27, ఫిబ్రవరి 2010, శనివారం

నేను రాను బిడ్డో సర్కారి దవాఖానకు...

ప్రభుత్వాసుపత్రుల్లో విచిత్రాలు.. విషాదాలు చోటు చేసుకోకపోతే ఆశ్చర్యపోవాలి కానీ... లేకపోతే ఎందుకు?.. ఒకటి కాదు..రెండు కాదు.. వరుసగా... ఒకదాని వెంట ఒకటిగా ఘటనలు జరుగుతున్నా... సర్కారు నోట ఒకే మాట... విచారణ జరిపిస్తాం... ఇంతే తప్ప చర్యల దగ్గరకు వచ్చేసరికి వాటి గురించి ఆలోచించే తీరిక అమాత్యులకు కానీ, అధికారులకు కానీ ఇసుమంతైనా ఉండదు.. ఫలితం ఇవాళ విశాఖ కెజిహెచ్‌లో జరిగిన ఘటన... ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన పసిగుడ్డు కుక్క పాలైంది...

విశాఖ పట్నం కింగ్‌ జార్జి హాస్పిటల్‌... అబ్బో.. దీనికున్న పేరు ప్రతిష్ఠలు అన్నీ ఇన్నీ కావు.. వైద్యంలో ఎంత పేరుందో.. నిర్లక్ష్యంలోనూ అంతే పేరు ఉంది... ఇక్కడి వైద్య అధికారులకు, సిబ్బందికి పేరుకు మాత్రమే ఉద్యోగం... బాధ్యతలంటే వీరికి ఎంతమాత్రం సరిపడవు.. నిన్న రాత్రి అనురాధ అనే ఓ మహిళ కెజిహెచ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది... ఆ పసికందుకు మొదట స్నానం చేయించాలంటే అయిదు వందల రూపాయలు కావాలంటూ సిబ్బంది తెగేసి చెప్పారు.. అందుకు అనూరాధ కుటుంబ సభ్యులు కాదనటంతో పసికందును అలాగే వదిలేసి వెళ్లారు..తెల్లవారేదాకా కూడా పుట్టింది మగబిడ్డో.. ఆడబిడ్డో కూడా చెప్పలేదు.. బంధువులకు అప్పజెప్పలేదు.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క... కళై్లనా తెరవని శిశువును నోట కరచుకుని పరిగెత్తుకుని వెళ్లి పీక్కు తింది...
ఇంత దారుణం జరిగిన తరువాత పుట్టింది మృత శిశువంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్లేటు మార్చారు.. రికార్డులూ మార్చేస్తున్నారు...

చివరకు మీడియాలో వార్తలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర రాజధానిలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి రొటీన్‌గా చెప్పే డైలాగే అదే నండీ విచారణ జరిపిస్తామని చెప్పేశారు..
ఒక ఘటన జరగ్గానే సంబంధిత శాఖ మంత్రులు ఎలా స్పందించాలో అలాగే స్పందించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు.. విశాఖ కెజిహెచ్‌లో ఓ పసికందు.. వీధి కుక్కకు పలహారంగా మారితే మంత్రి యథాలాపంగానే విచారణ జరిపిస్తామన్నారు.. మన ప్రభుత్వాసుపత్రుల పట్ల మంత్రికి ఉన్న అపారమైన శ్రద్ధకు జోహారు అర్పించకుండా ఎలా ఉండగలం?
ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్న ఆ బాధితుల శోకాన్ని తీర్చేదెవరు? అవి ఆసుపత్రులా?
కుక్కలు, పందులు సై్వరవిహారం చేసే చెత్తకుప్పలా?
సామాన్యులు కుక్కల కంటే హీనంగా కనిపిస్తున్నారా?
నిర్వహణకు మరోపేరు నిర్లక్ష్యమేనా?
ఆపరేషన్‌ థియేటర్‌లోకి కుక్క ఎలా ప్రవేశించింది?
రికార్డులు తారుమారు చేస్తున్నదెవరు?
ఇలాంటి దారుణాలకు జవాబుదారీ ఎవరు?
సర్కారీ వైద్యం ఎప్పుడు కళు్ల తెరుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరు జవాబు చెప్పాలి...
2.
ఒకటా రెండా? ఎన్నని చెప్పేది సర్కారీ ఆసుపత్రుల్లో విషాదాలు.. వివాదాల గురించి...
శిశు మరణాలు ఇవాళ ఈ దవాఖానల్లో కొత్తగా జరుగుతున్నవేం కాదు.. ఇవాళే వింటున్న వార్తలంతకంటే కాదు.. ఇంతకు ముందు ఇంతకంటే దారుణాలే చోటు చేసుకున్నాయి... మన పాలకుల్లో పట్టించుకునే వాళు్ల ఎవరైనా ఉంటేనే కదా.. సమస్యలు పరిష్కారమయ్యేది....

ఇప్పుడు తాజాగా విశాఖ కెజిహెచ్‌లో శిశువు కుక్కల పాలు కావటానికి కారణం ఏమిటి?... ఆసుపత్రికి ప్రసూతికోసం వచ్చిన ఆ తల్లి అంతులేని గర్భశోకానికి బాధ్యులెవరు?... ఎనిమిది నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో ఇలాగే ఓ పసికందును ఎవరో ఎత్తుకుపోతే ఇప్పటి వరకు ఆ పసివాడి జాడ ఏమైందో ఇవాల్టి వరకూ తెలియదు.. అంతలోనే మరో ఘటన...
అంతకు ముందు కర్నూలులో ఓ పసివాణ్ణి పంది ఎత్తుకుపోయింది..
అవి సర్కారు ఆసుపత్రులు కావు..? పెంటకుప్పలే.. కుక్కలు.. పందులు యథేచ్చగా ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌ వరకూ రావటం ఎక్కడి విచిత్రం... వైద్యం చేయించుకుంటున్న రోగుల దగ్గరకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్‌‌స్ట రాకుండా ఉండేందుకు బంధువులను సైతం రానివ్వరే... అలాంటిది ఇంత హీనాతిహీనంగా జంతువులు తిరగుతుంటే.. వాటిని ఆసుపత్రులని ఎలా పిలవాలి?

జిల్లాల్లోనే కాదు.. ఏకంగా రాష్ట్ర రాజధానిలోనే ఇలా జరిగిన ఘటనలో కొల్లలు... ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ ఇందుకు కేంద్రాలు... మూసీ కాలువలో శిశువుల మృతదేహాలు దొరికితే అడిగే దిక్కు లేదు.. చర్యలు తీసుకున్న నాథుడు లేడు... ఎప్పటిలాగే ఇవాళా ఓ శిశువు పుట్టడమే మృత్యుముఖంలో పుట్టింది.. పుట్టి మరణించింది.. అధికారులకు ఆ శిశువును గురించిన చింత ఎంతమాత్రం లేదు.. ఎందుకంటే ఆ శిశువు ఓ పేదరాలి కడుపున జన్మించింది కాబట్టి....
3.
ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వాసుపత్రులకు తేడా ఎక్కడ వస్తోంది? నిర్లక్ష్యమేనా అది? ఆసుపత్రుల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని అయోమయం రాజ్యమేలుతోంది...అప్పుడే పుట్టిన శిశువుల్ని జంతువులు మాంసం ముద్ద అని లాక్కెళ్తాయి... దోపిడీ దొంగలు డాక్టర్ల వేషం వేసుకుని వచ్చి రోగుల్ని నిలువు దోపిడీ చేస్తారు....
ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. అక్కడ వైద్యం జరుగుతుందో... దోపిడీ జరుగుతుందో తెలియని పరిస్థితి... తాము వెళు్తన్నది ఆసుపత్రులకా? మరో చోటికా తెలియదు... సర్కారీ దవాఖానాలను ఇవాళ నిర్లక్ష్యపు రోగం చుట్టుకుంది.. ఏ మందు వేసినా అది నయం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు..
రాష్ట్ర రాజధానిలోనే... అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు ఆసుపత్రుల్లోనే దొంగలు డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.. అందినకాడికి అందినంత రాచ మార్గం లోనే దోచుకు పోతున్నారు..
మెదక్‌ జిల్లాకు చెందిన వాణిశ్రీ జబ్బు పడి గాంధీ ఆసుపత్రికి వచ్చింది. వారం రోజుల పాటు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స చేయించుకుంటోంది.. ఇంతవరకు బాగానే ఉంది.. ఓ రోజు ఉదయం హటాత్తుగా ఓ డాక్టర్‌ వచ్చి ఇంజక్షన్‌ ఇవ్వాలి పక్కగదిలోకి రమ్మన్నాడు... వాణిశ్రీ, ఆమె తల్లి ఇద్దరూ డాక్టర్‌ గదిలోకి వెళ్లారు.. సదరు డాక్టర్‌ ఆ తల్లికి ఓ చీటీపై మందులు రాసిచ్చి తీసుకురమ్మన్నాడు.. ఆమె అలా వెళ్లిందో లేదో... వాణిశ్రీకి డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇచ్చాడు.. ఆమె మత్తులోకి జారిపోయింది.. ఆమె తిరిగి లేచేసరికి మూడున్నర తులాల గొలుసు మాయమైపోయింది. చీటీలో ఉన్న మందు తీసుకురావటానికి వెళ్లిన బాధితురాలి తల్లికి అలాంటి మందే లేదంటూ షాపు వాళు్ల చెప్పటం మరో విచిత్రం...
ఇంత జరిగాకైనా సర్కారు నిద్ర లేచిందా అంటే అబ్బే అలాంటి అలవాటు డిక్ష్నరీలోనే లేదు.. వారం తిరక్కుండానే నీలోఫర్‌లో అదే దొంగ మరో దొంగతనం చేశాడు...
రోగులకు పూర్తి భద్రతను కలిపిస్తామని సర్కారు వారు కబుర్లు చెప్పటంలో, ఉపన్యాసాలు దంచేయటంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు.. అసలు సంగతి దగ్గరకు వచ్చేసరికే, వారికి ఏం చేయాలో కూడా తోచదు.. విచిత్రమేమంటే నీలోఫర్‌ ఆసుపత్రికి కట్టుదిట్టమైన భద్రతే ఉంటుంది.. అయినా దొంగ తన పని తాను కానిచ్చేసుకుని వెళ్తాడు...
ఇక సర్కారీ ఆసుపత్రుల్లో ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఎవరైనా వెళ్లేందుకు ఎలా సాహసించగలరు?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి