23, అక్టోబర్ 2009, శుక్రవారం

కెసిఆర్‌ మళ్లీ గర్జిస్తున్నారు

కెసిఆర్‌ మళ్లీ గర్జిస్తున్నారు.. 2009 ఎన్నికల తరువాత కెసిఆర్‌ ఇక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించలేరన్న వాదనలకు జవాబు లభించింది. రాజకీయ రణరంగం మీదకు అన్ని అస్త్రశసా్తల్రతో ముందుకు దూకారు... ఎన్నికల ఫలితాల తరువాత అసలు బహిరంగ సభనే నిర్వహించనని అలిగిన కెసిఆర్‌.. ఉద్యోగుల బ్యానర్‌పై రంగప్రవేశం చేశారు...

కర్నూలు వరదల తరువాత కెసిఆర్‌ మాటల వరద రాష్ట్ర రాజకీయాల్ని నిండా ముంచేస్తోంది...2009 ఎన్నికల ఫలితాల తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వేసిన ఎత్తుగడలకు టిఆర్‌ఎస్‌ విలవిల్లాడింది... కెసిఆర్‌ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన్ను తప్పుకోవాలన్న డిమాండ్ల స్వరం హెచ్చింది. నాడు వైఎస్‌ ఇచ్చిన హామీతో కొందరు కాంగ్రెస్‌ పంచన చేరిపోయారు.. పార్టీని ఎలా నడిపిస్తారో తెలియని పరిస్థితి.. ప్రజల్లో నెలకొన్న గందరగోళం.. దీనికి తోడు ఇక తెలంగాణ ఉద్యమం సమసిపోయినట్లేనన్న వ్యాఖ్యానాలతో టిఆర్‌ఎస్‌ నాయకత్వం స్తబ్దుగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ అకస్మాత్తుగా, అనూహ్యంగా మరణించిన తరువాత టిఆర్‌ఎస్‌లో నెమ్మదిగా కదలిక మొదలైంది...

పార్టీ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలా అని మథన పడుతున్న కెసిఆర్‌కు కృష్ణమ్మ వరదలు బ్రహ్మాసా్తన్న్రే అందించాయి. శ్రీశైలం డ్యాంలో బ్యాక్‌ వాటర్‌ స్టోరేజీని పెంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లివ్వాలన్న సర్కారు నిర్ణయం వల్లనే కర్నూలు జిల్లా మునిగిపోయిందన్న వాదన కెసిఆర్‌కు మళ్లీ మాటలను ఇచ్చింది. పోతిరెడ్డిపాడును ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న టిఆర్‌ఎస్‌ వాదనలకు కర్నూలు వరదలు బలం చేకూర్చాయి. ఈ వివాదం సమసిపోకముందే సుప్రీం కోర్టు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించటం కెసిఆర్‌కు తిరుగులేని బలాన్నిచ్చినట్లయింది. ఇంకేం.. ఆయన నేరుగా రంగంలోకి దూకారు.. తాను మారానన్నారు.. భాష మార్చారు.. నడత మార్చారు.. సంయమనంతో మాట్లాడుతున్నారు.. సహేతుకంగా, ఆధార సహితంగా తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉండేలా తన వాదనలకు పదును పెట్టారు... ఎవరినీ నిందించటం లేదు.. అన్నింటికీ మించి ఒక్కసారిగా మీడియాఫ్రెండ్లీగా మారిపోయారు..

ఇప్పుడీ ఫ్రీజోన్‌ వివాదాన్ని సొము్మ చేసుకోవటం కోసమే సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పూనుకున్నారు... మొదట్నుంచీ సిద్దిపేట టిఆర్‌ఎస్‌కు కలిసివచ్చిన ప్రాంతం.. అటు కరీంనగర్‌, ఇటు మెదక్‌ మరోపక్క వరంగల్‌.. వెరసి జనసమీకరణకు ఉత్తర తెలంగాణలో అనువైన ప్రాంతం. పైగా హైదరాబాద్‌ ఉన్న ఆరోజోన్‌లోనే మెదక్‌ కూడా ఉండటం ఇక్కడ మరో కీలకాంశం...

సిద్దిపేట సభ పార్టీ సభ కాదని ముందే కెసిఆర్‌ స్పష్టం చేశారు.. ఉద్యోగుల జెండాను పట్టుకునే మళ్లీ తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.. టిఆర్‌ఎస్‌ స్థాపించిన నాటి నుంచీ ప్రత్యక్షంగా అంత దగ్గరగా లేని తెలంగాణ ఎన్‌జీవోలు ఇప్పుడు ప్రత్యక్షంగా సిద్దిపేటలో టిఆర్‌ఎస్‌ జత కట్టారు.. ఎన్నికల తరువాత పార్టీకి దూరమైన ఉద్యోగులు, మేధావులను మళ్లీ దగ్గర చేసుకోవాలన్న కెసిఆర్‌ ప్రయత్నం ఈ సభ ద్వారా ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి....

ఉద్యోగుల ప్రధాన సమస్యను తలకెత్తుకున్న కెసిఆర్‌ ఎత్తుగడ సవ్యంగానే వేశారు... కానీ అదే సమయంలో పట్టుమని తొమ్మిది మందైనా ఎమ్మెల్యేలు లేకుండా, పార్టీకి దూరమైన విజయశాంతి సహకారం లేకుండా, తానొక్కడే ఎంపిగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు పెడతామంటూ మళ్లీ పాత పోకడలు పోవటం కేసిఆర్‌ను ట్రాక్‌ తప్పేట్లు చేస్తోంది. అర్థం లేని రాజకీయ వ్యాఖ్యానాలు, డెడ్‌లైన్లు, డెత్‌ వారంట్ల జోలికి వెళ్లకుండా మారిన మాటతీరుతో, నడతతో వూ్యహాత్మకంగా ముందుకు నడిస్తేనే కెసిఆర్‌ ఉద్యమ లక్ష్యానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి