ఒక్కుదుటున పెల్లుబికి పెను విధ్వంసం సష్టించిన కష్ణమ్మ శాంతిస్తోంది. ఇక రాజకీయ నాయకుల పర్యటనలు.. పరామర్శలు ప్రారంభమయ్యాయి...అన్ని విధాలా ఆదుకుంటామని జాతీయ నాయకులు, పాలకులు మాటల మూటలు విప్పేశారు.. కానీ, వాళ్లిచ్చే సాయం మనకందేదెప్పుడు? అది ఎంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది? వేల కోట్ల నష్టంతో రాజులు తరాజులైన వరద విపత్తుకు యుపిఏ సర్కారు తక్షణం ప్రకటించిన నిధులు బాధితుల కన్నీరును ఏమేరకు తుడుస్తాయి?
ఆంధ్రప్రదేశ్‌కు కనీవినీ ఎరుగని విపత్తు సంభవించింది.. ఆపన్నులను అన్ని విధాలా ఆదుకుంటాం... కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ అన్న మాటలివి... ఇది తీవ్రమైన ఆపద... బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారుకు అన్ని విధాలా అండగా ఉంటాం... యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇచ్చిన హామీ ఇది... నిన్నటి వరకు వరద ముంపుతో అల్లాడిపోయిన కష్ణా బాధితులు... ఇప్పుడు పరామర్శల వరద మొదలైంది. వరద తెరిపిగొనటంతో ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర జాతీయ నాయకులు వరద ప్రాంతాలను సందర్శిస్తున్నారు.. ఆపన్నులను అక్కున చేర్చుకుని మేమున్నామంటూ స్వాంతన వాక్యాలు పలుకుతున్నారు.. బాధితులకు ఈ స్వాంతన అవసరమే.. ఈ మాటసాయమూ అవసరమే.. కానీ, సమస్తం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఈ ప్రజలకు ఈ కాస్త స్వాంతన సరిపోతుందా? ఆర్థికంగా ఆదుకునేదెవరు? వందేళ్లలో కనీవినీ ఎరుగని వైపరీత్యం సంభవించినప్పుడు తక్షణం అందించాల్సిన సహాయం కేవలం 418 కోట్లంట... ఈ 418 కోట్లలోనూ రాష్ట్రం 115 కోట్లను భరించాల్సిందేనట... వినడానికే విడ్డూరంగా ఉంది...
రాషా్టన్రికి తుపానులు, వరదలు కొత్తేం కావు... ప్రతి ఏటా కాకున్నా ప్రకతి విపత్తులను రాష్ట్రం తరచూ ఎదుర్కొంటున్నదే... కానీ, ప్రతిసారీ కేంద్రం చూపించేది సవతి తల్లి ప్రేమే... శ్రీశైలం జలశాయాన్ని ముంచెత్తేంతగా వచ్చిన వరద ఉధతి మహా విషాదాన్ని మిగిల్చింది... ఈ ఆపదను జాతీయవిపత్తుగా ప్రకటించాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కానీ, ఘనత వహించిన ఢిల్లీ సర్కారు మాత్రం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది. గొప్ప ఆపద అంటూనే.. జాతీయ విపత్తు మాట ఊసే లేకుండా మొయిలీ నుంచి మన్మోహన్ వరకు ఆచితూచి మాట్లాడుతున్నారు... అదే నిరుడు బీహార్‌ను వరదలు ముంచెత్తినప్పుడు ఎవరూ కోరకముందే అది జాతీయ విపత్తు అని సాక్షాత్తూ ప్రధాని స్వయంగా ప్రకటించేసి... వెయ్యి కోట్ల ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించేశారు... బెంగాల్ ఐలా తుపాను కానీ, లాతూరు భూకంపం కానీ జాతీయ విపత్తులుగా గుర్తించినవే.. 1970ల నాటి దివిసీమ తుపానును సైతం జాతీయ విపత్తుగా గుర్తించారు.. కానీ, ఇప్పుడు మాత్రం ఇంకా సంకోచంలోనే ఉంది.
రాష్ట్రాల ఆర్థిక వనరులపైనే పూర్తిగా ఆధారపడే కేంద్రాన్ని అవే రాషా్టల్రు ఆపద వచ్చినప్పుడు దేబిరించాల్సిన ఆగత్యం పడుతోంది... ఎంతగా వేడుకున్నా కేంద్రం ఆర్థిక సాయం అందేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది... కేంద్రం ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక సాయం 418 కోట్లు... అందులోనూ రాష్ట్ర వాటా తీసేస్తే...వాస్తవ సాయం 303 కోట్లే... అసలు సాయం అందటానికి పెద్ద తంతే జరగాల్సి ఉంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన నష్టం 12, 225 కోట్ల రూపాయలు.. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తరువాత కానీ అసలు నష్టం తేలదు... రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఢిల్లీకి పంపించాలి... ఢిల్లీ పెద్దలు ఆ నివేదికను పరిశీలించి.. తమ నిపుణుల బందాన్ని వీలును బట్టి రాషా్టన్రికి పంపిస్తారు.. వారికి మన సర్కారు వారు అన్ని సేవలు చేసి, బాధిత ప్రాంతాల్లో తిప్పి క్షేమంగా ఢిల్లీకి పంపిస్తారు.. వారు తీరి కూర్చుని ఓ నివేదిక తయారు చేసి హస్తినలో సింగ్ దొరవారికి సమర్పిస్తారు.. వారు తమ మంత్రివర్గ సహచరులతో సమావేశమై లెక్కలేసుకుని సాయాన్ని ప్రకటిస్తారు.. ఇదంతా జరిగేసరికి ఇక్కడి బాధితులు తమ బాధను పూర్తిగా మరచిపోయి, సాధారణ జనజీవనాన్ని గడుపుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు..
ప్రకతి విపత్తుల కారణంగా దేశంలో ఏటా 75 లక్షల హెక్టార్లలో 3కోట్ల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు...దాదాపు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది... వీటిని నివారించేందుకు 21వేల కోట్ల రూపాయలతో జాతీయ విపత్తు సహాయ నిది ఉన్నా... ఉపయోగం సున్నా... జరిగే నష్టం కొండంత... సాయం ఆవగింజంత.. అదీ ఆపద సంభవించిన ఎన్నో రోజుల తరువాత కానీ, అందని స్థితి... అందులోనూ కేంద్రం విధించే రకరకాల తిరకాసులు... రాషా్టన్రికి వచ్చే ఏడాది ఇవ్వాల్సిన కేటాయింపుల్లోంచి కొంత అడ్వాన్సుగానో... జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర పథకాల ద్వారా అందించే నిధులను అడ్వాన్సుగానో ఇవ్వటం మినహా కేంద్రం నేరుగా గ్రాంటుగా ఇచ్చే మొత్తం చాలా తక్కువ... మరి ఢిల్లీలో సర్కారు ఉన్నదెందుకు? ఎవరిని పాలించేందుకు? ఎవరికి మేలు చేసేందుకు..? ఆపద వచ్చినప్పుడే సరిగ్గా స్పందించని పాలకులు, మామూలు సమయాల్లో ఎన్ని ముచ్చట్లు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి