7, ఏప్రిల్ 2010, బుధవారం

దేశ రాజధానిలో రాష్ట్ర రాజకీయాల సందడి

దేశ రాజధానిలో రాష్ట్ర రాజకీయాల సందడి ప్రారంభమైంది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తుది కసరత్తులు చేస్తున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాల కారణంగా రెండు వర్గాలుగా చీలిపోయిన ప్రధాన పార్టీలు, నివేదిక సమర్పణలో కూడా అదే వైఖరిలో ముందుకు పోతున్నాయి...

విభజన.. సమైక్య వాదాలు.. సాక్ష్యాలు, ఆధారాలు.. వివరణలు.. విశ్లేషణలతో రాజకీయ పార్టీల నివేదికలు తుదిరూపానికి వచ్చేశాయి.. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు ఇవ్వాల్సిన గడువు మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో ఢిల్లీలో మనవారి హల్‌చల్‌ మొదలైంది... వివిధ రాజకీయ పార్టీలు, వర్గాలు.. బృందాలుగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధానంగా ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ౧౪౦౦ పేజీల సుదీర్ఘ నివేదికను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణాకు వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాలను ఉటంకిస్తూ అతి పెద్ద నివేదికనే టిఆర్‌ఎస్‌ రూపొందించింది..

ప్రదాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్లే నివేదిక విషయంలోనూ వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరేంటో స్పష్టం చేయలేదు.. సరికదా.. పార్టీలోనే రెండు గ్రూపులను ఏర్పాటు చేసి ఎవరి గోల వారే పడండంటూ తేల్చేశారు.. ఇంకేం తెలంగాణా టిడిపి, సీమాంధ్ర టిడిపి అంటూ రెండు కుంపట్లు ఏర్పడి రెండు నివేదికలను రూపొందించాయి.. ఈ రెండు బృందాలు ఇప్పటికే ఢిల్లీలో మకాం పెట్టాయి.
కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నివేదికలు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు లేదు.. నివేదికలు ఇచ్చేందుకు గడువును పెంచాలని కోరనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ పేర్కొనటం ఇందుకు తార్కాణం.. చివరకు నివేదికల విషయం దగ్గరలోనైనా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఒక స్పష్టమైన వైఖరికి రాలేకపోయాయి. ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు ఎస్కేపిజం అన్న సిద్ధాంతం తప్ప మరొక ధోరణిని అవలంబించే రిస్క్‌ తీసుకోలేకపోతున్నాయి. ఏమైతేనేం.. శ్రీకృష్ణ కమిటీ ఈ నేవేదికలన్నింటినీ పోగు చేసుకుని ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తుందన్నది మాత్రం వేచిచూడాలి...


కామెంట్‌లు లేవు: