20, మే 2009, బుధవారం
ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఓడిపోయింది? సంపూర్ణ విశ్లేషణ
ప్రజారాజ్యం ఎందుకు ఓడి పోయింది? ఎవరైనా నిశితంగా ఆలోచిస్తున్నారా? మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని మహారాజుగా వెలిగిన మెగాస్టార్ ప్రారంభించిన రాజకీయ ప్రస్థానానికి ప్రజలు ఆదిలోనే ఎందుకు అడ్డుకట్ట వేశారు...? కారణం ఏమిటి? నిష్పాక్షికంగా విశ్లేషిస్తే కారణాలు స్పష్టంగానే కనిపిస్తాయి. చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించటం దగ్గర నుంచి 2009 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకునేంత దాకా జరిగిన పరిణామాలను ఒక్కటొక్కటిగా విశ్లేషిస్తే అన్నీ వాటంతట అవే అవగతమవుతాయి.*నేపథ్యంచిరంజీవి రాజకీయాల్లోకి రావటం అనేది ఒక డ్రమాటిక్‌గా జరిగింది. వాస్తవానికి ముఠామేస్త్రీ సినిమా తీసినప్పటి నుంచే ఆయనలో రాజకీయాల్లోకి రావాలన్న బీజం పడింది కానీ, అది బీజంగా ఉండిపోయింది. అడపా దడపా సినిమా శతదినోత్సవాల్లో పలువురు ప్రముఖులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా చిరంజీవి మాత్రం సున్నితంగా తోసిపుచ్చుతూనే వచ్చారు. సాక్షాత్తూ దాసరి నారాయణ రావు సైతం ఓ సినిమా పండుగలో చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలంటూ కోరారు. ఆప్పుడూ ఆయన తిరస్కరించారు. ఆ సభలో సినీ నటి శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్ కూడా పాల్గొన్నట్లు గుర్తు.రాజకీయాల్లోకి రావాలని మనసులో ఉన్నా చిరంజీవికి ఏదో బెరుకు చాలాకాలం పాటు ఆ కోరికను బలవంతంగా అణచివేస్తూ వచ్చింది. చివరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం నాటకీయంగా అనేక అంకాలు మారుతూ వచ్చింది. ఒక దశలో గత రెండు మూడేళ్లలో ఆయన సినిమాలు వేళ్లపైన లెక్కించినన్ని మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో సక్సెస్ రేటు సాధించినవి చాలా తక్కువే. ఈ దశలో ఆయనలోని రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కోరిక క్రమంగా అధికమవుతూ వచ్చింది. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో తెలుసుకోవాలని ముందు జాగ్రత్తలు చాలానే తీసుకున్నారు. మొదట తన సన్నిహిత మిత్రుడు డాక్టర్ ప్రసాద్ రాజుతో ఫీలర్ వదిలిపెట్టారు.. ఒక అయిదు నక్షత్రాల హోటల్‌లో నలుగురే నలుగురు పాత్రికేయులను పిలిపించి వారి ద్వారా సమాచారాన్ని బయటకు పంపించారు... ఈ ఫీలర్ రాష్ర్ట మంతా బాగానే పాకింది. మీడియాకు ఇది తీపి మిఠాయిలా అంది వచ్చింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి అప్పటి నుంచి వాస్తవాలకు ఊహలు కొన్ని, కల్లలు మరి కొన్ని జోడించి చిలువలు, పలువలను ప్రసారం చేశారు. కనుసైగ చేస్తే చాలు రక్తం ధార పోసే చిరంజీవి అభిమాన బృందాల్లో ఇది భరించలేని వేడి రగిల్చింది. ఈ వేడి సెగలు జూబ్లీహిల్‌సలో 14 అడుగుల ఎత్తులో ప్రహారీతో నిర్మించిన దుర్భేద్యమైన చిరంజీవి కోటను బద్దలు కొట్టి మరీ మెగాస్టార్‌ను, ఆయన బృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒక విధంగా చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా ఆగలేని అనివార్య పరిస్థితి ఒకటి నెలకొంది. అప్పటి నుంచి ఇక అసలు కథ మొదలైంది... మొదట చిరంజీవిని ఆయన కుటుంబ సభ్యులు ప్రభావితం చేస్తూ వచ్చారు. ఆ తరువాత అభిమాన సంఘాలు ఆయన్ను ప్రభావితం చేశాయి. చిరంజీవిని ఇంద్రుడు, చంద్రుడు అన్నారు.. నాడు ఎన్టీయార్, నేడు చిరంజీవి అన్నారు. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి మీ ముందు ఎన్టీయార్ దిగదుడుపే అన్న స్థాయిలో పొగుడుతూ వచ్చారు. మీరు కాలు బయట పెడితే చాలు... జనం నీరాజనాలు పలుకుతారు అన్నారు... మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తారు అన్నారు. చిరంజీవికి సాటి రాగల వారు ఆంధ్ర ప్రదేశంలో ఎవరూ లేరన్నారు...ఇవన్నీ చిరంజీవి మైండ్ సెట్‌ను మారుస్తూ వచ్చాయి. మనసులోని కోరిక బలవత్తరమవుతూ వచ్చింది. (ఒక దశలో తనను కలిసిన పాత్రికేయ మిత్రులతో ``నేను బయటకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమో.. ఈ పోలీసులకు జనాన్ని నియంత్రించటం కష్టమేమో'' అని కూడా ఆఫ్‌ది రికార్డుగా అన్నట్లు సమాచారం) ఇంకేం ధీమా పెరిగింది. ఇక వెనక్కి తగ్గే సమస్యే లేదన్నారు.. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం అయింది.సినిమాల్లో సర్వం తానే అయి నడిపించిన బావమరిది అల్లు అరవిందే రాజకీయ పార్టీ కీ శ్రీకారం చుట్టారు.. తము్మళు్ల నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు రంగంలోకి దిగారు... మొదట అభిమాన సంఘాలను చేరదీశారు.. ఇక నుంచి మీరు అభిమానులు కారు.. పార్టీ కార్యకర్తలన్నారు.. మీరే నాయకులన్నారు... వారు ఏమేం చేయాలో.. ఎలా వ్యవహరించాలో చెప్పారు.. అయితే చిరంజీవి పార్టీ అనౌన్‌స చేసే దాకా అంతా సీక్రేట్‌గా ఉంచాలని స్ట్రిక్‌టగా చెప్పుకొచ్చారు...వాళు్ల ఒకవేళ నోరు జారే ప్రమాదం ఉందన్న అనుమానంతో అన్ని వివరాలూ వారికీ తెలియనివ్వలేదు.. మరో పక్క కమూ్యనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వారసుడు డాక్టర్ మిత్రాను రాజకీయ సలహాదారుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సారథ్యంలో `వారధి' అన్న పేరుతో సదస్సులు నిర్వహించారు... మహిళలను సమీకరించి వారితో సమావేశాలు నిర్వహించారు. మరో పక్క అభిమాన సంఘాలు.. వారధి టీంలు కలిసి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. పార్టీ పేరు ఏమిటి? జండా ఏమిటి? దానిపై ఉండాల్సిన గుర్తు ఏమిటి? దానికో గీతం ఎలా ఉండాలి? దాని మూ్యజిక్ ఎలా ఉండాలి? అన్న అంశాలపై రోజుల తరబడి చర్చలు జరిగాయి. చిరంజీవి, ఆయన సోదరులు, బావమరిది కోర్ కమిటీగా ఏర్పడి ఈ వ్యవహారాలన్నీ కార్పోరేట్ తరహాలో చక్కబెట్టారు. మల్టీ మీడియా ఎఫెక్‌ట్సతో పార్టీ జెండా, దాని పాట తయారైంది. తనకు మీడియా సలహాదారుగా ఓ పాత్రికేయుని తీసుకువచ్చి నియమించుకున్నారు. చివరి నిమిషం వరకు అంతా రహస్యంగానే జరుగుతూ వచ్చింది. ఆ నలుగురే అంతా చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో అత్యాధునిక వసతులతో పార్టీ కార్యాలయాన్నీ నిర్మించేశారు..ఇదీ రహస్యంగానే జరిగింది. ఆయన ప్రచారానికి ఉపయోగించే వాహనం రూపుదిద్దుకోవటాన్నీ రహస్యంగానే చేశారు.. అంతా రహస్యం... నిజానికి ఎప్పటికప్పుడు గుట్టు రట్టవుతున్నా... రహస్యమనే.. చెప్పుకున్నారు... ఇది అది కాదు.. అది ఇది కాదు.. అంటూ వచ్చారు... ఈ లోగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఒకరిద్దరు వూ్యహాత్మకంగా రాజీనామాలు చేశారు... చివరకు అసలైన రోజు రానే వచ్చింది. 2008 ఆగస్టు 17న చిరంజీవి తన కొత్త పార్టీ కార్యాలయంలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, మదర్ థెరెస్సాల ఫోటోలు పెట్టుకున్నారు. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు బలంగా తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు కాబట్టే రాజకీయ ప్రవేశం చేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. `సామాజిక న్యాయం' అన్న మాట ఆరోజు చిరంజీవి ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు...అప్పటి పరిస్థితిలో చిరంజీవితో పొత్తు పెట్టుకోవటానికి వామపక్షాలు ఆసక్తి చూపాయి. అయితే ఆయన తన సిద్ధాంతం ఏమిటో చెప్తే కానీ, తాము ముందడుగు వేయలేమని చెప్పుకుంటూ వచ్చాయి. కానీ, చిరంజీవి నోటి వెంట కానీ, ఆయన కోటరీ నోటి వెంట కానీ ఎలాంటి సమాధానం రాలేదు.. వాళు్ల తమను ప్రశ్నించేదేమిటంటూ ఎదురుప్రశ్న వేశారు... చివరకు ఆగస్టు 26, 2008న పార్టీ ప్రకటన జరిగింది. జెండా ఆవిష్కారం. పాటలు అంతా ధూం ధాంగా నిర్వహించారు. తిరుపతి బహిరంగ సభలో దాదాపు పది లక్షల మంది సమక్షంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఆవిష్కృతమైంది. సామాజిక న్యాయం తమ సిద్ధాంతం అన్న మాట అప్పటికి కానీ వెలుగు చూడలేదు... తెల్లవారే సరికి ప్రజారాజ్యం అన్న పేరుతో మరొకరు పార్టీ నమోదు కోస ం ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసింది. పేరు ఆలోచిస్తున్న తరుణంలోనే ముందుగా విచారణ చేయకపోవటం ముందు చూపు లేని తనం, వూ్యహాత్మక లోపం బయటపడిన తొలి సందర్భం ఇది. అప్పటికి ఆ సమస్యను ఏదో విధంగా చక్క బెట్టుకున్నారు. కానీ, ఆ తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న లోపాలను సవరించుకుపోగా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఒకరిద్దరు అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేస్తూ ముందుకు వెళూ్త పోయారు. తాను నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు, తన తము్మడు నిర్వహించిన ప్రచారానికి జనం తండోప తండాలుగా రావటంతో వారందరినీ తన ఓటర్లుగానే భావిస్తూ వచ్చారు. తానే తన పార్టీకి సింబల్ అన్నారు. తన పేరు చెప్తేనే చాలు.. ఓట్లు వాటంతటవే వచ్చేస్తాయన్నారు. సర్వేలు చేశామన్నారు. అభ్యర్థులు వచ్చి టిక్కెట్ అడిగితే పార్టీ ఫండ్ అడిగారు. పార్టీ నిర్వహణకు ఫండ్ తీసుకుంటే తప్పేమిటని మీడియాలో పిఆర్‌పి నేత ఒకరు బహిరంగంగానే సమర్థించుకొచ్చారు. అధినేతకు అన్నీ సవ్యంగా జరుగుతున్నట్లే చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముంచుకొచ్చిన తరువాత కూడా అధినేత అదే భ్రమలో ఉండిపోయారు. చివరకు ఎన్నికలు ముంచుకువచ్చిన తరువాత దిద్దుకోవటానికి సమయం చాలని పరిస్థితి నెలకొన్నాక చేసేదేమీ లేకుండా పోయింది. పర్యవసానం సాక్షాత్తూ తానే ఎన్నికల్లో ఓడిపోవటం. అదీ తన సొంత జిల్లాలో... రాష్ట్రంలో, ఒకప్పుడు దేశంలోనే అత్యధిక రెము్యనరేషన్ తీసుకున్న నటుడికి ఎదురవాల్సిన చేదు అనుభవం కాదు ఇది. *దీనికి కారణాలు అన్వేషిస్తే చిరంజీవి వేసిన ప్రతి అడుగూ తప్పేనని స్పష్టమవుతుంది.1. రాజకీయాల్లోకి వచ్చే ముందు నాటి ఎన్టీయార్‌తో తనను తాను పోల్చుకున్నారు. 1982లో ఎన్టీరామారావు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆయన కంటే తక్కువ సమయంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పాలని చిరంజీవి భావించి ఉండవచ్చు. లేదా ఆయన అభిమానులు ఆయన్ను ఆ విధంగా భ్రమల్లో ముంచి ఉండవచ్చు. అందుకే రాజకీయాల్లోకి రావాలని ముందుగానే అనుకున్నా, పార్టీ ప్రకటన ఆలస్యంగా చేశారు. అందుకనే సమయం చాలలేదు.... ఎన్టీరామారావు కంటే తనకు పాపులారిటీ ఎక్కువగా ఉందని చిరంజీవి అనుకున్నారు. వాస్తవానికి ఎన్టీరామారావుకు వయోభేదం లేకుండా పిల్లవాళ్ల దగ్గరి నుంచి ముదుసలి ఒగ్గు వరకు అంతా అభిమానులే. నాడు ఎన్టీయార్ రైతులకు రైతు, కార్మికులకు కార్మికుడు.. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు... సమాజ సేవకుడు, కథా నాయకుడు.. ఇలా అనేక పాత్రల ద్వారా ప్రజల్లో వారి సమస్యలను పరిష్కరించే వేషధారణల్లో రాష్ట్ర మంతటికీ సుపరిచితమైన వ్యక్తి. చిరంజీవి మెగాస్టార్. 30 ఏళ్ల సినీజీవితంలో ఆయన అభిమానుల్లో ఎక్కువగా మాస్ ప్రేక్షకులే ఉన్నారు. వీరిలో పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువ. వీరిలోనూ యువతను ఎక్కువగా చిరంజీవి ఆకర్షించారు. అంటే 35 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా చిరంజీవి అభిమానులు ఉన్నారు. అందులో చిన్న పిల్లలకు చిరంజీవి అంటే యమ క్రేజీ. ఇందులో సందేహం లేదు. అయితే వీరంతా ఓటర్లు కారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయించటం కోసమే వారధి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. యువకులంతా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రచారం చేసింది. అభిమానుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అనుకున్నట్లుగానే యువతీయువకులు ఎక్కువ మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలో ఎక్కువ మంది ఓటు వేయటానికి విముఖత చూపిస్తారన్న గత అనుభవాలను కాదని, అదృష్టవశాత్తూ ఈసారి ఓట్ల శాతం గతంలో కంటే బాగానే పెరిగినా, ఆ ఓట్లు చిరంజీవికి ట్రాన్‌సఫర్ కాలేదు. ఇక సినిమాల్లో సమాజంతో మమేకమైన పాత్రలు వేసిన సందర్భాలు వేళ్ల పైన లెక్కించదగినవి మాత్రమే ఉన్నాయి .అవీ సినిమాల నుంచి రిటైర్ అవటానికి ముందు తీసిన ఒకటి రెండిటిని మాత్రమే చెప్పుకోవచ్చు. అందువల్ల ఎన్టీయార్‌కు, చిరంజీవికి హస్తిమశకాంతరం ఉన్నది. ఎన్టీయార్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి కాలానికి అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత గూడుకట్టుకుని ఉంది. ప్రత్యామ్నాయం కోసం జనం ఆవురావురుమని ఎదురు చూస్తున్న సందర్భం అది. అప్పటికి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తోంది. అయినా సంస్థాగతంగా అది దక్షిణ భారత దేశంలో పెద్దగా నిలదొక్కుకోలేదు. రాష్ట్రంలో వెంకయ్య నాయుడు పార్టీ విస్తరణకు కొంత ప్రయత్నం చేస్తున్నా, అంతగా ఫలించలేదు. అదే సమయంలో ఎన్టీయార్ పార్టీని ప్రకటించారు. ఆయనకు ఈనాడు పత్రిక అండదండలు పుష్కలంగా అందాయి. యాంటీ కాంగ్రెస్ ప్రచారాన్ని ఈనాడు కంకణం కట్టుకుని నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ జెండా, దాని రూపు రేఖలు ఈనాడు కార్యాలయంలోనే రూపుదిద్దుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసే నేతలకు ఈనాడులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రసంగ పాఠాలు రాసిచ్చారు. కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ఏకపక్ష అజెండాతో నాడు ఈనాడు (ఈనాటికీ) పని చేసింది. సంపాదకీయాలు రాసింది. మరో పక్క వామపక్ష పార్టీలు పరోక్షంగా ఎన్టీయార్‌కు అన్ని విధాలా సహకరిస్తూ వచ్చాయి. ఎన్టీయార్ సభలకు జనసమీకరణ కూడా చేసాయి. తొమ్మిది నెలల పాటు ఎన్టీయార్ ఒక కార్మికుడి వేషం వేసుకుని రాష్ట్రం నలు చెరుగులా కలియతిరిగారు. రోడ్డు మీద తిన్నారు.. రోడ్డు మీద పడుకున్నారు.. అక్కడే స్నానం చేశారు.. వీటన్నింటికీ ఈనాడు ప్రచారం కల్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే యాంటీ ఇంకంబన్సీతో పాటు అన్ని రకాలుగా కలిసివచ్చింది కాబట్టే నాడు ఎన్టీయార్ గెలువగలిగారు. 1982 నాటి రాజకీయ వాతావరణాన్ని గురించి చిరంజీవి పూర్తిగా అధ్యయనం చేయలేదు. 1982 నాటికి, ఇప్పటికీ ఉన్న రాజకీయ వాతావరణంలో ఎంత మాత్రం పోలిక లేదు. ఆనాటి రాజకీయ క్రియాశూన్యత ఇవాళ రాష్ట్రంలో లేదు. ఇవాళ రాజకీయ క్రియాశీలతే ఎక్కువగా ఉంది. నాడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదు.. ఈనాడు తెలుగుదేశం బలమైన పార్టీ ఉంది. దీనికి తోడు అత్యంత క్రియాశీలంగా పనిచేస్తున్న శక్తిమంతమైన మీడియా ఉంది. రెండు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ నేతలు అనామకులు కాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో మదపుటేనుగుల వంటి వారు. మదించిన ఏనుగులను ఎదుర్కోవటం అంటే మృగరాజుకైనా అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. కుంభస్థలాన్ని బద్దలు కొట్టినప్పుడే ఏనుగు నిస్తేజమవుతుంది. ఇందుకు సింహమైనా సరే ఒడుపుగా ఏనుగుపైకి ఎక్కి కుంభస్థల భేదన చేయాల్సి ఉంటుంది. ఈ మౌలిక సూత్రాన్ని చిరంజీవి అసలు పట్టించుకునే లేదు. వైఎస్‌ఆర్, చంద్రబాబుల రాజనీతిజ్ఞతను ఆయన చాలా చాలా తక్కువ అంచనా వేశారు. తన రంగప్రవేశంతో రాజకీయ ముఖచిత్రం అంతా తనతోనే నిండిపోతుందని ఆశించారు. మితిమీరిన ఆ ఆత్మవిశ్వాసం.. ఆయన్ను అప్పుడే ఓటమి పాలు చేసింది. వైఎస్‌ను గద్దె దింపటానికి చంద్రబాబు నాయుడే మూడు పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. ఎందుకంటే వైఎస్ తన అయిదేళ్ల పదవీ కాలంలో తనదైన ఓటు బ్యాంకును సంక్షేమ పథకాల ద్వారా నిర్మించుకున్నారు. ఇందిరమ్మ ఇళు్ల కానీ, పెన్షన్లు కానీ, రాజీవ్ స్వగృహ కానీ, పావలా వడ్డీలు కానీ, రుణాల మాఫీ కానీ.. ఆరోగ్యశ్రీలు, 108, 104 సర్వీసులు.. జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల ద్వారా బలమైన ఓటుబ్యాంకును వైఎస్ సమీకరించుకున్నారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ముపై్ఫ ఏళ్ల నిరీక్షణ ద్వారా తాను సాధించుకున్న అధికారాన్ని కాపాడుకోవటానికి వైఎస్‌కు ప్రజల సంక్షేమ పథకాలే మార్గమయ్యాయి. వీటిని ఎదుర్కోవటానికి వీటన్నింటినీ మించిన పథకాలను చంద్రబాబు నగదు బదిలీ వంటి వాటి రూపంలో ప్రకటించాల్సి వచ్చింది. అయినా ఆయన లక్ష్యం సాధించలేకపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరూ ఒకరిని మించిన వారు ఇంకొకరు. తమ పార్టీలో తమకు పోటీయే లేకుండా చేసుకున్న నేతలు. జాతీయ స్థాయి రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సమర్థులు ఈ ఇద్దరు నాయకులు. ఆధిపత్యం కోసం ఇంత హోరాహోరీగా ఇద్దరి మధ్య సాగుతున్న పోరులో మధ్యలో ప్రవేశించాలనుకునే వ్యక్తి తానెంత బలంగా రావాలి? ఎన్ని అస్త్ర శసా్తల్రను పట్టుకుని యుద్ధరంగంలోకి దిగాలి? కానీ చిరంజీవి చేతిలో ప్రత్యర్థులపై సంధించటానికి ఒక్కటంటే ఒక్క అస్త్రమైనా లేకుండా పోయింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు స్పష్టత లేదు. మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. కానీ, తాను తీసుకురాదలిచిన మార్పు ఏమిటన్నది ఆయనకే తెలియదు. రెండవది పాజిటివ్ రాజకీయాలు చేస్తానన్నారు. ఎవరినీ నిందించేది లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి నిందారోపణలతోనే అంతా గడిచిపోయింది. ఆగస్టు 26 వచ్చేసరికి వివిధ రంగాలను ఎంపిక చేసుకుని వాటిపై తన అభిప్రాయాలేమిటో చెప్పుకొచ్చారు. అంతిమంగా తమ పార్టీ విధానం `సామాజిక న్యాయం' అని తేల్చారు. ఇక ఈ సామాజిక న్యాయం అంటే ఏమిటి? చిరంజీవి పార్టీ పెట్టడానికి ముందే ఆయన పార్టీ ఒక కులానికి మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ కమ్మ వర్గానికి, కాంగ్రెస్ పార్టీ రెడ్డి వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోందని, కాపులకు ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేదు కాబట్టి ఆ వర్గానికి మేలు చేసేందుకే చిరంజీవి పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని గురించి చిరంజీవికి తెలియకుండా ఉండదు. కానీ, చిరంజీవి మాత్రం ఈ ప్రచారాన్ని సమర్థించలేదు..సరికదా ఖండిచనూ లేదు.. చివరకు ప్రజారాజ్యం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నప్పుడు నష్టనివారణ చర్యలు తీసుకోవలసిన ప్రజారాజ్యం అధినాయకత్వం కిమ్మనకుండా కూర్చుంది. సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గానికి న్యాయం చేయటమే కావచ్చన్న సందేహాలు కూడా కలిగాయి. ఫలితం.. మొన్నటి ఎన్నికల రిజల్‌ట్స. ఎన్నికల్లో కులం కార్డు పని చేయదని మరోసారి ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రజల్లో కులం స్పృహ ఉంది కానీ, ఎన్నికల్లో కేవలం తమ కులం వాడు కాబట్టి అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే ఓట్లేయాలన్న ఆలోచన ఓటర్లకు లేదు. ఓటర్లు చాలా తెలివైన వారు. కాబట్టే విస్పష్టమైన తీర్పు చెప్పారు. ప్రజారాజ్యం తరపున మిగతా పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ సీట్లు బిసిలకు కేటాయించారు తప్ప, వాటికంటే ఈ పార్టీ భిన్నంగా వ్యవహరించింది ఏమీ లేదు. ప్రజారాజ్యం తరపున ఎన్నికైన 18 మందిలో తొమ్మిది మంది చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన కాపు వర్గీయులే ఉన్నారు. కానీ, అదే సమయంలో ఓడిపోయిన వారిలో అదే వర్గానికి చెందిన వారు అంతకంటే మూడు రెట్లు ఉన్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులపై ఆయా కులాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వుండవచ్చు. కానీ, ఆ పార్టీలు అంతకు మించిన రాజకీయ సమీకరణాలు సామాజికంగా అవలంబిస్తున్నవి. కానీ, ప్రజారాజ్యం పార్టీ ప్రారంభం నుంచి కులం ముద్ర బలంగా వేసుకుని మరీ ముందుకు వచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు (చిరంజీవితో సహా) తమ కులానికి సంబంధించిన ఓట్లు సాలిడ్‌గా, గంపగుత్తగా పిఆర్‌పికి బదిలీ అవుతాయని బలంగా విశ్వసించారు. ఇంకా చెప్పాలంటే గుడ్డిగా విశ్వసించారు. పిఆర్‌పిని సమర్థించిన వాళు్ల, చిరంజీవి అధికారంలోకి రావాలని కోరుకున్న వారు, విశ్లేషకులు సైతం ఇదే భ్రమలో ఉన్నారు. కులం స్పృహ రాష్ట్ర ప్రజల్లో మునుపెన్నడూ లేని విధంగా వచ్చిందని, ఏ కులం వాళు్ల ఆ కులానికి ఓట్లేస్తారని బలంగా ప్రచారం చేశారు. ఒక నియోజక వర్గంలో ఒక కులం వాళ్లే ముగ్గురు పోటీ లో ఉంటే కులం అభ్యర్థి కంటే కులం పార్టీకే ఓట్లు పడతాయని కూడా బల్లగుద్ది వాదించారు. చిరంజీవి దగ్గరకు వచ్చి ఆయన చెవుల్లో ఇదే అంశాన్ని ఊదరగొట్టి మరీ వచ్చారు. కులం స్పృహ ఉండటం వేరు.. ఓటేయటం వేరు.. కులం ఫ్యాక్టర్ పనిచేసేది కొంత శాతం మాత్రమే. అది కూడా చాలా తక్కువ శాతం పని చేస్తుంది. ఎన్నికల్లో ఓటు వేసే దగ్గరకు వచ్చేసరికి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వంపై అనుకూలతలు, వ్యతిరేకతలు... అభ్యర్థి వ్యక్తిత్వం, ఆర్థిక, హార్థిక, అంగ బలాబలాలు, గుణగణాలు, అభివృద్ధి, స్థానిక అంశాలు, సమస్యలు, ఓటరు వ్యక్తిగత లాభనష్టాలు, తరువాత పార్టీ అధినేతపై విశ్వసనీయత, ఆయన చేసే వాగ్దానాలపై నమ్మకం ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి. చివరకు ప్రలోభాలు చూపే ప్రభావమూ కొంత ఉంటుంది. ఒక అభ్యర్థి గెలుస్తారా లేదా అని సర్వే చేసేందుకు ఈ అంశాలన్నీ పరిగణించాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ కూడా సర్వేలు చేసింది(ట) లెక్కలు కట్టుకుంది(అరవింద్ చెప్పారు) ఆ లెక్కలు, సర్వేల ప్రకారమే గెలిచే గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చామన్నారు. తీరా చూస్తే సాక్షాత్తూ అరవిందే ఓడిపోయారు. అధినేతకే సురక్షిత నియోజకవర్గాన్ని ఎంపిక చేయలేని దురదృష్టకరమైన స్థితిలో ప్రజారాజ్యం పార్టీ ఉన్నదంటే, ఆ పార్టీ లెక్కలు ఎంత తప్పుడు లెక్కలో విడమర్చి చెప్పనవసరం లేదు.ఇక ప్రచారం విషయానికి వస్తే.. చిరంజీవి మంచి ప్రసంగ కర్త కాదు.. ఆయన సినిమాల్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలరేమో కానీ, వాస్తవ ప్రపంచంలో అనర్గళంగా మాట్లాడలేరు. తన మాటలతో, చేతలతో ప్రజలను ఉత్తేజితులను చేయగలిగే సమ్మోహన శక్తి చిరంజీవికి లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు కాలినడకన నడిచి, ప్రజలతో మమేకమయ్యారు. నారా చంద్రబాబు నాయుడు మీకోసం యాత్రతో రాషా్టన్న్రి రెండుసార్లు చుట్టి వచ్చారు. కె.చంద్రశేఖర్ రావు తన ప్రసంగాలతోనే తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోగలిగారు. చివరకు ప్రజారాజ్యంలో విలీనమైన నవతెలంగాణ పార్టీ నేత దేవేందర్ గౌడ్ కూడా పాదయాత్ర నిర్వహించి తన సామర్థా్యన్ని నిరూపించుకున్నారు. చిరంజీవి మాత్రం ముచ్చటగా మూడు రోజులు తిరిగే సరికి గొంతు పడిపోయింది. అర్ధంతరంగా తొలి విడత పర్యటనను ముగించుకుని వెనక్కి వచ్చారు. అప్పటి నుంచి ఆయన గొంతు మంద్ర స్థాయి నుంచి ఎప్పుడూ పెరగలేదు. ప్రజల్లో ఎమోషన్‌ను ఆయన క్రియేట్ చేయలేకపోయారు. ఆయన ప్రసంగాలన్నీ చప్పగా సాగిపోయాయి. ఆయన రాష్టమ్రంతటా తిరగలేదు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. 18 డిగ్రీల ఏసి వాతావరణం నుంచి బయటపడి ఎండల్లో తిరగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారు. ఆ కష్టం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఆయనకు తోడుగా రంగంలోకి దిగిన ఆయన కుటుంబ సభ్యులకైతే ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఓనమాలు కూడా తెలియవు.కనీసం చేస్తున్న ప్రచారం అయినా వూ్యహాత్మకంగా చేశారా అంటే అదీ లేదు. ఓ వైపు తొలి దశ ఎన్నికల కోసం తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగతా పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తుంటే చిరంజీవి మాత్రం రెండో దశ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తూ పోయారు. ఇక నేడో, రేపో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రచారం చేశారు .నల్గొండ జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహిస్తుంటే, అదే జిల్లాలో మరో ప్రాంతంలో చిరంజీవి ప్రచార సభ ఏర్పాటు చేయటం ఏ విధంగా వూ్యహాత్మకమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. ఇక అభ్యర్థుల ఎంపిక కూడా గుడ్డిగా జరిగింది. ఎవరు పార్టీ ఫండ్ ఇచ్చారో.. మరో రకంగా ప్రభావితం చేశారో వారికి అడిగిన చోట అడిగినట్లుగా టిక్కెట్లు ఇచ్చారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో ముందుగా అనుకున్న వారిని మరో స్థానానికి మార్చేశారు కూడా. రాజంపేట నుంచి పోటీ చేద్దామనుకున్న సి.రామచంద్రయ్యను తీసుకువచ్చి మచిలీపట్నం నుంచి బరిలోకి దింపటం ఇందుకు ఒక ఉదాహరణ. కనీసం పొత్తుల విషయంలోనైనా సరిగా వ్యవహరించారా అంటే అదీ లేదు. మొదట్లో కమూ్యనిస్టులు చిరంజీవితో పొత్తుకు సరేనందామనుకున్నారు. ఆయన సిద్ధాంతం ఏమిటో తెలిస్తే పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ, చిరంజీవి కానీ, ఇతర వందిమాగధ బృందం కానీ, తమ బలాన్ని, బలగాల్ని మితిమీరి అంచనా వేశాయి. అన్ని పార్టీలు తమ దగ్గరకు వచ్చి బతిమాలాలే తప్ప, తాము ఎవరి దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరించాయి. చివరకు దేవేందర్, జ్ఞానేశ్వర్ తప్ప ఎవరూ చిరంజీవి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. అన్నింటికంటే మించి పార్టీ నిర్మాణంలో చిరంజీవి దారుణంగా విఫలమయ్యారు. ఆయన పార్టీ ఏర్పాటుకు ముందు తన రాజకీయ సలహాదారుగా డాక్టర్ మిత్రాను నియమించుకున్నారు. ఆయన దివంగత కమూ్యనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య మనుమడు. ఆయన చిరంజీవి తోనే రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల ఆయన ఎంతవరకు అధ్యయనం చేశారు? ఎంతవరకు అవగాహన ఉంది? వైఎస్, చంద్రబాబు లాంటి దిగ్గజాల ఎత్తులకు పై ఎత్తులు వేయగల సామర్థ్యం ఎంత ఉంది అంటే సంతృప్తి కరమైన జవాబు దొరకడం కష్టమేనేమో.. ఇక పార్టీ అదికార ప్రతినిధుల్లో మరొకరుగా పరకాల ప్రభాకర్‌ను నియమించారు. రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాని వ్యక్తి ఆయన. ఈనాడు టెలివిజన్‌లో ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ మాజీ బిజెపి ప్రతినిధి చాలా ఏళ్ల తరువాత పిఆర్‌పిలో చేరితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ఆశించారో చిరంజీవికే తెలియాలి. ప్రభాకర్ తనతో పాటు కొందరు బిజెపి కార్యకర్తలను, చోటామోటా నాయకులను పిఆర్‌పి వైపు తీసుకువచ్చారే తప్ప, ఆయన వల్ల పార్టీకి ఒక మంచి ప్రవక్త దొరికాడే కానీ, ఇతరత్రా ప్రయోజనం ఏమీ కలుగలేదు. కొంతకాలం తరువాత ఆయనే వీరికి శత్రువయ్యాడనుకొండి... అది వేరే సంగతి...ఇక ప్రజారాజ్యం ఏర్పాటు చేయడంతోనే అందులో చేరిన కొందరు నాయకులు...చేగొండి హరిరామజోగయ్య, భూమా నాగిరెడ్డి దంపతులు, తమ్మినేని సీతారాం, పి.శివశంకర్, పర్వతనేని ఉపేంద్ర, సి.రామచంద్రయ్య వంటివారు... మరికొందరు...వీరిలో జోగయ్య, శివశంకర్, ఉపేంద్ర వంటి వారు వృద్ధ నాయకులు.. ఇప్పటి రాజకీయాలకు ఒక విధంగా ఔట్ డేటెడ్ రాజకీయ నేతలు. భూమా దంపతులు, తమ్మినేని సీతారాం వంటి వారు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారు. వీరిలో భూమా దంపతులకు తప్ప మిగతా నేతలు ఎవరూ కనీసం తాము సొంతంగా నిలబడి నాలుగు ఓట్లు సంపాదించే శక్తి ఉన్నవారు కారు. ఇలాంటి వాళ్లను చుట్టూ పెట్టుకుని చంద్రబాబు, వైఎస్ లను ఎలా ఎదుర్కోగలనని చిరంజీవి భావించారో ఆయనకే తెలియాలి. మొదటి నుంచి అభిమానులకు కీలక భూమికను కట్టబెడతామన్న చిరంజీవి, ఆ పనిని వేళ్లపై లెక్కించదగిన ప్రాంతాల్లోనే చేశారు. చాలా ప్రాంతాల్లో అభిమానుల ఆగ్రహం అభ్యర్థుల ఎంపిక సమయంలో, పార్టీ పదవుల పంపకం సమయంలో బయటపడటం బహిరంగ రహస్యమే. ఇలా లోతుగా విశ్లేషిస్తూ పోతే లోటుపాటులు ఎన్నో బయటపడతాయి. ఇప్పటికి చిరంజీవి గెలిచిన 18 స్థానాలు కేవలం ఆయనపై అభిమానంతో వచ్చిన సీట్లే కానీ, ఆయన అజెండాకు, పార్టీకి పడినవి మాత్రం కావు. తమ పరాజయానికి, ఇతరుల విజయానికి గల కారణాలను, అభిమాన, అహంభావాలకు అతీతంగా కోటరీని పక్కన పెట్టి పరిశీలన చేసుకోవటం చిరంజీవికి అత్యవసరం. గ్లామర్ మాయ పొరలను చీల్చుకుని బయటకు వచ్చి నిష్కర్షగా తన పనితీరును బేరీజు వేసుకోవాలి. ముందుగా పార్టీని పటిష్ఠంగా నిర్మాణం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలి. గ్రామీణ స్థాయి నుంచి కేడర్‌ను అంచెలంచెలుగా నిర్మించుకుంటూ రావాలి. ప్రజలు, వారి సమస్యలను కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా అర్థం చేసుకుని పట్టించుకుని వాటి పరిష్కారం కోసం తనకున్న 18 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రయత్నించాలి. అయిదేళు్ల చిరంజీవికి పరిపూర్ణ రాజకీయ నాయకుడుగా ఎదిగేందుకు మంచి అవకాశం. ఈ కాలంలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రౌండ్‌లెవల్‌లో పునాదులు గట్టి పడతాయి. లేకపోతే చిరంజీవి కలల సౌధం కూకటి వేళ్లతో కూలిపోవటానికి ఎంతో కాలం పట్టదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 కామెంట్‌లు:
మంచి post. Good analysis. కాక పొతె postని, అసందర్భంగా, దీనితొ
"మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని మహారాజుగా వెలిగిన మెగాస్టార్"
అని ప్రారంబించారు. అందులొ కొంత అతిశయొక్తి వుంది.
very good analysis.
విశ్లేషణ చాలా వివరంగా చేసారే! భేష్.
చాలా వివరంగా చెప్పారు. కానీ ఇలాంటి విశ్లేషణలు ఫలితాలు వెలువడిన తరువాత మాత్రమే సాధ్యమా? లేక ఫలితాలు వెలువడక ముందు కూడా మీరిలాగెప్పుడైనా ఆలోచించారా?
వీలైతే మళ్ళొకసారి చదవి వ్యాఖ్యానిస్తాను.
మీ విశ్లేషణ బాగుంది. చదవడం మొదలెట్టేటప్పుడు.. అబ్బా ఇంత సోది ఎవరు చదువుతారు అనుకొని.. తీరా చూస్తే అప్పుడే అయిపోయిందా అనిపించింది.
>> Indian Minerva గారు విశ్లేషణ ఎప్పుడు సాధ్యం అని కాదు మనంచూడాల్సింది. ఈ పరిణామాలు తిరిగి జరగకుండా వుండేందుకే విశ్లేషణలు.
Good analysis.
ఇవన్నీ ఇంతకు ముందు విన్నవే అయినా చాలా చక్కగా ఒక చోట కూర్చారు. చదువరులకు మరింత అనుకూలంగా ఉండడానికి నావి చిన్న సూచనలు
(1) పోస్టు మొత్తం ఒకేమొత్తంగా కాక పేరాగ్రాఫులుగా విడదీయండి.
(2) చిన్న చిన్న హెడింగులుంటే ఇంకా బాగుంటుంది.
బాగుందండి మీ విశ్లేషణ. నేను మాత్రం చిరు ఓడిపోయాడు అనుకోను. 8 నెలల పార్టీ కి 16 శాతం వోట్లు రావటం ఆయన మీద అభిమానానికి నిదర్శనం. పార్టీ యంత్రంగాన్ని బాగా నిర్మించుకుని, టిక్కెట్ల పంపకం లో అవకతవకలు జరగక పోయి ఉంటే ఇంకా బాగ వచ్చేయేమొ సీట్లు. కాకపోతే వీటన్నిటికి కారణం వాళ్లకి ఉన్న ఆత్మ విశ్వాసం. దాన్ని కూడా మితి మీరిన ఆత్మ విశ్వాసం అనుకొలేము ఎందుకంటే చిరు రోడ్షో లకు వచ్చిన జనాలను చూసి వచ్చిన విశ్వాసం అది.
మొదటి సారే 200 సీట్లు గెలిస్తే చిరు కి ఎప్పటికీ రాజకీయాలు అర్థం అయ్యెవి కాదేమో. ఒక రకంగా ఈ ఎన్నికలు చిరు కి నిజానిజాలను తెలిసేటట్లు చేసాయి. ఇప్పుడు చిరు కి వీటన్నిటిని అధిగమించటానికి బాగ సమయం ఉంది. నిజంగా సేవ చేయాలనుకుంటే వీటిని అధిగమిస్తాడు.
చిరంజీవి ప్రజారాజ్యం ను కాపాడుకోవటం కష్టం. సుబ్బరంగా కాంగ్రెస్ లో లేదా తెదేపాలో లేదా బీజేపీలో విలీనం చేయటం మంచిది. అన్నా జయప్రకాష్ అన్నా! నువ్వు గుడక పార్టీ మూసేసి ఎందులోనైనా కలిసిపో. పుట్ట గొడుగుల లెక్క ఇన్ని పార్టీలు ఏమిటికి ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి