6, జనవరి 2011, గురువారం

ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా?

ఇంతకీ జస్టిస్‌ శ్రీకృష్ణ  చెప్పిందేమిటి? వివాదానికి సంబంధించి జడ్జిమెంటును ఇవ్వబోతున్నానని చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ.. ఏం తీర్పు చెప్పారో కనీసం ఆయనకైనా అర్థమైందా? ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైంది? దానికి ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వాలన్న దానిపై ఆయన స్పష్టతకు వచ్చారా? లేదా? అన్న సందేహం నివేదికలోని సిఫార్సులు పరిశీలించిన వారందరికీ వస్తుంది.. చెప్పిందే చెప్పి.. తాను చెప్పినదాన్ని తానే ఖండించి.. చివరకు ఏమీ తేల్చలేకపోయారు.
అయోమయం జగన్నాథం.. జగన్నాథుడంటే శ్రీకృష్ణుడే.. మన శ్రీకృష్ణుడే.. మన రాష్ట్రం భావి తల రాతను రాసిన శ్రీకృష్ణుడే.. జగన్నాథుడి పేరు పెట్టుకున్నందుకు ఈ కృష్ణుడు కూడా నివేదికలో అయోమయమైపోయారు.
ఏం జరుగుతుంది? రాష్ట్రాన్ని విభజిస్తారా? కలిపి ఉంచుతారా? హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి చీలుస్తారా? లేదా? రాష్ట్రమంతటా ఒకటే ఉత్కంఠ.. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయిన జనం.. ఏదో ఒక పరిష్కారం కోసం ఆశగా ఊపిరి ఉగ్గబట్టుకుని చూసిన ప్రజలంతా ఇప్పుడు బుర్రలు గోక్కుంటున్నారు..

అయోధ్య తీర్పు మాదిరిగా కర్ర విరగకుండా, పాము చావకుండా ఆరు సిఫార్సులు చేసి నొప్పింపక, తానొవ్వక శ్రీకృష్ణుడు తప్పించుకుని పోయాడు బాగానే ఉంది. కనీసం ఆ సిఫార్సుల్లో తాను చెప్పిన దానికైనా చివరకంటా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు.. నివేదికను బుద్ధుడి సూక్తితో మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గెలవాలి.. ఏ ఒక్కరికీ ఓటమి ఎదురుకావద్దు అన్నట్లుగానే అందరికీ కోరినవన్నీ పంచి పెట్టారు. అదే నివేదిక చివరకు వచ్చేసరికి బుద్ధుడి సూక్తిని మరిచినట్లున్నారు. ఫస్ట్‌ హోం మినిస్టర్‌ పటేల్‌జీ గుర్తుకొచ్చారు.. గ్రౌండ్‌ రియాలిటీలను మరిస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అంశంపై తాము బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నామంటూనే తెలంగాణా ప్రత్యేక డిమాండ్‌ నిర్హేతుకం కాదని కూడా వ్యాఖ్యానించటం న్యాయమూర్తికే చెల్లింది.

అసలు శ్రీకృష్ణ కమిటీ  మొత్తం ఎన్ని సిఫార్సులు చేసిందో మీకు తెలుసా? నాలుగు..  ఇదీ కృష్ణ లీలలో భాగమే.. ఒకటో సిఫారసుకు కొనసాగింపు ఆరో సిఫార్సు.. రెండో సిఫార్సుకు కొనసాగింపు నాలుగో సిఫార్సు.. ఇక మిగిలింది నాలుగే కదా..
మొదటి సిఫార్సులో రాష్ట్రాన్ని విడగొట్టొద్దన్నారు.. ఆరో సిఫార్సులో విడగొట్టకుండా తెలంగాణాకు రాజ్యాంగ పరమైన హక్కులేమివ్వాలో సూచించారు. రెండో సిఫార్సులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నారు.. ఏయే ప్రాంతాలను కలిపి చేయాలో నాలుగో సిఫార్సులో చెప్పారు.
విచిత్రమేమంటే ఒకటో సిఫార్సులో యథాతథ స్థితిని కొనసాగించటం అసలు సాధ్యమే కాదని తేల్చి చెప్పారు.. ఆ సిఫార్సును తామే తిరస్కరించారు.. అదే ఆరో సిఫార్సు వచ్చేసరికి రాష్ట్రాన్ని ఇప్పుడున్నట్టుగా ఉంటూనే తెలంగాణాకు బోర్డులు, మండళ్లు, హక్కుల రూపంలో రాజ్యాంగ భద్రత కల్పించమన్నారు.. యథాతథ స్థితే సాధ్యం కాదన్నప్పుడు, ఇక హక్కులు కల్పించేదెలా సాధ్యపడుతుందో శ్రీకృష్ణే చెప్పాలి.
ఇక రెండో సిఫార్సు.. తెలంగాణా నుంచి హైదరాబాద్‌ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం.. తెలంగాణాలో ఇంటిగ్రల్‌ పార్ట్‌గా ఉన్న హైదరాబాద్‌ను కేంఅద పాలిత ప్రాంతంగా మారిస్తే తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతాయని, దానికి తోడుగా మరిని కొత్త సమస్యలు వస్తాయని కాబట్టి ఇది ప్రాక్టికల్‌ కాదని తేల్చారు. అదే నాలుగో సిఫార్సు వచ్చేసరికి హైదరాబాద్‌ యూనియన్‌ టెర్రిటరీగా ఎలా చేయాలి? సరిహద్దులు ఏమిటన్నదీ విపులంగా వివరించారు.. ఒక సిఫార్సులో ఉన్నదాన్ని మరో సిఫార్సులో వాళ్లే ఖండించారు.. సూపర్‌..
తెలంగాణా ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని, దాని జిడిపి కొన్ని రాష్ట్రాల కంటే పెరుగుతుందనీ పేర్కొన్న కమిటీయే కొన్ని లైన్లు కిందకు వచ్చేసరికి మావోయిస్టు సమస్య పెచ్చరిల్లుతుందని, సంక్షోభం రేకెత్తుతుందని పేర్కొంది. ఈ రెంటికీ పొంతన ఎలా కుదురుతుందో చిదంబరం వారే చెప్పాలి.. ఎందుకంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులన్నది వారి మాటే కదా..
ఇక మూడో సిఫార్సు సంగతి.. రాయల తెలంగాణా ప్రాక్టికల్‌ కాదని భావించినప్పుడు అసలు ఆ సిఫార్సు చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. 
ఇక మిగిలింది అయిదో సిఫార్సు.. అసలైన సిఫార్సు  రెండు రాష్ట్రాలను ప్రస్తుత సరిహద్దుల ప్రకారం విడగొట్టమనటం.. చివరకు ఈ సిఫార్సుపైనైనా గట్టిగా కమిటీ నిలబడిందా అంటే అదీ లేదు.. అసలు ఇది రెండో బెస్ట్‌ ఆప్షన్‌.. అందరినీ కన్సల్ట్‌ చేసి మరీ డిసైడ్‌ చేసుకోండన్నారు.. ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా? ఏమో.. చిదంబరానికెరుక...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి