29, ఏప్రిల్ 2010, గురువారం

యుగానికి ఒక్కడు...

కమ్మరి కొలిమీ.. కుమ్మరి చక్రం.. జాలరి పగ్గం.. సాలెల మగ్గం..
శరీర కష్టం స్ఫురింప జేసే-- గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు.. నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి
భావం.. భాగ్యం.. ప్రాణం.. ప్రణవం...
ఆయన ప్రతిమాటా బడుగుజీవికి ప్రణవ నాదం.. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు అలసిపోయిన వ్యథార్థ జీవితాలకు జీవనాదాలు..
శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా త్రికాలాలలో సాగిపోయిన మహాకవి.. ఆధునిక తెలుగు సాహిత్య రణక్షేత్రంలో ఒకే ఒక్క యుద్ధ వీరుడు.. శ్రీరంగం శ్రీనివాసరావు.. శ్రీశ్రీ...

భవభూతి శ్లోకాలు.. పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు.. నా వూహ రసరాజ్య డోల.. నా వూళ కేదార గౌళ.. గిరులు , సాగరులు, కంకేళికా మంజరులు, ఝరులు నా సోదరులు.. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం.. అనితర సాధ్యం నా మార్గం...
ఇలా నిశ్చయంగా తన మార్గాన్ని గురించి చెప్పగలిగిన అహం శ్రీశ్రీకి మాత్రమే చెల్లింది.. ఆయన ￧కనులు మూస్తే పద్యం వచ్చింది.. పెదవి కదిపితే నాదమయింది. నినదిస్తే విప్లవమైంది.. నిలదీస్తే తిరుగుబాటు బావుటా ఎగిరింది..
శ్రీశ్రీకి కవిత్వం ఒక తీరని దాహం.. తాను కవిత్వం రాసేందుకు వస్తువు ప్రధానం కాలేదు.. శిల్పం అక్కరకు రాలేదు.. లయ అవసరం లేనే లేదు.. రసం దృష్టిలోనే లేదు.. ఆయన కవిత్వం ఒక నాదం... మనస్సులో ఒక్కుదుటున కలిగే ప్రకంపనలకు అక్షర రూపం ఇస్తే దానికి పేరు శ్రీశ్రీ కవిత్వం.. ఎందుకంటే మరెవరూ ఆ ప్రకంపనలను ఆ స్థాయిలో అందుకోలేదు.. అందుకోలేరు కాబట్టి...
మరో ప్రపంచపు కంచు నగారా విరామమెరుగక మోగింది..
తాచుల వలెనూ..రేచుల వలెనూ, ధనుంజయునిలా సాగండి.. కనపడలేదా మరోప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు..
ఎర్రబావుటా నిగనిగలు.. హోమజ్వాలల భుగభుగలు..
మాటల్ని ఈటెలుగా ప్రయోగించటం, కత్తులుగా మార్చి విసరటం, మంటలుగా రేపటం... శ్రీశ్రీకి కవిత్వం ద్వారా అబ్బిన విద్య.. అలా చేయటం ఆయనకే సాధ్యం.. ఆయన కవిత్వం చదువుతూ ఉంటే.. ఆ పదాలు. పదబంధాలు.. వాటికి నిఘంటు అర్థాలు లేకపోవచ్చు.. భావనలు ఉండకపోవచ్చు.. కానీ, అవి మాటలు కావు.. పదాలు కావు.. పద బంధాలు కానే కావు.. ఆ మాటలు ఎగిసిపడే ఉద్రేకానికి ఉత్ప్రేరకాలు.. కార్మికుల భావోద్వేగానికి బాసటలు.. అరాచక వ్యవస్థపై చేసే యుద్ధానికి పదును తేలిన ఆయుధాలు..
శ్రీశ్రీ తన హృదయంలో నుంచి పొంగుకొచ్చిన అనుభూతిని మన హృదయంలోకి నేరుగా పంపించేస్తాడు.. ఆ కవిత్వాన్ని పెదాలపై పలకడం మొదలు పెట్టడంతోనే మనసు కంపించటం మొదలు పెడుతుంది.. గగుర్పొడుస్తుంది.. నెత్తుటి ప్రవాహ వేగం శరీరంలో పెరిగిందా అన్న భావన కలుగుతుంది..
భవిష్యత్తు తోచక దారితెన్నూ వెతుక్కుంటున్న ప్రజల రొద.. దీనుల మూగవేదనలే కాదు.. నీళ్లు లేక ఎండిపోతున్న గరిక పోచ దుఃఖాన్ని సైతం కవిత్వంలో వినిపించగలిగిన వాడు కాబట్టే శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి మార్గదర్శకుడు కాగలిగాడు..
-2-
ఏమిటీ శ్రీశ్రీ.. మరణించి పాతిక సంవత్సరాలు దాటి పోయిన తరువాత కూడా ఈయన్ను ఆంధ్ర లోకం ఎందుకు స్మరించుకుంటోంది? ఎందుకంటే ఆయన స్వరం సమాజంలోని అన్ని రకాల చైతన్యాలకు ఆనవాళ్లు.. శ్రీశ్రీది కవితా జీవితం.. ఆయనే ఒక జీవిత కావ్యం..
సరిగ్గా వందేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రం ఉత్తరాన సాగర తీరంలో జన్మించిన శ్రీశ్రీ.. విశాఖ పట్నం ఒడిలో... పారిశ్రామిక విప్లవం బడిలో పెరిగాడు.. వాటితో పాటే ఎదుగుతూ వచ్చాడు.. ఆయన కవిత్వమూ అలాగే పొంగుకుంటూ వచ్చింది.. ఎంత వేగంగా అంటే.. ఆయన కంటే వేగంగా, ఆయనకే అందనంత ఎత్తులో శ్రీశ్రీ కవితా ధార పరుగులు తీసింది.. ఆ పరుగును అందుకోవటం ఎవరికైనా అంత సులభం కాలేదు..
తనకీ ప్రపంచానికీ ఒక రకమైన సామరస్యం కుదిరే దాకా కవి తన మనసు లోపల...., బయటా..... పడే సంఘర్షణ శ్రీశ్రీ ప్రతి కవిత్వంలోనూ కనిపిస్తుంది.. అందువల్లనే రగులుతున్న నెత్తుటినీ, ఉబుకుతున్న కన్నీటిని కలిపి ఈ ప్రపంచానికి ఒక కొత్త టానిక్‌ను అందించగలిగాడు.. చలం చెప్పినట్లు కృష్ణశాస్త్రి తన బాధనంతా అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
ఇక ప్రజా ఉద్యమాలతో ఆయన సాన్నిహిత్యం చాలా ఎక్కువ.. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలోనూ, ఆ తరువాత విప్లవ రచయితల సంఘం స్థాపన వెనుక దాగి ఉంది శ్రీశ్రీ ఉద్యమ స్ఫూర్తే...
శ్రీశ్రీ వ్యక్తిగత జీవితం కంటే సామాజిక జీవితంతోనే ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడు.. కార్మిక వర్గంతో, కర్షక వర్గంతోనే మమేకమై పోయాడు.. అంతే కాదు రాజకీయ రంగంతోనూ కలిసి ఉన్నాడు..
౨౦వ శతాబ్దపు ఆంధ్ర సాహిత్య మలిభాగాన్ని శాసించిన వాడు శ్రీశ్రీ. అనేక ఉద్యమాలకు సారథ్యం వహించి ఉండవచ్చు. కానీ, తాను నమ్మిన దాన్ని, విలువలను, సిద్ధాంతాన్ని ఆయన ఎన్నడూ వీడలేదు.. ఇందుకోసం ఆయన నిందలు కూడా మోయాల్సి వచ్చింది.. అయినా వెనుకంజ వేసింది లేదు..కొన్ని సంఘాల్లో ఉన్నంత మాత్రాన వాటికి మాత్రమే కట్టుబడి ఉండటం ఆయనకు సాధ్యం కాలేదు.. అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ విధించినప్పుడు.. ఆ తరువాత ౨౦ సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు వాటిని సమర్థించిన వాడు శ్రీశ్రీ. దీనివల్ల విరసంలో విప్లవమే రేగింది.. ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామాయే చేయాల్సి వచ్చింది.. అయినా ఆయన వెరవ లేదు. ౨౦ సూత్రాల పథకం అమలయితే బడుగులకు లాభం కలుగుతుందని ఆయన బలంగా నమ్మాడు. దానికి కట్టుబడ్డాడు.
విరసం తనపై తాను విధించుకున్న ఎన్నో నియమాలను నేను ధిక్కరించాను.. అన్నిటిలోకీ ముఖ్యమైనది మొదట ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ, పిదప ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచకపోవటం.. అని ఆయన స్వయంగా తన అనంతంలో పేర్కొన్నారు..అందుకే శ్రీశ్రీని ఇజాలు కట్టిపడేయలేకపోయాయి.. తనకు తానుగా ఆంధ్ర సాహిత్య చరిత్రకు నిలువు సంతకంలా నిలబడిపోయాడు...
విప్లవ కవిత్వం సృష్టించినా, సామాన్యుల్లో చైతన్య జ్వాల రగిలించినా, సినిమా పాటలు రాసినా, శృంగార గీతాలను ఒలికించినా శ్రీశ్రీకే చెల్లింది. తన జీవిత కాలంలో తెలుగు సాహిత్యం తిరిగిన అన్ని మలుపుల్లోనూ శ్రీశ్రీ చైతన్య శీలిగా ఉన్నాడు.. ఉద్యమాలు తీవ్రమైనప్పుడు ముందుండి నాయకత్వం వహించాడు.. క్లిష్ట పరిస్థితుల్లో కీలకంగా నిలబడటానికి వెరవలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగునాట విప్లవానికి వెలుగు దారి చూపిన వాడు శ్రీశ్రీ. తానే విప్లవమై జగన్నాథ రథచక్రాలను నడిపించుకువచ్చిన వాడు.. ఆయన దారి అనంతం.. ఇతరులకు అందుకోవటం అనితర సాధ్యం.

3 కామెంట్‌లు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

మీ బ్లాగు టెంప్లేట్ ని మార్చండి.చదవడానికి ఇబ్బందిగా వుంది

కౌండిన్య చెప్పారు...

కవిగా ఆధునిక కవిత్వానికి 'రవి' గా ఆయనకు ఆయనే సాటి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సంతోష్ కుమార్! శ్రీశ్రీని గూర్చి చక్కగా వ్రాసారు. అభినందనలు.
ఆంధ్రామృతంలో నేను వ్రాసినది కూడా పఠన యోగ్యమే. అవకాశముంటే చదువగలరని లింక్ తెలియజేస్తున్నాను.
http://andhraamrutham.blogspot.in/2012/06/blog-post_2213.html
శుభమస్తు.