3, నవంబర్ 2009, మంగళవారం

ప్రమాదంలో సాగర్‌


ప్రఖ్యాత నాగార్జున సాగర్‌కు ఉగ్రవాదుల ముప్పు మాటేమిటో కానీ, మన రాజకీయ నాయకులు, పాలకుల నుంచి మాత్రం పెను ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వరద కృష్ణ తాకిడికి అల్లాడిపోయిన నాగార్జున సాగర్‌ డ్యామ్‌ రానున్న రోజుల్లో పెద్ద ముప్పును ఎదుర్కోనుంది... వరద తాకిడికి సాగర్‌ స్పిల్‌వే భారీగా నష్టపోయింది. కానీ, ప్రభుత్వానికి మాత్రం దీని తీవ్రత అర్థం కావటం లేదు.. డ్యాం నిర్వహణ సరిగా లేక ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది...

కృష్ణా వరదలు మన రాష్ట్రంలో రిజర్వాయర్లకు పెద్ద పరీక్షనే పెట్టాయి. నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఆసియాలో అతిపెద్ద ఎర్‌‌తడ్యాం, బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌ అస్తిత్వం ప్రమాదంలో పడింది... వరదల తరువాత సాగర్‌ వద్ద వాస్తవ పరిస్థితిని ఓ నిజనిర్థారణ కమిటీ అంచనా వేసినప్పుడు అనేక అంశాలు వెలుగు చూశాయి..
మొన్నటి వరదల్లో 25 లక్షల క్యూసెక్కులు ఒకే సారి విజృంభించి వచ్చిన నేపథ్యంలో సాగర్‌ డ్యాంకు కీలకమైన స్పిల్‌వే ముపై్ఫ శాతం పైగా దెబ్బ తిన్నది. ఇది ఇంతకు ముందే దెబ్బ తిని ఉంది... దీని మరమ్మతుల కోసం ప్రపంచ బ్యాంకు 400 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ, మరమ్మతులు మాత్రం పూర్తిగా జరగలేదు. ఫలితం మొన్నటి వరదలకు మరింత దారుణంగా స్పిల్‌వే చెడిపోయింది. ఫలితంగా భవిష్యత్తులో మొన్నటి వరదల్లో సగం నీళు్ల ముంచుకువచ్చినా డ్యాం పని అయిపోయినట్లే.....
స్పిల్‌వే సమస్య ఇలా ఉంటే, ప్రాజెక్టు గేట్లనయినా సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు.. నాగార్జున సాగర్‌ డ్యాంకు మొత్తం 26 గేట్లు ఉన్నాయి. వీట్లలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు...మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక్కో గేటు తెరిచేందుకు అరగంటకు పైగా పట్టిందంటేనే వాటిని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎర్‌‌త డ్యాం నిర్మించేముందు ఒక వేళ ప్రమాదం ఏర్పడితే, డ్యాంకు ఇబ్బంది కలుగకుండా సమాంతరంగా నీళు్ల వెళ్లేలా ఎమర్జెన్సీ హాలో నిర్మించారు... ఈ హాలో ఓపెన్‌ చేస్తే ఒకేసారి లక్ష క్యూసెక్కుల నీళు్ల వెళ్తాయి. కానీ, ఈ హాలోను నిర్మించిన నాటి నుంచీ ఏ ఒక్కనాడూ ఓపెన్‌ చేయలేదు.. మొన్న వరదలు వచ్చిన సందర్భంలో ఈ ఎమర్జెన్సీ హాలోను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తే.. మూతతో సహా బురదలో కూరుకుపోయింది. అది ఓపెన్‌ కాలేదు..
నీటిపారుదల గురించి, వ్యవసాయం గురించి పోచికోలు కబుర్లు చెప్పమంటే మన నేతలు తెగ చెప్పేస్తారు... నాగార్జున సాగర్‌ తాగునీటికి, సాగునీటికి, కృష్ణా డెల్టాకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు... దీని విషయంలో అలసత్వంతో వ్యవహరిస్తే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది..

2 కామెంట్‌లు:

జయ చెప్పారు...

ప్రమాదంలో సాగర్...నాకు చాలా బాధ కలిగిస్తోంది. చిన్నప్పుడు చాలా కాలం అక్కడ ఉన్నదాన్ని. మా నాన్నగారు, అక్కడ ఇంజినీర్ గా చేసారు. ఈ డాం కి ఏమి కాకుండా మన నేతలు కాపాడాలని కోరుకుంటున్నాను. వివరాలు తెలిపిన మీకు నా కృతజ్ఞతలు.

భావన చెప్పారు...

ఇటువంటివి చదివినప్పుడు ఎంత బాధ వేస్తుందో ఏదో చెయ్యాలనిపిస్తుంది కాని ఏమి చెయ్యాలో మాత్రం తెలియదు.. భగవంతుడా రక్షించు నా వాళ్ళను, నన్ను ఈ రాజకీయ నాయకుల బారి నుంచి.