13, నవంబర్ 2009, శుక్రవారం

ప్రజాకవి.. ప్రజల కవి.. కాళోజీ...

december 13 kaloji death anniversary
మన కొంపలార్చిన.... మన స్త్రీల చెరచిన...
మన పిల్లలను చంపి... మనల బంధించిన...
మానవాధములను.. మండలాధీశులను
మరచిపోకుండ గురుతుంచుకోవాలె...
కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె...
కాలంబు రాగానె కాటేసి తీరాలె...
.......................
జనం కోసం ఇంతగా గళం విప్పిన దెవరు?
ధిక్కారమే జీవింతగా గడిపిందెవరు?
ప్రజల గొడవను తన గొడవగా మలచుకున్నదెవరు?
పోరు గడ్డ ఓరుగల్లు విప్లవ వీరులను శాసించిందెవరు?

పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది... జీవితమంతా లోకం కోసం ధారపోసిన మహా పురుషుని మాటలివి... అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంత కాలం గొడవ చేసిన వాడు.. ప్రజల్ని చైతన్య పరచేందుకు ప్రజాస్వామ్య పూవులను లోకమంతటా విరజిమ్మిన వాడు.. రాజ్యహింసను ధిక్కరించిన స్వరంతోనే ప్రతిహింసనూ ప్రతిఘటించిన ఘనుడు... ప్రజాకవి.. ప్రజల కవి.. కాళోజీ...
తన ప్రజల కోసం, తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు తెలుగునాట ఒకే ఒక్కడు.. కాళోజీ నారాయణరావు.. వ్యక్తిత్వానికి మించిన వ్యవస్థ కాళోజీ... ఏ సిద్ధాంతానికీ కట్టుబడిన వాడు కాదు.. ఏ వర్గానికీ కొము్మ కాసిన వాడు అంతకంటే కాదు..అన్ని సిద్ధాంతాలూ ఆయన్ను తమవాణ్ణి చేసుకోవాలని ప్రయత్నించాయి.. లెఫ్టు రైటూ తేడా లేకుండా అన్ని వర్గాలూ ఆయన మావాడే అని చెప్పుకున్నాయి. కానీ, ఎవరికీ అందని, అంతుపట్టని వెలుగు మొగ్గ కాళోజీ...జనం చుట్టూ కము్మకున్న చీకట్లను తొలగించేందుకు తాను వెలిగినంతకాలం ప్రయత్నించింది..చీకట్లను ప్రతిఘటించింది.. ప్రజల మేలే ఆయన సిద్ధాంతం.. ప్రజల నాడే ఆయన వర్గం.. ప్రజల గొడవే కాళోజీ గొడవ... కాళోజీ వెలుగు ఆరిపోయి ఏడు సంవత్సరాలు అప్పుడే అయిపోయాయి... ఆయన గొడవ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అలుపెరుగని ధిక్కార స్రవంతికి అడ్డుకట్ట పడింది..
సుమారు తొంభై వసంతాల నిండు జీవితంలో కాళోజీ ఏనాడూ తన సంసారాన్ని పట్టించుకున్నది లేదు.. తన అన్న రామేశ్వర రావుకే అన్నీ అప్పగించారు.. ఊరూరా తిరిగారు... జనం ఘోష తన ఘోషగా చెప్పుకొచ్చారు..
నిజాం కాలంలో ఆర్యసమాజంలో తిరిగారు.. మావోయిస్టు ఉద్యమానికి అండగా నిలిచారు... ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మొదటగా కనిపించేది కాళోజీ.. ఆయన రాజ్యాంగాన్ని నిరసించలేదు.. రాజ్యహింసను నిరసించారు.. అదే సమయంలో మావోయిస్టుల అర్థం లేని హింసనూ సమర్థించలేదు.. ప్రజాస్వామ్య వ్యవస్థను మన్నించాడు... గౌరవించాడు.. అయితే పాలకులను ఎన్నుకునే ముందు ఆలోచించి ఓటేయమన్నాడు...
ప్రాణ తుల్యము ప్రజాస్వామ్యమున ఓటు.
వినియోగపరచుటకు అనువైన ఘడియ
ఓటిచ్చునప్పుడె ఉండాలె బుద్ధి
ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును?
తర్వాత ఏడ్చినను తప్పదనుభవము..
రోజుకో విధంగా ఏదో రూపంలో ఎన్నికలు ముంచుకొస్తూనే ఉన్న సమయంలో ఈ మాటలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవి... ఎప్పటికైనా ప్రతి ఓటరు అనుభవంలోకి వచ్చే మాటలివి....నేతలు ఎన్ని రకాల ప్రచారాలు చేస్తున్నా.. ఎన్ని గిమ్మిక్కులు చేస్తున్నా... ఓటరు తాను నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తుకు తెస్తున్న వాక్యాలివి. కాళోజీ నిలువెత్తు సంతకానికి ఇవి ఆనవాళు్ల...
అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు..
అన్యాయం అంతరించినప్పుడే నా గొడవకు సంతృప్తి

అన్నాడు కాళోజీ... ఆ అన్యాయం అంతరించేదెన్నడు? ప్రజలు ప్రశాంతంగా ఉండేదెన్నడు..
జరిగిందంతా చూస్తూ ఏమీ ఎరగనట్లు పడి ఉండటానికి నేను సాక్షీభూతుణ్ణి కాను...
సాక్షాత్తూ మానవుణ్ణి...
అన్నవాడు కాళోజీ... మన నాయకుల్లో.. ఆయన తమవాడని చెప్పుకుంటున్న వాళ్లలో.. ఫోటోలు పెట్టుకుని పూజిస్తున్న వాళ్లలో ఎవరికైనా ఈ మాటలు గుర్తుంటే ఎంత బాగుండు?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి