11, జనవరి 2010, సోమవారం

కావూరి మీడియా

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నది మీడియానే అంటూ దశాబ్దాతరబడి రాజకీయ అనుభవం ఉన్న కావూరి వంటి సీనియర్లే అసహనంతో వ్యాఖ్యానించారు.. కానీ, ప్రాంతాల మధ్య ఇవాళ ఇంత తీవ్రంగా విభేదాలకు నిజంగా కారకులెవరు? తమ ప్రయోజనాల కోసం వ్యవస్థను అడ్డగోలుగా వాడుకొని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న రాజకీయ నాయకత్వం కాదా?

వెయ్యి తుపాకుల కంటే.. ఒక కలానికి నేను భయపడతానని నెపోలియన్‌ అన్నాడట.. కానీ, ఇవాళ రాజకీయ నాయకులకు మీడియా ఆటపట్టుగా మారిపోయింది.. నైతికంగా మీడియా వేర్వేరు దారుల్లో ప్రయాణం చేస్తుండవచ్చు. తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తుండవచ్చు. కానీ, వార్తలను వార్తలుగా చూపించటంలో ఎవరూ వెనక్కి వెళ్లటం లేదు.. లెక్కకు మిక్కిలి చానళ్లు సమాచార మాధ్యమంలోకి ప్రవేశించటం, వాటి మధ్య పోటీ తత్వం పెరగటం ప్రతి వార్తను హైలైట్‌ చేయటం ద్వారా ప్రజల చేరువలోకి వెళ్లే ప్రయత్నం ప్రతి చానల్‌ చేస్తుంది. ఇందుకోసం తమకు ముందుగా అందిన సమాచారాన్ని అంతకంటే వేగంగా అందించటం కోసం కృషి చేస్తుంది.. ఈ దారిలో కొండకచో కొంత పొరపాటు దొర్లితే దొర్లవచ్చు.. అంతమాత్రాన అది వాటి బలహీనతగా రాజకీయ వ్యవస్థ భావించటమే దురదృష్టం. సుమారు నెలన్నర రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ, జైఆంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తెలుగుమీడియా అలసట ఎరుగని ప్రసారాలు చేసింది.ఎక్కడ ఏం జరిగినా వాటిని విశ్లేషణాత్మకంగా తనదైన రీతిలో ప్రజలకు అందించింది. నాయకులు పోటీలు పడి ఒకరిపై ఒకరు.. ఒక ప్రాంతంపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నా వాటినన్నింటినీ ప్రజల ముందుంచింది.. కానీ, నేతలకు ఇవేవీ పట్టలేదు.. తమ ప్రకటనల వల్ల తాము ఇరుకున పడగానే మీడియాపై రెచ్చిపోవటం ఒక తంతుగా మారింది. ప్రింట్‌ మీడియా ఉధ్ధృతంగా ఉన్న సమయంలో నేతలు ఎలా మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది.. తరువాత తాను అలా అనలేదని బుకాయించినా ఆధారం ఉండేది కాదు.. కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియాలో నేతలు ఏం మాట్లాడినా రికార్డు అవుతుంది. ఆ విషయం మన నాయకులకు తెలియందేమీ కాదు.. కానీ, అయినా బుకాయించటం వారికే చెల్లుబాటు అయింది. తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఉద్యమం ఉండేది కాదంటూ కావూరి తాజా ప్రకటన ఇందుకు ఉదాహరణ..ఒక బాధ్యత గల ఎంపి, మొన్నటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌కు ప్రతినిథిత్వం నెరపిన ఈ నాయకుడు విలేఖరుల సమావేశంలోనే ఈ మాటలు మాట్లాడారు.. చానళ్లు తీరా ప్రసారం చేసిన తరువాత వ్యక్తమైన నిరసనలకు కావూరికి ఇబ్బంది కలిగించాయి....ముందుగా తానలా అనలేదని అన్నారు.. తరువాత తన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పారన్నారు.. తప్పు తనది కాదని, మీడియాదేనని చిందులు వేశారు..ఇక మీడియాతో మాట్లాడనన్నారు.. ఎలక్ట్రానిక్‌ మీడియా లేని కాలంలో అయితే ఆయన ఏం ఖండించినా చెల్లేదేమో... ఇప్పుడు రికార్డెడ్‌ కామెంట్‌ ఉన్న తరువాత కూడా తాను మీడియాతో మాట్లాడనని అలిగితే ఏం చెప్పాలి? ఒక ప్రాంతపు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఇలాంటి వ్యాఖ్యానాలే.. ఒకరి మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యానాలు చేసి.. అవి మీడియాలో వచ్చిన తరువాత అదిగో మీ వల్లనే ప్రాంతాల మధ్య చిచ్చు రేగుతోందని మాట్లాడటం ఆక్షేపణీయం...వార్తల్ని సృష్టించేది ప్రధానంగా రాజకీయ వ్యవస్థ. మీడియా ఆ వార్తల్ని ప్రసారం చేస్తుంది.. వార్తలు నిప్పుకణికలు.. నిప్పులాంటి వార్తలు నిలువునా కాల్చేస్తాయి.. మరి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం...?

కామెంట్‌లు లేవు: