16, అక్టోబర్ 2009, శుక్రవారం

వెలుగు మొలక చివురించిన వేళ


కంప్యూటర్లు, కాంక్రీటు గోడల మధ్య జీవితాలను వెళ్లదీసే ఈ తరం సమాజానికి పండుగలు ఊరటనిచ్చే ఉపకరణాలు. పండుగలు ఆధ్యాత్మిక ప్రవృత్తికి అవసరమా? లేక పరలోక సుఖప్రదమా? వంటి అంశాలు ఇప్పుడు అనవసరమైనవి.

ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాళు్ల పూజలు చేసుకుంటారు. లేని వాళు్ల కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద మన పండుగలన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న భారాన్ని తగ్గించి ఉల్లాసాన్ని కలిగించడానికి తోడ్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నా, ఏడాది కాలంలో ఎన్నడూ మనసు విప్పి మాట్లాడుకోవడానికైనా తీరిక దొరకని భార్యాభర్తలు, అన్నదము్మలకు పండుగ రోజుల్లోనే సంబరాలు. ఇందుకు అన్ని మతాలూ ఒకటే. అన్ని మతాల్లోనూ పండుగలు ఉన్నాయి. ఒక్కో సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక్కో ఉద్దేశాన్ని లక్షించుకుని ఒక్కో పండుగను ఏర్పరుచుకున్నాం. అయితే హిందువులలో ఉన్నన్ని పండుగలు మరే మతంలో ఉండవనడం అత్యుక్తి కాదు. లోకానికి, మన దేశానికి మేలు చేసిన మహాపురుషుల జన్మదినోత్సవాల సందర్భంగా జరుపుకునే పండుగలు శ్రీరామనవమి, జన్మాష్టమి వంటివైతే, ఋతుసంబంధమైన ఉత్సవాలు ఉగాది, సంక్రాంతి, హోళి, రథసప్తమి వంటివి. శైవ, వైష్ణవ సంబంధమైన పండుగలు శివరాత్రి, వినాయక చతుర్థి, ముక్కోటి ఏకాదశి వంటివి మరికొన్ని.
వీటన్నింటి కంటే ప్రధానమైన పండుగలు దసరా, దీపావళి. ఏ పండుగను జరుపుకోవడానికైనా కొన్ని ప్రధానమైన కారణాలు చెప్పుకుంటాం. ఆదిశక్తి మహిషాసురుని సంహరించిన రోజు, రాముడు రావణున్ని హతమార్చిన రోజు, ఉత్తరగోగ్రహణాన అర్జునుడు కౌరవసేనను దునుమాడిన రోజును విజయదశమిగా జరుపుకుంటే, దీపావళి ప్రత్యేకం వేరు. ఇది దీపాల పండుగ. చీకట్ల చీల్చుకుని వెలుగును ప్రసరించే దివ్యమైన పర్వదినం. నరకుని నుంచి ప్రపంచానికి సత్యభామాకృష్ణులు విముక్తి కలిగించిన శుభవేళగా ఈ పండుగను జరుపుకుంటాం. మిగతా పండుగల కంటే దీపావళి విశిష్ఠత వేరు. ఇందుకు మరికొన్ని కారణాలున్నాయి. సత్యభామా సహాయుడై శ్రీకృష్ణుడు నరకాసురుని హతమార్చడం ఒకటైతే, బలి చక్రవర్తి వామనుని చేత పాతాళానికి అణగదొక్కిన రోజు కూడా ఇదే కావడం విశేషం. ఇదే రోజు విక్రమార్క చక్రవర్తి పట్టాభిషక్తుడయ్యాడు. దీపావళి జరుపుకోవడానికి ఇంకా కొన్ని కారణాలున్నాయి కానీ, వాటికున్న ప్రాధాన్యం తక్కువ. దక్షిణ భారత దేశంలో విక్రమార్కుని శకం పెద్దగా ప్రచారంలో లేదు. తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కుని ఓడించాడు. కాబట్టి ఆయన పేరుతోనే దక్షిణాపథమున శకసంవత్సరాల కాల గణన జరుగుతోంది. క్రీస్తుకు పూర్వం 55 సంవత్సరాల క్రిందట ఉజ్జయిని రాజధానిగా విక్రమార్కుడు భారత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. బలి చక్రవర్తిని దేవుడు వామనరూపుడై మూడడుగుల నేలను యాచించినప్పుడు ఆయన సర్వలోకాన్ని ధారపోశాడు. ఆర్యులకు దేవుడంటే సూర్యుడని అర్థం. అందుకు కృతజ్ఞతగా ఈ రోజున బలి పూజను నిర్వహిస్తారు.
లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వైదిక నిలయం అన్న గ్రంథంలో మరో అంశాన్ని చెప్పారు. పదివేల సంవత్సరాలకు పూర్వం ఆర్యులు ఉత్తరధృవ ప్రాంతంలో నివసించారు. ఆ మండలంలో ఆరునెలలు పగలుగానూ, మరో ఆరు నెలలు చీకటిగాను ఉంటుంది. దీనినే మనవారు దేవతలకు ఒక దినంగా పేర్కొన్నారు. ఈ ఉత్తరధృవమే మేరుపర్వతం. మేరు పర్వతం వద్ద దేవతలకు మేష సంక్రమణం నాటి సూర్యోదయం ఒక్కటే సూర్యోదయం. ఆ దినం మొదలుకొని అర్ధావృతము వరకు, అంటే ఆరు నెలల వరకు వాళు్ల సూర్యుని చూస్తూనే ఉంటారు. తులాసంక్రమణం వచ్చేంత వరకూ సూర్యుడు ఆకాశంలో వెలుగుతూనే ఉంటాడు. తులాసంక్రమణంతో అస్తమయం అవుతుంది. మళ్లీ మేష సంక్రమణం వచ్చేంతవరకు చీకటి ఆవరిస్తుంది. వీటినే ఉత్తరాయణ, దక్షిణాయనాలని అన్నారు. తులా సంక్రమణం రోజున ఆర్యులకు దీర్ఘరాత్రి ప్రారంభం అవుతుంది కదా! ఆ చీకటి ప్రవేశించిన రోజునే దీపోత్సవం చేసి `బలి' అన్న శత్రువును అణగద్రొక్కి, అచ్చటనే తాను బహుకాలం ఉండాల్సి ఉండకుండా త్వరగా సూర్యుడు మళ్లీ అగుపడాలని ప్రార్థిస్తూ దీపావళి జరుపుకుంటారన్నది మరో కథనం.
నరకుడిపై స్త్రీ బాణమును ప్రయోగించింది కాబట్టి, ఆ స్ఫూర్తితోనే బాణాసంచా కాలుస్తున్నాం. అంతే కానీ ఈ పండుగ నాడు పటాకులు కాల్చాలని ఏ గ్రంథంలోనూ చెప్పలేదు. దీపావళి పండుగ మార్వాడీలకు చాలా ముఖ్యమైంది. ఈ రోజున వాళు్ల జమాఖర్చుల పుస్తకాలన్నింటినీ పరిష్కరించి కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. వారికి ఈ పండుగ సంవత్సరాది. దీపావళి నుంచి కార్తీకమాసాంతము దాకా మన దేశంలో దీపోత్సవాలను నిర్వహిస్తారు. కథలెన్ని చెప్పుకున్నా, అన్నింటి వెనుకా ఉన్న ప్రధాన సూత్రం ఒక్కటే. కష్టకాలం పోయి, జీవితంలో మళ్లీ వెలుగులు నిండాలన్నదే దీపావళి ప్రధానోద్దేశం. తమసోమా జ్యోతిర్గమయ!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి