14, ఏప్రిల్ 2010, బుధవారం

పోలీసులు తీరు ఎందుకు విమర్శలకు గురవుతోంది?

ఆందోళనలు.. నిరసనలు.. ఉద్యమాలు... వీటిలో ఏ ఒక్కటి చెలరేగినా వాటిని నిరోధించటం, అడ్డుకోవటం పోలీసుల బాధ్యత. కానీ ఎక్కడ ఆందోళనలు రేగినా వాటిని అదుపు చేయటంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తరచూ ఎందుకు విమర్శలకు గురవుతోంది?.. ఇందుకు కారణం ఇటీవలి కాలంలో ప్రతి ఆందోళనలోనూ పోలీసు లాఠీ విచక్షణ లేకుండా విరుగుతోంది..

ఉస్మానియాలో విద్యార్థులపై లాఠీ చార్జి...
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆందోళన కారులపై విరిగిన లాఠీ..
కోల్‌కత్తా ఆసుపత్రిలో నిరసనకారులను చెదరగొట్టిన లాఠీ...
ఢిల్లీ.. భోపాల్‌.. సింగూర్‌.. ఇలా ఎక్కడ నిరసన రేగినా హింసాత్మకం కాకుండా ముగిసింది లేదు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసన కారులపై పోలీసులే ఎలాంటి కవ్వింపు లేకుండా విరుచుకుపడుతున్నారన్నది సాధారణంగా వచ్చే విమర్శ. ఇందులో నిజం పాలు ఎంత అంటే , ఇటీవల ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీ జరిపిన తీరును సిఐటి తప్పుపట్టినంత అని చెప్పవచ్చు... ఉస్మానియాలో విద్యార్థులపై లాఠీ చార్జీ విషయంలో పోలీసులే దూకుడుగా వ్యవహరించినట్లు సిఐడి నివేదిక తేల్చింది. ఈ వ్యవహారంలో ఆరుగురు పోలీసు ఉన్నతాధికారుల వైఖరిని సిఐడి తీవ్రంగా తప్పు పట్టింది. వాళ్లపై చర్య తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. డిజిపికి నివేదికను కూడా సమర్పించింది. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉస్మానియాలోనే కాదు.. జైపూర్‌లో ఓ కార్పోరేట్‌ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సేవలందించేందుకు నిరాకరించటం వల్ల ఇద్దరు చనిపోయారు.. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన నిరసన కారులపై పోలీసు లాఠీ దారుణంగా విరుచుకుపడింది. అంతకు ముందు రోజు గుంటూరులోనూ ఇదే పరిస్థితి...
ఎందుకిలా జరుగుతోంది.. ఆందోళన కారులు ప్రొవోక్‌ చేయకుండానే పోలీసులు ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. నిరసన కారులు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటే వాళ్లను చెదరగొట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. వాటర్‌ కేనన్లను వాడటం వంటివి చేయటం, టియర్‌ గ్యాస్‌ను వదలంటం వంటివన్నీ చేసాక కానీ ప్రత్యక్షంగా అణచివేతకు సిద్ధపడకూడదు.. అలా కాకుండా, ముందుగానే లాఠీలకు పని చెప్పటం, గాల్లో కాల్పులు చేయటం శాంతియుతంగా సాగే ఆందోళనను నిష్కారణంగా హింసాత్మకం చేస్తున్నారు..

ఆందోళనలు జరుగుతున్న సమయంలో బందోబస్తుకు వెళ్లే పోలీసులు ముందుగానే లాఠీచార్జీకి మానసికంగా సిద్ధపడుతున్నారా? అదే నిజమైతే అంతకంటే నేరం మరొకటి ఉండదు..ఇదే కారణం కాకపోవచ్చు. ఏవైనా ఆందోళనలు రేగినప్పుడు పోలీసులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారా? ఎండల్లో, వానల్లో చాలాసేపు నిలబడి ఉండటం వల్ల, కాపలా కాయటం వల్ల తమకు తెలియకుండానే చిరాకు పడుతున్నారా? కారణాలు ఏవైనా కావచ్చు. కానీ, ప్రొవొకేషన్‌ అనేది లేకుండా శాంతియుతంగా సాగే నిరసనలపై జులుం ప్రదర్శించటం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదు.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మొక్కుబడి విచారణలతోనూ, నామమాత్రపు నివేదికలతో సరిపెట్టడం, ఇలాంటి దూకుడు చర్యలను ఆపడానికి ఏం చేయాలో ఆలోచించాలి.. చర్యలు తీసుకోవాలి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనలు చేసే హక్కు అందరికీ ఉంది.. కొన్ని పరిమితుల్లో శాంతియుతంగా చేసుకున్నంత వరకు వాటిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు..


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Your observation is thought provoking. No Police guy would like to face violence in their duty. Not only Police, no professional would like to face as such.
Being a disciplined force they can't go to press to present their version whether it is fact or not. They can not play around like dirty politicians and media. Being Government salaried class, they can't afford to bribe corrupt media to talk in their favour.

There are troble in the mobs, who throw stones and disappear after that. Remaining mob face the consequences that follow. This is what happens , in most of such incidents.