2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆరోప్రాణం



ఒక పసి మొగ్గను విరిసీ విరియకుండానే చిదిమేశారు.. తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మొగ్గ తన కళ్ల ముందే రాలిపోతే చెట్టు తట్టుకోలేకపోయింది... ఒక్కసారిగా కూకటివేళ్లతో సహా కుప్ప కూలిపోయింది... ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకున్న కొమ్మలూ, రెమ్మలూ ఏం కావాలి? దానిపై గూడు కట్టుకున్న పక్షులు ఎక్కడ తలదాచుకోవాలి..
తప్పు చేసిందెవరు?
శిక్ష అనుభవిస్తున్నదెవరు?
ఆ తండ్రీ కూతుళ్లు ఎవరికి అపకారం చేశారు..?
చిట్టితల్లిని వేల డిగ్రీల కొలిమిలో వేసి బూడిద చేసేంత కసాయిలు ఎవరు?
ఎందుకిలా జరిగింది?

ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు.. రాష్ట్ర మంతటా ఒకటే ఆలోచన.. ఒకే ఆవేదన.. ఈ కాలంలో కూడా ఇలాంటి దారుణాలు ఉంటాయా? అనే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. ఎన్నో కిడ్నాపు వార్తలు కన్నాం.. విన్నాం...హత్యలూ చూశాం... కానీ, విజయవాడలో పెను విషాదంగా ముగిసిపోయిన కిడ్నాపు ఉదంతం ఏ ఒక్కరికి మింగుడు పడటం లేదు..
బెజవాడలో పసిపిల్ల నాగవైష్ణవిని కిడ్నాప్‌ చేసినప్పుడు అంతా ఇదొక వార్త అనుకున్నారు..
టెలివిజన్లలో ఆమె చిత్రాన్ని చూసినప్పుడు అంత చక్కని అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు..
౪౮ గంటల తరువాత కూడా ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త విని చలించిపోయారు..
అయ్యో పాపం అని బాధపడ్డారు.. ఆగ్రహించారు..దుర్మార్గులు దొరికితే తామే చంపేస్తామన్నారు...
తెల్లవారేసరికి తన బిడ్డ ప్రాణం తన ప్రాణంగా చేసుకున్న ఆ తండ్రి చనిపోవటం ప్రజల్ని ఒక కుదుపు కుదిపింది...
ఒక్కసారిగా ఊపిరి స్తంభించిపోయింది..
ప్రతి శరీరం ఉన్న పాటున ఉలికిపాటుకు గురైంది...
ప్రతి ప్రాణం కలవర పడింది...
ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు..
కూతురును పదకొండేళ్ల పాటు ఎంతో అపురూపంగా పెంచుకున్న తండ్రి ప్రేమ..
చిట్టితల్లిని కిడ్నాప్‌ చేసిన క్షణం నుంచి ఆమెకోసం అహరహం పరితపించిన నాన్న మనసు...
మీరేం అడిగినా ఇస్తా... మీ పైన కేసులూ పెట్టను.. నా పాపను నాకివ్వండి.. ఎక్కడో ఓ చోట వదిలిపెట్టండి.. నేను తెచ్చుకుంటానని ప్రాధేయపడ్డ హృదయం...
ఆమె లేదని తెలిసి.. అతి కిరాతకంగా బూది చేసారని విని భళ్లున పగిలిపోయింది. శ్వాస ఆగిపోయింది. కూతురితోపాటే తానూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. ఒకే ఊపిరిగా, ఒకే ప్రాణంగా.....

‘‘నేను తండ్రిని.. ఓ కూతురికి తండ్రిని.. తల్లే కాదు.. తండ్రి కూడా బిడ్డల కోసం ప్రాణాలిస్తాడు.. నా వైష్ణవిని కూతురిలా కాదు.. పూవులా పదిలంగా పెంచుకున్నాను..గుండెల్లో దాచుకున్నాను.. ఆడపిల్ల తండ్రి గుండెలపై కుంపటి కాదు.. కలల పంట.. ఆశల మూట.. ఆనందాల పూదోట అని ప్రతి తండ్రికీ చెప్పాలనుకున్నాను.. చెప్పకుండానే వెళ్లిపోతున్నాను.. ’’ అని అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఆ కూతురిపై ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది.. కూతురిపై ఇంతగా ప్రేమను పంచుకుని.. ఆమెను ప్రాణంగా పదిలపరుచుకున్న తండ్రి ప్రభాకర్‌... ఆమెతో పాటే వెళ్లిపోవటం ప్రజలందరిలో ఒక ఉద్వేగానికి కారణమైంది. ఇప్పుడు ఆ కుటుంబం వ్యథ తీర్చేదెవరు? ఒకే సారి భర్త, కూతురును పోగొట్టుకున్న ఆ ఇల్లాలి వేదన చల్లారేది ఎలా?
ఇవాళ తన బంధువుల్ని హటాత్తుగా కోల్పోయిన కుటుంబం ఈ రాష్ట్రం.. శోకతప్త హృదయంతో తల్లడిల్లిపోతోంది.. ఈ ఘోరాన్ని చూడలేక.. విషాదాన్ని దిగమింగుకోలేక మౌనంగా రోదిస్తోంది..



2 కామెంట్‌లు:

పదనిసలు చెప్పారు...

:(.. Very Unfortunate.. My heartly condolenses to the family of Vaishnavi. May souls of Vaishnavi and Mr. Prabhakar rest in peace.

Your article is well written.. Keep it up.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఇది మన రక్షక వ్యవస్థ వైఫల్యమే. సిగ్గులేని హోం మంత్రి వారిని వెనకేసుకొస్తోంది. మీడియావాళ్ళు చెప్తేనే వారిని అరెస్టు చేసారంటే ముందుగా వీళ్ళకు తెలిసే వుంటుంది. వీళ్ళ మాజీ బాసు చేయికూడా వుందని రాత్రి వార్తల్లో చెప్తున్నారు. అమ్ముడుపోయారన్నది అర్థమవుతోంది. ఏమైనా ఒక చిన్నారి ప్రాణం అత్యంత కౄరంగా హరించారు. ఒక తండ్రి నిండుప్రాణాన్ని తీసారు.