సోమవారం

స్నేహితుడే హంతకుడు

నరహంతకుడు రామారావు హత్య కేసు మిస్టరీ వీడిపోతోంది.. పోలీసుల కళ్లు గప్పి ఇన్నాళ్లూ ఎవరి పంచన తలదాచుకుంటూ వస్తున్నాడో.. ఎవరి ద్వారా అన్ని రకాల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడో.. ఇంతకాలం ఎవరిని అత్యంత విశ్వాస పాత్రుడిగా భావించాడో.. ఆ మిత్రుడే హంతకుడుగా స్పష్టమవుతోంది.. పోలీసులు ఈ విషయంలో దాదాపుగా నిర్థారణకు వచ్చేశారు..

నరహంతకుడు రామారావు ఎంత కిరాతకంగా మనుషుల్ని హతమార్చాడో.. అంతకంటే కిరాతకంగా అతను చనిపోయాడు.. రామారావు హత్య ఎవరినీ బాధపెట్టలేదు.. పైగా అందరినీ సంతోషపరిచింది.. చిక్కినట్లే చిక్కి ఎప్పటికప్పుడు పారిపోతూ, కనిపించిన చోటల్లా దోపిడీలు, హత్యలు చేస్తూ ఒకటిన్నర దశాబ్దంగా అల్లాడిస్తున్న రామారావు చనిపోవటం పోలీసులకు సైతం ఒకవిధంగా నమ్మశక్యం కావటం లేదు. రామారావు శవం ముందుగా కనిపించినప్పుడు పోలీసులే మట్టుబెట్టారని అంతా భావించారు. తమదైన రీతిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చి హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్న దన్న ఆరోపణపై ఆమె భర్తను విచారించినప్పుడు కేసు చిక్కుముడి నెమ్మదిగా వీడిపోవటం మొదలైంది..
పోలీసులు అరెస్టు చేసిన రాణి మేకల చలపతిరావుకు, రామారావుకు మొదట్నుంచీ స్నేహం ఉంది.. ఇద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు సమాచారం.. దీని ప్రకారం.. జైలు నుంచి రామారావు పరారయి వచ్చిన ప్రతిసారీ, చలపతిరావే అతనికి షెల్టర్‌ ఇచ్చేవాడు.. మందు, మగువలను ఏర్పాటు చేసేవాడు.. అదే విధంగా ఈ నెల ౮న శ్రీకాకుళం జైలు నుంచి తప్పించుకున్న రామారావు కృష్ణా జిల్లా అగిరిపల్లికి నేరుగా చేరుకున్నాడు.. చలపతిరావు ఇంట్లోనే ఆశ్రయం పొందాడు.. కానీ, ఈసారి రామారావు స్నేహితుడికే ఎసరు పెట్టాడు.. తిన్నింటి వాసాలు లెక్కించాడు. చలపతి రావు భార్యపై రామారావు కన్నేయటంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. ఆ కారణంగానే చలపతిరావు రామారావును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది..
విచిత్రమేమంటే రామారావు హత్య జరిగిన ౪౮ గంటల తరువాత అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.. కానీ, అతనికి అంత్యక్రియలు చేసే దిక్కు లేకుండా పోయింది.. మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చిన బంధువులు సైతం పోస్ట్‌మార్టమ్‌ తరువాత దాన్ని తీసుకుపోయేందుకు రానే లేదు.. ఇన్నేళ్ల పాటు కిరాతకుడుగా అందరినీ గడగడలాడించిన రామారావు చివరకు ఎవరికీ కాకుండా పోయాడు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి