6, జనవరి 2010, బుధవారం

ఆరు సూత్రాలేమిటి?

సెప్టెంబరు 21, 1973 నాటి ఆంధ్రప్రదేశ్‌ నాయకుల ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాలో మేము, కేంద్ర నాయకులతోనూ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించాం.రాష్ట్ర భవిష్యత్తుపై ప్రస్తుతం కలిగిన అపనమ్మకాలను.. దిగువున తెలిపిన సూత్రాల అమలు ద్వారా సంపూర్ణంగా తొలగించగలమని సంతృప్తి చెందుతున్నాం.

1. నిర్దిష్ట వనరులు కేటాయించటం ద్వారా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగిరిపరచటం. ప్రణాళికాబద్దంగా రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేయటం. దీని కోసం చట్టసభల్లోని ఆయా వెనుకబడిన ప్రాంతాల ప్రజాప్రతినిధుల తోపాటు అభివృద్ధి పథకాల రూపకల్పన, పర్యవేక్షణలో నిపుణులకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి వ్యూహాలలో భాగస్వాములను చేయటం. ఈ లక్ష్యసాధన కోసం రాష్ట్ర స్థాయి ప్రణాళిక మండలి తోపాటు వివిధ వెనుకబడినప్రాంతాలకు ఉప కమిటీలను ఏర్పాటు చేయాలి.

2. విద్యా సంస్థల ప్రవేశాల్లో స్థానికులకే సముచిత ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని రూపొందించటం. హైదరాబాద్‌లో కొత్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు. విద్యా సదుపాయాల విస్తరణే లక్ష్యంగా రాష్ట్ర విద్యా విధానం.

3. యావత్‌ రాష్ట్ర అవసరాల ప్రాతిపదికగా.. నేరుగా చేపట్టే ఉద్యోగ నియమాకాల్లో నిర్ధిష్ట పరిధి మేరకు స్థానిక అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాల్సినవి ..(అ) నాన్‌గజిటెట్‌ పోస్టులు (సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలు, సంస్థలు, హైదరాబాద్‌ నగర పోలీసు విభాగాలకు మినహాయింపు), (ఆ) స్థానిక సంస్థల పరిధిలోని కరస్పాండింగ్‌ పోస్టులు, (ఇ) తహశిల్దార్‌, జూనియర్‌ ఇంజినీర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ పోస్టులు. వీరికి పదోన్నతుల అవకాశాలు మెరుగుపర్చేందుకు స్థానికంగా, పాలనాపరమైన సౌలభ్యం మేరకు నిర్దేశిత గజిటెడ్‌ పోస్టుల సర్వీసులను ప్రథమ, ద్వితీయ స్థాయిలుగా వర్గీకరించాలి.

4. ఉద్యోగుల నియమాకాలు, సీనియారిటీ, పదోన్నతులు తత్సంబంధిత సమస్యల పరిష్కారానికి అత్యున్నతాధికారం గల అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు తప్పని సరి. ట్రైబ్యునల్‌ తీర్పులను సాధారణంగారాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. సదరు ట్రైబ్యునల్‌.. ఇవే విషయాల్లో న్యాయవ్యవస్థ పరిమితులకు లోబడి ఉండాలి.

5. పై సూత్రాల ఆధారంగా తీసుకునే వివిధ చర్యల అమలులో వివాదాలు, అనిశ్చిత పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్రపతికి తగిన అధికారాలు దఖలుపరుస్తూ రాజ్యాంగానికి సముచిత సవరణలు చేయాలి.

6. పైన పేర్కొన్న అంశాల వల్ల ముల్కి(స్థానిక) నిబంధనలు, స్థానిక కమిటీల కొనసాగింపు అవసరంలేదు.

వెనుకబడిన ప్రాంతాల శీఘ్రాభివృద్ధి, రాష్ట్ర రాజధాని ప్రణాళికాబద్ధ అభివృద్ధి అంశాలు ఆరు సూత్రాల పథకం అమలు విజయవంతం కావడానికి దోహదపడతాయని మేమునమ్ముతున్నాం. ఆరు సూత్రాల పథకం అమలుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ కేంద్రప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నాం''

పథకంపై అక్టోబరు 22, 1973న వివరణ ఇస్తూ నాయకులు చేసిన ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలు..
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల శీఘ్రాభివృద్ధి తోపాటు యావత్‌ రాష్ట్రం సమంగా అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలందరికీ సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు, జీవనోపాధి కల్పించాలని ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించినట్లు ఆ ప్రకటనలో వివరించారు. తద్వారా రాష్ట్ర ప్రజలందరిలో సమైక్య భావన పెంపొందాలన్నది తమ దృక్పథం వారు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు సూత్రాలకు లోబడే పలు కార్యక్రమాలు చేపడుతున్నాయని వివరించారు.

- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టే పథకాల అమలుకు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రణాళిక సాధారణ వనరుల నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం ద్వారా కూడా సమీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రణాళిక మండలి కీలకపాత్ర వహిస్తుందని వెల్లడించారు.
- ప్రణాళికామండలి అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించటానికి వివిధ వెనుకబడిన ప్రాంతాలకు చెందిన కమిటీలు సహాయపడాలి. ఈ కమిటీల్లో స్థానిక పరిస్థితులు, సమస్యలు బాగా తెలిసిన ప్రజాప్రతినిధులకు తగు సంఖ్యలో భాగస్వాములను చేయాలి. ముఖ్యమంత్రే ఈ కమిటీలకు ఛైర్మన్‌గా ఉంటే ప్రభుత్వ మద్దతు వాటికి బాగా లభిస్తుంది.
- రాష్ట్ర రాజధాని ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రకటనలో వివరించారు.
- ఉద్యోగాల విషయాల్లో వివిధ ప్రాంతాల వారందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే ఆరు సూత్రాల పథకం ప్రధానోద్దేశంగా వివరిస్తూ ‘స్థానికత' నిర్దరణకు జిల్లాస్థాయి పరిధిగా ఉండాలన్నారు. నాలుగో తరగతి, ఎల్‌.డి.సి., ఉద్యోగాల్లో జిల్లాయే స్థానిక ప్రాంతంగా ఉంటుంది. ఇతర కేటగిరీ ఉద్యోగాలకు కొన్ని జిల్లాలను స్థానికంగా పరిగణించాల్సి ఉంది. దీని కోసం రాష్ట్రం మొత్తాన్ని ఐదు లేదా ఆరు విభాగాలు(జోన్లు)గా, కంటోన్మెంట్‌ తోపాటు జంటనగరాలను ప్రత్యేక విభాగంగా ఏర్పరచాలన్నది తమ యోచనగా పేర్కొన్నారు.
- స్థానికులకే 100 శాతం ఉద్యోగాలు కేటాయించటాన్ని సమర్థనీయం కాదంటూ.. కొన్ని సూచనలు ఈ ప్రకటనలో చేశారు. నాలుగో తరగతి ఉద్యోగాల్లో 80శాతం, ఇతర అన్ని నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాల్లో 70 శాతం వరకూ, గెజిటెడ్‌ పోస్టుల్లో 60 శాతం వరకూ స్థానికులకు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. పెద్ద ప్రాజెక్టుల వల్ల వచ్చే ఉద్యోగాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు సమానంగా పొందాల్సి ఉంటుందని చెప్పారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.

ఆరు సూత్రాల పథకాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం 1974 మేలో 32వ రాజ్యాంగ సవరణ చేసింది. ఆర్టికల్‌ 371కి మార్పులు చేస్తూ డి, ఇ నిబంధనలు కొత్తగా పొందుపర్చింది.

(1973 అక్టోబరు 22 నాటి ప్రకటనకు ఇది క్లుప్తీకరణ.)

కామెంట్‌లు లేవు: