16, జూన్ 2009, మంగళవారం

లొల్లి ముదిరింది

తెలంగాణ లొల్లి ముదిరింది. పరిష్కరించటానికి వీల్లేనంతగా జటిలమైపోయింది... రెబల్‌‌స రెచ్చిపోయారు. సామరస్యంగా వ్యవహారాన్ని చక్కబెట్టాల్సిన టిఆర్‌ ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు చిక్కుముడులు వేసుకుంటూ వస్తున్నారు. టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీనియర్‌ నాయకుడు రవీంద్ర నాయక్‌ను కార్యకర్తలు వెంటపడి కొట్టి వెళ్ల గొట్టారు. పాపం రవీంద్రనాయక్‌ చిరిగిన చొక్కాతో, వచ్చిన కారులో తెలంగాణ భవన్‌ నుంచి పారిపోవలసి వచ్చింది. అసమ్మతి వాదులు సమావేశమవుతున్న మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్‌ ఇంటికి చేరుకున్న రవీంద్రనాయక్‌ కెసిఆర్‌పై విజృంభించారు. విరుచుకుపడ్డారు. ఆయన ఆగ్రహానికి, ఆవేశానికి అడ్డూ ఆపూ లేకుండా పోయింది. చిరిగిన చొక్కాను చూపుతూ, నిప్పులు చిమ్మారు. చంద్రశేఖర్‌ రావుతో ఇంతకాలం పనిచేసినందుకు తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణ చెప్పారు. తనకు, తన ప్రజానీకాన్ని దారుణంగా అన్యాయం చేశారని కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు. తనను వైఎస్‌ ఏజంటని విమర్శించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఆరోపణకు వైఎస్సే జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌ కరడుగట్టిన దొర అని, తన తాతలు, ముత్తాతలు దొరల దగ్గర వెట్టి చేసినట్టే తనతో కూడా వెట్టి చేయించుకున్నారని తీవ్ర అభియోగాన్ని మోపారు. మొత్తం మీద కెసిఆర్‌తో అసమ్మతి వాదుల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. కెసిఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో అసమ్మతి నేతలంతా తీవ్రంగా మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ కూడా వాళ్ల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు అంతే సీరియస్‌గా వర్కవుట్‌ చేస్తున్నారు. ఏమైతేనేం.. ఓటమితో కుంగిన టిఆర్‌ఎస్‌ను దెబ్బ తీసేందుకు వైఎస్‌ అసెంబ్లీ సాక్షిగా విసిరిన రాయి తగలాల్సిన చోటే తగిలినట్లుంది.
మొత్తం మీద టిఆర్‌ఎస్‌ అసమ్మతి వాదులు మీడియాలో పెద్ద హడావుడే సృష్టించారు. కెసిఆర్‌ కతను కంచికి చేర్చే దాకా నిద్రపోమని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. చొక్కాలు చింపించుకున్నారు. ముక్కు నేలకు రాశారు. కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు... పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టారు.. అంతలోనే ఉపసంహరించుకున్నారు. ఇక తరువాతి వూ్యహానికి పదును పెట్టేందుకు రాత్రంతా రహస్య మంతనాలు, చర్చలు, తర్జన భర్జనలు జరిగాయి. నిజానికి కెసిఆర్‌ను నిలువరించే సామర్థ్యం నిజంగా వీళ్లకు ఉందా? లేక గతంలో అసమ్మతి వాదుల మాదిరిగానే కొంతకాలం హల్‌చల్‌ సృష్టించి ఏదో ఒక పార్టీలో చేరిపోతారా? వూ్యహాత్మకంగా ముందుకు సాగటానికి వీరి ముందున్న అవకాశాలేమిటి? అన్నది ఇప్పటికైతే జవాబు దొరకని ప్రశ్నలే...

1 కామెంట్‌:

Pratap చెప్పారు...

గత అసమ్మతి కీ ఈనాటి అసమ్మతి కీ మధ్య చాలా తేడా వుంది.
ఈర్షా అసూయా ద్వేషం స్వార్ధం ఆనాటి అసమ్మతి కి పునాది అయితే ...
ఆవేదన, ఆక్రోశం, ఆరాటం , అసహ్యం, బాధ ఈ నాటి అసమ్మతికి మూలం.

తెలంగాణా ఉద్యమాన్ని గల్లీ నుంచి డిల్లీ దాకా తీసుకుపోయిన కెసిఆర్ .... ఈ తొమ్మిదేళ్ళల్లో మళ్ళీ తనే తన ఫకర్ తో , పాగల్ పన్ తో , స్వార్ధం తో డిల్లీ నుంచి గల్లీ దాక ఈడ్చుకొచ్చి బొందపెట్టాలని చూస్తున్నాడు.
త్యాగాల పునాది మీద ఏర్పడ్డ ఉద్యమం మీద స్వార్ధాల భవంతులు నిర్మించుకుంటున్నాడు.

ఉద్యమం అంటే కెసిఆర్ కు ఒక ఆట, డబ్బుల మూట, ఒక పద బంధ ప్రహేళిక
బొంత పురుగులను ముద్దు పెట్టుకుంటూ, కుష్టురోగులను కౌగలించు కుంటూ చేసే ఏకపాత్రాభినయం.

కెసిఆర్ తరచూ కాంగ్రెస్స్ లో వున్న తెలంగాణా నేతలను చవటలూ, దద్దమ్మలూ అంటూ తిడుతుంటాడు.
అదే సమయం లో తన పార్టీలో వున్న నేతలంతా తన అడుగులకు మడుగు లోత్తుతూ చవటలూ దద్దమ్మల్లా పడి వుండాలని కోరుకుంటాడు.

ఒక్కర్ని ఎంతకాలమైనా మోసం చేయొచ్చు.
కొందర్ని కొంతకాలం మోసం చేయొచ్చు .
అందర్నీ ఎల్లకాలం మోసం చేయలేరు ఎవరూ.
కెసిఆర్ నాటకాలు ఇక చెల్లవు. మాటల గారడీ ఇక నడవదు.

తెలంగాణా ఉద్యమం 1971 లో చెన్నారెడ్డి గాని ద్రోహానికి అర్ధంతరంగా ముగిసినట్టు ఇప్పుడు ముగియకుండా వుండాలంటే, చరిత్ర పునరావృతం కాకుండా వుండాలంటే నిబద్ధత వున్న వాళ్లంతా ప్రత్యామ్నాయాన్నిఆలోచించాలి.

ఇప్పుడు జరుగుతున్నది అదే ...!
ఒకరిద్దరు స్వార్ధానికి, బెదిరింపులకు లొంగిపోయి వైఎస్ ఆర్ పాదాల ముందు మొకరిల్లినా దిలీప్ కుమార్, ప్రకాష్, చంద్రశేకర్ , రవీంద్ర నాయక్ మొదలైన వాళ్ళు మాత్రం అట్లాంటి ద్రోహులుగా మారరనే నేను భావిస్తున్నాను.

ఎప్పటికైనా తెలంగాణా స్వప్నం ఫలిస్తుంది.
దొంగల, లుచ్చాల, లఫంగుల, స్వార్ధపరుల ద్రోహుల కుటిల యత్నాలన్ని విఫలమవుతాయి.

జై తెలంగాణా !