8, అక్టోబర్ 2009, గురువారం
యాదవ్ - హిట్ వికెట్
మొత్తానికి రాష్ట్ర పోలీసు బాసుపై వేటు పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అధికారంలో ఉన్నంత వరకు ఒక వెలుగు వెలిగిన ఎస్‌ఎస్‌పి యాదవ్‌పై సర్కారు ఇంతకాలానికి వేటు వేయగలిగింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వివాదాల పుట్టగా యాదవ్‌కు వచ్చిన పేరు బహుశా రాష్ట్రంలో మరే డిజిపి మూట గట్టుకోలేదేమో... అటు ప్రజల్లో మంచి పేరు లేక.. పోలీసు శాఖలో మంచిపేరు తెచ్చుకోలేక కేవలం రాజకీయ పలుకుబడితో అందలం ఎక్కిన అధికారిగా యాదవ్ అన్నది బహిరంగ రహస్యం... ఒక్కమాటలో చెప్పాలంటే... బ్యూరోక్రసీ, రాజకీయానికి మధ్య అక్రమ సంబందానికి అచ్చమైన ప్రతీక డిజిపి ఎస్‌ఎస్‌పి యాదవ్...
రాష్ట్ర పోలీసు శాఖ నుంచి నియంత తప్పుకున్నారు... లేదు.. తప్పించారు.. డిజిపి ఎస్‌ఎస్‌పి యాదవ్‌ను నియంత్రించటం ఇంతకాలం సర్కారుకు ఒక విడిపోని సమస్య... ఎందుకంటే యాదవ్ ఎవరికీ కొరుకుడు పడని అధికారి.. ఎవరినీ లెక్క చేయని మొండి వ్యక్తి... రాష్ట్ర పోలీసు శాఖకు ఇంతవరకు డిజిపిగా పనిచేసిన అధికారులందరిలోనూ ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి...మంత్రులు, అధికారులు, మీడియా.. ఎవరూ ఆయన కంటికి ఆనింది లేదు... కనీసం రాష్ట్ర హోం మంత్రికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యం తక్కువే... అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్ని కామెంట్లు... ఎన్ని వివాదాలు.. ఎవరితోనూ సఖ్యంగా ఉన్నది లేదు.. సరిగా వ్యవహరించింది లేదు.. ఇతర విభాగాలతో సమన్వయం లేదు.. తన విభాగంలో ఎవరినీ లెక్క చేసింది లేదు.. వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం ఆయన నైజం... వేధించటం ఆయన సరదా...
2007 అక్టోబర్‌లో స్వరణ్‌జిత్ సేన్ పదవీవిరమణ అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరికోరి యాదవ్‌ను డిజిపిగా నియమించుకున్నారు... తనపట్ల విధేయంగా ఉన్నవాళ్లను ఎంతటి అందలమైనా వైఎస్ ఎక్కిస్తారనటానికి యాదవ్ నియామకం ఉదాహరణ. 1972 బ్యాచ్‌కు చెందిన యాదవ్ డిజిపి దండాన్ని పట్టుకున్న వెంటనే, పోలీసు క్వార్టర్లలోకి వెళ్లి సిబ్బంది బాగోగులను పరిశీలించటం, జైళ్లకు వెళ్లి ఖైదీల స్థితిగతులను సమీక్షించటం చూస్తే.. ఆయన పోలీసు శాఖలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని అంతా అనుకున్నారు... కానీ, అవన్నీ ఒట్టివే అని తేలటానికి ఎంతోకాలం పట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఆయన అసలు స్వరూపం బయటపడింది. హోం మంత్రికి సైతం తెలియకుండా నియామకాలు జరిపించటం, ఇష్టారాజ్యంగా బదిలీలు చేయటం వివాదాస్పదమయ్యాయి. 2009 ఎన్నికలకు ముందు వైఎస్‌ను కీర్తిస్తూ యాదవ్ చేసిన కామెంట్లు... ఆయన వ్యవహారాన్ని బయటపెట్టాయి. వైఎస్ అధికారంలో ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించేది... ఎన్నికల ముందు సిఎంను పొగడటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టి ఆయన్ను బదిలీ చేసింది. కానీ.. రెండు మాసాల్లోనే తన అధికారాన్ని తాను దక్కించుకున్నారు... ఎన్నికల ఫలితాలు వెల్లడై... వైఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇడుపుల పాయకు వెళ్లినప్పుడు యాదవ్ అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు... ఆ తరువాత రెండు రోజులకే తిరిగి ఆయన కుర్చీ ఆయనకు దక్కింది.
ఇక అక్కడి నుంచి ఆయన తన విశ్వరూపం ప్రదర్శించటం ప్రారంభించారు.. తనను తప్పించిన సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పట్ల నిరాదరణ చూపించటం మొదలు పెట్టారు..అంతే కాదు.. తన అధికారం పోవటానికి కారణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐవి సుబ్బారావుతో హోరాహోరీగానే పోరాడారు.. తనను తప్పించటానికి కారణాలు ఏమిటో చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో తనపై చేసిన ఫిర్యాదులేమిటో తనకు చెప్పి తీరాలంటూ సుబ్బారావు గారికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు.. ఈ వ్యవహారం అంత తేలిగ్గా సమసిపోలేదు... ఐఏఎస్‌ఐపిఎస్‌ల మధ్య పోరాటంగా మారిపోయింది. చివరకు యాదవ్ బాస్ వైఎస్ స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సివచ్చింది.
హోం మంత్రిగా మొట్టమొదటిసారి ఒక మహిళకు బాధ్యతలు అప్పగిస్తే.. ఆమెను ఏనాడూ గౌరవించింది లేదు,... చివరకు వైఎస్ మరణించిన తరువాత అంత్యక్రియల సందర్భంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన యాదవ్, తాను మాత్రం హెలికాప్టర్లో వెళ్లి, హోం మంత్రి సహా, మంత్రులు, ప్రతిపక్ష నేతల భద్రతను ట్రాఫిక్‌కు వదిలేశారు. దాదాపు ఎనిమిది గంటల పాటు విఐపిలు వేంపల్లెఇడుపుల పాయ రహదారిపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే.. అది తన వైఫల్యం కాదన్నట్లుగా వ్యవహరించటం యాదవ్‌కే చెల్లింది. ఇదేమని మీడియా వాళ్లడిగితే, ప్రభుత్వమే తనను సంజాయిషీ అడగనప్పుడు మీరెవరు నన్నడగడానికి అని ఎదురు ప్రశ్నించారు...
విచిత్రమేమంటే... దివంగత సిఎం హెలికాప్టర్ ప్రమాదంపైనా పొంతన లేని వ్యాఖ్యలు చేశారు... అమెరికాలోని డబ్లు్యటిసి టవర్లపై టెరర్రిస్టుల దాడితో సిఎం చాపర్ క్రాష్‌ను పోల్చటం మరింత గందరగోళం సష్టించింది... తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఎదురుపడ్డ విలేఖరులపైనా మైకులు మూయించి నానా దుర్భాషలాడటం డిజిపి స్థాయి వ్యక్తికి తగని పని.. చివరకు హోం మంత్రి సైతం యాదవ్‌ను తప్పించాల్సిందేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. పర్యవసానం డిజిపైపై వేటు.... ఇప్పుడు ఆయన్ను ఆర్టీసీ ఎండి పదవిలో కూర్చోబెట్టారు.. ఇక అక్కడ ఎన్ని వ్యవహారాలు చక్కబెడతారో... ఎన్ని వివాదాలు సష్టిస్తారో చూడాలి....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
యాదవ్‌ని పోలీసు శాఖ నుండి ఆర్టీసీకి బదిలీ చెయ్యటం అంటే - శిక్ష ఆయనకా, లేక కోట్లాది ప్రయాణీకులకా?
ఇలాంటి వాళ్లకి మూటా ముల్లే చంకనెట్టి ఇంటికి పంపాలి కానీ ఒక శాఖ నుండి మరో శాఖకి బదిలీ చేస్తే ఉపయోగమేంటి?
పాపం APSRTC
@ అబ్క్రదబ్ర అంత తేలికాండి సీనియర్ IPS ను ఇంటికి పంపటం.. (ఐతే బాగుండు స్వగతం)
వీళ్లు కావాలనుకొంటే, ప్రాధాన్యత లేని పోస్ట్ కో, లేక అసలు పోస్టింగో లేకుండా చేయవచ్చు. వీళ్ల పిలకలు ఎన్ని యాదవ్ దగ్గర ఉన్నాయ్యో ఎవరికి ఎరుక?
అజ్ఞాత గారి సందేహం సమంజసమే ! పైగా సబితా ఇంద్రా రెడ్డి మాత్రం మరీ కంపాషనేట్ పోస్టింగ్ లాగా పవర్లెస్ గా పనిచేయడం కూడా చికాకు కలిగించింది. అసలు ఆవిడ హోం మినిస్టెర్ పదవి కున్న చార్మ్ అంతా తీసి పడేసారు. ఎన్ని తక్కువ అధికారాలు ఆవిడ దగ్గర ఉన్నా - ఆ అధికారాల మీద కూడా పట్టు కోల్పోవడం అన్యాయం. కొత్త అధికారుల సామర్ధ్యం మీదే ఆవిడ వైఫల్యాల ప్రస్థానం ఆధారపడి ఉంటుంది.
జాబు శీర్షిక అదిరింది.
ఇతగాడి ప్రవర్తన చూస్తే మూర్ఖుడేమోనని అనిపిస్తుంది. అధికారం చెలాయించే వాళ్ళను, అధికారం తలకెక్కినవాళ్ళను చూసాంగానీ, ఇలా తిక్కగా, ఇంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళను చూళ్ళేదు. సీపీఐ నారాయణ అంత తొందరగా వ్యక్తిగత విమర్శలు చెయ్యడు.. ఆయన ఇతగాణ్ణి విమర్శించినట్టు ఇంకెవర్ని విమర్శించడం చూళ్ళా.
చచ్చిపోయిన ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చుకున్న భాను అనే అయ్యేయెస్సు కూడా కొద్దిగా ఇలాటి పేనూ-పెత్తనం బాపతేనంట - కాకపోతే ఇలా మూర్ఖత్వం లేదు. అస్సాములోనో, ఈశాన్యంలోనో మరోచోటో ఉండగా (ఆ రాష్ట్రపు క్యాడరే కాబోలు)అక్కడ ఏకంగా ముఖ్యమంత్రినే వేధించుకుతిన్నాడంట. 2004లో ఆంధ్రకు పోతానని అంటే ఎగిరిగంతేసి పంపించారంట వాళ్ళు. ఇంకో నెలాగితే మళ్ళీ వెనక్కి పోవాలట ఇతగాడు కూడా!
రాశేరె పోయినా.. ఇలాంటి ఎస్‌బాస్‌గాళ్ళను ఏరేస్తే తప్ప ఆ కంపు పోదు, కొత్తదనం రాదు.
thank you all of you sirs and mams
santosh
కామెంట్‌ను పోస్ట్ చేయండి