రోజుకొకరు.. పూట కొకరు.. వేధింపులు తాళ లేక ఒకరు... ఒత్తిళ్లను తట్టుకోలేక ఇంకొకరు... పిట్టల్లా రాలిపోతుంటే నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తున్న ప్రపంచం... వారం రోజుల్లో దాదాపు పది మంది విద్యార్థులు బలవంతంగా తమ ఉసురు తీసేసుకున్నారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఒక్క క్షణంలో ఆలోచన లేకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు అమాయకుల బలవణ్మరణాలకు దారి తీస్తోంది. దీనికి కారణం ఎవరు? బాధ్యత ఎవరిది? ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులదా? ర్యాంకుల కోసం కన్నపిల్లలపై ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రులదా? ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నందుకు కసాయివాళ్లకంటే ఎక్కువగా కాల్చుకుతింటున్న కార్పోరేట్ యాజమాన్యాలదా? తప్పెవరిది?
సోమాజీగూడలో అనూష...
ఘట్‌కేసర్‌లో కృష్ణకాంత్...
నల్గొండలో శ్వేత..
మెహదీ పట్నంలో స్వర్ణలత...
ఎల్‌బి స్టేడియంలో బాక్సర్ అమరావతి...
ఒకరి తరువాత ఒకరు..
వారం రోజుల్లో పది మంది...
ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
ముఖ్యంగా విద్యార్థుల్లోనే ఇలా ఎందుకు జరుగుతోంది... ?
నవంబర్ ఆరోతేదీ సోమాజీ గూడలోని విల్లామేరీ కార్పోరేట్ కాలేజీ నాలుగో అంతస్థు నుంచి అనూష అనే అమ్మాయి హఠాత్తుగా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకలా చేసుకుందో ఎవరికీ అర్థం కాలేదు.. పోలీసులకు తెలిసిన కారణం అందరినీ విస్తుపోయేలా చేసింది... తన తల్లి కోప్పడిందనీ, తోటి విద్యార్థినులు వేధిస్తున్నారని అదే ఆమె ఆత్మహత్యకు కారణమట.. ఇదేం కారణం? తోటి విద్యార్థినులు వేధించటం ఏమిటి? తల్లి రాధాభాయి చెప్తున్న సమాధానం పోలీసులకే కన్విన్సింగ్‌గా లేదు.. వేరే బలమైన కారణం ఏమిటో ఉందనే వారు అనుమానిస్తున్నారు.
ఇక నల్గొండలో చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థిని శ్వేత చావుకు ప్రేమ కారణం. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు లండన్ వెళ్లి ఆరేళ్లయినా రాలేదని నిరాశతో తనువు చాలించిన అభాగ్యురాలు శ్వేత..
హైదరాబాద్‌లోని మరో ప్రైవేటు కళాశాలలో బయోటెక్నాలజీ జదువుతున్న జ్యోతి, బిటెక్ చదువు తున్న శిరీష్ లు కూడా ప్రేమించి, పెళ్లి చేసుకుని పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకున్నారు...ఘట్‌కేసర్‌లో కృష్ణకాంత్ చదువుల ఒత్తిడి తాళలేక ఏకంగా రైలు కింద పడి చనిపోయాడు...ఎందుకిలా జరుగుతోంది...
ఎందుకిలా జరుగుతోంది?
కొందరిది చదువు వైఫల్యం...
మరి కొందరిది ప్రేమ వైఫల్యం...
అందరిదీ ఒకే వయస్సు..
కురక్రారులోనే ఎందుకీ నైరాశ్యం...?
రేపటి భవితకు పునాదులు వేసుకోవలసిన వయస్సు యూత్‌కు అసలు భవిష్యత్తే శూన్యంగా ఎందుకు కనిపిస్తోంది? ఎక్కడుందీ లోపం? సమాజంలోనా? తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలోనా? జవాబు చెప్పేదెవరు? ఈ తరానికి సరైన మార్గం చూపేదెవరు?
=============2================
అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం కేవలం క్షణికావేశంలో తీసుకునేది ఎంతమాత్రం కాదు.. రోజుల తరబడి.. నెలల తరబడి తనలో తాను మధన పడి గమ్యం తెలియక... దారి కనిపించక అంతా చీకటిగా మారిన క్షణం ఒక్కటి ఆ వ్యక్తి ఉసురు అమాంతం మింగేస్తుంది.
ప్రస్తుత సమాజంలో టీనేజీలో ఆత్మహత్యలకు కారణం ఏమిటి?
ఆత్మ న్యూనతా భావమా? మెదడులో కెమికల్ బ్యాలెన్‌స తప్పటమా?
తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవటమా?
ఇలాంటి వారిని ముందుగా గుర్తించలేమా?
ఇలాంటి లక్షణాలను వ్యాధిగా భావించవచ్చా?
కష్టాల్లో ఉన్నవాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనుకోవటం భ్రమ... రకరకాల వేదనలతో తమలో తాము నిరంతరం కుమిలిపోయే వాళ్లు, తమ సమస్యకు పరిష్కారం ఏదీ తోచక.. ఎవరి సలహానూ తీసుకోక, ఆలోచనలు మాని క్షణికావేశంలో కొన్ని సెకన్లలో తీసుకునే నిర్ణయం ఆత్మహత్య. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైన వాళ్లే ఎక్కువగా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు పాల్పడుతుంటారు...
కేవలం టీనేజీ వయసులో ఉన్న యువతే ఎందుకింత ఒత్తిడికి లోనవుతోంది? కారణాలు అనేకం కనిపిస్తాయి.. ఈ తరం యువత చాలా సున్నితంగా పెరుగుతున్నవారు.. ఏ కాస్త ఒత్తిడినైనా తట్టుకునే ఆత్మసై్థర్యం వారిలో పూర్తిగా కొరవడింది. దీనికి తోడు ఏదో విధంగా ఇంజనీరింగో... ఎంబిబిఎస్సో చదివి విదేశాలకు పోయి ధారాళంగా డాలర్లు కొని తేవాలన్న అర్థం లేని ఆలోచనలు.. పనికిరాని టార్గెట్లు విద్యార్థులను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
ఆత్మహత్యే తప్ప మరో మార్గం లేదని భావించేవారి మానసిక ప్రవర్తన అందుకు పూనుకునే కొద్దిరోజుల ముందు విచిత్రంగా ఉంటుంది.
* ఎక్కువ సేపు ఒంటరిగా గడపటం
* చిన్న చిన్న విషయాలకు చికాకు పడటం
* తనకెవ్వరూ లేరన్నట్లుగా మాట్లాడటం
* కొన్ని ఘటనల పట్ల విపరీతంగా భయపడటం
* తన బాధ్యతలను అర్థాంతరంగా ఇతరులకు అప్పజెప్పటం
* తన కిష్టమైన వారికి దూరంగా ఉండటం...ఒక్కోసారి అతి ప్రేమగా ప్రవర్తించటం
జరుగుతుంటాయి. వీటిని సీరియస్‌గా పరిగణించి ముందు జాగ్రత్త పడితే అనర్థాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుంది.
తమ పిల్లలపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని సకాలంలో గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. ఎవరికి వారు తమ పనుల్లో మునిగిపోయి.. అసలు పిల్లలు ఎలా ఉంటున్నారు.. ఎలా వ్యవహరిస్తున్నారు అన్న విషయాలను పట్టించుకోకపోతే భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వస్తుంది. చదువు విషయంలో కానీ, జీవితం విషయంలో కానీ పిల్లల మనసెరిగి ప్రవర్తించటం అవసరం... ఒకవేళ పిల్లలు తప్పుదారిలో వెళు్తన్నారని అనిపిస్తే.. సరైన దారిలో తీసుకురావటానికి సున్నితంగా వ్యవహరించాలి తప్ప, మనసును తీవ్రంగా గాయపరిచేలా ప్రవర్తించటం సరికాదు.. తమ పిల్లలతో ఎంత స్నేహంగా మెలిగితే అంత మంచిది.. కాలేజీలో, పాఠశాలలో తమకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తల్లిదండ్రులకు స్వేచ్ఛగా చెప్పుకునేలా పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి.. వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించటం కీలకం... ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తొలగించేందుకు తోడుగా తల్లిదండ్రులు ఉంటే.. స్నేహితులు ఉంటే... విద్యార్థుల్లో ఒత్తిడి ఉండదు.. చదువూ సాఫీగా సాగుతుంది.. జీవితాన్ని అర్థం లేకుండా అంతం చేసుకోవాలన్న ఆలోచనకు తావుండదు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి