1, మే 2009, శుక్రవారం
బ్యూరోక్రసీలో చీడపురుగుల్ని ఏరివేయటం ఏసిబికి తేలిక కాదు
అవినీతి... ఇది ఈ దేశంలో ఒక అభిన్న అంగంగా మారిపోయింది. అటెండర్ దగ్గరి నుంచి ఉన్నత అధికారి దాకా అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో, అన్ని ప్రదేశాల్లో సర్వాంతర్యామిగా మారిపోయింది. శరీరంలో రక్తం మాదిరిగా కలిసిపోయింది. అవినీతిని లీగల్‌గా అంగీకరించే పరిస్థితి ఉత్పన్నమైంది. అన్ని కార్యాలయాల్లో, అన్ని సర్వీసులకూ ఎంతో కొంత అధికారుల చేతులు తడపందే పని కాదు... ఎంతో కొంత ఇచ్చి తమ పని కానిచ్చేసుకోవటమూ జనానికి అలవాటైంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎవరి స్థాయిలో వారు, వారి వారి హోదాలకు తగ్గట్లుగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు... అక్రమార్జన చేస్తూనే ఉన్నారు... చివరకు దేవుడి గుళ్లలో తీర్థం పెట్టే అర్చకుడు... శఠగోపం పెట్టే పూజారి... ప్రసాదం ఇచ్చే అయ్యవారు.. ఇలా అందరూ చేతులు జాచేవారే తయారయ్యారు... భక్తి కోసం, ప్రశాంతత కోసం గుడికి వచ్చే భక్తులు అక్కడ ప్రశాంతత పొందడం దేవుడెరుగు... నిలువు దోపిడీకి గురవుతున్నారు...అంతా కమర్షియల్... కాంక్రీటు గోడల మధ్య జీవితాలు... మనుషుల మనసులను కూడా కాంక్రీటుగా మార్చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయటానికి, అధికారంలో ఉన్న పార్టీలను నిందించటానికి అవినీతి అన్నది రాజకీయ పార్టీలకు, నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది....అంతకు మించి అవినీతిని గురించి ప్రభుత్వాలు పట్టించుకునేది లేదు... ప్రభుత్వాలు పట్టించుకునేది అంతకంటే లేదు.. పాలకులకు ఆ అవసరమే లేదు... పార్టీల నిఘంటువుల్లో ఆ పదమే మచ్చుకు కూడా కనిపించదు... అన్నింటికంటే ప్రజలే ఈ విషయాన్ని పట్టించుకోవటం మానేశారు.. అవినీతి నిర్మూలన కోసం `అవినీతి నిరోధక శాఖ' పేరుతో ఓ సంస్థ ఉంది. అవినీతి వ్యవహారాలపై నిఘా ఉంచటానికి సెంట్రల్ విజిలెన్‌స కమిషన్ అన్నదీ ఉంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవకతవకలు.. అడ్డగోలు ఖర్చులు, దుబారా వ్యవహారాలను బయట పెట్టడానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థా ఒకటి ఉంది. సివిసి అవినీతి పరుల చిట్టా బయటపెడుతుంది. కాగ్ ఏటా నివేదికలు వెలువరిస్తుంది. ఇక ఎసిబి ఫిర్యాదులు అందటంతోనే సదరు అధికారులపై దాడులను నిర్వహిస్తుంది. అక్రమార్జనను సీజ్ చేస్తుంది. కేసులు నమోదు చేస్తుంది. సివిసి సిఫార్సులను ఎవరు చూడను కూడా చూడరు.. కాగ్ నివేదికను సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి డస్‌టబిన్‌లో పడేస్తుంది. ఇక ఎసిబి నమోదు చేసిన కేసుల్లో ఎన్ని రుజువయ్యాయి? ఎందరికి శిక్ష పడిందంటే చెప్పటానికి ఒక్క కేసు కూడా కనిపించదు.. ఏఇలు, డిఇల స్థాయిని మించి ఐఏఎస్‌లు, ఐపిఎస్‌ల వంక కన్నెత్తి చూసే సాహసం అయినా ఏసిబి చేయలేదు... ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపిఎస్‌ల లాబీయింగ్ సామాన్యమైంది కాదు... ఉన్నతాధికారుల అవినీతి ప్రస్తావన వచ్చినంతనే... వారిపై దాడులు చేయటానికైనా, విచారించటానికైనా ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ ప్రభుత్వం చేత పదిహేనేళ్ల క్రితమే ఓ మెమోను జారీ చేయించుకోగల సమర్థులు వాళు్ల... కేవలం ఈ ఒక్క మెమో(నెంబర్404) గత ఒకటిన్నర దశాబ్దంగా దాదాపు 200 మంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లపై ఆరోపణలు వచ్చినా ఏసిబి చేతులు ముడుచుకునేట్లు చేసింది. వీరిని విచారించటానికి అనుమతించాలంటూ ప్రభుత్వానికి ఏసిబి వారు పెట్టుకున్న దరఖాస్తులు లక్షలాది పెండింగ్ ఫైళ్ల మధ్య బూజు పట్టిపోయాయో, చెదలు పట్టి పోయాయో తెలియదు... 2009, ఏప్రిల్‌లో రాష్ట్ర హైకోర్టు సదరు మెమో చెల్లదని, ఎవరినైనా ఏసిబి నేరుగా విచారించవచ్చంటూ తీర్పు చెప్పింది...ఈ తీర్పుతో ఏసిబి రెచ్చిపోతుందని, అక్రమార్కులైన ఉన్నతాధికారుల భరతం పడుతుందని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు... ప్రభుత్వంలో బ్యూరోక్రసీ బలం ముందు రాజకీయుల బలం తక్కువే... తిమ్మిని బమ్మిని చేయగల బ్యూరోక్రసీలో చీడపురుగుల్ని ఏరివేయటం ఏసిబికి అంత తేలిక కాదు.. పైగా దానికి ఉన్న పరిమిత అధికారాలతో ఆ సంస్థ పెద్దగా ఒరగపెట్టేది కూడా ఏమీ లేదు...ఇది మనదేశం, దీని అభివృద్ధి మనందరి బాధ్యత.. ఇందుకోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి అన్న స్పృహ ఎవరికీ లేనప్పుడు అవినీతి నిర్మూలన అన్నది అందని ద్రాక్షే... శాసన వ్యవస్థలో భాగస్థులు కావటానికి, ఎమ్మెల్యేలు, ఎంపిలుగా ఎన్నిక కావటానికి పార్టీల దగ్గర కోట్లు పోసి టిక్కెట్లు కొనుక్కున్న ప్రతినిధులు అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవ చేస్తారంటే, మార్పు తీసుకువస్తామంటే నమ్మేదెవరు? అందుకే పలు చోట్ల ఓటరు కూడా ఓటును గిట్టుబాటైన ధరకు అము్మకుంటున్నాడు.. ఇలాంటి వాతావరణంలో దేశం, జాతి, సమాజం, అభివృద్ధి అన్నది ఎవరికి కావాలి?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి