25, నవంబర్ 2009, బుధవారం

వేడెక్కిన తెలంగాణ..

తెలంగాణ ఉద్యమం ఎటు వెళ్తోంది... 1969 నాటి సన్నివేశాలు పునరావృతం అవనున్నాయా? తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు ప్రారంభిస్తానంటున్న ఆమరణ నిరాహార దీక్ష ఇప్పటివరకు అందిస్తున్న సంకేతాలు ఆందోళన తీవ్రతను సూచిస్తున్నాయి. రాష్టమ్రంతటా ఒకటే ఉత్కంఠ.. తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్తత... ఆమరణ దీక్ష జరుగుతుందా? ప్రభుత్వం భగ్నం చేస్తుందా? అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి?
కెసిఆర్‌ ఆమరణ దీక్ష కొనసాగుతుందా?
తెలంగాణ ఉద్యమం హింసాత్మకం కానుందా?
ఉద్యమం హింసాత్మకమైతే పరిణామాలకు బాధ్యులెవరు?
తెలంగాణపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?
కెసిఆర్‌ దీక్ష భగ్నం చేయటమే లక్ష్యమా?


ఇప్పుడు అందరి దృష్టీ నవంబర్‌ 29పైనే... సిద్దిపేటకు దగ్గర్లోని రంగదామ్‌ పల్లిలో కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపడుతున్నారు... ఆయన గతంలో చేసిన ఆందోళనలకు, ఇప్పుడు చేస్తున్న ఆందోళనకు చాలా తేడా ఉంది.. గతంలో ఆయన ఏ ఆందోళన చేసినా, దానికి జనం స్పందించినా అవన్నీ అలా పైకెగిసి కింద పడిపోయినవే... ఇప్పుడు ఉద్యమాన్ని సీరియస్‌గానే ముందుకు తీసుకువెళు్తన్నట్లు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని కల్పించటంలో కెసిఆర్‌ సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో ఇంతకు ముందు కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కెసిఆర్‌ దీక్షను భగ్నం చేసేందుకు సర్వ సన్నాహాలతో సన్నద్ధమైంది. సిద్దిపేట అంతటా భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. హోటళు్ల, లాడ్జిలను సైతం పోలీసులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు... అయినా చాపకింద నీరులాగా వివిధ జిల్లాల నుంచి కార్యకర్తల్ని, ప్రజల్ని సమీకరించేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మానలేదు..
1969లో విద్యార్థి ఉద్యమం తెలంగాణను రక్తసిక్తం చేసింది... ఇప్పుడు ఆ ఉద్యమానికి సరిగ్గా నలభై ఏళు్ల నిండాయి. ఆనాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని గట్టిగా చెప్పలేం కానీ, కెసిఆర్‌ కూడా విద్యార్థి చైతన్యాన్నే అండగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల్లో కనిపిస్తున్న సానుకూల స్పందనలు ఇందుకు తార్కాణం. ఈ ప్రతిస్పందన చూసే కాంగ్రెస్‌ నాయకుల్లో గుబులు మొదలైంది... ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కెసిఆర్‌కు అనుకూలంగా స్పందించటం ప్రారంభించారు..
రాష్ట్రంలో వైఎస్‌ ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులకీ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకీ చాలా తేడా ఉంది... అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల స్వరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కెసిఆర్‌ సైతం చాలా పకడ్బందీగా తన రెండో స్పెల్‌ ప్రారంభించారు.. వూ్యహాత్మకంగా నడుస్తున్నారు.. గతంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ఆమరణ దీక్షకు పూనుకున్నట్లే పూనుకుని అరగంటలోనే విరమించినట్లు కాకుండా, ఈసారి పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. కానీ కెసిఆర్‌ ఎక్కువ రోజులపాటు ఆమరణ దీక్ష చేసే పరిస్థితులు లేవని ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్నారు..
మరో పక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు దూరం కావటం ద్వారా రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ రాష్ట్ర సాధన అన్న నినాదాన్ని టిఆర్‌ఎస్‌ పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. అదే జరిగితే ఉద్యమ పంథా మారినట్లే... అయితే దాని దారి ఎటు మళు్లతోంది... కెసిఆర్‌ ఎటువైపు తీసుకువెళు్తన్నారు..? ఇప్పటికైతే ఇవి సమాధానం లేని ప్రశ్నలే..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి