24, నవంబర్ 2009, మంగళవారం

కాంగ్రెస్‌ ఇప్పుడేమంటుంది?

డిసెంబర్‌ 6 1992...
కరసేవకు ముందే ఉత్తరప్రదేశ్‌లో రాష్టప్రతి పరిపాలన ఎందుకు విధించలేదు?
కేంద్ర ప్రభుత్వం 355, 356 అధికరణలను ఎందుకు ప్రయోగించలేదు?
కేంద్ర సైనిక బలగాలను పివి సర్కారు ఏకపక్షంగా యుపిలో ఎందుకు మోహరించలేదు?
బాబ్రీ కూల్చివేతను నిరోధించటంలో పివి నరసింహరావుదేనా వైఫల్యం?

బాబ్రీ కట్టడం కూల్చివేత తరువాత దేశమంతటా చర్చకు తావిచ్చిన ప్రశ్నలివి. కేంద్ర ప్రభుత్వం ముందుగా స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే బాబ్రీ కట్టడం కూలి ఉండేది కాదన్న వాదన విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.
అంతా కలిసి నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావును బలిపశువును చేశారు.. రాజీవ్‌గాంధీ మరణానంతరం పార్టీకి జవసత్వాలు అందించిన నాయకుణ్ణి సహచరులే దూరం చేసుకున్నారు.. మైనార్టీలు దూరమవుతారన్న కారణంతో ఆయన జీవించి ఉన్నంత కాలం రాజకీయాల దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.. మరణించాక కనీసం భౌతిక కాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకుపోయేందుకు ఇష్టపడలేదు...

అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేత ఓ రాజకీయ దిగ్గజానికి అస్తిత్వమే లేకుండా చేసింది. మైనారిటీలో ఉండి కూడా అయిదేళ్ల పాటు సర్కారును కొనసాగించగలిగిన రాజనీతిజ్ఞని సొంత పార్టీయే దూరం చేసుకుంది కూడా ఈ కారణంపైనే.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చిన నేతను మరణించిన తరువాత కూడా అక్కున చేర్చుకోలేకపోయింది. ఆయన పివి నరసింహరావు... ఆ పార్టీ కాంగ్రెస్‌.... ఇవాళ ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ చేసిన లిబరహాన్‌ కమిషన్‌ మాత్రం పివి నరసింహరావు ప్రభుత్వాన్ని అంతగా వేలెత్తిచూపలేదు... కాంగ్రెస్‌ ఇప్పుడేమంటుంది?
ఇంతకీ పివి చేసిన నేరం ఏమిటి? బాబ్రీ కూల్చి వేత జరిగిన డిసెంబర్‌ 6 1992న ప్రధానమంత్రి కుర్చీపై కూర్చుని ఉండటం... ఇవాళ దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న లిబరహాన్‌ కమిషన్‌ నివేదికలో అందరి దృష్టీ బిజెపి నాయకులపైనే ఉంది కానీ, ఈ కూల్చివేతలో అసలైన బాధితుడు పివి నరసింహరావుపై లేదు.. నిజంగా ఆయన తప్పు చేశారా? లిబరహాన్‌ కమిషన్‌ పివికి పూర్తిగా క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని పూర్తిగా సమర్థించింది.
`` పివి నరసింహరావు 1992లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.. మీడియాలో వస్తున్న వార్తలను, వదంతులను గుడ్డిగా నమ్మి, ఏకపక్షంగా కేంద్ర బలగాలను పివి సర్కారు మోహరించలేదు.. రాష్టప్రతి పాలనను విధించలేదు. అలాంటి చర్య తీసుకోవటం రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది. ఎలాంటి హేతువు లేకుండా అలాంటి చర్య పివి సర్కారు తీసుకుని ఉంటే, భవిష్యత్తులో రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తిని దెబ్బ తీసినట్లయ్యేది.''
వాస్తవానికి 1992 తొలినాళ్లలోనే అయోధ్యలో కరసేవ గురించి విశ్వహిందూ పరిషత్‌ ఓ ప్రకటన చేసింది. దీంతో పివి సర్కారులో రెండోస్థానంలో ఉన్న అర్జున్‌ సింగ్‌ లాంటి కొందరు ఈ విషయాన్ని ప్రముఖం చేశారు.. కేంద్ర సోలిసిటర్‌ జనరల్‌ దేవేంద్ర ద్వివేది బిజెపి నేతలతో మాట్లాడారు.. పివి కూడా అద్వానీ, జోషి, వాజపేయిలతో సంప్రతింపులు జరిపారు... అటు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరసేవ పూర్తి శాంతియుతంగా జరిగేలా చూస్తామంటూ సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించిన తరువాత జస్టిస్‌ వెంకటాచలయ్య కరసేవకు అనుమతినిచ్చారు.. ఇంత జరిగాక కూడా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటుంది?
కనీసం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌ అయిన రాష్ట్ర గవర్నర్‌ అయినా సకాలంలో స్పందించారా అంటే అదీ లేదు.. కేంద్ర బలగాలను పంపించాలనో, రాష్ర్టపతి పాలన విధించాలనో గవర్నర్‌ సిఫారసు చేయలేదు.. రిక్వెస్‌‌ట చేయలేదు.. ఈ కేసులో గవర్నర్‌ పాత్రను లిబరహాన్‌ కమిషన్‌ పూర్తిగా తప్పుపట్టింది. అప్పటి గవర్నర్‌ బి. సత్యనారాయణరెడ్డి మాత్రం అసలు అక్కడ ఏం జరగలేదనే ఇవాల్టికీ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు..విచిత్రమేమంటే గవర్నర్‌ మరింత `బెటర్‌'గా వ్యవహరించి ఉండాల్సిందన్న జస్టిస్‌ లిబరహాన్‌ నాటి గవర్నర్‌ను ఏనాడూ పిలవలేదు.. ఆయన స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న గవర్నర్‌ వాదన ఏమిటన్నది తెలుసుకోవలసిన అవసరం లిబరహాన్‌కు కనిపించనే లేదు. 399 మంది సాక్షు్యలను విచారించిన లిబరహాన్‌ కమిషన్‌ గవర్నర్‌ను మాత్రం ఎందుకు పక్కన పెట్టింది? ఆయన పాత్రను తప్పుపట్టిన లిబరహాన్‌ కమిషన్‌ ఆయన్ను ఎందుకు విచారించలేకపోయింది.? దీనికైతే ఇప్పుడు జవాబు చెప్పటం కష్టం.
సంక్లిష్ట సమయంలో సక్రమంగా వ్యవహరించింది పివి సర్కారు.. మోసం చేసింది నాటి కళ్యాణ్‌సింగ్‌ సర్కారు.. నష్టపోయింది పివి నరసింహరావు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ఏం చేస్తుంది? ఇప్పుడు బిజెపి నాయకులను బోనులో నిలబెట్టాలన్నది కాంగ్రెస్‌ రాజకీయం. లిబరహాన్‌ కమిషన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడి చేసింది కాబట్టి.. ఆ నివేదికను ప్రభుత్వం, పార్లమెంటు ఆమోదిస్తే.. దోషులపై కఠినంగా చర్యలు తీసుకోవలసిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు.. అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు.. ఎందుకంటే చట్టానికి ఎవరూ అతీతులు కారన్న సిద్ధాంతాన్ని అంతా విశ్వసిస్తాం కాబట్టి... అదే జరిగితే దోషులుగా నిలబెట్టాల్సిన వారి జాబితాను లిబరహాన్‌ స్పష్టంగానే లిఖించారు.. అదే కమిషన్‌ పివి నరసింహరావు విషయంలోనూ స్పష్టమైన వైఖరినే వెల్లడించింది. మరి బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలనే కాంగ్రెస్‌ నేతలు పివి విషయంలో ఎలాంటి వైఖరిని వ్యక్తం చేస్తారు? పివి నరసింహరావుకు తాము చేసిన నష్టాన్ని ఇవాళ పూడ్చగలుగుతారా? తమ పూర్వ నాయకులతో సమానంగా ఆయనకు గౌరవాన్ని ఇస్తారా? పివికి ఇంతకాలం దక్కని గౌరవ మర్యాదల్ని ఇప్పటికైనా దక్కించలేకపోతే కాంగ్రెస్‌కు లిబరహాన్‌ కమిషన్‌పై మాట్లాడే నైతిక అర్హతను ప్రశ్నించాల్సి వస్తుంది. పివి కి చేసిన అన్యాయానికి తెలుగువారికి క్షమాపణ చెప్పటం కాంగ్రెస్‌ కనీస బాధ్యత.. అలా చేయలేనప్పుడు బిజెపి నేతలపై చర్యలు తీసుకోమని డిమాండ్‌ చేసే నైతికత కాంగ్రెస్‌కు ఉంటుందని ఎలా భావించాలి?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి