10, ఫిబ్రవరి 2010, బుధవారం

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు !

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు దాదాపుగా ఖరారయ్యాయి. కోల్‌కతాలో నక్సల్‌ సమస్యపై జరుగుతున్న సమావేశంలో ఉన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం ఢిల్లీ తిరిగి వచ్చిన తరువాత ఈ సాయంత్రం కమిటీ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది నెలల నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల డిమాండ్లను సమన్వయ పరుస్తూ ఈ విధి విధానాలను కేంద్ర హోం శాఖ ఆచితూచి రూపొందించింది...

రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుదిరూపునిచ్చింది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీల ఆమోద ముద్ర పడిన వెంటనే వీటిని కేంద్ర హోం మంత్రి ప్రకటిస్తారు... కమిటీ ఏ విధంగా పనిచేయాలి.. ఏయే అంశాలపై దృష్టి సారించాలన్న విషయంపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా కసరత్తు చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణ, కమిటీ కార్యదర్శి వికె దుగ్గల్‌లతో పూర్తి స్థాయి సంప్రతింపులు జరిపిన తరువాత ఈ మార్గదర్శకాలు ఖరారయినట్లు తెలుస్తోంది..
౧. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీకృష్ట కమిటీ కాలపరిమితి ఎనిమిది నెలలుగా విధించే అవకాశం ఉంది. అవసరమైతే మరో నాలుగు నెలలు ఈ కాలపరిమితిని పొడిగించవచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్పాయి...౨. రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారాన్ని చూపడం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రధాన బాధ్యత.
౩. కమిటీ మార్గదర్శకాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాంతానికీ మొగ్గు చూపకుండా జాగ్రత్త పడ్డారు..
౪. అదే సమయంలో ఉద్యమాలకు ప్రధాన కారణమైన తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు..
౫. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రమే ప్రాతిపదిక కాదు..
తెలంగాణ వెనుకబాటు తనం.. అందుకు గల కారణాలను కమిటీ పూర్తిగా పరిశీలిస్తుంది. ఇందుకోసం పలు అంశాల అజెండాను రూపొందించారు..
౬. జస్టిస్‌ ఫజల్‌ అలీ నేతృత్వంలో మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిటీలో తెలంగాణ గురించి ప్రస్తావించిన చారిత్రక, సామాజిక, అభివృద్ధి అంశాలను ప్రస్తుత కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.
౭. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు... అవసరాన్ని బట్టి మరింత లోతుల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించటమే లక్ష్యంగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తుంది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రాలుగా పనిచేస్తుంది. ప్రభుత్వం లాంఛనంగా నోటిఫికేషన్‌ జారీ చేసిన వారం రోజుల్లోగా మొదటి సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలు, ప్రజలతో విస్తృతంగా చర్చలు జరుపుతుంది..
అన్నింటికంటే కీలకం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కావచ్చు... కానీ, దీని మార్గదర్శకాలు భవిష్యత్తులో వెల్లువెత్తే చిన్న రాష్ట్రాల డిమాండ్ల ను సమర్థంగా ఎదుర్కునేందుకు బ్లూప్రింట్‌ గా ఉండేట్లు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది..

కామెంట్‌లు లేవు: