7, జనవరి 2010, గురువారం

ఆయన ఓ మోనార్క్

ఎస్.ఎస్.పి. యాదవ్... ఈ పేరే వివాదానికి పర్యాయ పదం. డిజిపిగా ఉన్నా, ఆర్టీసీ ఎండీగా ఉన్నా ఆయన రూటే సపరేట్.. తాను ఏ పదవిలో ఉన్నారో దానితో ఆయనకు సంబంధం లేదు.. తాను ఎవరికీ జవాబుదారి కాదు.. చివరకు ముఖ్యమంత్రి కూడా ఆయన కంటికి కనిపించరు.. ఆయన ఒక్కసారి చెబితే వందసార్లుచెప్పినట్లే. ఆయన నిర్ణయానికి ప్రభుత్వం కూడా ఇరుకునపడాల్సిందే. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన ఓ మోనార్క్.

వివాదాల కేరాఫ్ అడ్రస్ ఎస్ఎస్పి యాదవ్ తన స్టైల్ మార్చుకోలేదని మరోసారి రుజువు చేసుకున్నారు..
డిజిపిగా ఉన్నంతకాలం తనకు తాను నియంతగా వ్యవహరించారు.
నాడు రాష్ట్ర హోం మంత్రిని నిర్లక్ష్యం చేసినా, ఇవాళ ఏకంగా సిఎంను మనిషే కాదన్నా ఆయనకే చెల్లింది.
ఎన్నికల ప్రధానాధికారితో లేఖల యుద్ధం చేసినా.. పోయిన పదవిని తిరిగి తెచ్చుకోగలిగినా యాదవ్ తీరే వేరు..
ఇవాళ ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా, సంబంధిత శాఖ మంత్రికైనా తెలియకుండా ఆర్టీసీ చార్జీలను అడ్డగోలుగా పెంచటంతో మరోసారి వివాదస్పదమయ్యారు ఆర్టీసి ఎండీ ఎస్.ఎస్.పి యాదవ్. ఈ మాజీ డిజిపి గతంలో ఆనేక సార్లు వివాదాల సుడిగండంలో తిరిగారు. ఇంకా ఆర్నెల్లలో సర్వీసు ముగుస్తుందనగా ఆర్టీసి ఎండిగా పగ్గాలు చేపట్టిన యాదవ్ తాజాగా ఆర్టీసి చార్జీల మోత మోగించి తానింకా సర్వీసులోనే ఉన్నాననే విషయం అందరికీ గుర్తుచేశారు. ఆర్టీసి నష్టాలబాట పట్డడంతో సంస్థకు ఛార్జీలు పెంచక తప్పేట్టు లేదని యాజమాన్యం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇవన్నీ పట్టుకుని ప్రభుత్వం వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఎం.డీ యాదవ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఎంతమాత్రం లేదంటూ, సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం సంస్థకు ఉందంటూ యాదవ్ ఛార్జీలపెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అంతకు ముందు సిఎం వద్దకు ఈ ప్రస్తావన వచ్చినప్పటికీ ప్రతిపాదనలు పంపించాలని కోరినట్లు సమాచారం. అయితే యాదవ్ తన దైన స్టైల్లో ఛార్జీలు పెంచేసారు.. సిఎంకు, సర్కారుకు చిక్కకుండా ఎంచక్కా ఆగ్రా హాలిడే ట్రిప్ కు వెళ్లిపోయారు. అయితే ఆయన తిరిగొచ్చేలోపే మరికొన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఆర్టీసీ ఛార్జీలు పెంచుకునే అవకాశం కార్పోరేషన్ కు ఉన్నప్పటికీ ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం అనుమతి కోరాలి. కానీ యాదవ్ గారి జమానా కాబట్టి ఆలా జరగలేదు. కనీసం రవాణాశాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు కూడా తెలియకుండా ఛార్జీలు మమోత మెగిందంటే కార్పోరేషన్ వ్యవహరించిన తీరు ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. పాపం మంత్రి గారు తీరిగ్గా తన గోడును సిఎం విన్నవించుకున్నారు. ఒక వేళ యాదవ్ ఏకపక్ష నిర్ణయమైతే ఆయనపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన అంటున్నారు.
అయితే వస్తున్న నష్టాన్ని ప్రభుత్వం భరించనని తేగేసి చెప్పడంతో ఛార్జీలు పెంచక తప్పలేదని యాజమాన్యం అనవచ్చు.. కానీ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం తెలియకుండా, ముఖ్యమంత్రిని అడక్కుండా నిర్ణయం తీసుకోవటం రోశయ్య అధిపత్యాన్ని నేరుగా ప్రశ్నించినట్లయింది. ఇప్పటికే రోశయ్య పరిపాలనపై రకరకాలుగా పెదవి విరుపులు మొదలయ్యాయి. ఈ సమయంలో యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం సిఎంను ఒక విధంగా అవమానించినట్లే... రాజకీయ కోణంలో చూసినా యాదవ్ కరడు గట్టిన వైఎస్ అభిమాని.. ఇప్పుడు కూడా ఆయన ఇలాగే ప్రవర్తిస్తున్నారా? జగన్ వర్గానికి అనుకూలంగా సర్కారును ఇరుకున పెడుతున్నారా?


1 కామెంట్‌:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఇది అంత నమ్మబుద్దిగా లేదు. ఎలాగు కొద్దిరోజుల్లో దిగిపోతాడు కాబట్టి నెపం ఆయనపై తోసి వుండొచ్చు అనిపిస్తోంది. ఎలాగు వివాదాలకు ఆద్యుడు కాబట్టి సి.ఎం. తప్పించుకొనే ఉపాయంలా అనిపిస్తోంది.