10, అక్టోబర్ 2009, శనివారం

నోబెల్సా గోబెల్సా

ప్రపంచంలో నోబెల్‌ శాంతి బహుమతికి ఉండే గౌరవం అసాధారణమైంది. ప్రపంచ శాంతి కోసం నిరంతరం శ్రమించిన వారికి చంద్రునికో నూలుపోగులా అందించే పురస్కారంగా భావిస్తారు.. కానీ, ఈసారి నోబెల్‌ శాంతి బహుమతి సంబరాలకు కాదు.. సంశయాలకు నాంది పలకింది.. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతి బహుమతి ప్రకటించటం నోబెల్‌ ప్రతిష్ఠనే ప్రశ్నిస్తోంది.

నోబెల్‌ ప్రైజ్‌... ఈ బహుమతికి ప్రపంచంలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ ఏ ముహూర్తంలో ఈ అవార్డులను ఇవ్వాలని సంకల్పించాడో కానీ, ఈ అవార్డు ప్రపంచ అవార్డుగా మారిపోయింది. అన్ని దేశాలూ, వ్యక్తులు, వ్యవస్థలు ఈ అవార్డు కోసం పరితపిస్తాయి... ఒక వ్యక్తికి అవార్డు వస్తే తమ దేశానికే గౌరవం లభించినంత సంబరపడతారు. అందులోనూ నోబెల్‌ శాంతి బహుమతికి అన్ని దేశాల్లో అపారమైన ప్రతిష్ఠ ఉంది. ప్రపంచ శాంతి కోసం పని చేసిన వారికి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు.. నోబెల్‌ ఆశయం కూడా అదే...
వివిధ దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, సైనిక ప్రమేయాన్ని తగ్గించేందుకు లేదా నిర్మూలించేందుకు శాంతియుత సమైక్య భావనను పెంపొందించేందుకు అవిశ్రాంతమైన కృషి చేసిన వారికి శాంతి బహుమతి ఇవ్వాలి.
శాంతి బహుమతి ఎలాంటి వారికివ్వాలో ఆల్‌ఫ్రడ్‌ నోబెల్‌ తన వీలునామాలో స్పష్టంగా చెప్పిన మాటలివి... మరి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ పేర్కొన వాటిలో దేనికి అర్హుడని నోబెల్‌ కమిటీ భావించిందో అర్థం కాదు.. అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతున్నందుకు, అంతర్జాతీయ దౌత్యాన్ని పరిపుష్టం చేస్తున్నందుకు శాంతి బహుమతి ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించటం నోబెల్‌ స్ఫూర్తికే విరుద్ధం... శాంతి పురస్కార లక్ష్యం ఒకటి... కమిటీ తీసుకున్న నిర్ణయం ఒకటి... శాంతి బహుమతి పొందటానికి ఇప్పటి వరకు ఒబామా ఎంతమాత్రం అర్హుడు కాడు.. మున్ముందు ఆయనేం చేస్తారనేది ఇప్పటికైతే ఊహాజనితమే...
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు వరకు బరాక్‌ హుస్సేన్‌ ఒబామా ఎవరన్నది ప్రపంచానికి పెద్దగా తెలియదు.. ఒక రాష్టంలో సెనెటర్‌ అని మాత్రం అమెరికా రాజకీయాల గురించి తెలిసిన కొద్ది మంది మాత్రం ఆయన పేరు విన్నారు... హోరాహోరీగా పోరాటం చేసి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి ఒబామా పట్టుమని తొమ్మిది నెలలైనా పూర్తి కానే లేదు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయన చేసిన ఘనకార్యాలేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు.. అది చేస్తా.. ఇది చేస్తా... అంటూ హామీల వర్షం కురిపించినంత మాత్రాన్నే నోబెల్‌ శాంతి బహుమతి పొందడానికి ప్రపంచంలో కోతల రాయుళు్ల కుప్పలు తెప్పలుగా దొరుకుతారు..
ఒబామా అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ప్రసంగంలోనే ఇరాక్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ముగిస్తామన్నారు... సైనికులను ఉపసంహరిస్తామన్నారు... గ్వాంటనామో బే డిటెన్షన్‌ క్యాంపును మూసేస్తామన్నారు... అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని అమెరికా సెనేట్‌ చేత ఆమోదిస్తానన్నారు... అమెరికా ఆర్థిక సాయాన్ని అణు ఆయుధాల పెంపుకోసం పాకిస్తాన్‌ ఉపయోగిస్తోందంటూనే, మరిన్ని ఆయుధాలు, సొము్మలు అందిస్తున్న ఒబామా అణు నిరాయుధీకరణకు తోడ్పడతారంటే ఎవరైనా ముక్కున వేలేసుకోరా? అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు.. అమెరికా మూల విధానాన్ని మార్చే ధైర్యం సాహసం చేయగలరా? ఆయుధాల అమ్మకాలను ఆపగలరా?
కనీసం అంతర్జాతీయ శాంతి కోసం ఈ నల్లకలువ దొరగారు ఏమైనా పాటుపడ్డారా అంటే అదీ లేదు.. ఇరాన్‌ అణు కార్యక్రమాలపై చర్చ మొదలైంది కానీ, ఇజ్రాయిల్‌తో సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితి లేదు.. పాలస్తీనా విమోచనానికీ ఒబామా ఒక్క అడుగు కదిపింది లేదు.. ఇక ఆఫ్గనిస్తాన్‌లో ఎన్నికలు జరిపించటం మాత్రం ఆయన ఘనత అంటున్నారు.. కానీ, అక్కడ మరిన్ని సైన్యాలను మోహరించాలన్న డిమాండ్‌ను ఆయన పరిశీలిస్తున్నారు.. అంటే యుద్ధం మరింత తీవ్రం చేయటమే కదా? ఇదేనా ప్రపంచ శాంతి? దీనికేనా పురస్కారం? గతంలో ఈ పురస్కారం స్వీకరించిన వాళు్ల సైతం ఒబామాకు ప్రకటించటాన్ని విని విస్తుపోయారు.. తీవ్ర నిర్బంధాలకు లోనైనా పీడితుల కోసం పోరాడిన తియానన్మెన్‌స్కే్వర్‌ బాధితుల దగ్గరి నుంచి మహామహులు ఎంతోమంది నామినేషన్లు పరిశీలనకు వచ్చినా... రాత్రికి రాత్రి ఒబామా పేరు పైకి రావటం వెనుక రాజకీయం అర్థం కాదు.. నిజానికి ఒబామా కంటే పాలస్తీనా శాంతి కోసం ఎంతో కొంత కృషి చేసిన మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు ఈ అవార్డు ప్రకటించినా అభ్యంతరాలు వచ్చి ఉండేవి కావేమో... తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ప్రాతిపదికన అవార్డు ప్రకటించినా ప్రపంచం దాన్ని ఆమోదించి తీరాలన్న అభిప్రాయంతో నోబెల్‌ కమిటీ ఉంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి