9, అక్టోబర్ 2009, శుక్రవారం

ఇక గరీబోళ్ల గోడు వినిపించేదెవరు?


తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడి ఉండటం అన్నది సాధారణంగా అరుదు... ముఖ్యంగా మన సమకాలంలో... అలాంటి వ్యక్తులు ఉండటం అన్నది దాదాపు అసాధ్యం... తమ ఉనికిని నిలబెట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రస్తుతమన్నట్లుగా మనసును మార్చుకునే వాళు్లన్న కాలం ఇది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తాను నమ్మిన భావాల కోసం చివరి శ్వాస వరకూ గొంతు వినిపించిన, కనిపించిన ఒకే ఒక్కరు బాలగోపాల్‌. అసమాన మేధావి అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లిపోయారు.. ఇక గరీబోళ్ల గోడు వినిపించేదెవరు?

పేదల హక్కుల సేనాని వెళ్లిపోయారు...మనిషి జీవించే హక్కును పరిరక్షించేందుకు పరితపించిన గుండె ఆగిపోయింది. పేద ప్రజలకు న్యాయం చేసే న్యాయ వాది ఇక లేరు... గరీబోళు్ల పిలిస్తే పలికే గొంతు ఇక వినిపించదు... తెలుగు నేల తనకున్న ఏకైక మార్కి్సస్టు మహా మేధావిని కోల్పోయింది. బడుగుజీవుల ఆపన్న హస్తం బాలగోపాల్‌ ఇక లేరన్న వార్తను దిగమింగుకోలేకపోతోంది.... కరవుసీమ అనంతపురంలో జన్మించి, ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో మేధోమధనం చేసిన శక్తికి పేరు బాలగోపాల్‌... ఆయన నిజంగా బాల గోపాలుడే... చిన్ని కృష్ణుడు పురిట్లోంచే మృత్యువుతో పోరాడాల్సి వచ్చింది. జైల్లో పుట్టిన క్షణం నుంచే రాజ్యవ్యవస్థకు ప్రతిరూపమైన కంసుడితో సుదీర్ఘ పోరాటమే చేశాడు కృష్ణుడు... కృష్ణుణ్ణి మనం చూడలేదు కానీ, బాలగోపాల్‌ నాటి కృష్ణుడికి అచ్చమైన ప్రతీక... తెలుగు సాహిత్యలోకంలో గొప్ప విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మనవడిగా జన్మించిన బాలగోపాల్‌ వ్యక్తిత్వ వికాసానికి ఓరుగల్లు కేంద్రమైంది.
మేథమెటిక్‌‌స విద్యార్థిగా రీజనల్‌ ఇంజనీరిగ్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే బాలగోపాల్‌ ఉద్యమాల వైపు అడుగులు వేయటం ప్రారంభించారు.. రాష్ట్రంలో పీపుల్‌‌సవార్‌ ఉద్యమం అప్పుడప్పుడే ప్రారంభమైన కాలం... దానికి కేంద్రంగా మారిన వరంగల్లు... ఒకరి వెంట ఒకరుగా విద్యార్థులు ఆకర్షితులు కావటం.. సైద్ధాంతికంగా బాలగోపాల్‌ ను మార్కి్సస్టు ఉద్యమానికి దన్నుగా నిలిచేలా చేసింది. అదే పంథాలో ఎదిగాడు... కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేసిన బాలగోపాల్‌ అదే మార్గంలో ముందుకు వెళ్తే ఇవాళ్టికి నోబెల్‌ లారెట్‌ అయ్యేవారని ఆయన్ను బాగా ఎరిగిన వారు చెప్తారు.. మేథమెటిక్‌‌స కంటే సులభమైంది మరేదీ లేదని బాలగోపాల్‌ చాలా సార్లు అన్నారంటేనే ఆయను ఎంతటి మేథావో అర్థం చేసుకోవచ్చు.
కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు బాలగోపాల్‌, విప్లవకవి వరవరరావు లాంటి ఇతర విద్యావంతులతో కలిసి పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగా కీలక పాత్ర పోషించారు.. అక్కడి నుంచి ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైంది. పేద ప్రజలకు న్యాయం చేయటం కోసం... వారి హక్కులను కాపాడటం కోసం 30 ఏళ్ల పాటు నిరంతరం కృషి చేశారు.. శ్రమించారు.. పీడితులను అక్కున చేర్చుకుని సేద తీర్చారు...
మార్కి్సస్టు మేధావుల్లో బాలగోపాల్‌ది ఒక ప్రత్యేకమైన పంథా... మిగతా మార్కి్సస్టులకు ఆయనకూ మధ్య తేడా ఎంతో ఉంది. తాను జీవించి ఉన్నంత వరకు ఏది నమ్మితే దాన్ని చిత్తశుద్ధితో ఆచరించాడు.. అనుసరించాడు.. నమ్మనిదాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.. రాజ్యహింసను నిరసించినట్లే, ప్రైవేటు హింసనూ నిందించాడు.. మనిషి ఎవరైనా అతని హక్కును కాలరాసే అధికారం మరో మనిషికి లేదని గట్టిగా నమ్మాడు.. వాదించాడు.. గెలిచాడు.. మనీషిగా ఎదిగాడు...
నక్సలైటు ఉద్యమానికి బయటి నుంచి చాలాకాలం పాటు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి బాలగోపాల్‌... ఒకటా.. రెండా... రాష్ట్రంలో జరిగిన వేలాది ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశాడాయన... బూటకపు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులందరిపైనా హత్యకేసు నమోదు చేయాలని ఆయన చేసిన పోరాటం విజయం సాధించింది. పీడిత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఏ పోరాటమూ బాలగోపాల్‌ ప్రమేయం లేకుండా జరగలేదు.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించాడు.. పౌర హక్కుల ఉద్యమంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా... హత్యాయత్నాలు జరిగినా, కోబ్రాలు కిడ్నాప్‌ చేసినా.. ఆయన వెరవ లేదు.. వెనుకడుగు వేయలేదు... దేశంలో, రాష్ట్రంలో మానవ హక్కుల పట్ల జరుగుతున్న అరాచకాలను తీవ్రంగా నిరసించాడు..
కోర్టు మెట్లంటే తెలియని పేద ప్రజలకు న్యాయం చేసేందుకు విశ్రాంతి ఎరుగకుండా శ్రమించిన వాడు బాలగోపాల్‌... ఆయన ఒక ఉద్యమానికి పరిమితం కాలేదు.. ఒక వర్గాన్ని మాత్రమే సమర్థించలేదు.. ఆయన భావాలు పీడిత ప్రజానీకపు హక్కులకు అనుగుణంగా ఎదుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర పౌరహక్కుల సంఘానికి దూరమయ్యారు... రాజ్యహింసను వ్యతిరేకించినట్లే... ప్రైవేటు హింస కూడా సరికాదన్న అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు..
ఏపిసిఎల్‌సికి దూరమైన తరువాత మానవహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు.. దాని తరపున అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.. పోరాటాలు చేశారు..ఒక్క మాటలో చెప్పాలంటే మానవ హక్కులంటే బాలగోపాల్‌... బాలగోపాల్‌ అంటే మానవ హక్కులు అన్న స్థాయికి ఆయన చేరుకున్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సైతం ఆయన ప్రశ్నించారు. ఇందుకోసం గద్వాల వేదికగా ఆయన నడిపించిన ఉద్యమం చరిత్రాత్మకమైంది...
నక్సలైట్ల బాటలో బాలగోపాల్‌ భారత రాజ్యాంగాన్ని నిరసించలేదు. రాజ్యాంగ స్ఫూర్తితోనే పౌర హక్కులను పునారచించటంలో కీలక పాత్ర పోషించారు.. హక్కుల పరిరక్షణకు ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేశారు.. ఇవాళ మానవ హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం రావటం వెనుక బాలగోపాల్‌ పాత్రను మరవటం సాధ్యం కానిపని. ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్న పీడిత వర్గాలకు బాలగోపాల్‌ పెద్ద దిక్కు. గత మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో, దేశంలో చోటు చేసుకున్న ప్రతి సంక్షోభ సందర్భంలోనూ క్రియాశీలంగా స్పందించిన వ్యక్తి బాలగోపాల్‌...
చదివింది గణిత శాస్త్రం అయినా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విశేష ప్రతిభ కనపరచిన మేధ బాలగోపాల్‌ది... సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ పేదల హక్కుల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సైద్ధాంతికంగా అరమరికలు లేకుండా నిలబడిన బాలగోపాల్‌ వంటి వారు లేని లోటు తీర్చటం దుర్లభం... ప్రజల గోడును తన గొడవగా కవిత్వంలో తీవ్ర స్వరంతో వినిపించిన వాడు కాళోజీ... ప్రజల గొంతును తన గళంగా మార్చుకుని వ్యవస్థను నిలదీసిన వాడు బాలగోపాల్‌...

1 కామెంట్‌:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

సార్ పై మీ వ్యాసం ఇంఫర్మేటివ్ గా వుంది. హక్కుల లైట్ హౌస్ ను తెలుగు ప్రజలు కోల్పోయారు. అభాగ్య జీవులను మరింత ఒంటరి వాళ్ళను చేసి పోయారు.