29, జులై 2011, శుక్రవారం

బాబు స్పందించాలి

తెలంగాణ,సమైక్యాంద్ర సెంటిమెంట్లు రెంటిని గౌరవిస్తానంటున్న చంద్రబాబుకు... టిడిపి లో ఏకాభిప్రాయం సాధించే దిశగా చర్చలు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది.
అధికారంలో ఉండగా ఎన్నో సమస్యలు అవలీలగా పరిష్కరించి చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న బాబు తెలంగాణ పై పార్టీనేతలను ఒకే మాట మీదకు తీసుకురావాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.
తెలంగాణ పై కాంగ్రెస్‌ తరహాలోనే టిడిపిలో అంతర్గత చర్చలు ప్రారంభించి జటిల సమస్యకు ముగింపు పలకాల్సిన బాధ్యత బాబుకు ఉన్నదన్న వాదనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి....2009 ఎన్నికలకు ముందు తెలంగాణ పై వైఖరి చెప్పడానికి ఇరు ప్రాంతాల నేతలతో కమిటి వేసిన చంద్రబాబు పార్టీ విధానాన్ని మెనిఫెస్టో లో కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ పై కాంగ్రెస్‌ ఇవ్వని స్పష్టత టిడిపి ఇచ్చిందని బాబు అప్పట్లో ప్రశంసలందుకున్నారు కూడా...అయితే డిసెంబర్‌ తొమ్మిది తర్వాత ఆయన రెండు కళ్ల సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి  తెలంగాణలో టీడీపీని అగ్నిపరీక్షకు నిలిపారు...
 ఇప్పటికే పలువురు సీనియర్లు ,వేల సంఖ్యలో కార్యకర్తలు ఆ ప్రాంతంలో పార్టీని వీడారు.తెలంగాణ లో పార్టీ నేతలు చనిపోయినా వారి అంత్యక్రియలకు హాజరుకాని స్థితికి చంద్రబాబు చేరుకున్నారంటే ఆ తీవ్రత ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.
 ఇలాంటి వాతావరణంలోనూ తెలంగాణ పై చెప్పాల్సింది చెప్పాం ...ఇక చెప్పేదేమీలేదు అని బాబు మాట్లాడుతుండడం టిడిపి నేతలకే కాక రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అధికారంలో ఉండగా విజన్‌ 2020 అని అన్ని అంశాలపై ఓ విధానాన్ని ప్రకటించిన మాజీ సీఎం కనీసం కొత్త రాష్ట్రాల ఏర్పాటు పై తన మనోగతాన్నెనా చెబితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఓ పెద్ద సమస్యపై ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరు బాబు ఇమేజ్‌ ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
 తెలంగాణ పై తనకో వైఖరి లేక పోవడంతో కాంగ్రెస్‌ తప్పటడుగులను ప్రశ్నించ లేని స్థితికి ఆయన చేరారు..ఏ ప్రాంతానికి దగ్గట్టు ఆ ప్రాంత పార్టీ నేతలు వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్న బాబు సమస్య అలాగే ఉండాలని కోరుకుంటున్నారా అనే అనుమానాలకు దారితీస్తున్నాయి...
తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తామంటున్న టిడిపి అధినేత ఉద్యమాల విషయంలోనూ తటస్థ వైఖరి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
 కాంగ్రెస్ ఇపుడిపుడే తెలంగాణ పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతుంటే టిడిపిలో మాత్రం ఆప్రయత్నమే జరగడం లేదు...డిసెంబర్‌ తొమ్మిది తర్వాత వైఖరి మారడానికి కారణాలు వివరించకుండా కేవలం రెండు కళ్ల సిద్దాంతామంటూ ఇంకా చెబితే... చంద్రబాబుకు ఇరు ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 తన వైఖరితో తెలంగాణలో పట్టు కోల్పోయిన బాబు ఆంధ్రాలో అదనంగా పొందిన లాభం కూడా ఎదీ లేదని కడప ఉప ఎన్నికలు కూడా రుజువు చేశాయి.
 రాజకీయ నాయకులు సాహోసోపేతంగా వ్యవహరించకుండా ఎపుడూ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ గడిపితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గతంలో అనేక ఉదంతాలు రుజువు చేశాయి.
 చంద్రబాబు ఆ జాబితాలో చేరకూడదంటే ఆయన కూడా టిడిపిలో తెలంగాణ పై చర్చను పారదర్శకంగా మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎంత అవునన్నా..కాదన్నా చిదంబరం చేసిన సూచనపై బాబు స్పందించాలి....పార్టీలో తెలంగాణ పై చర్చించాలి...ఓ పరిష్కారం చూపాలి...

కామెంట్‌లు లేవు: