3, నవంబర్ 2009, మంగళవారం

పాపం చిరంజీవి

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. చివరకు పొత్తు కుదరకుండానే ఎవరికి వారే అయిపోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలు సృష్టించాయి. జగన్‌ వర్గం తెచ్చిన ఒత్తిడి, వీరప్ప మొయిలీ లాబీయింగ్‌ డిఎస్‌ వూ్యహాన్ని దెబ్బ తీశాయి. నిజానికి పిఆర్‌పితో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలకు పిసిసి ఛీఫ్‌ తెరలేపిన మరుక్షణం నుంచీ కాంగ్రెస్‌లో మాటల తూటాలు శరవేగంగా దూసుకువచ్చాయి.

ఓ పక్క జగన్‌ వర్గం తనదైన రీతిలో వ్యతిరేకంగా స్పందిస్తే... కాంగ్రెస్‌లోని మిగతా వర్గం రకరకాలుగా స్పందించింది. అయితే మెజారిటీ వర్గం మాత్రం పిఆర్‌పితో పొత్తు కంటే, పార్టీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికే మొగ్గు చూపారు.. ప్రస్తుతానికి పొత్తు గొడవ సద్దుమణిగినా, భవిష్యత్తులో రెండు పార్టీలూ కలిసి పనిచేసేందుకు ఒక మార్గం అంటూ ఏర్పడిందనే చెప్పాలి...జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే
మహానగర ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపనున్నాయనే చెప్తున్నాయి.. ఈ ఎన్నికల్లో పిఆర్‌పితో దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పొత్తు కుదుర్చుకుంటున్నట్లు డిఎస్‌ ప్రకటించిన మరుక్షణం నుంచి కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు విస్పష్టంగానే చిరంజీవితో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. సంధి కుదుర్చుకోవటం అంటూ జరిగితే పతనావస్థలో ఉన్న పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లు అవుతుందన్నారు...కోమాలో ఉన్న చిరంజీవిలో మళ్లీ చైతన్యాన్ని తీసుకువచ్చినట్లవుతుందని విష్ణువర్థన్‌ రెడ్డి బహిరంగంగానే విమర్శించారు..
పొత్తును వ్యతిరేకిస్తున్న నాయకులు అందుకు కారణాలను బలంగానే వినిపిస్తున్నారు.. మొన్న 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని నియోజక వర్గాల్లో పిఆర్‌పి బలం చెప్పుకోదగ్గంత లేదని, దేవేందర్‌ గౌడ్‌ లాంటి నాయకులు సైతం మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చిన వాస్తవాలను గ్రహించాలని వారు వాదిస్తున్నారు. మల్కాజిగిరిలో తప్ప మరెక్కడా పిఆర్‌పి రెండోస్థానానికి చేరుకోలేకపోయింది. కొన్ని చోట్ల లోక్‌సత్తా కంటే తరువాత స్థానంలో ఉంది కూడా... అలాంటి పిఆర్‌పితో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి మేకులా తయారయ్యే అవకాశం ఉందని కూడా కొందరు అనుమానిస్తున్నారు.. పొత్తు వల్ల కాంగ్రెస్‌కు లాభం కలిగే మాటెలా ఉన్నా, చిరంజీవికి మాత్రం మేలు జరుగుతుందనేది స్పష్టం. దీని కంటే సముద్రం లాంటి కాంగ్రెస్‌లో పిఆర్‌పిలో విలీనం చేసుకోవటమే మంచిదన్న ఆలోచనతో చాలామంది నాయకులు వర్గాలకు అతీతంగా అభిప్రాయపడుతున్నారు..
పిఆర్‌పితో పొత్తు పెట్టుకోవటం వల్ల టిఆర్‌ఎస్‌లాగా మరో పార్టీని పక్కలో బల్లెంలాగా తయారు చేసుకున్నట్లవుతుందని కొందరి భావన. ఎందుకంటే పిఆర్‌పి ఒంటరిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ విజయం సాధించగలిగింది. పైగా రాజధానిలో ఎంఐఎం సహకారం ఎలాగూ ఉంది..అలాంటప్పుడు పిఆర్‌పితో పొత్తు వల్ల ఒరిగేదేమీ లేదని ఎక్కువమంది అంటున్నారు.. దీని పర్యవసానమే పొత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటూ వీరప్పమొయిలీ ప్రకటన...
అయితే మంతనాలు సాగించాం కాబట్టి ఈ కథకు ఎలా ముగింపునివ్వాలన్నది కాంగ్రెస్‌ నాయకత్వానికి చాలా సేపు అర్థం కాలేదు.. దీనికి మార్గంగా గ్రేటర్‌ ఎన్నికల్లో 21 సీట్లు తమకు కేటాయించాలని పిఆర్‌పి డిమాండ్‌ను తిప్పికొట్టడమొక్కటే కనిపించింది. కాంగ్రెస్‌ పది సీట్లకు మించి ఇవ్వలేమంటూ కాంగ్రెస్‌ పొంతన లేని ప్రతిపాదన చేయటంతో పొత్తు కథ తేలిపోయింది. పాపం చిరంజీవి.. కనీసం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిచ్చెనైనా పట్టుకుంటే కొన్ని మెట్లయినా ఎక్కవచ్చని భావించారు.. దాన్నీ జగన్‌ వర్గం దిగ్విజయంగా తిప్పి కొట్టింది... కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీపై ఒత్తిడి తీసుకురావటంలో సక్సెస్‌ అయింది...
కొసమెరుపు... వీరప్పమొయిలీ కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కంపెనీలో ఏడాదికి సుమారు ఆరు కోట్ల ఉద్యోగి...

కామెంట్‌లు లేవు: