3, ఫిబ్రవరి 2010, బుధవారం

అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2 nu జరుపుకోవాలి

ఇష్టమైంది తొలగిపోయింది.. అయిష్టమైంది మిగిలిపోయింది. ప్రేమ దూరమైంది... కన్నపేగు తెగిపోయింది. ఆ కన్న గుండె ఎలా తట్టుకుంటుంది... వైసూ.. వైసూ అని ౭౨ గంటల పాటు పలవరించిన ఆ గుండె... తన పిలుపుకు ఇక జవాబు రాదని తెలిసి అలసిపోయి ఆగిపోయింది..
మూడు రోజుల క్రితం వరకు ఆ ఇల్లు పూదోట.. ఆనందం తప్ప అలజడే తెలియని భవనం అది.. భార్యాభర్త.. ముగ్గురు పిల్లలు.. కావలసినంత ఆస్తి.. అంతు లేని ఆప్యాయతలు.. తమకు అసలు కోరతే లేదనుకున్నారు.. రాదనుకున్నారు.. సంతోషం తప్ప మరేదీ ఉండదని తలచారు..
ఇప్పుడు అంతా కొరతే... కొరతే...

అనుకోకుండా వచ్చిన సునామీలో అంతా కొట్టుకుపోయింది... కలల సౌధం కుప్పకూలిపోయింది. శాంతియుత వాతావరణం భగ్నమైంది.. నిన్నటి దాకా అన్నీ ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా అనాథగా మారింది... ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదు.. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా నివ్వెర పోవటం కూడా కష్టమే అయింది... ఏమిటీ దారుణం? ఎందుకింత కష్టం? ప్రతి మాటలో, ప్రతి చర్చలో, ప్రతి ఆలోచనలో ప్రకంపన సృష్టించిన ఘటన...దీనికి మరపు లేదు.. అది సాధ్యం కాదు..

వైసూ... వైసూ.. ఆయన గుండెంతా ఇదే చప్పుడు... తొమ్మిదేళ్ల పాటు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నప్రేమ... పుట్టినప్పటి నుంచి తన చిన్నారి పాపను పొత్తిళ్లలో దాచుకుని కాపాడుకున్న తండ్రి ప్రభాకర్.. చివరి నిమిషం వరకూ భద్రంగానే తిరిగి వస్తుందని అనుకున్నాడు... డబ్బుల కోసమే తన పాపను దుండగులు ఎత్తుకెళ్లారని.. పోలీసుల హడావుడి కాస్త తగ్గిన తరువాత డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చేసి తన పాపను తాను తెచ్చుకుంటాననే ధీమాతోనే ఉన్నాడు... కానీ, దుండగులు డబ్బుల కోసం కాకుండా ఉసురు తీసేందుకే తన పాపను ఎత్తుకెళ్లారని ఊహించలేకపోయాడు.. మూడు రోజుల తరువాత తన చిన్నారిని నిప్పుల కొలిమిలో బూడిద చేయటం అంతటి తండ్రినీ ఒక్కసారిగా దిగ్భ్రమకు గురిచేసింది.. ఏ దశలోనూ అలా జరుగుతుందని ఊహించనైనా ఊహించని తండ్రి ఒక షాక్కు గురవటం దురదృష్టం.. అదే షాక్లో ఆయన హృదయం చలించటం మానేసింది..

ఆ తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమ అంత గొప్పది.. వైష్ణవి చనిపోయినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.. కానీ, కూతురి కోసం తండ్రి విగత జీవుడవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు..
మనం ప్రపంచంలో ఎన్నో జీవితాలను చూస్తున్నాం.. ఎన్నో వార్తల్ని కంటున్నాం.. కానీ, ఇలాంటి ఘటన అనూహ్యం... అందుకే ఈ తండ్రీ కూతుళ్ల ప్రేమకు శాశ్వతత్వం కల్పించాలని ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారు... అంతర్జాతీయంగా ఎన్నో రోజుల్ని ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాం.. మదర్స్డే.. ఫాదర్స్ డేలు అందులో కొన్ని... ఇవి ఎందుకోసం జరుపుకుంటారో మనలోనే చాలా మందికి తెలియదు.. ఇదిగో ఫిబ్రవరి ౨ ప్రభాకర్ తన పాప కోసం ప్రాణం విడిచిన రోజును ఫాదర్స్డేగా ఎందుకు జరుపుకోకూడదు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఇదే..
ఇది నిజం.. తండ్రి ప్రేమకు అసలైన నిర్వచనం వెల్లడైన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం.. కూతురిపై ఆప్యాయత ప్రతిఫలించిన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం... కూతురంటే గుండెలపై కుంపటి కాదు... ఆనందాల సందడి అని రుజువైన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కన్న కూతురికోసం తండ్రి హృదయం తల్లడిల్లిన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కూతురి ప్రాణం తన ప్రాణంగా తండ్రి గుండె ఆగిపోయిన రోజు ఫిబ్రవరి 2...
అందుకే ఆ తండ్రీ తనయల ప్రేమను అజరామరం చేయాలి..అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2ను జరుపుకోవాలి...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి