8, జనవరి 2011, శనివారం

ఏపిఎస్‌ఇబి-1956....... కొత్తగూడెం కేరాఫ్ రాయలసీమ..

శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు చెప్పటం వల్లనే తెలంగాణా వాదులు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారని అనడంలో హేతుబద్ధత ఉంది. బుర్ర ఉన్న ప్రబుద్ధాంధ్రులు కొందరు తెలంగాణా వాదులను గేలి చేయటంలో అర్థమూ ఉంది. ఇందులో ఎవరినీ ఆక్షేపించటానికి లేదు. ఒకవైపు తీర్పు వచ్చినప్పుడు మరో పక్షం వారు ఆందోళన చెందటం, అసంతృప్తి వ్యక్తం చేయటం సహజమే.  అయితే ఈ అసంతృప్తి నిర్హేతుకమైతే నిస్సందేహంగా తిరస్కరించాల్సిందే.. శ్రీకృష్ణ కమిటీ గుడ్డిగా ఎవరో ఇచ్చిన నివేదికను ఫాలో అయి ప్రచురించేసిందనటానికి ఒకటి రెండు ఉదాహరణలు చాలు.. తొమ్మిది నెలలు జాబ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసి  కమిటీ సభ్యులు హాయిగా ఇళ్లల్లో రెస్ట్ తీసుకుంటున్నారు.. ఇక్కడ కాలేజీల్లో విద్యార్థులు 27 రకాల నరకబాధలనూ అనుభవిస్తున్నారు.
ప్రపంచంలోనే ఇంత చెత్త నివేదిక లేదనటానికి ఇంతకంటే ఉదాహరణలు లేవు.

1 విద్యుత్తు గురించి చర్చిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట విద్యుత్తు బోర్డు ఏపిఎస్‌ఇబి 1956లో ఏర్పడిందని సోకాల్డ్ నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఏపిఎస్‌ఇబి 1959లో ప్రారంభమైంది. దాని ఎగ్జిస్టెన్స్ అనేది 1959లో జరిగింది.

2. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ రాయల సీమలో ఉన్నదని న్యాయమూర్తిగారి దివ్వదృష్టి చెప్తోంది. కొత్తగూడెం రాయలసీమకు ఎప్పుడెళ్లిందో ఆయనకే తెలియాలి.

3. విద్యుత్తు ఉత్పత్తికి తగిన వనరులు ఉన్న చోట పవర్ ప్లాంటులు ఉండాలన్నది సాధారణ సూత్రం..ఇన్ జనరల్‌గా విద్యుత్తు ఉత్పత్తికి కావలిసిన బొగ్గు, నీరు తెలంగాణాలో  ఉన్నాయి. కానీ, పవర్ ప్లాంట్లను సీమకు, కోస్తాంధ్రకు తరలించారు..  మణుగూరు పవర్ ప్లాంట్‌ను విజయవాడకు తరలించటం వంటి వాటి గురించి ప్రస్తావిస్తే.. పవర్‌ప్లాంట్లు ఎక్కడుంటే మాత్రమేం.. విద్యుత్తు సరఫరా అవుతోంది కదా అని కొట్టిపారేస్తారు జడ్జిగారు అప్పాయింట్ చేసిన విద్యుత్తు రంగ నిపుణుడు విబి గుప్తా చెప్తారు... ... ఇలాంటి తరలింపుల వల్ల  విద్యుదుత్పత్తికి సంబంధించి సుమారు 1200 కోట్ల రూపాయలు ఏటా నష్టపోతున్నట్లు విద్యుత్తు రంగ నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటే వినేవాడెవడు? లగడపాటి వింటే కృష్ణగారికి వినిపించేదేమో...  ప్రపంచంలో ఎంత చెత్త నిపుణుడైనా ఇలా మాత్రం రిపోర్టు ఇవ్వడు.

4. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా ప్రాంతానికే అగ్రతాంబూలం అనీ అన్నారు.. వాస్తవానికి వినియోగం రేటింగ్‌ను గృహ వినియోగం ఆధారంగా నిర్ధారిస్తారు.. కమర్షియల్ వినియోగం ఇందులో లెక్కకు రాదు.. ప్రపంచ దేశాలన్నీ పాంటిచే ఇంటర్నేషనల్ ప్రామాణికం ఇది. గృహ వినియోగంలో  సగటు కంటే 40 శాతం తక్కువ ఉన్నది తెలంగాణాలోనే... మిగతా వినియోగం అంతా లగడపాటి వారి ల్యాంకోలు.. కావూరి లాంటి వారి బడా పరిశ్రమల పరిధిలోకి వస్తాయి.. తెలంగాణా జిల్లాల్లో, పల్లెల్లో ఇళ్లల్లో కరెంటు లేక చీకట్లో మగ్గుతున్న వారు వారికి కనిపించలేదు.
5. ఇక పవర్ నెట్‌వర్క్... తెలంగాణాలో అద్భుతంగా ఉందని సెలవిచ్చారు జస్టిస్ శ్రీకృష్ణ.. అంత నెట్‌వర్కే ఉంటే.. మొన్నటికి మొన్న ఆదిలాబాద్‌లో ఒక టవర్ కూలిపోతే, పది రోజులు అంధకారంలో ఉండిపోయారు అక్కడి ప్రజలు.. నెట్‌వర్కే ఉంటే, వేరే టవర్ నుంచి వెంటనే కరెంటు వచ్చేది. మరి వీరికి కనిపించిన నెట్‌వర్క్ ఎక్కడుందో? లగడపాటినడిగి చెప్పండి..
6. కరీంనగర్‌లో 1200 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్‌కు ప్రభుత్వం ప్లాన్ చేసిందని, ఇక అక్కడ  బ్రహ్మాండంగా విద్యుదుత్పత్తి జరుగుతుందని నివేదిక పేర్కొంది.. కానీ వాస్తవం కమిటీ కళ్లకు కనిపించనే లేదు. అసలు గ్యాస్ సరఫరాకే నిర్ద్వంద్వంగా తిరస్కరించిన తరువాత ఇక్క అక్కడ విద్యుదుత్పత్తి ఏం జరుగుతుంది.. దీన్ని లెక్కల్లో చూపించి తెలంగాణా అభివృద్ధిలో ముందంజలో ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? రెండో పవర్ ప్లాంట్ సత్తుపల్లిలో ఉందని చెప్పారు.. కనీసం అక్కడ భూమి సేకరించటానికి సైతం ప్రభుత్వం పూనుకోలేదు..స్థల సేకరణకు నిరాకరించారు. ఆ కాగితాన్ని చెత్తబుట్టలో పడేశారు.. ఇవి కాకుండా 17 ప్లాంట్లు సీమాంధ్రలో పెడుతున్నారు.. ఇది న్యాయం.. ఇది అభివృద్ధి... ఆహా ఎంత గొప్ప తీర్పు?

7 . ఇక ఇరిగేషన్.. తెలంగాణా వ్యవసాయంలో మిగతా మూడు ప్రాంతాలలో కంటే చాలా అగ్రస్థానంలో ఉందన్నది నివేదికలోని ఉవాచ... తెలంగాణాలో  కల్వకుర్తి, భీమా, భీమా -2, నెట్టెంపాడు, కోలిసాగర్, ఏఎంఆర్‌పి సింగిల్ స్టేజ్, ఏఎం ఆర్‌పి లో లెవల్.. దేవాదుల, ఇచ్చంపల్లి, పోచంపాడు.. ఇలా లిస్టు ఇస్తూ వెళ్లారు.. వీటిలో ఇరిగేషన్ కూడా అద్భుతంగా సాగుతోందని చెప్పుకుంటూ వచ్చారు. వీటిలో అసలు పూర్తయిన ప్రాజెక్టులు ఎన్ని? పూర్తి స్థాయిలో పని చేస్తున్నవి ఎన్ని? వాస్తవంగా ఎంత నీరు భూముల్లోకి చేరుతోంది? కనీస నిజాలను తెలుసుకున్నారా? వీటిలో ఏ ఒక్కటి కూడా  పూర్తి అయిన ప్రాజెక్టు కాదు. ఇక వీళ్లిచ్చే నీళ్లెన్ని? అన్నింటికీ మించి శ్రీరాం సాగర్ ఆయకట్టు కింద 18 లక్షల ఎకరాలకు నీరు అందుతోందనీ శ్రీవారు సెలవిచ్చారు.. ఒక్కసారి వారు వారి అయ్యగారు లగడపాటి ప్రభృతులు, చిదంబరం దొరవారు, కేంద్ర జలసంఘం చైర్మన్‌ను వెంటబెట్టుకుని వచ్చి తెలంగాణా ప్రజలకు బాబూ మేము చెప్పిన ఆయకట్టు ఇదే.. ఇక్కడే నీరు వస్తుందని చూపిస్తే సంతోషం.. ఇంత ఆయకట్టులో పంటలు పండుతుంటే, ఉత్పత్తి జరుగుతుంటే ఇంక సమస్యేముంది? ఆంధ్రప్రదేశ్‌తో విడిపోతామనటం వీళ్ల వెర్రే కదా.. !

ఏపిఎస్‌ఇబి ఎప్పుడు పుట్టిందో చెప్పటంతోనే నివేదిక ఏపాటిదో తెలుస్తోంది. ఇక కొత్తగూడెంను రాయలసీమతో కలపడంతో మరింత అద్భుతంగా వారి న్యాయనైపుణ్యం, నిశిత దృష్టి తెలుస్తోంది. ఇక నివేదికలోని మిగతా విషయాలను గురించి మాట్లాడటం బుద్ధి ఉన్న ప్రబుద్ధాంధ్రులు తప్ప ఇంకెవరికైనా ఎలా సాధ్యపడుతుంది?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి