28, మే 2009, గురువారం
కెసిఆర్ అను ఓ అసమర్ధుడి రాజకీయ యాత్ర!
తెలంగాణ మళ్లీ సశేషంగానే మిగిలిపోయింది. నాలుగు దశాబ్దాల ఉద్యమం ఇంకా గమ్యం కోసం చేరుకోవటానికి నానా కష్టాలు పడుతూనే ఉంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు లేక తెలంగాణ అనాధలా కన్నీరు పెడుతోంది. ఉద్యమానికి ఊపిరి పోసిన వారే ఉసురు తీస్తుంటే ఆ ఉరితాళ్ల నుంచి తప్పించుకోవటానికి పోరాడుతోంది. అగాధంలో పడిపోయిన తనను ఎవరు మళ్లీ పైకి తీస్తారా సహాయం కోసం చేతులు చాచి నిరీక్షిస్తోంది. ఆ చేతులను అందుకునేదెవరు? తెలంగాణాకు చేయూతనిచ్చేదెవరు? జవాబులేని ప్రశ్నలు ఇవి. తెలంగాణాను 1969లో భుజానికెత్తుకున్నవాళు్ల... తమ రాజకీయ ప్రయోజనం తీరగానే తెరమరుగైపోయారు.. తెలంగాణకు ముఖం చాటేశారు. నాడు వేలాది విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. వందలాది విద్యార్థులు తమ ప్రాణాలను బలి చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. మరో ఆరు నెలలు అదే ఊపులో ఉద్యమం నడిచి ఉంటే తెలంగాణ రాష్ట్రం అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేది. సరిగ్గా అదే సమయానికి మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని హైజాక్ చేశాడు. ప్రజలు ఆయన్ని గుడ్డిగా నమ్మారు. ఉద్యమకారులూ విశ్వసించారు. ఆవేశంగా ఉన్న విద్యార్థులు ఆయన వెంట నడిచారు. ఓట్లు వేసి గెలిపించారు. గెలిచినోళ్లందరినీ వెంటబెట్టుకుని వెళ్లి నాటి ప్రధానమంత్రి ఇందిరమ్మ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్‌లో చేరిపోయాడు... ఉద్యమానికి బలైపోయిన ఇన్ని ప్రాణాల విలువ గాల్లోనే కలిసిపోయింది. మళ్లీ నలభై ఏళ్ల తరువాత మరోసారి తెలంగాణ రాష్ట్ర నినాదం 2001లో వినిపించింది. రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణం చేతనో.. తెలుగుదేశం అధినేతతో విభేదాల కారణాల వల్లనో అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే బక్క ప్రాణి తెలంగాణ అనే ఒక బలమైన భావోద్వేగాన్ని ఊతంగా పట్టుకుని రాజకీయ యాత్ర ప్రారంభించాడు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. తాను అసమర్థుణ్ణని చంద్రశేఖర్ రావుకు బాగా తెలుసు. అందుకే తన ప్రమేయం లేకుండానే తనకు ఓ తిరుగులేని అస్తిత్వాన్ని కట్టపెట్టగల నినాదాన్ని ఒడిసి పట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమం అనే నిప్పుపై ఉన్న నివురును నెమ్మదిగా తొలిగించాడు. ఒక్కసారిగా 1969 నాటి ఉద్యమ స్ఫూర్తి మరోసారి రగలటం ప్రారంభించింది. అమాయకులైన మేధావులు కెసిఆర్ అని పొట్టి అక్షరాలతో పిలిచే చంద్రశేఖర్‌రావుకు వెనుక నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యావంతులు ఇంకోవైపు నుంచి అండగా నిలబడ్డారు. ఇక సాంస్కృతిక కళాకారుల బృందం కెసిఆర్‌కు ముందుండి పార్టీని ముందుకు నడిపించింది. అక్షరాలా ఎనిమిది సంవత్సరాలు.. తెలంగాణకు ప్రతినిధినని చెప్పుకున్న, చెప్పుకుంటున్న కెసిఆర్‌ను ఇక్కడి ప్రజలు మన్నిస్తూనే వచ్చారు. తాను ఓడిపోతే తెలంగాణ ఉద్యమమే కనుమరుగైపోతుందని చెప్తే.. అయ్యో తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఒక్కడు కూడా ఓడితే ఎట్లా అని గెలిపించారు. శిశుపాలుడిని వంద తప్పులు కాసినట్లుగా కెసిఆర్‌ను ఏ రకంగా వ్యవహరించినా ప్రజలు మాట్లాడలేదు. చివరకు కెసిఆర్ శరీరం లాగానే, ఆయన మాటలు కూడా ఒట్టి డొల్లేనని తెలుసుకున్నారు. ఇక చాలు పొమ్మంటూ పంపించారు. పంపే ముందు కూడా తెలంగాణ ప్రజలు తమ ఔదార్యాన్ని వీడలేదు. నియోజక వర్గం మార్చినా, దక్షిణ తెలంగాణకు వెళ్లినా, పాపం పోనీమంటూ బొటాబొటి మార్కులతో పాస్ చేశారు. మరోసారి రాజకీయుల చేతుల్లో పడి తెలంగాణ అభాసుపాలైంది. అవమానం పాలైంది. ఆందోళనకరమైంది. సమర్థుడైన నాయకుడు లేక అనాధగా మిగిలిపోయింది. నిజంగా కెసిఆర్‌కు తెలంగాణపై కించిత్ అభిమానం ఉన్నా.. తెలంగాణ రాషా్టన్న్రి తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఏ మూలన ఏ కాస్త మిగిలి ఉన్నా.. ఒకసారి తాను తీసుకున్న నిర్ణయాలు, చేసిన చర్యలు, దూరమైన ఆప్తులు.. ఓటమికి కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషించటం అవసరం. కెసిఆర్ జర సోచియే....1. కెసిఆర్‌పై ఒత్తి డి తీసుకు వచ్చి ఆయనతో పార్టీ పెట్టించిన వాళు్ల ఇప్పుడు ఆయనతో ఉన్నారా? 2. ఇన్నయ్య, కెకె మహేందర్ రెడ్డి, వి. ప్రకాశ్ లాంటి ఎందరో నాయకులు, మేధావులు ఇప్పుడు కెసిఆర్‌తో ఎందుకు కలిసి లేరు?3. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఇది ఉద్యమ పార్టీ అని.. ఎట్టి పరిస్థితిలో రాజకీయ పార్టీ కాదని ఆరోజు కెసిఆర్ ఖరాఖండిగా చెప్పారు. (రికార్డుల్లో చూసుకోవచ్చు.). ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైంది? ఉద్యమం పోయింది.. ఫక్తు రాజకీయ పార్టీగా మిగిలిపోయింది. దీనికేమని జవాబు చెప్తారు?4. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ కెసిఆర్ తెగ తిరిగారు. తెలంగాణ మాండలికంలో తెగ మాట్లాడేశారు. ప్రజలను ఉద్విగ్నులను చేశారు. ఉత్తేజపరిచారు. ఉత్సాహాన్ని రేకెత్తించారు. తెలంగాణ సాధనే తప్ప తమ లక్ష్యం మరేమీ కాదన్నారు. అదివో అల్లదివో అని అన్నమాచార్య అన్నట్లే.. ఇదిగో, ఇల్లిదిగో తెలంగాణ అన్నారు. సోనియమ్మ ఇచ్చిందన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఇచ్చేస్తున్నారన్నారు. పార్టీలన్నీ మద్దతు పలికాయన్నారు. చివరకు వాళ్లనే తిట్టిపోశారు. ఎవరిని విడిచి వచ్చారో వారి పంచనే చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఇంత చేసీ కెసిఆర్ సాధించింది ఏమిటి? సున్నా....5. ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా మార్చినప్పుడు, అందుకు అనుగుణంగా తెలంగాణ అజెండాను ఎందుకు మలచుకోలేకపోయారు?6. బహిరంగ సభల్లో అహో తెలంగాణ, ఒహో తెలంగాణ అనటం తప్ప ఇక్కడి ప్రజల సమస్యలపైన, ప్రాంత సమస్యలపైన నిర్మాణాత్మకంగా ఏనాడైనా పోరాడారా?7. ఫలానా సమస్యపై ఉద్యమించాం.. ఫలానా సమస్యను పరిష్కరించగలిగాం.. లేదా.. పరిష్కారం దాకా తీసుకురాగలిగాం అని చెప్పుకోవటానికి ఏ ఒక్క అంశమైనా ఉందా?8. ఎత్తుల జిత్తుల మారి అని చెప్పుకోవటమే తప్ప.. కెసిఆర్ వేసిన ఎత్తుల్లో చిత్తయినవే ఎక్కువ కాదా?9. తెలంగాణ ప్రజలకు, మేధావులకు, కళాకారులకు, విద్యావంతులకు మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టే కెసిఆర్ ఆడింది ఆట, పాడింది పాటగా మారలేదా?10. తాను కేంద్రంగా తెలంగాణ నడవాలని కేసీఆర్ అనుకున్నారే తప్ప, తెలంగాణ కేంద్రంగా తాను నడవాలనుకోలేదు.. కాబట్టే లక్ష్యం నెరవేరలేదన్నది నిజం కాదా?11. తన నిరంకుశత్వం వల్లనే శత్రువులు పెరిగిన మాట వాస్తవం కాదా?12. చెప్పింది చేయకపోవటం కెసిఆర్ నైజం...ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు...13. తన మాటలో, చేతలో నిజాయితీ లేకపోవటం కెసిఆర్‌లో ప్రధాన లోపం14. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక మేనిఫెస్టో ఉంటుందని చెప్పింది కెసిఆరే... కులాల వారిగా గొప్పగా సదస్సులు నిర్వహించింది కూడా కెసిఆరే. ముసాయిదాలనూ సిద్ధం చేయించింది కెసిఆరే.. సరిగ్గా ఎన్నికలు ముంచుకు వచ్చిన తరువాత అసలు మేనిఫెస్టోయే లేని పార్టీగా ఎన్నికల్లోకి దిగిన ఏకైక పార్టీ కెసిఆర్ పెట్టిన టిఆర్‌ఎస్సే...15. ఎన్నికల్లో గెలిచారు సరే.. మెదక్ నుంచి కెసిఆర్ ఎంపిగా ఎన్నికయ్యారు.. తరువాత అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో చేరి ఆబగా అధికారాన్ని అనుభవించింది కెసిఆరే...16. పార్టీ పెట్టినప్పుడు మియాబీవీ తప్ప పిల్లలంతా అమెరికాలోనే ఉన్నారన్నారు.. పార్టీతో, రాజకీయాలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవన్నారు.. ఆ డైలాగు ఇప్పుడేమైంది... టిఆర్‌ఎస్ కుటుంబ పార్టీగా మారలేదా?17. ఎమ్మెల్యే కాకుండానే మేనల్లుడు హరీశ్‌రావుకు మంత్రి పదవిని ఇప్పించాల్సిన ఆగత్యం ఎందుకు వచ్చింది. కుటుంబ పార్టీగా మార్చాలన్న ఆలోచన లేకపోతే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది.18.అమెరికాలో నెలకు నాలుగు లక్షల రూపాయల జీతంతో సాఫ్‌టవేర్ ఉద్యోగం చేస్తున్నాడన్న కొడుకు రామారావును ఉద్యోగం మాన్పించి దేశానికి రప్పించి రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావలసి వచ్చింది. 19. చివరకు కూతురు కవితను కూడా రంగంలోకి దింపే ప్రయత్నం చేసింది కెసిఆర్ కాదా?20. తన కుటుంబ సభ్యులను బలవంతంగా పార్టీపై రుద్దింది ఎవరు?21. తెలంగాణ వచ్చేసింది.. ఇక సరిహద్దులు గీయడమే తరువాయి. ఆస్తుల పంపకం చేసుకోవటమే మిగిలింది అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు... అవన్నీ ఒఠ్ణి మాటలేనని తేలిపోయాయి. 22. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పులిచింతల ప్రాజెక్టును నిర్మిస్తే రక్తం ఏరులై పారుతుందని బీరాలు పలికారు. కానీ, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వైఎస్ కేబినెట్‌లో ఉన్నప్పుడే పులిచింతల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. పనులు మొదలయ్యాయి. ఈ మంత్రులంతా అప్పుడు ఏం చేస్తున్నారు?23. మేధావులు గగ్గోలు పెడితే కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు.. బాగానే ఉంది. అక్కడి నుంచి నేరుగా డిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గరకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కనీసం ఆ దీక్ష అయినా నిబద్ధతతో చేశారా అంటే అదీ లేదు. గంటల్లోనే విరమించారు. అదేమంటే లోక్‌సభ స్పీకర్ చెప్పారని చెప్పారు. నిజానికి లోక్‌సభ స్పీకర్ ఏమీ చెప్పకున్నా, ఎలాంటి హామీ ఇవ్వకున్నా ఆయన పేరుతో అబద్ధం చెప్పి దీక్షను విరమించింది కెసిఆరే...24. మొట్ట మొదట టిర్‌ఎస్‌కు మద్దతును ఇచ్చింది స్థానిక సంస్థలే.. అలాంటిది ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట తప్ప మరెక్కడా ఎందుకు గెలవలేకపోయారు?25. బిసిలను సైతం నిర్లక్ష్యం చేశారు.. వైఎస్ సర్కారులో బిసి సంక్షేమ శాఖ టిఆర్‌ఎస్‌కు లభిస్తే.. అది కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఇప్పించారు.26. ప్రతి పనికీ మేధావుల సలహాలను తీసుకుంటానని కెసిఆర్ ప్రతి చోటా చెప్పుకొస్తారు. నిజానికి ప్రొఫెసర్ జయశంకర్ తప్ప ఆయన వెంట ఉన్న మేధావుల లిస్‌ట ఏది?27. చేసిన ప్రతి తప్పుకూ జయశంకర్ ఆమోదం ఉందని చెప్పి, ఆయన ప్రతిష్ఠను దారుణంగా దెబ్బ తీసింది కెసిఆర్ కాదా?28. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కెసిఆర్ ఆ ఊపును ఉద్దేశ పూర్వకంగానే కొనసాగించలేకపోయారన్నది నిజం కాదా?29. నిష్కారణంగా ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలతో రాజీనామాలు చేయించి ఘోర పరాజయం పాలయింది వాస్తవం.30. ఉపఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత రాజీనామా డ్రామా ఆడారు.. మేధోమధనం నిర్వహించారు. తప్పొప్పులు సమీక్షించుకున్నారు..తాను మారతానన్నారు. నిజంగా మారారా? మారితే ఆ జాడేది? మారిన ఫలితం ఏది?31. ఒక రాజకీయ పార్టీ అన్నాక దానికి ఓ పొలిట్ బ్యూరోనో, రాజకీయ వ్యవహారాల కమిటీ లాంటివో ఉంటాయి. టిఆర్‌ఎస్‌కు అలాంటివి ఏవీ లేవు. అన్నీ ఆయనే... ఆయన కుటుంబ సభ్యులే... 32. బిసి ముసాయిదా ప్రకటిస్తానన్నారు.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదే...33. చంద్రబాబును అడ్డగోలుగా తిట్టిన కెసిఆర్, వైఎస్‌ఆర్‌ను ఓడించటం కోసం తెలుగుదేశంతో జత కట్టారు. దీని వల్ల తెలంగాణలో వ్యతిరేకత మూట కట్టుకోలేదా?34. టిక్కెట్ల పంపిణీ సమయంలో అజ్ఞాత ప్రదేశాల్లో ఉండటం, అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించటం, సీనియర్లకు కూడా అందకుండా మంత్రాంగం నడపడం ఒక రాజకీయ పార్టీకి, నాయకత్వానికి సబబైన విషయమేనా?35. 2004లో టిడిపి మంత్రులను ఓడిస్తామని చెప్పి వారి స్థానాల్లో టికెట్లు తీసుకున్న కెసిఆర్.. ఈసారి తనపై తిరుగుబాటు చేసి, తాను ద్రోహులుగా ముద్ర వేసిన రెబల్‌స విషయంలో ఆ సూత్రాన్ని ఎందుకు పాటించలేకపోయారు?36. సంగారెడ్డిలో కెసిఆర్ తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసిన జగ్గారెడ్డి గెలిచారు.. కెసిఆర్ నిలబెట్టిన అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.. ఇది దేనికి సంకేతం?37. సిరిసిల్లలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ రెండువందల లోపు ఓట్ల మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచారు. దీన్ని ఒక గెలుపుగానే భావిస్తారా?38. దక్షిణ తెలంగాణాలో అసెంబ్లీ సీట్లకు బోణీయే చేయలేదు. దీనికి ఏమని జవాబు చెప్తారు?39. 13 చోట్ల టిఆర్‌ఎస్ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది. కెసిఆర్ ఇమేజి పడిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?40. టిడిపి కేడర్ టిఆర్‌ఎస్‌కు పనిచేయలేదని అందువల్లే ఆ పార్టీ ఓట్లు తమకు బదిలీ కాకపోవటం వల్లనే టిఆర్‌ఎస్ పరాజయం పాలయిందంటున్నారు. దీనికి ఆధారాల్లేవు. టిడిపి ఓట్లు బదిలీ కాకపోతే, మహబూబ్ నగర్‌లో కెసిఆర్ ఎలా గెలిచారు?41. టిఆర్‌ఎస్‌పై బరిలో నిలిచిన ఇద్దరు టిడిపి అభ్యర్థులు, ఒక టిడిపి రెబల్ గెలవటానికి ఎవరు కారణం?42. కెసిఆర్‌కు తన కేడర్‌పైనే నమ్మకం లేదు... ఏ ఒక్క దశలోనూ కేడర్‌ను విశ్వాసంలోకి తీసుకోలేదు. నాయకులనే నమ్మని వారు కేడర్‌ను ఏం నము్మతారు?43. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నగదు బదిలీ, కలర్ టివిల గురించి అదే పనిగా ప్రచారం చేసిన కెసిఆర్, తన అసలైన అజెండా అయిన తెలంగాణాను ఉద్దేశ పూర్వకంగా మరవలేదా?44. టిఆర్‌ఎస్ సభలకు అయిదారు గంటల పాటు ప్రజలను కట్టిపడేలా చేసిన తెలంగాణ ధూంధాంను, రసమయి బాలకృష్ణ లాంటి వాళ్లను దూరం చేసుకోవటం కేసిఆర్ చేసిన చారిత్రక తప్పిదం.45. తెలంగాణాకు కట్టుబడి పార్టీ పెట్టుకున్న దేవేందర్‌గౌడ్‌ను, తెలంగాణ ఇస్తానన్న బిజెపిని పూర్తిగా పక్కన పెట్టి వాస్తవంగా తెలంగాణ అనుకూల ఓటును దూరం చేసుకున్నది కెసిఆర్.46.2009 ఎన్నికలు తెలంగాణకు అంతిమ యుద్ధం అని ప్రకటించింది కెసిఆర్. ఇప్పుడు ఓడిపోయింది కెసిఆర్.. ఇప్పుడేమంటారు?47. ముందు నుంచి సమైక్యవాదాన్ని మోస్తున్న సిపిఎంతో పొత్తు పెట్టుకోవటం ద్వారా టిఆర్‌ఎస్ మౌలిక డిమాండ్‌కు తూట్లు పొడిచింది కెసిఆర్ కాదా?48. ఎన్నికల ఫలితాలు రాకముందే అద్వానీ ప్రధానమంత్రి అయిపోతారని గుడ్డిగా నమ్మి, టిఆర్‌ఎస్‌ను తీసుకుపోయి ఎన్‌డిఎలో కలపటం సొంత ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం కాదా?49. తెలంగాణ ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని ఇప్పుడు ఎలా పునరుద్ధరిస్తారు?50. పార్టీ నాయకత్వాన్ని మారుస్తారా? నాయకుడుగా కెసిఆర్ మారుతారా?కెసిఆర్ గారూ... డిసైడ్ యువర్ సెల్‌ఫ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
కష్టపడి రాశారు. బాగుంది. పేరాగ్రాఫులుగా విడదీస్తే ఎక్కువమంది ఆసక్తిగా చదువుతారు.
Nice analysis. If you assess the ground situation honestly, it looks like the Telangana issue is dead.
As long as ముసల్మాన్లు (15-20% of the population??), కిరస్తానీలు (10-15% of the population?? include recently converted upper castes, etc.) don't support Telangana, it is difficult to achieve the objective.
anna very nice...
కామెంట్‌ను పోస్ట్ చేయండి