26, నవంబర్ 2009, గురువారం

గ్రేట్‌ ఓటరు - చిరంజీవి రెండో షో అట్టర్‌ ఫ్లాప్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీల సత్తా ఏమిటో తేలిపోయింది. వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు కాంగ్రెస్‌ చుట్టూ ఏకపక్షంగా తిరిగిన రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం వైపు మళ్లింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకున్న తెలుగుదేశం ఈ ఎన్నికల్లో దాదాపు పదిహేను నియోజక వర్గాల్లో బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. కాంగ్రెస్‌తో దాదాపు సమానంగా డివిజన్లను సాధించటం తెలుగుదేశం శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహాన్ని నింపిందనటంలో సందేహం లేదు. అయితే పూర్తిగా స్థానిక రాజకీయాలను ఆధారం చేసుకుని జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అయినా, ఇప్పుడున్న వాతావరణంలో రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయనటంలో సందేహం లేదు.

చివరి రెండురోజుల్లో హఠాత్తుగా ప్రచారంలోకి దిగిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుడిగాలిగా 30 డివిజన్లలో ప్రసంగాలు చేసినా, కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది కేవలం 13 డివిజన్లలోనే... జగన్‌ వర్గీయులైన సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌ రెడ్డి నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ దాదాపు అడ్రస్‌ లేకుండా పోయింది. అటు తెలుగుదేశంలోనూ సీనియర్‌ నాయకుడు.. నిత్య అసమ్మతివాది తలసాని శ్రీనివాసయాదవ్‌ నియోజకవర్గం సికింద్రాబాద్‌లో తెలుగుదేశం జాడే లేదు... ఇక వైఎస్‌ వ్యతిరేక వర్గానికి చెందిన పి.విష్ణువర్థన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జూబ్లీహిల్‌‌సలో కాంగ్రెస్‌ మళ్లీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య నివాసముంటున్న బల్కంపేటలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. పాపం ఆయన తన ఓటును తెలుగుదేశానికి వేయలేదు కదా.. సరదాకు అన్నా లెండి... 150 డివిజన్లను తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఎంఐఎంలు పంచుకున్నాయి. ఎంఐఎం గురించి చెప్పనే అక్కర్లేదు.. అసెంబ్లీ ఎన్నికల్లోనే అయిదు నుంచి ఏడుకు బలాన్ని పెంచుకున్న ఆ పార్టీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే దూకుడుతో దూసుకుపోయింది. బిజెపి అయిదు డివిజన్లను తన ఖాతాలోకి వేసుకునేసరికి అలసిపోయింది. ఇక లోక్‌సత్తా సీటీ బచావ్‌ సీటీ బచావ్‌ అంటూ విజిళు్ల పట్టుకుని బరిలో దూకింది.. చివరకు లోక్‌సత్తా `సీటీ బజ్‌గయా' అన్నట్లే అయింది. కనీసం లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ వెతికి వెతికి ఏరికోరి గెల్చుకున్న కూకట్‌పల్లిలో కూడా ఓటర్లు ఆయన పార్టీకి మొండిచెయ్యే చూపించారు...
అన్నింటికీ మించి చిరంజీవి రెండో షో కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. కాంగ్రెస్‌తో పొత్తుల కోసం చివరి నిమిషం దాకా వెంపర్లాడి... అఖరుకు ఒంటరిగా అదీ 64 సీట్లలో మాత్రమే పోటీ చేసిన చిరంజీవి మెగా పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో బోర్లా పడింది. ఫలితాల చివరలో ఓల్‌‌డబోయినపల్లి డివిజన్‌ చిరంజీవి పాలిటి గోల్‌‌డ బోయినపల్లిగా మారింది. పిఆర్‌పిలోని ఏ ఒక్క అభ్యర్థికీ తాను గెలుస్తానన్న నమ్మకం లేదు.. ఈ డివిజన్‌లో కూడా పోటీ చేసిన నర్సింహులు యాదవ్‌ కౌంటిగ్‌ కేంద్రానికి రానే లేదు. తాను ఓడిపోతానని ఖాయంగా భావించి ఉదయం నుంచే పత్తాలేకుండా పోయారు. చివరి నిమిషంలో గెలుస్తున్నట్లు తెలిసాక తన చెవులను తానే నమ్మలేని పరిస్థితి. ఏదో రకంగా ఒక సీటును గెలిపించి చిరంజీవికి తనవంతు ఆక్సీజన్‌ను నర్సింహులు అందించారు.. ఇప్పుడు చిరంజీవి ఏం చేస్తారు? సినిమాల్లో రెండో స్పెల్‌ ప్రారంభిస్తారా? సినిమాల్లో నటిస్తే ఎలాంటి పాత్రలు వేస్తారు.. ఆయన మళ్లీ సినిమాలు మొదలు పెడితే.. పార్టీని ఎవరు నడిపిస్తారు? లేక అంతా భావించినట్లు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? మేయర్‌ ఎన్నిక కంటే కూడా అందరి దృష్టీ చిరంజీవి రాజకీయ భవిష్యత్తుపైనే ఉందంటే అతిశయోక్తి కాదేమో...

కామెంట్‌లు లేవు: