13, ఏప్రిల్ 2010, మంగళవారం

చంద్రబాబు నాయుడు మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నారా?

జాతీయ రాజకీయాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. బొటాబొటి సంఖ్యాబలంతో సర్కారును నెమ్మదిగా నెట్టుకొస్తున్న యుపిఏ కు ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. బిజెపి యేతర ప్రతిపక్షాలన్నీ ఆర్థిక బిల్లులపై కోత తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటం సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టింది.. కోతతీర్మానమే ప్రవేశపెడితే, సర్కారు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి..
మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వం తొలిసారి అత్యంత కీలకమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. కాంగ్రెస్‌, బిజెపి యేతర విపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. అధిక ధరలు, ఇతర అంశాలపై సర్కారును నిలదీసేందుకు, ఆర్థిక బిల్లులపై కోత తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు నాయుడి నేతృత్వంలో సమావేశమైన ౧౩ పార్టీలు నిర్ణయించాయి. దీని వెనుక ఉన్న ఇదే జరిగితే సర్కారు మైనార్టీలోకి పడిపోయే అవకాశం ఉంది..

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బలం దాదాపు ౨౮౭ దాకా ఉంది.
ఇందులో కాంగ్రెస్‌కు సొంతంగా ఉన్న బలం ౨౦౮
తృణమూల్‌ కాంగ్రెస్‌ ౧౯
డిఎంకె ౧౮
ఎన్‌సిపి ౯
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ౩
ముస్లిం లీగ్‌ ౨
బయటి నుంచి సపోర్ట్‌ ఇస్తున్న పార్టీలు
బిఎస్‌పి ౨౧
జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా ౧
స్వతంత్రులు ౬
................................

ఢిల్లీలో సమావేశమైన ౧౩ పార్టీల బలం ౮౭ దాకా ఉంది. వీటిలో
ఎస్పీ ౨౨
సిపిఎం ౧౬
బిజెడి ౧౪
అన్నాడిఎంకె ౯
టిడిపి ౬
ఆర్‌ఎల్‌డి ౫
సిపిఐ ౪
ఆర్‌జెడి ౪
ఫార్వర్డ్‌ బ్లాక్‌ ౨
జెడి(ఎస్‌) ౩
ఆర్‌ఎస్‌ ౨
వీటికి తోడు ఎన్‌డిఏ బలం ౧౫౧ ఎలాగో ఉంది..
ధరలపై కోత తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఎన్‌డిఏ ఇంతకు ముందే హెచ్చరించింది. ఇప్పుడు పదమూడు పార్టీల కూటమి అదే మాట అంటోంది.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, బిఎస్‌పి ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంది. బిఎస్‌పికి ఉన్న ౨౧మంది ఎంపిలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవకపోయినా, వ్యతిరేకంగా ఓటేస్తారా లేదా అన్నదే సమస్య. తటస్థంగా ఉన్నా సర్కారు గండం నుంచి గట్టెక్కుతుంది.

జాతీయ రాజకీయ పునస్సమీకరణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నారా? ఔను.. ఢిల్లీలో జరిగిన పదమూడు పార్టీలు సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి ఇల్లు వేదిక కావటం కీలకం...
తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ౧౯౯౭-౯౮లలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో చక్రం తిప్పినట్లే.. ఇప్పుడూ క్రమంగా జాతీయ సమీకరణాల్లో తనదైన శైలిలో విపక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు.. రెండోసారి ఓటమి పాలైన తరువాత జాతీయ స్థాయిలో మసకబారిన తన ఇమేజిని మళ్లీ పెంచుకునే దిశగా బాబు పావులు కదుపుతున్నారు.. ధరల పెరుగుదల అంశం ఆయనకు బాగా కలిసి వచ్చింది. మూడో ఫ్రంట్‌ అన్న పదం అచ్చిరాలేదో ఏమో.. అలాంటి పేర్లు కానీ, కూటములు కట్టడం కానీ చేయకుండానే, విడివిడిగా ఉంటూనే ఒక్కటిగా ఆందోళన పథంలో నడిచేందుకు బాబు వ్యూహం పన్నుతున్నారు..
రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది.. ఈ వాతావరణంలో తాను తిరిగి అధికారంలోకి రాలేనన్న అనుమానం వస్తే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ వెనుకాడకపోవచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రాంతంలో అధికారాన్ని కొల్లగొట్టేందుకు తెలుగుదేశంకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సమైక్యంగా ఉన్నా రాష్ట్రంలోనూ తామే అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా టిడిపి శ్రేణుల్లో దృఢంగానే ఉంది. ఇదే జరిగితే తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.. అలాంటప్పుడు చంద్రబాబు పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించవచ్చు. వచ్చే ఎన్నికల్లో కనీసం ౨౫ నుంచి ౩౦ వరకు ఎంపి స్థానాలపై తెలుగుదేశం పార్టీ గురి పెట్టింది. అనుకున్నంత బలాన్ని పొందగలిగితే ఢిల్లీలో చంద్రబాబు తిరిగి ఓ వెలుగు వెలగడం కష్టమేమీ కాదు.. జాతీయ పార్టీగా ఎదగాలంటే పొరుగున ఉన్న రాష్ట్రాల్లోకి టిడిపిని విస్తరించాలన్న ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.. మొత్తం మీద చంద్రబాబు దూరదృష్టితో, ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీగానే పుట్టింది.. అదే సిద్ధాంతంతో ఇప్పటివరకూ కొనసాగుతోంది.. మిగతా విపక్షాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతూ వచ్చినవే.. ఇప్పుడు వీటన్నింటినీ మరోసారి ఏకం చేసే పనిలో బాబు నిమగ్నమయ్యారు.. ఇందులో ఆయన సాధించే సక్సెస్‌ తెలుగుదేశం భవిష్యత్తుకు బాట అవుతుంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇంతకు ముందు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి ఏమి ఒరగ పెట్టినాడు,ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం తప్ప.