15, ఫిబ్రవరి 2010, సోమవారం

డయ్యర్‌ వారసులు...


రక్తతర్పణం జరిగింది.. విద్యార్థులతో పాటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా ప్రతినిధుల రక్తమూ ఏరులై పారింది... ఆ రుధిర ధారల్లో భద్రతాబలగాల బూట్లు తడిసి సంబరపడ్డాయి. పోలీసులు పదఘట్టనల హోరులో విలేఖరులు, విద్యార్థుల రోదనలు రోదసిలో కలిసిపోయాయి.. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు?

ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో అగ్గి రాజేసింది ఎవరు?
ఓయులో రక్త చరిత్రను రచించిందెవరు?
కెమెరా కళ్లకు గంతలు కట్టే సాహసం చేసిందెవరు?
మీడియా ప్రాథమిక హక్కులను కాలరాసిందెవరు?
ఓయు నిషేధిత ప్రాంతమా?
మనం ఏ సమాజంలో ఉన్నాం...?
ఏమిటీ దారుణం?

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది.. ఈ చెదలు ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు.. ప్రశాంతంగా ఎదుగుతున్న విద్యాఫలాలను పూర్తిగా నాశనం చేసేంత వరకు ఈ చీడ విరగడ అయ్యేట్టు కనిపించటం లేదు.. ఇంతకాలం విద్యార్థులనే పీడించిన ఈ పీడ.. ఇప్పుడు మీడియాకూ పాకింది... విచ్చలవిడిగా తాము సాగించే పాశవికత్వానికి సాక్షీభూతంగా నిలిచిన మీడియాను తొలగించటానికి మూకుమ్మడిగా విరుచుకుపడ్డ తీరు గతంలో బ్రిటిష్‌ పోలీసులకు కూడా తెలిసి ఉండదు.. జలియన్‌ వాలాబాగ్‌లో ప్రజల్ని ఊచకోత కోసిన జనరల్‌ డయ్యర్‌కు కూడా ఈపాటి తెలివి తేటలు ఉండకపోవచ్చు..

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతున్న సందర్భంలోనైనా దానికి సంబంధించిన వార్తల్ని కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతిస్తారు.. కార్గిల్‌ లోనైనా, ఆఫ్గనిస్తాన్‌లోనైనా, ఇరాక్‌లోనైనా, ప్రపంచానికి ఆ యుద్ధాల వార్తలని ప్రపంచానికి అందజేసింది మీడియానే... ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిలా వ్యవహరించేది మీడియా... అలాంటి మీడియా కాళ్లూ చేతులూ కట్టేసి కూర్చోబెట్టడం సాధ్యమేనా?
ఉస్మానియాను ప్రభుత్వం నిషేధ ప్రాంతంగా ప్రకటించలేదు.. ఉస్మానియా ఓ విశ్వవిద్యాలయం... రెండు నెలలుగా ఓయు కేంద్రంగా విద్యార్థులు తెలంగాణా రాష్ట్రం కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు... వాటిని కవర్‌ చేయటం, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రసారం చేయటం మీడియా విధి.. వార్తలను సేకరించటం, ప్రసారం చేయటం మీడియా ప్రాథమిక హక్కు... దీన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు..కానీ ఈ హక్కుపై ఇవాళ పోలీసు ఉక్కుపాదం పడింది...

ఎందుకు మీడియాను పోలీసులు టార్గెట్‌ చేసుకోవలసి వచ్చింది..? కేవలం శాంతిభద్రతలను పరిరక్షించటం కోసమే పోలీసులు బాధ్యతాయుతంగా పని చేస్తుంటే...మీడియా కవరేజి వల్ల జరిగే నష్టం ఏమిటి? అంటే, మరింకేదో చేసేందుకు పోలీసులు పూనుకున్నారు కాబట్టే... మీడియాను అక్కడి నుంచి తప్పించేందుకు పూనుకున్నారు.. వాళ్లపై లాఠీలు ఝళిపించటమే ప్రత్యామ్నాయంగా కనిపించింది... ఇంకేం.. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు.. పది మందిపై వందల మంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.. కనపడ్డవారిని కనపడ్డట్టుగా చితకబాదారు..
అంతా అయ్యాక తీరిగ్గా.. అయ్యో దురదృష్టం.. సారీ... తప్పయింది.. చూసుకోలేదు.. కావాలని కొట్టలేదు.. అంటూ మాటలు చెప్పుకొచ్చారు.. ఓ పక్క సారీలు చెప్తూనే.. మరోపక్క చితక్కొట్టారు.. ఈ పరిణామం.... ఓ అరాచక వ్యవస్థను...నియంతల పరిపాలనను తలపించింది...రెండో ప్రపంచయుద్ధ కాలంలో మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, తాను కోరుకున్న వార్తలు మాత్రమే ప్రచురితమయ్యేలా చేసుకున్న హిట్లర్‌ వ్యవస్థలో ఉన్నామా మనం?

ఉస్మానియాలో ఈ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది నిర్ద్వంద్వం.. లాఠీచార్జీకి విద్యార్థులే బాధ్యులని ఇవాళ తీరిగ్గా కథలు చెప్పటం సర్కారు వారికి వెన్నెతో పెట్టిన విద్యే... వాస్తవానికి విద్యార్థులు రెండు నెలలుగా అక్కడ నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు.. దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు.. క్యాంపస్‌లో ఇటు సీఫెల్‌ వరకు, అటు తెలుగు విశ్వవిద్యాలయం హాస్టల్‌ వరకు ప్రదర్శనలు చేస్తారు.. నినాదాలు చేస్తారు.. ఈలోగా అక్కడ విధ్వంసం చేసేందుకు ఏమీ లేవు.. ధ్వంసం చేసుకుంటే వారి కాలేజీలను వారే ధ్వంసం చేసుకోవాలి.. వారి పుస్తకాలను వారే తగులబెట్టుకోవాలి.. అలా జరిగే అవకాశం ఎలాగూ లేదు.. అలాంటప్పుడు క్యాంపస్‌లోకి వెళ్లి అక్కడ టెంట్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది...? క్యాంపస్‌ దాటి బయటకు వస్తే వారిని అడ్డుకోవచ్చు... అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే క్యాంపస్‌లోపల క్యాంప్‌ పెట్టారా?
విద్యార్థులే కవ్వించారని పోలీసులు అంటున్నారు.. రెండు నెలలుగా లేని కవ్వింపు.. నిన్నటి ప్రదర్శనలోనే ఉన్నట్టుండి చోటుచేసుకుందా? ఒక వేళ విద్యార్థులు కవ్విస్తే.. ఇంత పైశాచికంగా కొడ్తారా? అది కవర్‌ చేసిన పాపానికి మీడియాపై దురాగతానికి పాల్పడతారా? ఈ ఘటనతో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలు చాలా చక్కని నిర్వచనం ఇచ్చాయి...ఇలాంటి పోలీసులను మనం రక్షక భటులని పిలుస్తున్నాం.. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?
జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలతో దద్దరిల్లిపోయే ప్రాంతాన్ని పిఓకే.. పాక్‌ ఆక్యుపైడ్‌ కాశ్మీర్‌ అని పిలుస్తారు.. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి ప్రాంతంగా పిఓయు తయారైంది.. అంటే పోలీస్‌ ఆక్యుపైడ్‌ ఉస్మానియా...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి