7, జనవరి 2011, శుక్రవారం

బెస్ట్‌ ఫస్ట్‌ ఆప్షన్-‌ కొత్త సీసాలో పాత సారా

తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొదలైందో.. అక్కడికే తెచ్చి వదిలిపెట్టారు జస్టిస్‌ శ్రీకృష్ణ. ఏ కారణంతో  ఉద్యమం మొదలైందో.. అదే కారణాన్నే మళ్లీ పరిష్కారంగా చూపించారు సదరు న్యాయమూర్తి.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే సువర్ణాక్షరాతో లిఖించదగిన తీర్పు ఇది..ఇలాంటి తీర్పు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా ఇచ్చి ఉండరు.  దీని వల్ల సమస్యను పరిష్కరించటం ఎలా సాధ్యపడుతుందో ఆయనకైనా అర్థం అయిందో లేదో తెలియదు.. ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఆయన చేసిన సిఫార్సు కొత్త సీసాలో పాత సారా మాత్రమే..
----------------------------------------------------
సమైక్యానికే మొగ్గు... శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సర్వత్రా వ్యక్తమైన సగటు అభిప్రాయం ఇది.. నివేదికలోని అంశాలను చూస్తే అందరికీ ఇలాగే కనిపించింది. మొత్తం ఆరు సిఫార్సుల్లో అన్నింటికీ ఏదో ఓ కామెంట్‌ చేసిన శ్రీకృష్ణ కమిటీ నాలుగో ఆప్షన్‌పై మాత్రం అలా చెప్పి ఇలా వదిలేసింది.. ప్రాక్టికల్‌గా అదీ వర్కవుట్‌ కాదు కాబట్టే దానిపై ఎక్కువ చర్చించకుండా వదిలేసింది.. ఇక మిగిలింది రెండు ఆప్షన్‌లు.. వీటిలోనూ ఆరో ఆప్షన్‌ శ్రీకృష్ణ కమిటీకి ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపించింది.. ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఆరో సిఫార్సు ఎలా అయింది?

ఇంతకీ ఆరో ఆప్షన్‌లో  ఏం చెప్పారు?

మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంతానికి రాజ్యాంగ పరమైన చట్టపరమైన హక్కులు కల్పించాలి. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. ౧౯౫౬ నాటి పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తిగా నిధుల బదలాయింపు, విధులు నిర్వహించే అధికారాలు ఉండాలి. ఈ అభివృద్ధి మండలి  రాష్ట్ర అసెంబ్లీకి జవాబుదారిగా ఉండాలి. తెలంగాణా ప్రాంతాభివృద్ధి కోసం తాను చేసే సిఫార్సులను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. మండలికి ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు వస్తే, గవర్నర్‌ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలి.
ఇందులో గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్‌, డిప్యూటిస్పీకర్‌, ప్రతిపక్ష నాయకుడు, మండలి చైర్మన్‌ ఉంటారు. ఇందులో మెజారిటీ అభిప్రాయం మేరకు నడుచుకోవాలి.
మండలికో సచివాలయం అదే ఓ ఆఫీసు.. దానికో బిళ్ల బంట్రోతు.. ఆయన తిరగడానికి ఓ బుగ్గ కారు ఇవ్వాలి. కేబినెట్‌ మంత్రికి ఉండే అన్ని సౌకర్యాలూ అనుభవించేయొచ్చన్నమాట.
బ్రహ్మాండం..

ఈ సిఫార్సులు అమలయితే తెలుగు వారంతా ఒక్కటిగానే ఉండవచ్చన్నమాట.. అటూ, ఇటూ తిరిగి మొదలైన చోటికి రావడమంటే ఇదే... రాజ్యాంగంలోని ౩7౦, ౩71 అధికరణల ప్రకారం ఈ సిఫార్సు రాష్ట్రం ఏర్పడిన నాడే అమల్లోకి వచ్చింది.. ఆ విషయం పాపం జడ్జిగారు మరిచినట్లున్నారు.. లేదా మళ్లీ చెప్పినా నష్టం లేదనుకోవచ్చు. తెలంగాణ ప్రాంత నిధులను ఆ ప్రాంతానికే ఖర్చు చేయాలని, ఉద్యోగాల విషయంలో  ప్రాధాన్యం ఇవ్వాలని ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉంది.
మండలి ఏర్పాటు ఉత్తర్వు వచ్చిన తరువాత దశాబ్దాల తరబడి చైర్మన్‌ను నియమించని ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. అంతా లొల్లి చేస్తుంటే వైఎస్‌ హయాంలో ఆర్టీసీ హెడ్‌ ఆఫీస్‌లో ఓ గదిలో ఓ కుర్చీ వేసి దానికి మండలి చైర్మన్‌ అని పేరు పెట్టి  ఉప్పునూతల పురుషోత్తమరెడ్డిని అక్కడ కూర్చోబెట్టారు. బుగ్గకారు కూడా ఇచ్చారనుకోండి.. తీరిగ్గా పేపరు చదువుకోవటానికి, మిత్రులతో పిచ్చాపాటీ చేయటానికి సర్కారీ ఖర్చుతో ఆ రూము భేషుగ్గా పనికొచ్చింది.

ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు.. ఈ ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి మినహా మరెవరూ మార్చేందుకు వీల్లేదని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది.. కానీ, ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఓ అసిస్టెంట్‌ సెక్రటరీ, ఓ జీఓ ద్వారా మార్చేశాడు.. దాన్ని అడ్డం పెట్టుకుని 1993 నుంచి 2000 సంవత్సరం దాకా అడ్డగోలుగా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర హోంమంత్రి దగ్గరకు వెళ్లి ఈ ఉత్తర్వుల ఉల్లంఘనను క్రమబద్దీకరించుకుని వచ్చారు.  పార్లమెంటుతో సంబంధం లేకుండా హోంమంత్రిత్వ శాఖే డైరెక్టుగా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కు పోటు పొడిచింది. వాస్తవానికి మనదేశంలో ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను మించిన రాజ్యాంగ భద్రత లేదంటారు.. దానికే తూట్లు పొడిచిన మహానుభావులు కొత్తగా ఎలాంటి హక్కులు కల్పించగలరు? అంతకు ముందు ఎన్టీయార్‌ ౬౧౦ జీవో తెచ్చారు.. అదీ బుట్టదాఖలైంది.
ఇక అసెంబ్లీకి మండలిని జవాబుదారి చేయటం.. అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక తెలంగాణా మండలి సిఫార్సులకు ఎంతమాత్రం విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అపెక్స్‌ కమిటీలో తెలంగాణ మండలి చైర్మన్‌ ఒక్కరే ఉంటారు.. ఆయన మాట నెగ్గుతుందని ఎవరు మాత్రం ఎలా భావిస్తారు?

గతంలో అమలు కావలసిన దాన్ని ఇప్పుడు అమలు చేయమని చెప్తున్నారు. గతంలో అమలు కాకపోవటం వల్లనే ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అమలు జరుగుతుందని తెలంగాణా ప్రజలు ఎలా నమ్ముతారు? అది ఎలా సాధ్యమవుతుంది? దీని వల్ల తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ సమసిపోవటం జరిగే పనేనా? విచిత్రమేమంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటం సాధ్యం కాదని తానే తిరస్కరించిన తొలి సిఫార్సులో శ్రీకృష్ణ స్పష్టంగా చెప్పారు.. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రీజనల్‌ బోర్డులతో మండలితో రాష్ట్రాన్ని యునైట్‌గా ఉంచటం ఎలా వీలవుతుందో ఆయనే చెప్పాలి.. ఇదంతా చూస్తే ముక్కెక్కడుంది అంటే చుట్టూ తిప్పి తిప్పి కనిపించలేదని చెప్పి మీరే మళ్లీ తిరగండని చెప్పినట్లుంది..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

You are 100% Correct. avi anni amulu kananduke ee udyamam vochinid . malli fail ayina vatine follow avamantunnaru. i don't know why these big people miss small logic.