21, ఏప్రిల్ 2010, బుధవారం

చిరంజీవిని మీడియా టార్గెట్‌ చేసిందా?

చిరంజీవిని మీడియా టార్గెట్‌ చేసిందా? ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు మీడియా పనిగట్టుకొని దాడి చేస్తోందా? ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తాజాగా చేస్తున్న ఆరోపణ ఇది.. కొంత కాలంగా కొన్ని పత్రికల్లో, చానళ్లలో పిఆర్‌పికి ప్రతికూలంగా వస్తున్న కథనాలు పిఆర్‌పి అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితిని కల్పించాయి..
చిరంజీవి రాజకీయాల విషయంలో మొదట్నుంచీ మీడియా అత్యుత్సాహాన్నే ప్రదర్శిస్తూ వచ్చింది. తన రాజకీయ ప్రవేశాన్ని చిరంజీవి ఎంత దాచాలనుకున్నారో... అంతకంటే ఎక్కువగా ఆయన కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావటానికి మీడియా పాపరాజీల్లా చిరంజీవి, ఆయన కుటుంబం వెంటబడింది.. ఎక్కడ ఏ చిన్న సమావేశం ఏర్పాటు చేసినా రాజకీయ దృక్కోణంతోనే చూసింది..

తీరా పార్టీ ఆవిర్భవించిన తరువాత పెద్ద సంచలనం అనుకున్న పార్టీ అనుకున్నంత సెన్సేషన్‌ సృష్టించలేకపోయింది. పార్టీ వ్యూహకర్తల రాజకీయ అవగాహనా లేమి మీడియాకు ఆటపట్టుగా మారింది.. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన చిరంజీవి సభలకు జనవాహిని తరలి వచ్చినా.. ఓట్లుగా మారలేకపోయాయి. ౧౮ శాతం ఓట్లతోనే పిఆర్‌పి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల తరువాత మీడియాలో ఒక వర్గం తనను టార్గెట్‌ చేస్తోందంటూ చిరంజీవి పదే పదే ఆరోపిస్తూ వచ్చారు.. ఆ రెండు పత్రికలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.. ఒక పత్రిక జెండా ఎత్తేద్దాం అని రాస్తే.. మరో పత్రిక బాక్స్‌ ఖాళీ అంటూ మరో కథనం రాసింది. ఓ చానల్‌ దుకాణం బంద్‌ పేరుతో పిఆర్‌పిపై కథనం ప్రసారం చేసింది.
పిఆర్‌పి అధినేత చిరంజీవికి కానీ, ఆయన వందిమాగధ బృందానికి కానీ, తొలినాళ్ల నుంచీ కూడా మీడియా మేనేజిమెంట్‌పై సరైన అవగాహన లేదు.. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు మీడియా మేనేజిమెంట్‌ను ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేశాయో.. పిఆర్‌పి ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్‌ అయింది. పైగా పార్టీలో మీడియా మేనేజర్లు అంటూ ఎవరూ లేకుండా పోయారు.. అంతకు మించి చిరంజీవి మినహా అంత చరిష్మా ఉన్న నాయకుడు దుర్భిణీ వేసి వెతికినా పిఆర్‌పిలో కనిపించరు.. మన రాజకీయాల్లో ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవటం ఏ పార్టీకైనా తప్పదు.. కానీ పిఆర్‌పి దీన్ని విస్మరించింది. బావగారి బొమ్మ చూపించి చానళ్లు టిఆర్‌పి రేటింగ్‌లు పెంచుకుంటున్నాయంటూ బావమరిది అల్లు అరవింద్‌ చాలాసార్లు బాహాటంగానే అన్నారు కూడా... మొత్తం మీద అటు ప్రధాన పార్టీలు, ఇటు మీడియాల మధ్య పిఆర్‌పి పోకచెక్కలా నలిగిపోతోంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

mee blg lo lettrs kana padatledu...
background colour and letters colour okka lagani unnai..

can you please make the changes...