14, జూన్ 2009, ఆదివారం

కమలనాథుల కప్పల తక్కెడ


పరివారానికి ఇప్పుడు ఓ కొత్త అనుబంధ సంస్థ కావాలి. ఇంతకాలం తనకు రాజకీయ బలాన్ని బలగాన్ని అందించిన భారతీయ జనతాపార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. వరుస పరాజయాలు పార్టీ దిగ్గజాల శక్తి సామర్థా్యలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. అంతర్గత కుము్మలాటలతో సతమతమవుతోంది. రాజకీయంగా ఆత్మరక్షణలో పడిన కమలనాథులు పయనం ఏ దిశగా సాగుతోంది? పరివర్తన దిశలోనా...? పతనం దిశగానా?
***
భారత రాజకీయాల్లో మాది విభిన్నమైన పార్టీ...వ్యక్తి పూజకు ఆస్కారం లేని పార్టీ... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే పార్టీ.. అని కమలనాథులు ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే రొటీన్‌ మాటలు... 2004లో గుడ్‌ గవర్నెన్‌‌స పేరుతో ముందస్తు ఎన్నికలకు పోయి బోర్లా పడ్డ బిజెపి.. 2009లో అద్వానీని తెరమీదకు తెచ్చి హైటెక్‌ ప్రచారం అద్భుతంగా చేసినా కించిత్‌ ఫలితం కూడా లేకపోయింది. చివరకు తాను అధికారంలో ఉన్న రాషా్టల్ల్రోనైనా తగినన్ని సీట్లు తెచ్చుకోలేకపోయింది. అయిదేళ్లలో యుపిఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవటంలో సమష్టిగా విఫలమైన బిజెపి నేతలు ఓటమికి ఎవరు బాధ్యులో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నీవంటే, నీవని సిగపట్లు పడుతున్నారు. సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తాజాగా పార్టీని విడిచిపెట్టడం భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి నిలువెత్తు దర్పణం.
1996లో తొలిసారి అధికారంలోకి రానంతవరకు బిజెపి నేతలంతా ఒక్కమాటపై నిలబడి, ఒక్కతాటిపై నడిచినవారే... వాస్తవానికి వారికా అధికారం కూడా ఊరిస్తూ, ఊరిస్తూ వచ్చింది. మొదట రెండు సీట్లు, ఆ తరువాత 80 సీట్లు.. ఆ తరువాత 140 సీట్లు ఇలా నెమ్మది నెమ్మదిగా వాళ్ల బలం పెరిగినట్లే.. అధికారం కూడా మొదట పదమూడు రోజులు, తరువాత పదమూడు నెలలు, ఆ తరువాత పూర్తి ఆధిపత్యం లభించింది. పవర్‌ పవరేమిటో ఒకసారి తెలిసిన తరువాత ఓటమి బాధను బిజెపి ఎంతమాత్రం తట్టుకోలేకపోతున్నది.
2004లో ఓటమి తరువాత వాజపేయి తెరమరుగైపోయారు. ఎంతోకాలంగా అధికారం కోసం అర్రులు చాస్తున్న అద్వానీ రంగంమీదకు వచ్చారు. గత అయిదేళ్లలో ఉమాభారతి, మదన్‌లాల్‌ ఖురానా, గోవిందాచార్య వంటి నేతలను దూరం చేసుకుంది. సాహిబ్‌ సింగ్‌వర్మ, ప్రమోద్‌ మహాజన్‌ వంటివారిని కోల్పోయింది. అద్వానీ జిన్నా ప్రకటనలు, గుజరాత్‌లో విహెచ్‌పితో మోడీ గొడవతో పరివారం బిజెపికి దూరమైంది. చివరకు మొన్నటి ఎన్నికలు దగ్గరపడేసమయానికి పార్టీకి సరైన వూ్యహకర్తలే కరవయ్యారు. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూసినవారే... పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీల మధ్య ఘర్షణ ఒక దశలో పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ గొడవ పార్టీ ప్రతిష్ఠను మరింత మంటగలిపింది. వరుణ్‌గాంధీ వివాదం మరింత దిగజార్చింది. ఫలితాలు వెల్లడైన తరువాత అద్వానీ అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన చోటామోటా నేతలా రాజకీయ సన్యాసం అంటూ ఒక రోజు సీన్‌ క్రియేట్‌ చేశారు.. నేతలంతా పోయి ఒప్పించగానే ఇక తప్పేదేముందంటూ మళ్లీ రంగంమీదకు వచ్చారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఎక్కారు. ఇంతవరకు బాగానే ఉంది. బిజెపికి అధ్యక్షుడు ఎవరైనా అద్వానీ కనుసన్నల్లోనే నడవాల్సిందే. అలాంటప్పుడు పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సిన అద్వానీ ఆ పని చేయలేదు. కనీసం ఓటమిపై చిత్తశుద్ధితో సమీక్ష అయినా జరిపారా అంటే అదీ లేదు. యశ్వంత్‌ సిన్హా వంటి సీనియర్ల ప్రశ్నలకు జవాబు చెప్పేవారే లేరు. ఈయనతో మొదలైన రాజీనామాల పరంపర ఇంకా కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇప్పటికే పార్టీ కేడర్‌ పూర్తిగా నిస్సత్తువగా మారింది. ఈ దశలో ఓటమికి కారణాలను నిబద్ధతతో విశ్లేషించి కేడర్‌లో మళ్లీ ఉత్సాహం నింపాల్సిన బిజెపి నేతలు న్యూఢిల్లీ అశోక రోడ్‌లోని తమ కార్యాలయంలో కూర్చుని తీరిగ్గా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.. కమలనాథుల బెకబెకలతో బిజెపి ఆఫీసు కప్పల తక్కెడలా మారింది.



కామెంట్‌లు లేవు: