1, జనవరి 2010, శుక్రవారం

ఆరు సూత్రాల పథకంపై ఈశ్వరీబాయి ఆవేదన

సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది. ఇది వరలోఅష్ట సూత్ర పథకాలు, పంచ సూత్ర పథకాలు వచ్చాయి. వాటికి పట్టిన గతే ఈ ఆరు సూత్రాల పథకాలకు కూడా పడుతుంది. గవర్నరుగారి ప్రసంగ సందర్భంలో ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఇక్కడ నేను తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక్కడ ఏమని రాశారంటే, ఇక్కడ నాయకులతో అనేక సార్లు చర్చించామని, వారిలో వారు కూడా చర్చించుకున్నారని ఉంది. ఎవరు ఎవరితో చర్చించారో మాకు తెలియదు. ఈ రాజ్యం కాంగ్రెస్‌ వాళ్ళ అబ్బ సొమ్మా అని అడుగుతున్నాను. కాంగ్రెస్‌ పార్లమెంటు మెంబర్లు, శాసన సభ్యులతో మాట్లాడితే సరిపోయిందా అని అడుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ వారు ఎప్పుడూ ఆంధ్రతో కలియడానికి సిద్ధంగా లేరు.

రాయలసీమ వారు కూడా కలియడానికి ఇష్టం లేకపోతే శ్రీబాగ్‌ ఒప్పందం అని పెట్టి వారిని కలుపుకున్నారు. ఇక్కడ కూడా ప్రజలకు కలవడానికి ఇష్టం లేకపోయినా వెంకటరెడ్డిగారు కొన్ని షరతులపై కలుస్తామని ఒప్పుకున్నారు. వాటిని మేము కూడా ఒప్పుకుం టాము అన్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నాయకుల మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పం దం అయినది. ఆ విధంగా పదమూడు సంవత్సరాలు నడిచింది. మంత్రి పదవులు కావాలి అనుకున్నవారికి దొరికాయి. శాసన సభ్యులు కాదలచుకున్నవారు అయినారు. వారు ఇక్కడ డబ్బు సంపాదించుకున్నారు. బ్లాక్‌ మార్కెట్టు కోసం పైరవి చేసుకున్నారు. మంత్రులు చాలా సుఖంగా ఉండిపోయినారు. తెలంగాణ వారి బాధలను మరిచిపోయినారు.

పదమూడు సంవత్సరాలైన తర్వాత ఉద్యమం లేవతీసినారంటే, నాయకులు లేవతీయలేదు. విద్యార్థులు లేవతీసినారు. ఉద్యోగులు లేవతీసినారు. క్లాస్‌ 4 ఉద్యోగులు లేవదీసినారు. టీచర్లు లేవతీసినారు.వారంతా లేవతీసిన తర్వాతనే ఇక్కడ లీడర్లు దానిలో పూనుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి కొంతమంది లీడర్లు వచ్చి పవిత్రమైన మూవ్‌మెంట్‌ను స్టాప్‌ చేసి ఆరు సూత్రాలు, 7సూత్రాలు, 8 సూత్రాలు అనుకొని వెళ్లిపోయారు.

కేంద్రం కూడా విఫలం అయినది. చవాన్‌ను పంపించి స్పాట్‌ ఎంక్వయిరీ చేయమన్నారు. 69లో ఒకనాడు ఇందిరాగాంధీ గారు ఏ రాత్రి వచ్చారో వెళ్లిపోయారు. 1972 ఎలక్షన్స్‌ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణా గురించి న్యాయం చేస్తామని ప్రామిస్‌ చేశారు. ఫెయిర్‌ డీల్‌ టు ది తెలంగాణ అని వరంగల్లులో ఇందిరాగాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు చెప్పారు. కానీ ఎలక్షన్‌ కాగానే తెలంగాణను మర్చిపోయారు.ఆంధ్రలో పెద్ద ఉద్యమం లేవదీసినారు. వెంగళరావుగారు ముఖ్యమంత్రి అయితే గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారే, అమాయకులైన బిడ్డల ప్రాణాలు తీయించిన వారే మంత్రులు అయినారు. ప్రత్యేక ఆంధ్ర కావాలన్న వారు ఈనాడు మినిష్టర్లు అయినారు. ఇది వరకు ప్రత్యేక తెలంగాణ కావాలనిన వారు మంత్రులు అయినట్లే, ఆంధ్ర కావాలని అనినవారు మంత్రులు అయినారు.

సెపరేషన్‌ మంచిది. పంజాబ్‌, హర్యానా చిన్న రాష్ట్రాలుగా అయిన తర్వాత చాలా అభివృద్ధి అయినవి.సముద్రం లాంటి పెద్ద స్టేట్‌తో కలిసి ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి కాదు. తెలంగాణ వెనుకబడి ఉంది.మాకు సెపరేటు స్టేట్‌ కావాలని మేము అంటున్నాం. ఆరు సూత్రాల పథకం మూలంగా తెలంగాణ రీజియనల్‌ కమిటీ ఖతం అయినది. ముల్కీ రూల్సు ఖతం అయినవి. తెలంగాణ వారి గతి ఏమయినది? తెలంగాణ వారు అనాథలు అయినారు. ఎవరికి చెప్పుకోవాలి? ఏమి చెప్పుకోవాలి?

ఆరు సూత్రాల పథకంపై
1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో
జె. ఈశ్వరీబాయి ప్రసంగం

5 కామెంట్‌లు:

Nrahamthulla చెప్పారు...

ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

అజ్ఞాత చెప్పారు...

World today is far more different than in 1960s and 70s. People will not tolerate perpetuating descrimination in todays world. Telangana as a separate state is a good idea in 70s. But in todays globalized world resource and manpower sharing is what makes socities prosperous.

Nobody says Telanagana is not exploited during socialist era. You know the reasons for it. But todays world is very different. Try to come out of that old midset(mould).

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ముఫ్ఫయ్యాఱేళ్ళనాటి ప్రసంగం. What way is it relevant now ? అప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ ఒకటేనా ? అప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదు ఒకటేనా ? అప్పటివి అన్నీ ప్రభుత్వోద్యోగాలు. ఇప్పటివన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు.

దోపిడికి అసలైన అర్థం వనరుల తరలింపు. కానీ హైదరాబాదులో రాజధాని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవనరులన్నీ తెలంగాణలోకి ప్రవహించాయి తప్ప తెలంగాణ వనరులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకి ప్రవహించలేదు. మఱి అటువంటప్పుడు ఎవఱు ఎవఱిని దోపిడి చేసినట్లు ? తెలంగాణ మిహతా రాష్ట్రాన్నా ? మిహతా రాష్ట్రం తెలంగాణానా ? ఆలోచించండి. ఇప్పుడు విడిపోతే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది వేర్పాటువాదులకి, మావంటివాళ్ళు ఏమీ చెప్పకుండానే !

సమతలం చెప్పారు...

#

"దోపిడికి అసలైన అర్థం వనరుల తరలింపు. కానీ హైదరాబాదులో రాజధాని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవనరులన్నీ తెలంగాణలోకి ప్రవహించాయి తప్ప తెలంగాణ వనరులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకి ప్రవహించలేదు. మఱి అటువంటప్పుడు ఎవఱు ఎవఱిని దోపిడి చేసినట్లు ? తెలంగాణ మిహతా రాష్ట్రాన్నా ? మిహతా రాష్ట్రం తెలంగాణానా ? ఆలోచించండి. ఇప్పుడు విడిపోతే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది వేర్పాటువాదులకి, మావంటివాళ్ళు ఏమీ చెప్పకుండానే !"
ఇవేమైన అర్ధం ఉన్న మాటలేనా?
తెలంగాణాలోకి వనరులు ప్రవహించడం కాదు, దురాక్రమణదారులు ప్రవేశించి వనరులను దోచుకొన్ని దర్జాగా అనుభవిస్తున్నారు.
ఛ, ఛా
ఈ విధంగా మాట్లాడే వాళ్లకు కనీస నీతిలేదు.
నీతి ఉంటె వాళ్ల వనరులతొ వాళ్లె బ్రతకాలి, బ్రహ్మాండంగా. వాళ్ల వనరులు మాకొద్దు.
మాకున్న వనరులతోనే బ్రతుకుతాము

Nrahamthulla చెప్పారు...

ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః

* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.