11, జనవరి 2010, సోమవారం

సాహిత్య అకాడమీ అవార్డుల్లో నూ అన్యాయమేనా?...

ఇప్పుడు ఒక సాహిత్య అకాడమీ అవార్డు విషయం చర్చల్లోకి వస్తూ ఉండటం వల్ల తెలంగాణ విషయంలో సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యులు, అకాడమీ యాజమాన్యం చేసిన అన్యాయం గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. 1953 నుంచి సాహిత్య అకాడమీ అవార్డులు కొన్ని సంవత్సరాలు మినహాయించినా, ఇప్పటికి 50దాకా ఇచ్చి ఉంటారు. తెలంగాణాలో ఆధునిక సాహిత్య చైతన్యం ప్రజ్వలంతంగా ఉన్నది ఈ కాలం. ఉద్గమించిన నిత్య చైతన్యంతో, ఉద్యమాల నేపథ్యంతో పునరుజ్జీవన జాగృతితో తెలంగాణాలో సాహిత్యం క్రియాశీలంగా లేదని, ఉత్తమ రచనలు రాలేదని ఎవరూ చెప్పలేరు.

ఆ లెక్కన కనీసం పాతిక అవార్డులైనా తెలంగాణా మట్టిలో పుట్టి పెరిగిన రచయితలకు వచ్చి ఉండవలసింది. కానీ నిజానికి ఈ భూమి పుత్రులకు దక్కినవి సింగిల్‌ డిజిట్‌ కూడా దాటలేదు. సురవరం ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి, దాశరథి, గోపి, నవీన్‌, గడియారం రామకృష్ణ శర్మలకు అవార్డులు వచ్చిన విషయమే గుర్తుకు వస్తుంది. ఇంత కనిష్టంగా పురస్కారాలు లభించటానికి కారణం ఏమిటో ఎవరూ చెప్పలేరు.. ఈ నేలలో వానమామలై వరదాచార్యులకు, దాశరథి రంగాచార్యకు, సదాశివకు, కాళోజీకి, దోర్బల విశ్వనాథశర్మకు, కపిలవాయి లింగమూర్తికి, వట్టికోట ఆళ్వార్‌ స్వామికి, బూర్గుల రామకృష్ణారావుకు, కసిరెడ్డి వెంకటరెడ్డికి, ముదిగంటి సుజాతారెడ్డికి, యశోదారెడ్డికి, మాదిరాజు రంగారావు, సంపత్కుమార, సుప్రసన్నలకు, బి.రామరాజుకు, వరవరరావు, రామాచంద్రమౌళి ఇత్యాదులకు అకాడమీ పురస్కారాలకు అర్హత లేదని అనుకోవటం జరుగుతున్నదా? లేదా.. ఈ రచయితలు తమను గూర్చి ప్రచారం చేసుకోలేకపోవటం, గుంపులు కట్టలేకపోవటం, పైరవీలు చేయలేకపోవటం, కారణమా?
కేంద్ర సాహిత్య అకాడమీ తొలి అవార్డుల సందర్భంలో నిర్ణాయక స్థానంలో ఉన్న శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు ఆ ప్రాంతంలోని సృజనాత్మక రచయితలు ఎవరూ నచ్చక తొలి అవార్డుకి ప్రతిపాదనలను పంపే క్రమంలో తెలంగాణ దాకా వచ్చిన అంశం దేవులపల్లి రామానుజరావు గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు.. తరువాత ఆయన తన కాలంలో వచ్చిన అవార్డులు రాధాకృష్ణన్‌ భారతీయ తత్త్వ శాస్త్రం అనువాదానికి , రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రకు, నాట్యశాస్త్రం అనువాదం వంటి వివరణ గ్రంథానికి ఇప్పించారు.. ఈ క్రమంలో సృజనాత్మక రచన అనదగినది బాలాంత్రపు రజనీకాంతరావు శతపత్ర సుందరి మాత్రమే. ఎవరికీ ఆ గ్రంథం ఇవాళ గుర్తుకు లేదు. తెలుగు సాహిత్య ప్రపంచంలో శిఖరప్రాయులైన మహాకవులు, రచయితలు అవార్డుకు ఆయన కాలంలో నోచుకోలేదు. ఇది బహిరంగ రహస్యమే.
తరువాత కాలంలో బెజవాడ గోపాలరెడ్డి గారు చక్కని అభిరుచి ఉన్నవారు కావటం వల్ల సృజనాత్మక రచయితలకు ఏదో విధంగా పురస్కారాలు వచ్చేందుకు ప్రయత్నించారు.. తరువాతి కాలంలో మళ్లీ వ్యక్తుల పలుకుబడులు, ఇష్టానిష్టాలు, అభిరుచులు, రాగద్వేషాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. దీన్ని ఇప్పటికైనా మనం సరిదిద్దుకోలేమా? తెలంగాణ సాహిత్యానికి సరైన గౌరవాన్ని సాధించుకోలేమా?

1 కామెంట్‌:

budugu చెప్పారు...

Rama chandramouli for sahitya akademy award..ha ha ha..what a joke. Because of this one statement your article can be thrown in to dust bin.
sadasiva? what is his original contribution? for a long time, he did nt write in telugu. when he started he wrote some memoirs..Though he is a great guy and i am his big fan, he does nt deserve award for that.

dont politicize literature.
I am from telangana. That does nt mean we can accept any BS arguments.